
విభజనకు ‘భాష’ కారణమా?!
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ముల్కీ-నాన్‌ముల్కీ గొడవకు పరిష్కారంగా మూడు ప్రాంతాలలోని విద్యా, ఉపాధి అవకాశాలలో ఎవరూ దెబ్బతినకుండా రాష్ట్రావతరణ తర్వాత పదిహేనేళ్లకు ఇందిరాగాంధీ ‘371-డి’ అనే ప్రత్యేక అధికరణను (32వ రాజ్యాంగ సవరణ ద్వారా) రూపొందించడానికి కారకులయ్యారని మరవరాదు! దీన్ని సవరించాలంటే 368వ అధికరణ ద్వారా రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ను సవరించి తీరాలనేది అందుకే!
‘విభజించి పాలించే’ బ్రిటిష్ వలస పాలకుల ‘నీతి’ మత సరిహద్దులు కూడా దాటింది. ఆ కూట నీతి మన దేశంలో ఏ స్థాయికి వ్యాపించిందంటే, ఒకే భాషా సంస్కృతుల పునాదిగా ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాలను సహితం కకావికలు చేయగలిగే వరకు వెళ్లింది. అక్కడ కూడా ఆగకుండా అసలు ‘భాష’ అనేదే రాష్ట్రం విడిపోవడానికి లేదా విభజనకు కారణమని తాజా వాదన లేవదీసే వరకూ వెళ్లింది!
మజ్లిస్ నాయకుడు, గౌరవ పార్లమెంటు సభ్యుడు ఒవైసీ సమైక్య రాష్ట్రంతోనే అందరి అభివృద్ధి అని చాటుతూన్న సమయంలో, హైదరా బాద్‌కు చెందిన కులీన కుటుంబానికి చెందిన ప్రసిద్ధులు నవాబ్ మెహ బూబ్ అలామ్ ఖాన్ రాష్ట్రం విడిపోవడానికి ‘భాష’ సబబైన కారణమని అభిప్రాయపడినట్టు (‘ది హిందూ’,‘ఆఫ్ ది రికార్డు’: 13.1.2014) వచ్చిం ది! ఇందుకు నవాబ్ అలామ్ చేస్తున్న వాదనేమిటి? ‘‘హైదరాబాద్, గుల్బ ర్గాలు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు మీరు ప్రయాణిస్తున్నప్పుడు తేడా ఏదీ మీకు అనిపించదు. కాని, రాష్ట్రంలో ఉన్నప్పటికీ, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తుంటే తేడా కనిపిస్తుంద’’ని ఆయన అంటారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరమైందో చెప్పడానికి ఈ పోలిక తెచ్చారట! హైదరా బాద్ స్టేట్‌లో నాలుగు విభిన్న భాషలు-ఉర్దూ, తెలుగు, కన్నడం, మరాఠీ మాట్లాడేవారుండేవారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా రాకపోకలు సాగించే వారు, నేడు ఒకే రాష్ట్రంలోని ఒక భౌగోళిక ప్రాంతాన్ని దాటి సుఖంగా వెళ్ల లేకపోతున్నారు కాబట్టి ఒకే భాషాప్రయుక్త రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం విడిపో వాలనుకోవడానికి ఇంతకన్నామించిన కారణం ఏముంటుంద’’ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు!
అన్నిచోట్లా అన్ని భాషల వారూ...
అలామ్ ప్రస్తావించిన నాలుగు విభిన్న భాషలు మాట్లాడే ప్రజలు నేడు ఏ ఒక్క తెలంగాణ ప్రాంతానికో పరిమితమైలేరు. బహుముఖీనంగా విస్తరి స్తున్న ఆధునిక సంస్కృతిలో భిన్న భాషలు మాట్లాడే ప్రజలు అసోం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ, కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా విస్తరించుకుని ఉన్నారు! రెండు పరాయి పాలక వంశాల ఇలాకాల్లో (నిజాం సంస్థానం, బ్రిటిష్ పాలన) చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఇటు 200 ఏళ్లకు పైగా అటు 150 ఏళ్లకు పైగా ప్రజల భాషకు, బతుకుతెరువుకు ఏర్పడిన కడగండ్లను అలామ్ పరిగణనలోకి తీసుకుని ఉంటే ‘భాష’ ఆధారంగా తెలుగు జాతి విచ్ఛిత్తిని, విభజనను సమర్థించడానికి సాహసించేవారు కాదు! పరిమి తంగానే అయినా ఒక్క కుతుబ్ షాహీల కాలంలో తెలుగు రాణించింది. అది మినహా తెలంగాణలో తెలుగు స్కూళ్లు తెరవనివ్వలేదు. తెలుగు సంస్కృతిని వికసించనివ్వలేదు. మద్రాసు రాజధానిగా సీమాంధ్ర ప్రాంతా లను ఏలుతూ వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యపాలనా వ్యవస్థవల్ల అక్కడి ప్రజలూ స్వరాష్ట్రం కోసం, స్వభాషాభివృద్ధి కోసం, ఉపాధి సౌకర్యాల కోసం తెలంగాణ సోదరుల మాదిరిగా నానా అగచాట్లు పడినవారే!
నిజాంనూ ఆదేశించిన మద్రాసు
1942లో ‘జాయిన్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తిలో సాగిన క్విట్ ఇండియా ఉద్యమకాలంలో తెలుగు భాషా ప్రాంతాలకు మూడు ప్రాంతీయ కార్యాల యాలు ఏర్పడ్డాయి. తెలంగాణకూ ఓ ప్రాంతీయ కార్యాలయం ఏర్పడింది. ఈ కార్యక్షేత్రానికి కేంద్రం విజయవాడ. నిజాములు లొంగిపోయిన తరు వాత బ్రిటిష్ వలస పాలనకు దక్షిణాదిన, దక్కన్‌లోనూ మద్రాసు, హైద రాబాద్ నగరాలే ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. మద్రాసు నుంచే అన్ని రకాల ‘హుకుమ్’లూ జారీ అవుతూ ఉండేవి. హైదరాబాద్‌కు సంబంధించి తెలుగు సహా నాలుగు భాషల వారి గురించి అలామ్ ప్రస్తావించారు. కానీ భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడేవారు వారి వారి భాషా రాష్ట్రాలకు తరలిపోతుంటే ఎందుకు అడ్డు కోలేకపోయారో చెప్పగలరా? అసలు ప్రాంతాల వారీగా ఇక్కడున్న వివిధ భాషా ప్రజల వివరాలను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వెల్లడించిన సంగతిని గుర్తుచేసుకోవాలి.
రాష్ట్రం మొత్తంమీద తెలుగు వారు 85 శాతం. హైదరా బాద్ సహా మొత్తం తెలంగాణలో చూస్తే 77 శాతం ఉన్నారు. హైదరాబాద్ మినహాయించి కేవలం తెలంగాణలో తెలుగువారు 81 శాతం ఉన్నారు. కేవలం హైదరాబాద్‌లో 47 శాతం. రాయలసీమలో 80 శాతం, కోస్తాం ధ్రలో 93 శాతం ఉన్నారని కమిషన్ చెప్పింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే పెక్కు భాషలు-తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడం, హిందీ మాట్లాడే ప్రజలున్నారని ఆ కమిటీ తేల్చింది! ఈ సందర్భంగా, ‘ముల్కీ’ (స్థానికులు, నాన్-ముల్కీ అంటే స్థానికేతరులు) భావన ఎందుకు తలె త్తిందో శ్రీమతి ముదిగొండ సుజాతారెడ్డి ఇచ్చిన వివేచనాత్మకమైన వివరణ చూద్దాం: ‘‘ఉత్తర భారతంలో మొగల్ సామ్రాజ్యం, లక్నోలో అవధ్ నవా బుల రాజ్యం (1857) కూలిపోయిన తర్వాత అక్కడి రాజాస్థానాల్లో ఉన్న తోద్యోగులెందరో హైదరాబాద్‌కు వలసవచ్చి, నిజాం రాష్ట్రంలో స్థిరపడి పోయారు. దాంతో ఇక్కడ పాలితులు, పాలకులు అనే భేదం, వర్గ భేదం విస్తరించింది. పూర్తిగా ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడింది.
భూస్వాముల చేతుల్లోకి చాలా భాగం వ్యవసాయ భూములు చేరిపోయాయి. కాపులు, రైతులంతా కౌల్దారులుగా మాత్రమే మిగిలిపోయారు. కష్టం వాళ్లవంతయింది. ఫలాలు ఫ్యూడల్ దొరలపాలై ప్రభువు నిజాం ధనవంతుడయ్యాడు. వృత్తి పనుల వారు, మాలమాదిగలు తమ భుక్తి కోసం పనులు చేసేదానికన్నా దొరలకు దేశ్‌ముఖ్‌లకు సేవలు, వెట్టిచాకిరీ చేయడంలోనే కాలం గడిచిపోయింది. స్వాతంత్రోద్యమంలోనూ నిజాం రాష్ట్రంలోనూ క్రమంగా ఆ గాలులు ప్రవే శించాయి. కాని చాలా నిర్బంధాలుండటం చేత మొదట భాషాపరమైన, సాంస్కృతిక పరమైన గుర్తింపుల కోసం ప్రయత్నాలు జరిగాయి’’.
తెలుగు తెలుగువారందరిదీ...
వాదన కోసమో లేదా నిజాం పాలనావశేషాల పట్ల మిగిలిపోయిన మమకా రంతోనో ‘భాష’ విభజనకు లేదా విడిపోవడానికి కారణమని అలామ్ వాదించి ఉంటారు. మత సామరస్యానికి పేరెన్నికగన్న హైదరాబాద్ (భాగ్య) నగరంలో భిన్న మతస్థుల మధ్య సంబంధాలను పరిశీలించి నివే దిక ఇవ్వమని, సరోజినీ నాయుడి కుమార్తె పద్మజా నాయుడిని జాతీయ కాంగ్రెస్ పురమాయించింది. 1938, డిసెంబర్ 1న పద్మజా నాయుడు ప్రత్యేక అనుబంధాలు సహా ఒక నివేదికను సమర్పించింది. అందులో హైదరాబాద్‌లోని మెజారిటీ, మైనారిటీ ప్రజల హక్కుల సమస్య గురించిన ప్రస్తావనలో ఇలా ఉంది. ‘‘ఈ సమస్యను గోరంతలు కొండంతలు చేసి దానికి కృత్రిమమైన ప్రాధాన్యం కల్పించారు. అలా ఎందుకు జరిగిందంటే, బ్రిటిష్ ఇండియాలో పాలన విదేశీయులది కాబట్టి, హిందువులు, ముస్లిం లు సఖ్యంగా ఉన్నారు. హైదరాబాద్‌లో పాలన ముస్లిం ప్రభువులది. పైగా 1909, ఏప్రిల్ 7న విడుదలైన ఫర్మానాలో హైదరాబాద్‌ను ‘ఇస్లామిక్ స్టేట్’ అని పేర్కొన్నారు. అప్పట్లో స్టేట్‌లోని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న అధి కారులు ముస్లింలే అయినందున ఉన్నత, కిందిస్థాయి పదవులు పెక్కిం టిలో ముస్లింలనే నియమించారు. పైగా ఉర్దూ భాషనే బోధనా భాషగా చేయడం వల్ల హైదరాబాద్ మొత్తం (1,41,36,148) జనాభాలో కనీసం ఒక తరం తరం, ఆ అధికార మార్పిడి కాలంలో ఉద్యోగాల కోసం నిర్వహిం చిన పోటీ పరీక్షలో 90 శాతం తీవ్రంగా నష్టపోయారు’’!
పేరు మార్చుకుందాం!
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ముల్కీ-నాన్‌ముల్కీ గొడవకు పరిష్కారం గా మూడు ప్రాంతాలలోని విద్యా, ఉపాధి అవకాశాలలో ఎవరూ దెబ్బతిన కుండా రాష్ట్రావతరణ తర్వాత పదిహేనేళ్లకు ఇందిరాగాంధీ ‘371-డి’ అనే ప్రత్యేక అధికరణను(32వ రాజ్యాంగ సవరణ ద్వారా) రూపొందించడానికి కారకులయ్యారని మరవరాదు! దీన్ని సవరించాలంటే 368వ అధికరణ ద్వారా రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ను సవరించి తీరాలనేది అందుకే! ఒకవేళ అందులో ‘తెలంగాణ’ పదం చేర్చాలన్నా అందుకూ 7వ షెడ్యూ ల్‌కు సవరణ తేవాలేగాని అడ్డగోలు బిల్లు పనికిరాదని గుర్తించాలి! అంత కన్నా ఉర్దూ భాషా ప్రతిపత్తిని కాపాడుతూనే, రక్షణ కల్పిస్తూనే తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసుకోకుండా ‘ఆర్టికల్-3’లోని ‘ఇ’ క్లాజు ప్రకారం రాష్ట్రం పేరును ‘తెలుగునాడు’ లేదా ‘తెలంగాణ’ అని మార్చుకుంటే చక్కగా ఉండదూ! ఆలోచించండి!
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు