
విభజన బిల్లు పాసయిందా?
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలయిపోయింది. 18-2-2014న లోక్‌సభలో, 20-2-2014న రాజ్యసభలోనూ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదం పొంది, యాక్ట్ (చట్టం)గా రూపొందింది.
లోక్‌సభలో ఏం జరిగిందో మనమె వ్వరూ చూడలేకపోయాం. కారణం టి.వి. ప్రత్యక్ష ప్రసారాలు ఆగిపోవటం లేదా ఆపుచేయటం!
దీనికి కారణమేమిటని లోక్‌సభ సెక్రటేరియట్ వారిని ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ చట్టం ప్రకారం ప్రశ్నించాను. సరిగ్గా, 18వ తారీఖున, 3 గంటల 1 నిమిషానికి, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు మీద లోక్‌సభలో చర్చ ప్రారంభమైన మరుక్షణం, లోక్ సభలో అమర్చిన తొమ్మిది ఆటోమేటిక్ కెమెరాలూ ఒకేసారి, హఠా త్తుగా, ప్రసారం చేయటానికి వీలులేకుండా ఆగిపోయాయనీ, సభ వాయిదా పడ్డ తర్వాతే రిపేరు చేయించి సరిచేశామనీ సమాధాన మిచ్చారు. లోక్‌సభ చరిత్రలో ఇలా ప్రత్యక్ష ప్రసారాలకు అంతరా యం కలగటం ఎన్నడైనా జరిగిందా అన్న ప్రశ్నకు 18వ తారీఖు, 3.01 నిమిషానికి మాత్రమే జరిగిందని కూడా సమాధానం ఇచ్చారు.
మర్నాడు పత్రికల్లో ప్రచురితమైన వార్తల ప్రకారం గంటా ఇరవై ఆరు నిమిషాల్లో చర్చ, ఆమోదం, సవరణలు, వగైరాలన్నీ పూర్తయి, బిల్లు పాసయిపోయినట్లు తెలిసింది.
20-2-2014న రాజ్యసభలో జరిగిన చర్చనంతా టీవీ ప్రత్యక్ష ప్రసారంలో చూశాం. ఓటింగ్ పెట్టండి, డివిజన్ చెయ్యండి, ఎంతమంది అనుకూలమో ఎంత మంది వ్యతిరేకమో లెక్క తేల్చండంటూ మార్క్సిస్టు సభ్యులు సీతారాం ఏచూరి తదితరులు అడిగినా అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురి యన్ గారు అంగీకరించలేదు. సభ గందరగోళంగా ఉన్నప్పుడు ‘డివిజన్’ చేయటానికి రూల్స్ ఒప్పుకోవు అని తేల్చి చెప్పేశారు!
లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారం ఆపు చేసినా, జరుగుతున్న ప్రొసీడింగ్స్ రికార్డు చేసే లోక్‌సభ రిపోర్టర్లు, వెర్బాటం రికార్డింగ్, అంటే ఏ పదానికి ఆ పదం షార్ట్‌హ్యాండ్‌లో రాసుకుని రికార్డు చేసేశారు.
ఆ విధంగా తయారైన లోక్‌సభ చర్చా- ఇతర వివరాలూ వెబ్‌సైట్‌లో పెట్టారు! తర్వాత పుస్తక రూపంలో కూడా ప్రచురించారు!!
వెబ్‌సైట్ చదివి, ఆ తర్వాత పుస్తకం కూడా చదివిన తర్వాత అర్థమయింది.. బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదని.
తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలు ఆపేసి బిల్లు పాసయి పోయిందనిపించేయటానికి కారణం, రూల్స్ ప్రకారం బిల్లు పాసయ్యే అవకాశమే లేకపోవటం!
సుప్రీంకోర్టులో, అనేక దశల్లో, అనేక పిటిషన్లు దాఖలయి ఉన్నాయి. మే 5, 2014న జస్టిస్ దత్తు (ఇప్పుడు చీఫ్ జస్టిస్) పిటిషనర్ల వాదనలు విని, కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పటానికి ఆరువారాలు గడువిస్తూ, ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి గానీ, కేంద్ర ప్రభుత్వం వారు ‘కౌంటర్’ దాఖలే చెయ్యలేదు.
18వ తారీఖున లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, 20న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ ఇద్దరూ కూడా ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమనే ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధమైనా మేమీ బిల్లును సమర్థిస్తున్నామని కూడా ప్రకటించారు.
అంతేకాకుండా, 2014 బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని కొన్ని క్లాజులు రాజ్యాంగానికి లోబడి లేవని పలువురు న్యాయ నిపు ణులు అభిప్రాయపడుతున్నారు; ఈ క్లాజులను కోర్టులు కొట్టివేస్తే, రాజ్యాంగాన్ని సవరించటం ద్వారా బీజేపీ వాటిని పునరుద్ధరి స్తుంది అని ప్రచురించారు.
ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వెంటనే కౌంటర్ దాఖలు చేస్తుందనే అనుకున్నాను! సంవత్సరం ఆరు మాసాలు గడచినా అతీగతీ లేదు!!
నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలందరికీ లోక్‌సభ ప్రొసీడింగ్స్.. వాటిని బట్టి ఈ బిల్లు పాసయిందని చెప్ప టానికి ఎలా వీలులేదో... ఈ మెయిల్ ద్వారా పంపించాను. కొంత మంది ఎంపీల్ని మెయిల్ చదివారా అని అడిగాను కూడా!
ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. బిల్లు పాసవ్వక పోతే మాత్రం, ఇప్పుడు చేయగలిగిందేముంది? రాష్ట్రాన్ని మళ్లీ కలుపు తారా? ఇదే ప్రశ్న!!
ఒక పెద్ద రాష్ట్రాన్ని లోక్‌సభ గడువే రెండ్రోజుల్లో ముగిసి పోతుంటే, విడదీసే తొందర్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలసి పోయి, మొత్తం నిబంధనలన్నీ గాలికొదిలి, అయిపోయిందంటే అయిపోయిందంటూ గంటన్నరలో ‘ఓటింగ్’ కూడా నిర్వహించ కుండా పూర్తి చేసేస్తే... కనీసం అడిగేవాడైనా లేకపోతే, భవి ష్యత్‌లో మన పరిస్థితి ఏమిటి... అనిపించింది.
అక్టోబర్ 7న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని కలసి ఒక మెమోరాండంను ఇచ్చాను. దానితో పాటే లోక్‌సభ, రాజ్యసభల ప్రొసీడింగ్స్‌తో ప్రచురించిన ఒక పుస్తకం కూడా ఇచ్చాను. ‘‘లోక్ సభలో 18.2.2014న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పాస య్యిందా?’’ ఆ పుస్తకం ఈ ప్రశ్నతో ప్రారంభమవుతుంది.
ఆ పుస్తకం, నేను రాష్ట్రపతి గారికిచ్చిన మెమోరాండం కాపీ, ఢిల్లీలో ప్రెస్ వారికీ, కొంత మంది మిత్రులకూ ఇచ్చాను.
‘సాక్షి’ రామచంద్రమూర్తిగారు ఆ పుస్తకం చదివారు. ‘తెలుగులో ప్రచురించలేకపోయారా’ అని అడిగారు. మీరు చేస్తున్న వాదనకు ప్రతిఫలం ఏమిటి అనే ప్రశ్న పక్కనబెట్టి, ఈ రకంగా పార్లమెంట్ నడిస్తే, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లదా-అనే ప్రశ్న ప్రజల ముందుంచాలిగదా అన్నారు మూర్తిగారు.
2000 సంవత్సరంలోనే ‘వార్త’ పత్రికలో నా చేత, వారం వారం ‘కాలమ్’ రాయించారు మూర్తిగారు! ఆ చనువుతో ‘మీ సాక్షిలో వేసుకుంటారా... పంపిస్తాను’ అన్నాను.
‘యస్’ అన్నారు రామచంద్రమూర్తి గారు.
రేపట్నుంచి ‘‘పార్లమెంట్‌లో ఏం జరిగింది’’ ప్రారంభమవు తుంది. కొంచెం ‘బోరు’ కొట్టినా చదవాలి. అధికార ప్రధాన ప్రతి పక్ష పార్టీలు కలసిపోతే (పార్టీలే సభ్యులు కాదు) ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతాయో, ఇది చదివితే అర్థమవుతుంది.
-ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
మొబైల్: 98881 80171