సీఎంల సింగపూర్ జ్వరం | kcr and chandra babu naidu have singapore fever | Sakshi
Sakshi News home page

సీఎంల సింగపూర్ జ్వరం

Published Wed, Nov 19 2014 12:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

సీఎంల సింగపూర్ జ్వరం - Sakshi

సీఎంల సింగపూర్ జ్వరం

డేట్‌లైన్ హైదరాబాద్
 
 ఇప్పటికే రాజధానిగా ఉపయోగిస్తున్న నగరాన్ని సింగపూర్ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రంగుల కలలు చూపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేని సింగపూర్ నగరాన్ని సృష్టిస్తానని మరో మయుడి అవతారం ఎత్తే ప్రయత్నంలో ఉన్నారు. ఇద్దరు ఏలికలు ఆదర్శంగా తీసుకున్న సింగపూర్‌లో మంచినీళ్లు కొనుక్కుంటారన్న విషయం మరిచిపోయారా? ఇంకా సెంటు భూమయినా సేకరించలేదు, కానీ అప్పుడే సింగపూర్ కన్సల్టెంట్‌ను రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నియమించేశారు.
 
 
 ‘‘బడుగువర్గాల జీవితాలు బాగుపడడాన్ని మనం ఇంకా అభివృద్ధిగా అర్థం చేసుకోవడం లేదు.  సంక్షేమంగా మాత్రమే అర్థం చేసుకుంటున్నాం. ‘సంక్షేమం’ అనేది ఎంత ‘అభివృద్ధో’ గ్రహించినట్టయితే ఈ విషయాల గురించి మనం చర్చించే పద్ధతే మారిపోతుంది’’ అని మన కాలపు తాత్వికుడు, మానవ హక్కుల పోరాటయోధుడు కె. బాలగోపాల్ చెప్పిన మాటలు గుర్తొస్త్తున్నాయి. ఆయన మన సమాజాన్ని విశ్లేషించిన కొన్నివేల సందర్భాలలో ఇటువంటి కొన్ని లక్షల విషయాలు చెప్పి ఉంటారు. కానీ, మన ఏలికల బుర్రల్లోకి అవి ఎంతవరకు ఎక్కి ఉంటాయి?  అది మాత్రం అనుమానమే. డబ్బంతా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడితే అభివృద్ధి ఎట్లా ? ప్రపంచ దేశాల్లో మన దేశం తలెత్తుకు నిలబడాలా వద్దా అని ప్రశ్నించే మేధావులు కూడా లేకపోలేదు.
 
 ఏది అభివృద్ధి?
 
 బాలగోపాల్ ఇంకా, ‘బలహీన వర్గాలకు స్కాలర్‌షిప్‌లు, చౌక బియ్యం, కరెంట్ సబ్సిడీ, ఉచిత ైవైద్యం, విద్య - ఇవన్నీ 50 ఏళ్లుగా అందకుండా ఉంటే, ఈ రోజు పక్కా ఇళ్లలో ఉంటూ పిల్లలను అంతో ఇంతో చదివించుకుంటూ ఒక మోస్తరు జీవన ప్రమాణాలను అందుకున్న లక్షలాది కుటుంబాలు ఎక్కడ ఉండేవి, ఏ విధంగా ఉండేవి? ఇది ‘అభివృద్ధి’ కాదనీ,  ప్రభుత్వానికి ఆర్ధికభారం పెంచే సంక్షేమ వ్యయం మాత్రమేనని అనుకోగలమా?’ అని కూడా అన్నారు. ఆయన  చెప్పినట్టు సంక్షేమానికి ఖర్చు చేసే నిధులను ఆర్థికభారంగా, అనవసర వ్యయంగా మాత్రమే చూసినట్టయితే, అభివృద్ధికి ఆయన చెప్పిన అర్ధం కాకుండా మన ఏలికలు  చెప్ప చూస్తున్న అర్థమే తీసుకుంటే స్వాతంత్య్రం వచ్చిన ఈ 67 ఏళ్లలో మనకు మనుషులు కాకుండా దేశం నిండా మహా కట్టడాలే కనిపించేవి. బాలగోపాల్ మాటలు ఇప్పుడెందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు పోటీ పడి తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్న మాటలూ, చేస్తున్న ప్రకటనలూ, కురిపిస్తున్న వాగ్దానాల కారణంగానే.
 
 ఇద్దరూ ఇద్దరే!
 
 ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడంగా చెప్పే దుబాయ్ బర్జ్ ఖలీఫా కంటే ఎత్తయిన టవర్‌ను హైదరాబాద్ సంజీవయ్య పార్క్‌లో నిర్మిస్తానంటున్న  తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచనలు, రాజధాని నిర్మించ తలపెట్టిన చోట పంట భూములున్న రైతులను సింగపూర్ పర్యటనకు పంపిస్తానంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనలు చూస్తుంటే బాలగోపాల్ చెప్పినట్టు అభివృద్ధికి ఏలికలు చెప్పుకునే అర్థం ప్రజాసంక్షేమం కాదు, అందమయిన నగరాలను అభివృద్ధి చేయడం, ఆకాశ హర్మ్యాలు నిర్మించడమేనని భావించక తప్పదు.
 
 రాష్ర్టం విడిపోయే నాటికి రెండు ప్రాంతాల్లోనూ సామాన్య ప్రజల పరిస్థితి ఎంతో అధ్వానంగా ఉంది. అంతకు ముందు అయిదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే లేదు. ఏలికలు చెప్పే అభివృద్ధి  ప్రజలు కోరుకునే సంక్షేమం అన్నీ కుంటుపడ్డాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే వచ్చాయి. ఇదంతా తెలిసిన వాళ్లు కాబట్టే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు ఎన్నికల సమయంలో బోలెడు వాగ్దానాలు చేశారు. ఇద్దరూ ముఖ్యమంత్రులు కాగానే ఆ పనిలో ఉండాల్సింది. కానీ ఇద్దరి ప్రాధామ్యాలు మారిపోయాయి. ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
 
 ఆకాశ హర్మ్యాలే తప్ప ఆత్మహత్యలు పట్టవు
 తెలంగాణ  రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు నిత్యం పత్రికల్లో, టీవీ చానళ్లలో చదువుతున్నాం, చూస్తున్నాం. కరెంట్ కష్టాలతో, అప్పుల బాధతో, పింఛన్లు పోయాయనో బక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌ను సింగపూర్‌ను మించిన నగరంగా అభివృద్ధి చేసేపనిలో పడింది. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మి స్తానని, ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు ముప్పు తెచ్చే నిర్మా ణాల ను నిరోధించే 111 జీవో  రద్దు చేయిస్తానని, సంజీవయ్య పార్క్‌లో ప్రపం చంలోనే అతి పెద్ద టవర్ నిర్మిస్తానని చంద్రశేఖర్‌రావు  ప్రకటనలు చేస్తున్నారు.
 
 రైతుల ఆత్మహత్యల మీద మాత్రం అధ్యయన కమిటీ వేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో చెప్పిస్తున్నారు. ఈ వార్తా లేఖ రాస్తున్న సమ యంలోనే మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని కనిమెట్ట గ్రామం లో దేవన్న అనే పేదవాడు పింఛన్ల జాబితా నుండి తన పేరు, తన భార్య పేరు తొలగించారని తెలిసి గుండె ఆగి చనిపోయినట్టు వార్తవచ్చింది.  భర్త మరణ వార్త విని తట్టుకోలేక ఆయన భార్య కూర్మక్క కూడా చనిపోయింది. ఈ నిజాలను నిర్ధారించడానికి అధ్యయన కమిటీలు అవసరమా!
 
 ససేమిరా అంటున్న రైతన్నలు
 
 ఇప్పటికే రాజధానిగా ఉపయోగిస్తున్న నగరాన్ని సింగపూర్ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రంగుల కలలు చూపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేని సింగపూర్ నగరాన్ని సృష్టిస్తానని మరో మయుడి అవతారం ఎత్తే ప్రయత్నంలో ఉన్నారు. ఇద్దరు ఏలికలు ఆదర్శంగా తీసుకున్న సింగపూర్‌లో మంచినీళ్లు కొనుక్కుంటారన్న విషయం మరిచిపోయారా? ఇంకా సెంటు భూమయినా సేకరించలేదు, కానీ అప్పుడే సింగపూర్ కన్సల్టెంట్‌ను రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నియమించేశారు. ఇక్కడ ప్రతిపక్షాలతో సంప్రదించే ఆలోచన మాత్రం ఆయన చేయడం లేదు. ఏటా మూడు పంటలు పండే భూములను ఇచ్చే ప్రసక్తే లేదని గ్రామాలకు గ్రామాల రైతులు ఘోషిస్తుంటే, ఒకవేళ బలవంతం చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని  బెదిరిస్తుంటే రాష్ర్ట మంత్రివర్గం మాత్రం  ఆర్డినెన్స్ తెచ్చే తొందరలో ఉంది. ముందు అధికారులు వెళ్లారు.  తరువాత మంత్రులు వెళ్లారు. అయినా రైతులు  సిద్ధపడడంలేదు.  ఇప్పుడు కొన్ని బస్సులు వేసి రైతులనే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొస్తున్నారు.
 
 రైతులకు సింగపూర్ చూపుతారట
 
 భూములు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి దగ్గరే కుండబద్దలుకొట్టే ఉద్దేశంతో బయలుదేరిన రైతులను మాత్రం బస్సుల నుండి బలవంతంగా దింపేశారని వార్తలు వచ్చాయి.  రాజధాని కోసం భూసేకరణ చేయదలచిన గ్రామాల రైతు లను  సింగపూర్ పర్యటనకు పంపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తు న్నట్టు  ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక మంగళవారం రాసింది. సింగపూర్‌ను చూస్తే ఆ రైతులకు వాస్తవం అర్థం అవుతుందట. రేపు ఆ రాజధానిలో, ఎంత గొప్ప భవనాల మధ్య జీవించవచ్చునో అవగతం అవుతుందట.
 
 మనుషులను బతకనీయండి!
 
 తెలంగాణలో  చంద్రశేఖర్‌రావు నిర్మించబోయే మహా కట్టడాలకు నిధులు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. అడిగినా ఎవరికీ చెప్పరు. అక్కడ 30 నుండి 40 వేల ఎకరాల పంట భూములను ఏం చేసుకుంటారో,  దానికి నిధులు  ఎక్కడి నుండి వస్తాయో చెప్పరు. భూములు ఇవ్వాల్సిన  రైతులకయినా సమాచారం ఉండదు. సింగపూర్ కన్సల్టెంట్‌కు తప్ప ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా వివరాలు తెలియవు. చంద్రబాబునాయుడు ఆదర్శంగా తీసుకున్న దేశాల్లో రాజధానులు ఇన్నిన్ని వేల ఎకరాల్లో నిర్మాణం జరగలేదు. మన ముఖ్యమంత్రులు  ఈ రెండు ప్రభుత్వాలను ఇట్లాగే నడిపితే చివరికి మహా నగరాలూ కట్టడాలూ తప్ప మనుషులు  మిగలరు. బాలగోపాల్ మాటలు గుర్తు చేసుకున్నది ఇందుకే.
 
 -దేవులపల్లి అమర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement