జార్ఖండ్‌లో ఓ వేట కథ! | Is it essential for the Chief Minister of Jharkhand to be a tribal? | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో ఓ వేట కథ!

Published Sat, Nov 22 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

జార్ఖండ్‌లో ఓ వేట కథ!

జార్ఖండ్‌లో ఓ వేట కథ!

జార్ఖండ్‌లో బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి, ప్రాణత్యాగాలు చేసింది ఆదివాసీలే. ఆదివాసీ రాష్ట్రం కోసం వందేళ్ల క్రితమే ఉద్యమ శంఖం ఊదిందీ ఆదివాసీలే. ‘అభివృద్ధి’ కోసం అడవులను, ఊళ్లను, ఆదివాసీ జీవిత విధానాన్ని త్యాగం చేసిందీ ఆదివాసీలే. ఈ చరిత్రనంతా పక్కకు నెట్టి ఆదివాసీయేతర ముఖ్యమంత్రి అవసరంపై మన మేధావులు చర్చిస్తున్నారు. ఈశాన్యం మినహా గిరిజన ముఖ్యమంత్రి ఉన్నది జార్ఖండ్‌లోనే. ఆ ఒక్క ముఖ్యమంత్రి పదవిని సైతం గిరిజనులకు దక్కకుండా చేస్తారా? 
 
 మరో మూడు రోజుల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతాయి. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది డిసెంబర్ చివరి నాటికి తెలుస్తుంది. నిజానికి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించేవేమీ కాదు. ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్న దేశంలో జనాభా రీత్యా జార్ఖండ్ పదమూడో స్థానంలో ఉంది. పద్నాలుగు లోక్‌సభ స్థానాలు, ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, పూర్వపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్ లాగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల శక్తి లేదు. పెపైచ్చు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అక్కడ పన్నెండు సీట్లను గెలిచింది.
 
  యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల పరిధిలో ఆధిక్యతను కనబరిచింది. గిరిజన ప్రజల్లో అంతో ఇంతో పట్టున్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో బీజేపీకి ఎన్నికల పొత్తు కూడా కుదిరింది. ఆ పార్టీ విజయంపై ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. అందుకే ఈ ఎన్నికలపై జాతీయ మీడియాలో సైతం పెద్దగా విశ్లేషణలు కానీ, చర్చలు కానీ కనిపించడంలేదు. అయితే సన్నిహితంగా ఈ ఎన్నికలను గమనిస్తున్న వారికి మాత్రం జార్ఖండ్ రాజకీయ రంగంలో ఎన్నికల అనంతరం ఏదో ఒక పెను మార్పు రాబోతున్న సూచన కనబడుతోంది.
 
 సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం జార్ఖండ్ రాష్ర్టం ఏర్పడినప్పటి నుంచి, రాష్ర్టపతి పాలనలో వున్న రెండేళ్లు మినహా మిగిలిన పన్నెండేళ్లు ఆదివాసీలే ముఖ్యమం త్రులుగా ఉన్నారు. ఐదుగురు ఆదివాసీ నేతలు ముఖ్యమంత్రులు అయ్యారు. శిబుసోరెన్ (జేఎమ్‌ఎమ్) మూడుసార్లు, అర్జున్ ముండా (బీజేపీ) మూడుసార్లు సీఎమ్‌లుగా ప్రమాణస్వీకారం చేశారు. మిగిలిన ముగ్గురు ఒక్కోసారి అధికా రాన్ని చేపట్టారు. ఈ పన్నెండేళ్లలో తొమ్మిది ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంటే సగటున ఒక్కో ప్రభుత్వం పదహారు నెలలు మాత్రమే పనిచేసింది. ఈ నేపథ్యం లో జార్ఖండ్ మీడియాలో గత కొంత కాలంగా ఒక చర్చ మొదలైంది. ‘‘ఆదివా సీలు అభివృద్ధి చెందాలంటే ఆదివాసీయే ముఖ్యమంత్రి కానవసరం లేదు, గిరిజనేతరులైన రమణ్‌సింగ్ (క్షత్రియుడు) ముఖ్యమంత్రిగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనాభివృద్ధి జార్ఖండ్ కన్నా మెరుగ్గా ఉంది.
 
 వ్యవసాయ, పారిశ్రామికాభి వృద్ధిలో కూడా ఛత్తీస్‌గఢ్‌తో పోలిస్తే జార్ఖండ్ వెనకబడే వుంది. కనుక ఈసారి గిరిజనేతర ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది.’’ ఇది ఆ చర్చ సారాంశం. బీజేపీ అనుకూల మీడియాలో కూడా ఈ తరహా వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో క్షత్రియుడైన రమణ్‌సింగ్ గత పదకొండేళ్లుగా అవిచ్ఛిన్నంగా అధి కారంలో ఉండటం, అక్కడ రాజకీయ సుస్థిరత నెలకొని ఉండటం వాస్తవం. అలాగే జార్ఖండ్‌లో ప్రభుత్వాలు సగటున పదహారు మాసాలకు మించి నిలువ లేదనేదీ వాస్తవమే. అయితే రాజకీయ సుస్థిరత లేదా అస్థిరతలకూ ముఖ్యమం త్రుల ఆదివాసీ నేపథ్యానికీ ఎటువంటి సంబంధం లేదని మీడియా గుర్తించడం లేదు. అలాగే రాజకీయ సుస్థిరతకూ, అభివృద్ధికీ సంబంధం ఉందనే అంశాన్ని కూడా మీడియా గుర్తించ నిరాకరిస్తోంది.
 
 2009లోనే ఆదివాసీయేతర ముఖ్య మంత్రి అవసరమనే అంశాన్ని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్‌సిన్హా తెర మీదకు తీసుకొచ్చారు. జార్ఖండ్‌కు చెందిన సిన్హా కోరిక అప్పట్లో తీరలేదు. వయోభారం వల్ల ఇప్పుడూ తీరే అవకాశం లేదు. అప్పుడు యశ్వంత్‌సిన్హా వెలిబుచ్చిన అభి ప్రాయాలను సమర్థిస్తూ అక్టోబర్ 31న బీజేపీకి సంబంధంవున్న ‘నీతి సెంట్రల్’ అనే వెబ్‌సైట్‌లో ‘ఆదివాసీయేతర సీఎం అవసరముంది’ అనే శీర్షికతో శాశ్వత్ పాణిగ్రాహి అనే పాత్రికేయుడు ఒక వ్యాసం రాశారు. పై వాదాన్ని సమర్థిస్తూనే ఈయన మరింత ముందుకు వెళ్లాడు. హరియాణాలో జాట్ల పెత్తనానికి, మహా రాష్ట్రలో మరాఠాల ఆధిపత్యానికి చరమగీతం పాడిన బీజేపీ ఇప్పుడు జార్ఖండ్ ఆదివాసీ సీఎం అనే నిశ్చితాభిప్రాయం నుంచి బయట పడాలని ఆయన అభి ప్రాయపడ్డారు. ఈ చర్చనంతటినీ బీజేపీ నాయకత్వం మౌనంగా ప్రోత్సహి స్తోంది. ఈ కారణంగానే బీజేపీ జార్ఖండ్‌లో ఆదివాసీయేతర ముఖ్యమంత్రిని ప్రతిష్టించాలనే నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.
 
 జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసీల జనాభా 28 శాతం. మరి మిగతా డెబ్బయ్ రెండు శాతంగా ఉన్న ఆదివాసీయేతరులు ముఖ్యమంత్రులు కావాలని కోరుకో వడంలో తప్పేముంది?... సగటు మేధావికి ఈ సందేహం కలగడం చాలా సహజం. అయితే జార్ఖండ్ లాంటి రాష్ట్రంపై ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చే ముందు ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, సంస్కృతులపై రేఖామాత్రంగానైనా అవగాహన నేర్పరచుకోవడం అవసరమని వారికి సూచించాల్సి ఉంది.
 
 తూర్పు భారతంలోని ఛోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతమంతటా విస్తరించిన అటవీ ప్రాంతమే జార్ఖండ్. బిహార్, బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో విస్తరించి వున్న ఈ ప్రాంతాన్ని జార్ఖండ్ పేరుతో ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వందేళ్ల క్రితమే వచ్చింది. 1914లోనే ఆ డిమాండ్ వచ్చిం దని ఫజలలీ కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. ఎనభై ఆరేళ్ల పోరాటం అనంతరం... జార్ఖండ్ పోరాటయోధుడు బిర్సాముండా జన్మదినం సందర్భంగా, 2000 నవం బర్ 15న బిహార్ దక్షిణ ప్రాంతం జార్ఖండ్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. జార్ఖండ్ ఆదీవాసీల్లో ముండా, సంతాల్, ఓరోన్ వగైరా ఐదారు తెగలు ప్రధానమైనవి. వీరి భాషలకు, హరప్పానాటి భాషతో సారూప్యత ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యావర్తమంతటా గణరాజ్యాలు విస్తరించిన కాలంలో జార్ఖండ్ ఉత్తర భాగం మగధలోకి, దక్షిణ భాగం కళింగలోకి చీలిపోయింది.
 
 అనంతరం అనేకసార్లు రాజులూ, రాజ్యాలూ మారిపోయి జార్ఖండ్ ప్రాదేశిక సరిహద్దులూ మారిపోయాయి. సరిహద్దులు మాత్రమే మారుతూ వచ్చాయి తప్ప ఆదివాసీల జీవితాల్లోకి మాత్రం ఆ మార్పులు ప్రవేశించలేదు. అడవులు ఆదివాసీల సంపదగానే ఉన్నాయి. వారి ఆచార వ్యవహారాలూ చెక్కు చెదరలేదు. బ్రిటిష్ వారి ప్రవేశంతోనే మొదటిసారిగా ఆదివాసీల ఉనికికి సవాలు ఎదురైంది. జాగీర్దారీ వ్యవస్థనూ, దానితో పాటు వడ్డీ వ్యాపారుల వ్యవస్థనూ బ్రిటిష్‌వాళ్లు అటవీప్రాంతంలో కూడా ప్రవేశపెట్టారు. అడవి బిడ్డల హక్కు భుక్తంగా ఉన్న పంట భూములు జాగీర్దార్లకు దఖలు పడ్డాయి. వడ్డీ వ్యాపారులు అవసరానికి అప్పులిచ్చి చక్రవడ్డీలతో పీల్చి పిప్పిచేయడం మొదలైంది.
 
 ఈ పరిణామాలను తమ జీవితాలపై దురాక్రమణగా భావించిన జార్ఖండ్ ఆదివా సీలు సాయుధ తిరుగుబాటుకు సిద్ధపడ్డారు. 1857లో ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రారంభమైందని చదువుకున్నాం. కానీ అంతకు వందేళ్ల పూర్వమే 1765లో జార్ఖండ్ ఆదివాసీల తిరుగుబాటు మొదలైంది. అణచివేసే కొద్దీ తెరలు తెరలుగా ఆదీవాసీల ప్రతిఘటనా పోరు దాదాపు నూటా యాభై ఏళ్ల పాటు కొనసాగింది. ఈ పరంపరలో 1855లో జరిగిన సంతాల్ తిరుగు బాటు, 1895-1900 మధ్యకాలంలోని బిర్సా ముండా పోరాటం చరిత్ర ప్రసిద్ధికె క్కాయి.
 
  సిద్దూ, కన్హూ అనే ఇద్దరు అన్నదమ్ముల నేతృత్వంలో జరిగిన పోరాటంలో సుమారు అరవై వేలమంది సంతాల్ తెగ ఆదివాసులు పాల్గొ న్నారు. గెరిల్లా యుద్ధ తంత్రం తెలియని గిరిజనులు బరిగీసి నిలిచినట్టుగా మర ఫిరంగి దళాలకు ఎదురొడ్డి నిలిచారు, విల్లంబులతోనే ఎదురు నిలిచి బ్రిటిష్ వారిని ప్రతిఘటించారు. ఈ తిరుగుబాటులో సిద్దూ, కన్హూలు సహా పదిహేను వేల మంది సంతాల్ గిరిజనులు ఆత్మ బలిదానం చేశారు. బిర్సా ముండా ఓ జానపద హీరో వంటి చారిత్రక వ్యక్తి. ఇరవయ్యో ఏట తిరుగుబాటు ప్రారం భించి పాతికేళ్ల వయసులోనే మరణించాడు. ఇతని నాయకత్వంలోనే ఆదివాసీలు కోల్పోయిన భూమి హక్కులను తిరిగి సాధించుకోగలిగారు. ఆది వాసీల ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో బిర్సా ముండా ముద్ర చెరిపివేయలేనిదని చెబుతారు. రాంచీ ఎయిర్‌పోర్టుకు ఈయన పేరే పెట్టారు. పలు విద్యాసంస్థలకు కూడా బిర్సా పేరు పెట్టుకున్నారు.
 
 దేశంలోని మొత్తం ఖనిజ సంపదలో దాదాపు 40 శాతం జార్ఖండ్‌లోనే వుంది. 1907 లోనే టాటాలు జమ్‌షెడ్‌పూర్‌లో తొలి ఇనుము-ఉక్కు కర్మాగా రాన్ని ప్రారంభించారు. దేశంలోనే అతి పెద్దవైన ధన్‌బాద్ బొగ్గు గనులు, ఆసియాలోనే పెద్దదైన బొకారో ఉక్కు కర్మాగారం వంటి డజన్ల కొద్ది పరిశ్రమలు జార్ఖండ్‌లో ప్రారంభమయ్యాయి. ఎనిమిది పెద్ద డ్యాములు నిర్మాణమ య్యాయి. వీటి ఫలితంగా 70 లక్షల మంది నిర్వాసితులయ్యారు. వీరిలో అత్యధి కులు ఆదివాసీలే. వారు జార్ఖండ్ వీడి ఈశాన్య రాష్ట్రాల్లోని టీ తోటలకు, దక్షిణాది రాష్ట్రాల పట్టణాలకు ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లారు. మరో పక్క ఉత్తర బిహార్ నుంచీ, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చిన గిరిజనేత రులు జార్ఖండ్‌లో ఏర్పాటైన పరిశ్రమల్లో ఉపాధి పొందారు.
 
 జార్ఖండ్‌లో ఆది వాసీల జనాభా 28 శాతానికి పడిపోవడం ఈ పరిణామాల పర్యవసానమే. ఈ ప్రాంతంలో బ్రిటిష్ వలసవాదుల పెత్తనానికి వ్యతిరేకంగా తరాల తరబడి పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి నిలబడింది ఆదివాసీలే. ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం కోసం వందేళ్ల క్రితమే ఉద్యమ శంఖం ఊదిందీ ఆదివాసీలే. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తమ అడవులను, ఊళ్లను, మొత్తంగా ఆదివాసీ జీవిత విధానాన్ని త్యాగం చేసి దేశాంతరం వెళ్లిందీ ఆదివాసీలే. ఈ చరిత్రనంతా పక్కకు నెట్టి ఆదివాసీ యేతర ముఖ్యమంత్రి అవసరం గురించి మన మేధావులు చర్చిస్తున్నారు. ఈశాన్య భారతంలోని కొన్ని చిన్న చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే దేశం మొత్తం మీద గిరిజన ముఖ్యమంత్రి ఉన్న రాష్ర్టం జార్ఖండ్ ఒక్కటే. ఆ ఒక్క ముఖ్య మంత్రి పదవిని సైతం గిరిజనులకు దక్కకుండా చేస్తూ సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం అంటూ వల్లించే చిలక పలకులకు అర్థం వుంటుందా?
 
  పూర్వం జార్ఖండ్ అటవీ ప్రాంతంలో ఒక బ్రిటి ష్ అధికారి ఉండేవాడు. అతనికి వేట అంటే చాలా ఇష్టం. అక్కడే మంచి వేటగాడైన ఒక గిరిజన యువ కుడూ ఉండేవాడు. ఆ యువకుడు జంతువును వేటాడి దాని తలను అధికారికి చూపేవాడు. అధికారి కానుకలిచ్చేవాడు. ఓసారి పెద్ద పులిని వేటాడి తలను తీసుకెళ్లాడు. అధికారి మెచ్చి, కానుకలిచ్చాడు. ఇంకా ప్రమాదకరమైన మృగం వడ్డీ వ్యాపారి రూపంలో ఎదురైంది. అది గిరిజనుల ధన, మాన, ప్రాణాలను దోచుకుంటున్న మానవ మృగం. ఒకనాడు ఆ మృగం ఆ యువకుని భార్యను ఎత్తుకుపోయింది.
 
 యువకుడు అన్ని క్రూరమృగాల్నీ వేటాడినట్టే ఆ మృగాన్నీ వేటాడి, ఆ తలను కూడా అధికారి దగ్గరకు తెచ్చాడు. అధికారి మెచ్చుకోలేదు. అరెస్టు చేయించి మరణశిక్ష వేయించాడు... అవును. ఇది సినిమా కథే. మృణాల్ సేన్ దర్శకత్వంలో 1976లో వచ్చిన ‘మృగయా’ సినిమా కథ. ఆదివాసీయేత రుడ్ని జార్ఖండ్ ముఖ్యమంత్రిని చేయడంపై జరుగుతున్న చర్చను చూస్తుం టే ఈ కథే గుర్తుకొస్తోంది. ఆదివాసీలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే ఆది వాసీ జీవనవిధానాన్ని, సంస్కృతిని పరిరక్షించే నిజమైన అభివృద్ధి సాధ్య మని పోరాటాలు, త్యాగాలు చేశాం అంటారా? ఓ విగ్రహం అడగండి పెట్టిస్తాం, విమానాశ్రయానికి పేరు పెట్టమనండి... అనుగ్రహిస్తాం. శాంపి ల్‌గా కొంతకాలం అధికారం రుచి చూస్తామంటారా?... అలాగే పరిశీలిస్తాం. అదివాసీ రాష్ట్రాన్ని పాలించే హక్కు ఆదివాసీలదేనని మాత్రం అనకండి... మన ప్రజాస్వామ్యం అంగీకరించదు!   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement