మార్క్స్ నుంచి మార్స్ దాకా...
మార్క్స్ నుంచి మార్స్ దాకా...
Published Mon, Nov 18 2013 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
మహారాజుల పోషణలో ప్రబంధ సాహిత్యం కుప్పలు తెప్పలుగా పెరిగింది. తంజావూరు రాజుల కాలంలో ఎక్కడ విన్నా యక్షగానాలు వీనుల విందు చేశాయి. ఆస్థానాలు పచ్చగా ఉన్న రోజుల్లో అవధాన విద్య పురివిప్పి నాట్యమాడింది. గిరాకీని బట్టి ఉత్పత్తి అనే సూత్రం సాహిత్యానికి కూడా వర్తిస్తుందనిపిస్తుంది. అన్నమయ్య పద కవితలు, క్షేత్రయ్య పలుకులు, త్యాగయ్య కృతులు యిందుకు మినహాయింపు. వాళ్ల సమీకరణాలు ఇహలోక వ్యవహారాలు కావు, పరలోక బేరసారాలు. తెలుగులో సొంత ఆలోచనలు రెక్కలార్చింది ఆ మధ్యనే అంటే పదిహేను దశాబ్దాల క్రితమే. తెలుగువాడు హాయిగా తనని చూసి తాను నవ్వుకోవడం నేర్చింది కన్యాశుల్కంతోనే. గట్టిగా నూటపదహారేళ్లు!
స్వాతంత్య్రోద్యమం అర్ధశతాబ్దిపాటు సాహిత్యాన్ని వీరంగం వేయించింది. కొందరు కవులు నిజంగా దేశభక్తితో రాస్తే కొందరు గిరాకీ ఉందని చలించారు. వీటితో పాటు గులాబీ అత్తర్లూ గుబాళించాయి. అంతరిస్తున్న అవశేషాలను తలచుకుంటూ సానిపాప కథలు వచ్చాయి. అప్పుడే ‘ఎలుతురంతా మేసి ఏరు నెరేసింది’. సరిగా నూరేళ్ల క్రితం తెలుగులో సాక్షి వ్యాసాలు శ్రీకారం చుట్టుకున్నాయి. వేయి పడగలు, నారాయణరావు సాంఘిక నవలలు వందేళ్ల తెలుగువాడి జీవితాదర్శం అన్నారు కొందరు. అది వారి వారి స్వీయచరిత్రలకు నవలీకరణగా విశ్లేషించారు ఇంకొందరు. వాటి ప్రభావమే ఆ తరువాత ఊడిపడిన ‘లోపలి మనిషి’. గయోపాఖ్యానమనే ప్రచండ యాదవం. పాండవోద్యోగ విజయాలు; పడక సీను; అయినను పోయిరావలె హస్తినకు... యివన్నీ తెలుగువారి గుండెల మీద పచ్చబొట్లుగా మద్రపడ్డాయి స్వాతంత్రానికి ముందే. గరుడ పక్షి ఆర్భాటాలకు దీటుగా వచ్చి, అందర్నీ తేరిపార చూసేలా చేసిందొంక గబ్బిలం. సమాజానికి ఒక కొత్త చూపు ప్రసాదించింది. భావకవిత్వం, దాని తాలూకు వేషభాషా విలాస విన్యాసాలు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయాయి. కమ్యూనిస్టు మానిఫెస్టో కవిత్వీకరించుకుని వరదలా వచ్చి పడింది. దాని పేరు మహాప్రస్థానం. ఈ దశాబ్దం నాది అంటూ మహాప్రస్థాన కవి క్లెయిమ్ చేసుకున్నాడు. మరైతే ఈ దశాబ్దం కవిత్వాలకే పరిమితం అయితే మిగతా ఆవిర్భావాల మాటేంటని ఎవరూ అడగలేదు. ఉదాసీనత తెలుగువాడి నైజగుణం.
పాప్యులర్ లిటరేచర్ అంటే కథలు, నవలలు, స్కెచ్‌లు ఒక్కసారి వచ్చిపడ్డాయ్. సాంఘిక నాటకాలు అందులో ఒక పద్ధతిలో పరిషత్తు నాటకాలు తెరకెక్కాయి. తెలుగు సినిమాలు ఆదర్శాలను మూటకడుతూ, పౌరాణిక సాంఘిక నాటకాలను అనుసరిస్తూ నడుస్తున్నాయి నాటికీ నేటికీ. ‘కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం- రెప్పపాటే ఈ జీవితం’లాంటి మినీ కవితలు కొన్నాళ్లు ఒక వూపు ఊపాయి. తరువాత అతి పాప్యులర్ లిటరేచర్ సీసాలోంచి దయ్యంలా వచ్చి ఆవరించింది. ఇండిపెండెన్స్ తరువాత భారతి సాహిత్యం పడిపోయి ఆంధ్రవారపత్రిక అందుకుంది. వేళ్లు లేని రకరకాల సాహిత్య ధోరణులు బంగారు తీగెలా బదనికల్లా అల్లుకుని పెరిగాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నది నిజమని మరోసారి రుజువైంది. వీటితో పాటు సామాజిక స్పృహ ముఖ్య దినుసుగా ఒక కెరటం ఆవహించింది. కాదన్నవారిని కాల్చేస్తామని బుజ్జగించారు. ఆ సీజన్‌లో కన్వర్షన్స్ జోరుగా జరిగాయి.
ఆ స్పృహ కొడిగడుతున్న వేళ ప్రపంచీకరణ తారాజువ్వలా ఎగసింది. ఈ కొత్తవింతను ఉద్యమస్ఫూర్తితో సాహిత్యకారులు అంది పుచ్చుకున్నారు. నూతన సహస్రాబ్ది సాఫ్ట్‌వేర్‌కీ సాహిత్యకారులకూ గొప్ప గిరాకీ తెచ్చింది. లిటరేచర్‌లోని అన్ని ప్రక్రియలనీ ప్రపంచీకరణలోనే పండించారు సత్కవులు. ఇప్పుడు అదీ సద్దుమణిగింది. ఈ ఫ్లాష్‌బ్యాక్ సరే, భవిష్యత్‌వాణి ఎలా ఉంటుంది? ‘మార్క్స్ నించి మార్స్ దాకా’ కథనాన్ని చెబుతారెవరో.
- శ్రీ రమణ
Advertisement