ఆయనొక సామాజిక విప్లవ యోధుడు
కొప్పుల రాజు
ఐదు దశాబ్దాల పార్లమెంటరీ చరిత్ర గలిగిన విశిష్ట నేత బాబూ జగ్జీవన్‌రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం యావత్ జీవితాన్ని అంకితం చేశారు. ఆయన స్మృతి అజరామరం. ఆయన కృషిని కొనసాగించడానికి కంకణబద్ధులం కావడమే ఆయనకు అర్పించగల నివాళి.
దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని సమరం సాగించిన సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్‌రామ్. ప్రేమగా అంతా ఆయనను ‘బాబూజీ’ అనే వారు. పీడితులు, దళితులు, బహుజనులు తదితర అణగారిన వర్గాల ఆత్మబంధువుగా, పరిపాలనా దక్షునిగా దేశ చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. బీహార్ రాష్ట్రం షహబాద్ (నేటి భోజ్‌పూర్) జిల్లాలోని చాంద్వా అనే చిన్న గ్రామంలో 1908, ఏప్రిల్ 5న ఆయన ఒక దళిత కుటుంబంలో జన్మించారు. తండ్రి చిన్ననాటనే మరణించి కుటుంబం కష్టాలపాలైనా చదువులో ఆయన అసాధారణ ప్రతిభను కన బరచారు. భోజ్‌పూరి, హిందీ, ఆంగ్లం, బెంగాలీ, సంస్కృత భాషలలో విస్తృతంగా పుస్తక పఠనం సాగించారు. 1920లో అర్రా పట్టణ మాధ్యమిక పాఠశాలలో చేరి ఎస్సీ స్కాలర్‌షిప్‌ను నిరాకరిం చారు. జనరల్ కేటగిరి విద్యార్థులకు దీటైన ప్రతిభను కనబరచి మెరిట్ స్కాలర్‌షిప్‌ను సాధించారు.
పాఠశాలలోని వెలికి, వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అందరికీ ఒకే మంచి నీటి కుండను ఏర్పాటు చేయించారు. జగ్జీవన్‌లోని తెలివి తేటలను, జ్ఞాన తృష్ణను గమనించిన పండిట్ మదన్‌మోహన్ మాల వీయ ప్రోత్సాహం కారణంగా ఆయనకు కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం కలిగింది. ఆ తదుపరి కలకత్తా విశ్వవిద్యాల యం నుంచి బి.ఎస్.సి.లో డిస్టింక్షన్ సాధిం చారు. అక్కడ చదువుతుండగానే 35 వేల మంది కార్మికులతో బహిరంగ సభను నిర్వహించి బోస్‌బాబు వంటి వారి దృష్టిని ఆకర్షించారు. మార్క్స్ రచనలను చదివి వర్గ రహిత, కుల రహిత సమాజంపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకున్నారు. 1934 బీహార్ భూకంప బాధితుల సేవలో నిర్విరామంగా శ్రమించారు. అప్పుడే గాంధీజీని చూసి ప్రభావితులయ్యారు.
1935లో ఇంద్రాణీదేవిని వివాహం చేసుకున్న జగ్జీవన్ 1936లో బీహార్ శాసన మండలిలో నామినేటెడ్ సభ్యులయ్యారు. 1937లో ఆయన స్థాపించిన డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ బీహార్ శాసనసభలోని మొత్తం 14 రిజర్వుడ్ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. బ్రిటిష్ పాలకులు ఎర చూపిన డబ్బు, మంత్రి పదవులను తిరస్కరించారు. ‘‘జగ్జీవన్‌రామ్ పుటం పెట్టిన బంగారాన్ని తలపిస్తున్నారు’’ అని గాంధీజీ ప్రశంసించా రు. బ్రిటిష్ పాలకులు భారత్‌ను రెండవ ప్రపంచ యుద్ధంలోకి లాగినందుకు నిరసనగా, మొత్తం మంత్రివర్గంతో పాటూ ఆయన రాజీనామా చేశారు. 1940 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలోనూ, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోనూ జగ్జీవన్ కారాగారవాసం అనుభవించారు. 1946లో ఈస్ట్ సెంట్రల్ షహబాద్ (రూరల్) నుంచి ఏకగ్రీవంగా గెలిచి కేంద్ర కార్మిక మంత్రి అయ్యారు. 1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో సాసారాం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1986లో కన్ను మూసేవరకు ఆయన అదే నియోజక వర్గం నుంచి అవిచ్ఛిన్నంగా పార్లమెంటు సభ్యులుగా కొనసాగారు. 1952-56 మధ్య కమ్యూనికేషన్ల మంత్రిగానూ, ఆ తర్వాత 1957-62 మధ్య రైల్వే మంత్రిగానూ పనిచేశారు. 1962-70 మధ్య రవాణా, కమ్యూనికేషన్ మంత్రిగా, కార్మిక, పునరావాస మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. వ్యవసాయ మంత్రిగా సస్య విప్లవ సారథి అయ్యారు. 1969లో కాంగ్రెస్ చీలిపోయినప్పుడు ఆయన ఇందిరాగాంధీకి దన్నుగా నిలిచారు. 1971లో రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ విమోచనలో కీలక పాత్రను పోషించారు. అద్వితీయ దీక్షాదక్షతలతో ప్రతి శాఖపైనా ఆయన తనదైన సొంత ముద్రను వేయగలిగారు.
1975లో ఇందిర విధించిన అత్యవసరసర పరిస్థితికి నిరసనగా 1977లో జగ్జీవన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీని ఏర్పాటు చేశారు. తదుపరి దా న్ని జనతా పార్టీలో విలీనం చేసి రక్షణశాఖ ను చేపట్టారు. 1979లో ఉప ప్రధాని పదవిని స్వీకరించారు. జనతా ప్రభుత్వ పతనం తదుపరి ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఐదు దశాబ్దాల పార్లమెంటరీ చరిత్ర గలిగిన విశిష్ట నేతగా చిరస్మరణీయులైన జగ్జీవన్ 1986 జూలై 6న 78వ ఏట తుది శ్వాస విడిచారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన బాబూజీ స్మృతి అజరామరం, ఆయన కృషిని కొనసాగించడానికి కంకణబద్ధులం కావడమే ఆయనకు అర్పించగల నివాళి.
(వ్యాసకర్త ఏఐసీసీ,ఎస్సీ విభాగం చైర్మన్
ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్‌రామ్,106వ జయంతి