అవశేషాలు.. అవమానాలు.. | indian Agriculture food faced the Import Prohibitions problems | Sakshi
Sakshi News home page

అవశేషాలు.. అవమానాలు..

Published Thu, Jul 3 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

అవశేషాలు.. అవమానాలు..

అవశేషాలు.. అవమానాలు..

నిషేధాలు ఈయూకే పరిమితం కావడం లేదు. సమీప భవిష్యత్తులోనే రష్యా నుంచి కూడా ఇలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆలుగడ్డలు నాణ్యతా ప్రమాణాలకు దీటుగా లేవనీ, వీటిని నిషేధించక తప్పని పరిస్థితులు ఉన్నాయనీ ఆ దేశ అధికారులు చెబుతున్నారు.    
 
బియ్యం, గోధుమ, పప్పులు, పళ్ళు కూరగాయల ఉత్పత్తిలో మన దేశానిది ప్రపంచంలోనే రెండవ స్థానం. పాలు, పంచదార, జీడిమామిడి, మసాలా దినుసులు వంటి వ్యవసాయోత్పత్తులలో మనది మొదటి స్థానం కూడా. అయినా ప్రపంచ ఎగుమతులలో మన వాటా 5 శాతానికి చేరలేక దిగాలు పడుతున్నది. ఇదంతా అవగాహనా రాహిత్యంతో తలెత్తిన పరిస్థితి కావచ్చు. కానీ ప్రపంచ దేశాలలో ఈ పరిస్థితి వల్ల భారత్ ఎగుమతులు అవమానకరమైన వాతావరణాన్ని ఎదుర్కొనవలసి వస్తున్నది.

నాణ్యతా ప్రమాణాల నియంత్రణ గురించి దేశంలో కనిపిస్తున్న అవగాహనా రాహిత్యం తీవ్రమైనది. ఆహారం ద్వారా ప్రబలే వ్యాధు లకు కారణమయ్యే సూక్ష్మక్రిములు, పారిశ్రామిక రంగాలలో భద్రతా లోపాలు మన ఎగుమతులకు శాపంగా మారుతున్నాయి. వ్యవసా యోత్పత్తులను ఎగుమతి చేసే దేశాలు  పాటించవలసిన పరిశుభ్రత, మాలిన్యాల నిరోధానికి సంబంధించి 2006లో ఒక చట్టాన్ని రూపొం దించారు. కానీ భారతదేశంలో చాలా చట్టాల మాదిరిగానే ఈ కీలక చట్టానికి కూడా చెదలు పట్టించారు. దీని ఫలితంగానే అంతర్జాతీయ ఎగుమతుల రంగంలో భారత్ ప్రతిష్ట మసకబారిపోతోంది.

ఇటీవలి చేదు అనుభవాలు

భారత్ నుంచి అత్యధికంగా తాజా కూరగాయలను దిగుమతి చేసుకునే దేశాలలో సౌదీ అరేబియా ఐదో స్థానంలో ఉంది. కానీ మన పచ్చి మిర్చి ఉత్పత్తులను మే నెల 30 నుంచి ఆ దేశం నిషేధించింది. క్రిమి సంహారక అవశేషాలు కనిపించడం వల్ల ఈ నిషేధం విధిస్తున్నట్టు భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల సాధికార సంస్థ (అపిడా)కు సౌదీ అరేబియా వివరించింది. ఇకపై ఉత్పత్తులలో క్రిమి సంహారక అవశేషాల జాడ లేకుండా చేస్తామని, నిషేధం ఎత్తివేయవలసిందని భారత్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ దేశం ఇంకా జవాబు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే అల్ఫాన్సా జాతి మామిడి, కొన్ని రకాల కూరగాయల మీద ఈ మే మాసంలోనే యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధం విధించింది. ఆ ఎగుమతులలో ఫ్రూట్‌ఫ్లైస్ అనే కీటకాల జాడను కనిపెట్టి ఈయూ ఈ నిర్ణయం తీసుకుంది. అల్ఫాన్సాతో పాటు చామ దుంపలు, కాకర, పొట్ల, వంకాయ కూడా మొదటిసారి ఈయూ నిషేధానికి గురైనాయి. గుడ్డిలో మెల్ల మేలు అన్నట్టు తమ నిషేధం ఐదు శాతం తాజా పళ్లు, కూరగాయలకే వర్తిస్తుందనీ, మిగిలిన ఎగుమతులలో ప్రమాణాలు సక్రమంగానే ఉన్నాయని యూనియన్ వివరణ ఇచ్చింది. అలాంటి క్రిములు ఆ దేశాలలో కనిపించవు. కాబట్టే వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2013 సంవత్సరంలో ఎగుమతైన 207 రకాల వ్యవసాయోత్పత్తులలోనూ ఇలాంటి క్రిములను గుర్తించిన సంగతిని ఈయూ గుర్తు చేసింది. అల్ఫాన్సా మామిడి మీద నిషేధం అంటే దేశం అపారమైన నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. ఈ మామిడి రకంతో పాటు, మన తమలపాకులనూ నిషేధించే యోచనలో ఈయూ ఉన్నది. ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్న తమలపాకులలో సాల్మొనెల్లా అనే బాక్టీరియాను వారు కనుగొన్నారు. నిజానికి ఈ బాక్టీరియాను ఈయూ 2011 నుంచి గమనిస్తున్నది. ఈ కారణంగానే బంగ్లాదేశ్ నుంచి ఎగుమతయ్యే తమలపాకుల మీద ఈయూ ఇప్పటికే నిషేధాన్ని అమలు చేస్తున్నది. ఆ బాక్టీరియా ఉన్న ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులు వాంతులూ విరేచనాల బారిన పడతారు. ఇవన్నీ గమనించే కాబోలు గత సంవత్సరం ఆహార కాలుష్యానికి సంబంధించి ఈయూ 111 హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో 12 కరివేప, మిరప ఉత్పత్తులకు సంబంధించినవి. 84 హెచ్చరికలు బెండ ఉత్పత్తులకు సంబంధించినవి. వీటితో ఈయూ ఇప్పటివరకు భారత్‌కు చేసిన హెచ్చరికల సంఖ్య 257కు చేరుతుంది. అయితే 433 హెచ్చరికలను అందుకుని చైనా మొదటి స్థానంలో ఉంది. 2007లో కూడా మనం ఎగుమతి చేసిన గోరు చిక్కుడు, గోవర్‌గమ్‌లలో పెంటాక్లోరోఫినాల్ అనే క్రిమి సంహారకం అవశేషాలను ఈయూ కనుగొన్నది.

నిషేధాలు ఇప్పటివి కావు

2003లో యూరప్ దేశాలలో తయారుచేసే వోస్టర్ సాస్‌లో సూడాన్-1డై అనే మలిన కారకాన్ని కనుగొన్నారు. ఇది పెద్ద దుమారం లేపింది. ఈ మలిన కార కం భారత్ నుంచి ఎగుమతి అయిన ఎండుకారం నుంచి వచ్చిందని వెల్లడైంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతుల విషయంలో జాగరూకత పాటించాలని ఆ సందర్భంలోనే సభ్య దేశాలకు ఈయూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణా మం దేశానికి అవమానకరమైనది. మన అంతర్జాతీయ ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపగలిగినది కూడా. ఈ ఉదంతం తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం బ్రాండింగ్ లేని ఆహారోత్పత్తులను నిషేధించింది. భారత ప్రభుత్వం కూడా సుగంధ ద్రవ్యాల బోర్డుకు ఎగుమతుల నమూనాలను సమర్పించడాన్ని అనివా ర్యం చేసింది. 2003లో డచ్ అధికారులు మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న ద్రాక్షలో మిథోమిల్, ఎసిఫేట్ అనే క్రిమిసంహారక అవశేషాలను కనుగొన్న తరువాత జరిపిన రభస చిన్నదేమీ కాదు. మసాలా దినుసుల ఎగుమతిలో, వినియోగంలో మనదే ప్రపంచంలో అగ్రస్థానం. కానీ అప్లటాక్సిన్ వంటి విష పదార్థం ఉనికి, నిషేధించిన రంగులను ఆహార పదార్థాల తయారీలో వినియో గించడం వంటి కారణాలతో చాలా దేశాలు మన ఎగుమతులను నిలిపివేశాయి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లండ్ వంటి దేశాలు 1998, 2000 సంవత్సరాలలో మన ఎండు మిర్చి మీద నిషేధం విధించడానికి కారణం అప్లటాక్సిన్ అనే పదార్థమే. చేపల ఎగుమతిలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయి. అన్ని రకాల చేపల ఎగుమతులలోను సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుందన్న ఆరోపణ లు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను పాటించని అవిధేయ దేశంగా భారత్‌కు 1997లోనే యూరోపియన్ కమిషన్ ముద్ర వేసింది.

పొంచి ఉన్న నిషేధాలు

నిషేధాలు ఈయూకే పరిమితం కావడం లేదు. సమీప భవిష్యత్తులోనే రష్యా నుంచి కూడా ఇలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆలుగడ్డలు నాణ్యతా ప్రమాణాలకు దీటుగా లేవనీ, వీటిని నిషేధించక తప్పని పరిస్థితులు ఉన్నాయనీ ఆ దేశ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇకపై తమ దేశానికి ఎగుమతులు జరగాలంటే అపిడా ధ్రవీకరణ పత్రం తప్పనిసరి అని రష్యా చెబుతోంది. మనం ఎగుమతి చేస్తున్న బ్రెడ్, ఒలిచిన రొయ్యలు, బాసుమతి బియ్యం, నువ్వులు, మిరియాలు, ధనియాలు, కారం వంటి వస్తువులు అన్నింటికీ క్రిమి సంహారక మందుల అవశేషాల బెడద పుష్కలంగా ఉంది. అరటి చిప్స్‌లో కలుపుతున్న ఎఫ్‌డీ అండ్ సీ పసుపు రంగు, క్రీమ్ బిస్కెట్లలో సురక్షితం కాని రంగుల వాడకం వల్ల కూడా మన ఎగుమతుల మీద వేటు పడే అవకాశాలు ఉన్నాయి. వీటికి తోడు భార లోహాల ఉనికి కొత్త బెడదగా మారనున్నది.

పరిష్కారాలు మన దగ్గరే ఉన్నాయి

వ్యవసాయ, ఆహారోత్పత్తులలో క్రిమి సంహారకాల ఉనికి కేవలం ఎగుమతులకు సంబంధించినదే కాదు. మన ఆరోగ్యానికి సంబంధించినదిగా కూడా పరిగణించాలి. సురక్షిత ఆహారం అనే అంశం మీద ఎలాంటి అవగాహన లేని చిన్న చిన్న వ్యాపారులతో చాలా చిక్కులు వస్తున్నాయి. మన నుంచి దిగుమతులను ఆహ్వాని స్తున్న దేశాలలో ఉన్న భద్రత, ఆరోగ్య ప్రమాణాలను మనం గౌరవించాలి. ఎగుమతుల కోసమే కాకుండా, మన ప్రజల ఆరోగ్యం కోసం కూడా ఇందుకు సంబంధించి పటిష్టమైన చట్టాలు చేయాలి. వ్యవసాయోత్పత్తులను ఎంత వృద్ధి చేశామన్నది కాదు, ఎన్ని నాణ్యతా ప్రమాణాలతో, ఆరోగ్య సూత్రాలతో  ఆ వృద్ధి జరిగిందన్నదే నేటి ప్రపంచం గమనిస్తున్న అంశం. ఏ దేశమైనా దిగుమతులను ఆహ్వానించగలదు. వాటితో వచ్చే అనారోగ్యాన్ని మాత్రం కాదు.

(వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు) బలిజేపల్లి శరత్‌బాబు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement