దళితుల్లో అభద్రత పెంచిన మోదీ : కొప్పుల రాజు
ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు
సాక్షి, హైదరాబాద్: దళితులపై కాకుండా తనపై దాడి చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో దళితుల్లో, మైనారిటీల్లో మరింత అభద్రత పెరిగిందని ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో కలసి మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. దళితులకు ప్రత్యేకంగా ఉన్న చట్టాలను అమలు చేస్తామని, దాడులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పలేదన్నారు.
భరోసా కల్పించేవిధంగా మాట్లాడకుండా, మరింత ప్రోత్సహించే విధంగా మోదీ మాట్లాడటంతో మరింత అభద్రత, ఆందోళన పెరుగుతున్నదన్నారు. గో రక్షక్ విషయంలో చట్టంపై నమ్మకాన్ని కలిగించేలా మోదీ ఎందుకు మాట్లాడలేదని రాజు ప్రశ్నించారు. రెండేళ్లుగా మైనారిటీలపై, దళితులపై దాడులు జరుగుతున్నా నోరెందుకు విప్పలేదన్నారు.
జీవో 123పై సుప్రీంకు...
జీవో 123పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగు, ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలపై వాస్తవ జలదృశ్యాన్ని ఈ నెల 17న ఆవిష్కరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలేమిటో ప్రజలకే వెల్లడిస్తామన్నారు. ఈ నెల 16న ఆదిలాబాద్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, సాయంత్రం రైతు గర్జన ఉంటాయన్నారు.