మతం ముసుగున మగాధిపత్యం
సామాజిక, నైతిక స్మృతిగా ఇస్లాంను నిర్వచించినప్పుడు దానిది విప్లవాత్మక దృష్టి, ప్రత్యేకించి లైంగిక సమస్యలపై అది ఆ కాలం కంటే చాలా పురోగమించినది. కాల క్రమంలో చట్టంపై మగ గుత్తాధిపత్యం దాని ఉదారవాద స్ఫూర్తిని ధ్వంసం చేసింది.
పాకిస్తాన్‌లోని తిరోగమనవాద మితవాదుల గత చరిత్రను, పెరుగుతున్న వారి ప్రభావాన్ని బట్టి చూస్తే ఈ వ్యాసం అసాధారణ మైనదే. పాకిస్తాన్ సెనేట్ (పార్ల మెంటు ఎగువ సభ) మానవ హక్కుల కమిటీ ఆ దేశంలోని ఇస్లామిక్ భావజాల మండలి (సీఐఐ)ని రద్దు చేయాలని సూచించింది. అర్థ దయార్ద్ర హృదయ నియంత ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ 1962లో తన కొత్త రాజ్యాంగాన్ని రుద్దారు. అప్పుడే ఆయన దేశంలోని చట్టాలన్నీ ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేలా చేయడానికి తగు మార్గాలను సూచించడానికి సీఐఐను ఏర్పాటు చేశారు.
రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థను రద్దు చేయమని కోరడం సాధారణంగా జరిగేదేమీ కాదు. అయితే, భర్తలు ‘‘తప్పు దారి పట్టిన’’ భార్యలపై ‘‘తేలికపాటి’’ హింసను ప్రయోగించడాన్ని అనుమతించాలి, నేరమూ, శిక్షల పరిమా ణాన్ని సహజంగానే భర్తకు వదిలిపెట్టాలి అని సీఐఐ సూచించింది. దీంతో వ్యవహారం తీవ్ర స్థాయికి చేరిన ట్టుంది.
సీఐఐ సూచనలు తప్పనిసరిగా అమలు చేయాల్సినవి కాదనేది నిజమే. కానీ అవి బహిరంగ చర్చను ప్రభావితం చేస్తాయి. అర్థరహితమైన స్త్రీద్వేషం, మహిళల పట్ల అనుమా నపు జబ్బు ప్రపంచవ్యాప్తంగానే పతాక శీర్షికలకు ఎక్కుతు న్నాయి. చాలావరకు అవి అపహాస్యాన్ని వ్యక్తంచేసేవే అయి ఉంటాయి. ఆ అపహాస్యపు ప్రతిస్పందనా తక్కువే. మతాధికార దుర్వినియోగం ఎల్లప్పుడూ సున్నిత వ్యవహరమే. స్వార్థ ప్రయోజనాలు ఎల్లప్పుడూ కపట భక్తి ముసుగును కప్పుకునే ఉంటాయి మరి. అందువలన ఈ అంశానికి సంబంధించిన దృక్కోణం ఉండాల్సిన క్రమం లోనే ఉంది.
ఒకటి, ఇస్లామిక్ భావజాల మండలి అనే పేరే తప్పుగా పెట్టినది. సభలోని అన్ని పక్షాలకు ప్రాతినిధ్యం ఉండటం అనేది ఏ ప్రజాస్వామిక మండలికైనా మొట్ట మొదటి ఆవశ్యకత. ఆ లక్షణం లేకున్నా సీఐఐ ఒక మండలి వంటిది ఏదైనా కావచ్చునేమో... అంతేగానీ ఏదేమైనా అది ఇస్లామ్‌కు చెందినది మాత్రం కాదు. 7వ శతాబ్దంలో ఇస్లాంను సామాజిక, నైతిక శిక్షా స్మృతిగా నిర్వచించి నప్పుడు దానిది విప్లవాత్మక దృష్టి, ప్రత్యేకించి లైంగిక సమస్యలపై అది నాటి కాలం కంటే ఎంతో ముందుకు పురోగమించినదిగా ఉండేది.
అందువల్లనే అత్యుత్సాహంగా ఇస్లాంలోకి పరివర్తన చెందినవారిలో అత్యధికులు మహిళలే. ఇస్లాం మహిళలకు వారసత్వ హక్కులను, ఒక రూపంలోని మనోవర్తిని ఇచ్చింది. ఆ కాలంలో మరెవరూ ఆ పని చేయలేదు. అయితే కాలక్రమంలో చట్టానికి భాష్యం చెప్పడంపై మగవారి గుత్తాధిపత్యం దాని ఉదారవాద స్ఫూర్తిని ధ్వంసం చేసి, ఆచరణను మగ ఆధిపత్యంగా మార్చింది. ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ఇజ్తిహాద్ అనే భావన ఉంది. దాని ప్రకారం చట్టం మౌలిక ఉద్దేశాన్ని కాపాడటం కోసం మీరు దాన్ని మీ స్వతంత్ర బుద్ధితో వ్యాఖ్యానించవచ్చు. అత్యంత సుపరిచితమైన ఉదాహరణనే తీసుకుందాం.
విశ్వాసులు దొంగల చేతులను ఖండించాలని పవిత్ర ఖురాను చెబుతుంది. అయినా సమాజాలు దొంగతనాన్ని అదుపుచేయడానికి మార్గాంతరాలను కనుగొన్నాయి. కాబట్టి ఏ ముస్లిం దేశం లోనూ ఇంకా ఆ శిక్షను అమలు చేయడం లేదు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని నియంత జనరల్ జియా ఉల్ హఖ్ సుదీర్ఘమైన తన పదేళ్ల కిరాతక పాలనలో పాకిస్తాన్‌లో ఈ శిక్షను పునరుద్ధరించాలని ప్రయ త్నించి, విఫలమయ్యాడు. మారుతున్న పరిస్థితుల వెలు గులో... చట్టంలో ఒక చోట సవరణను చేయగలిగారంటే వెనుకడుగు వేసిన మరెక్కడైనా కూడా ఆ పనిని చేయవచ్చు.
ఉదారణకు, సుప్రీంకోర్టు షా బానో కేసులో... ఆమెకు మాజీ భర్త మనోవర్తిగా పడేస్తున్న బిచ్చం కంటే ఎక్కువ తీసుకోడానికి అర్హత ఉన్నదని తీర్పు చెప్పింది. ఆ వృద్ధురాలికి మాజీ భర్త ఇవ్వజూపిన డబ్బు నెలకు సరిప డటం కాదు గదా, ఒక్క పూట భోజనం కొనుక్కోడానికి కూడా చాలనిది. ఆ తర్వాత 1980లలో భారత మితవా దులు ప్రజాభిప్రాయాన్ని ఆ తీర్పునకు విజయవంతంగా తిరోగమన దిశకు మరల్చగలిగారు. తమ భార్యలను, ఇతర మహిళా బంధువులను మనుషులుగా గాక తమ ఆస్తు లైన వస్తువులుగా చూసే... మగాళ్లు లైంగకపరమైన క్రూర త్వంతో ప్రగతిశీలమైన ముస్లిం చట్టాన్ని మహిళలకు వ్యతిరేకంగా ఎలా తిరగరాయగలరనే దానికి ఇది ఒక ఉదా హరణ. అలాంటి ఆలోచనా ధోరణి కుహనా మతవాదపు ముసుగులో దాక్కుంటుంది.
పాకిస్తాన్‌లో ఈ సమస్య ఒక సంక్షోభంగా మారింది. ‘‘అత్యాచారం కేసుల్లో డీఎన్‌ఏ పరీక్షలను ప్రాథమిక ఆధా రంగా ఆమోదించ రాదనడం, విద్యాలయాల్లో, కార్యాల యాల్లో ఆడామగా కలిసి ఉండటాన్ని నిషేధించే మోడల్ బిల్లు సీఐఏ ఆదేశాల్లో కొన్ని. ఠారెత్తించే మత ధిక్కార చట్టం కింద వచ్చిన ఫిర్యాదుల పరిశీలనలో అతి చురుగ్గా ప్రతి స్పందించే మండలి... ఆ చట్టం కింద తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని శిక్షించే చర్యలను తీసుకోవాలంటూ చేసే విజ్ఞప్తులను తిరస్కరిస్తుంది’’ అని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
పాకిస్తాన్‌లోని పలుకుబడిగల కొన్ని వర్గాల అభి ప్రాయం అలాంటి నిరపేక్ష అధికారాన్నిసవాలు చేయ డానికి సిద్ధంగా ఉండటం ఆశను రేకెత్తించే అంశం. ప్రజలు సీఐఐకి వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్ధపడుతున్నారు. మానవ హక్కుల కమిటీ సభ్యులు అందుకు ఒక ఉదాహరణే తప్ప ఒకే ఒక్క ఉదాహరణ కాదు. ఇస్లామిక్ భావజాల మండలి ‘‘మత, సాంస్కృతిక విలువల వక్రభాష్యాల వాయుతరంగాల’’తో ముంచెత్తుతోందంటూ ప్రధాన పాకి స్తానీ ఇంగ్లీషు దినపత్రిక ‘డాన్’ దానిని ఖండించింది. ‘‘మహిళలను ప్రభావితం చేసే చట్టాలు పార్లమెంటు ఏకాభిప్రాయంతోనే జరిగేలా’’ చేయాలని అది శాసన కర్తలకు విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి నిరోధకత్వం పార్లమెం టులో వృద్ధి చెందడం కాదుగదా, మనజాలదనే అంతరార్థం ఈ సూచనలో ఉంది.
కపటుల కోసం, మహత్తరమైన మతాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకునే అత్యధమ కపటుల కోసం ఇస్లాం నరకంలో ఒక ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించి ఉంచింది. వారు ఏ రూపంలో వచ్చినా, ఏ నేపథ్యంలో వారు తమ దుష్టత్వానికి పాల్పడ్డా... ఈ కపటులను ‘‘మిత్రులుగా స్వీకరించరాదు’’, వంచకులుగా, పిరికిపంద లుగా చూడాలి. పాకిస్తాన్ ఈ నయవంచుకుల ముసుగు లను తొలగిస్తుందని ఆశిద్దాం.
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు