
‘జేఎన్‌యూ పేరు మార్చాలి’
వివాదాస్పద వ్యాఖ్యలకి ప్రసిద్ధి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి. మానవ వనరుల మంత్రిత్వ శాఖ జవహర్‌లాల్ యూనివర్సిటీ (ఢిల్లీ) ఉపకులపతిగా ఆయనను నియమించాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు స్వామి చాలా షరతులు విధిస్తున్నారు. అసలు జేఎన్‌యూ పేరే మార్చాలని ఆయన కోరిక. నెహ్రూ పేరుకు బదులు, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని మేం సిఫారసు చేశామంటున్నారు. అక్కడితో ఊరుకోలేదు. బోస్ ఉన్నత స్థాయి విద్యావంతుడు, నెహ్రూ తృతీయ శ్రేణి ఉత్తీర్ణుడు మాత్రమే అన్నారాయన.
మానవ వనరుల శాఖ స్వామిని ఇప్పుడు వీసీగా నియమించినా విద్యార్థులు అంగీకరిస్తారా అన్నది అనుమానమే. ఎందుకంటే, నెహ్రూతో పాటు ఆ విశ్వవిద్యాలయం విద్యార్థులను కూడా స్వామి విడిచి పెట్టలేదు. జేఎన్‌యూలో తిష్ట వేసిన జాతి వ్యతిరేక విద్యార్థులను తొలగించే అధికారం ఇస్తేనే పదవి చేపడతానని ఆయన ట్వీట్ ఇచ్చారు. అసలు ఆ ప్రాంగణంలో మత్తు పదార్థాల నిరోధక బ్యూరో శాఖనే ఏర్పాటు చేయాలంటున్నారాయన. అంతేనా, అక్కడే పాతుకుపోయిన నక్సల్స్‌నీ, జీహాదిస్టులని ఏరేయడానికి సరిహద్దు భద్రతాదళం శిబిరం కూడా అవసరమేనని ఆయన పేర్కొన్నారు.