సరైన దారిలో మోడీ అడుగులు | Modi, in the right way | Sakshi
Sakshi News home page

సరైన దారిలో మోడీ అడుగులు

Published Thu, Jun 5 2014 12:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

సరైన దారిలో మోడీ అడుగులు - Sakshi

సరైన దారిలో మోడీ అడుగులు

తమిళనాడు రాజకీయ నేతల ఒత్తిళ్లకు వెరవకుండా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడం ద్వారా మోడీ తానేమిటో రుజువు చేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇలాంటి తెగువను ప్రదర్శించలేకపోయారు. విదేశీ వ్యవహారాల విషయానికి వచ్చేసరికి కేంద్రం, స్థానిక రాజకీయాలకూ, ఒత్తిళ్లకూ లొంగదనీ ప్రధాని స్పష్టంగా చెప్పకనే చెప్పారు.
 
నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని అవుతారని ఏడాది క్రితం ఎవరూ ఊహించలేదు. బీజేపీకి ఇంత సులభంగా మెజారిటీ వస్తుందని కూడా ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. త్రిశంకు సభ ఏర్పడుతుందనీ, ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ పండితులు వేసిన లెక్కలు తప్పాయి. ఎన్నో రాజకీయ ప్రణాళికలు రచించుకున్న నవీన్ పట్నాయక్, జయలలితలు హెచ్చులకుపోకుండా వినయంగా, మర్యాదపూర్వకంగా మోడీని కలిశారు.

తనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ పోల్చుకున్నారు. కాని అత్యంత విఫలుడైన అధ్యక్షుడిగా ఆయన అమెరికా చరిత్రలో నిలిచిపోతారన్న విషయాన్ని మోడీ అర్థం చేసుకుంటే మంచిది. ఒబామా చేసే అద్భుత ప్రసంగాలతో ప్రజలు విసిగిపోయారు. వారికి ఫలితాలు కావాలి. ఆ విషయం మోడీ గ్రహించాలి. తమ కేబినెట్ సహచరులు తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనుల గురించి ప్రధాని అప్పుడే మార్గనిర్దేశనం చేశారు. ‘ఏదైనా పని సవ్యంగా ప్రారంభిస్తే సగం పూర్తయినట్టే’నని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పారు. దీని నుంచి స్ఫూర్తి తెచ్చుకున్నారు కాబోలు ప్రధాని తన ప్రభుత్వం ముందు ఉన్న 10 ప్రధాన లక్ష్యాలను ప్రకటించారు. మోడీ శుభారంభం చేయడంతో ఎంతో ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నేతల నోటమాట రాలేదు.

ఆరంభంలోనే ప్రత్యేక ముద్ర

తన ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ఆయన విమర్శకులను సైతం దిగ్భ్రాంతి కలిగించింది. పొరుగు దేశాల పట్ల మోడీ దౌత్యం పాటించబోరని, దుందుడుకు విదేశాంగ విధానం అనుసరిస్తారని వారు భావించారు. మోడీ తీసుకున్న చొరవను జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ప్రశంసించారు. మోడీ చిన్న కేబినెట్ ఏర్పాటు చేయడం కూడా ప్రజలను ఆశ్చర్యపరిచింది. గతంలో ఐదు ప్రభుత్వాలు శాఖలను విడగొట్టి పదవుల పందేరం చేసి జెంబో కేబినెట్ ఏర్పాటు చేశాయి. సంకీర్ణ సర్కారులలో మిత్రపక్షాలు కీలకమైన శాఖలను దక్కించుకోగా ఏ రాజా, టీఆర్ బాలు లాంటి మంత్రులు బాహాటంగా అవినీతికి పాల్పడినా ప్రధాని ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సి వచ్చింది. శివసేనలాంటి మిత్రపక్షాల ఒత్తిళ్లకు సైతం లొంగకుండా మోడీ చిన్న కేబినెట్‌తో సరిపుచ్చారు. తమిళనాడు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు వెరవకుండా శ్రీలం క అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడం ద్వారా మోడీ తానేమిటో రుజువు చేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇలాంటి తెగువను ప్రదర్శించలేకపోయారు. విదేశీ వ్యవహారాల విషయానికి వచ్చేసరికి కేంద్రం స్థానిక రాజకీయాలకూ, ఒత్తిళ్లకూ లొంగదనీ ప్రధాని స్పష్టంగా చెప్పకనే చెప్పారు.

బంధుప్రీతికి దూరం

గతంలో వాజ్‌పేయ్ కేబినెట్‌లో పనిచేసి విఫల రాజకీయ నేతలుగా ముద్రపడిన సీనియర్లను మోడీ పక్కన పెట్టారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గతంలో ఆరేళ్లు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వీరి పనితీరు గొప్పగా ఏమీ లేదు కాబట్టి ఈసారి తీసుకోనవసరం లేదని మోడీ భావించారు. ఇక సుష్మా స్వరాజ్ విషయానికి వస్తే ఆమెను కొంతకాలం నిరీక్షింప చేసిన తర్వాత చివరి క్షణంలో కేబినెట్‌లో తీసుకునేందుకు మోడీ అంగీకరించారు. ప్రధాని కొన్ని మంత్రిత్వ శాఖలను మరికొన్నింటిలో కలిపేశారు. దీనివల్ల ఏ మేరకు మేలు జరుగుతుందో చూడాలి. ఆయన విద్యాధికులైన బీజేపీ ఎంపీలకు మంచి అవకాశం ఇచ్చారు. వాణిజ్య, విద్యుత్, పెట్రోలియం, పర్యావరణం వంటి అంశాలకు స్వతంత్ర శాఖలను ఏర్పాటు చేసి వాటిని కొత్తవారికి ఇచ్చారు. పార్టీ మంచి పనితీరు కనబరచని రాష్ట్రాలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కోణంలో తెలంగాణ, కేరళ నుంచి ఎవరికీ మంత్రి పదవి రాలేదు. అవినీతిలో నిండామునిగిన యడ్యూరప్పను కూడా తీసుకోలేదు. అంతేకాదు సోనియా-రాహుల్ కుటుంబ పాలన గురించి తీవ్రంగా విమర్శలు చేసిన మోడీ తన కేబినెట్‌లో నేతల బంధుప్రీతికి తావివ్వలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన కుమారుడు దుష్యంత్ సింగ్‌నూ, మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్‌ను ఓడించిన సోనారామ్ చౌదరినీ మంత్రులుగా చేయాల్సిందిగా కోరగా... ప్రధాని నిర్మొహమాటంగా తిరస్కరించారు. అలాగే ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ తన కుమారుడు అభిషేక్ సింగ్‌కు మంత్రి పదవి ఇప్పించుకోలేకపోయారు.

అధికార యంత్రాంగానికి స్వేచ్ఛ

 అధికార యంత్రాంగానికి ప్రధాని మార్గనిర్దేశనం చేశారు. నిర్ణయాలు తీసుకునేందుకు వారికి తగిన స్వేచ్ఛనిచ్చారు. సాచివేత ధోరణిని సహించబోనని, నిర్దిష్ట సమయానికి ఫలితాలను రాబట్టాలని స్పష్టంగా చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలో అక్రమార్కులు ఆడింది ఆటగా సాగేది. నిజాయితీ, సమర్థులైన వారు భయంతో నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకంజ వేసేవారు. అధికార యంత్రాంగానికి స్వేచ్ఛనివ్వడం ద్వారా మోడీ సరైన సంకేతాలు పంపినట్టయ్యింది.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సూచించిన విధానాలతో ద్రవ్యలోటు తీవ్రతరం కావడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం కళ్లారా చూసిన మోడీ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. పర్యావరణ శాఖ అనుమతులు పెండింగ్‌లో పెట్టిన కారణంగా దాదాపు రూ. రెండు లక్షల కోట్ల దాకా విలువైన ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఫైళ్లు అనుమతి ఇవ్వడానికి అప్పటి పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారంటూ గత ఏడాది డిసెంబర్‌లో  మోడీ విమర్శించడమే కాకుండా,  ఆయన దానికి ‘జయంతి ట్యాక్సు’గా పేరు కూడా పెట్టారు. దీన్ని అవమానంగా భావించి ఆ మరునాడే జయంతి నటరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనితో తాను ప్రధాని అయిన తర్వాత పర్యావరణ శాఖ అనుమతులపై ఆయన ప్రత్యేక దృష్టిని పెట్టారు.

సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమాలోచనలు, సమీక్షలు జరుపుతున్నారు. అన్నింటికన్నా పాలనలో, కార్యాచరణలో వేగం ముఖ్యం. లక్ష్యాలు సాధించిన వారిని ప్రోత్సహించడం ఎంత ప్రధానమో, చేవలేని వారిని శిక్షించడం కూడా అంతే ప్రధానం. ఇది మంత్రులకూ సమానంగా వర్తిస్తుంది. మంత్రుల పనితీరును మదింపు వేయడంలో ప్రధాని సమదృష్టితో ఉండాలి. ఒకవేళ అసమర్థుల్ని తొలగించాల్సి వస్తే వెనుకాడకూడదు.

భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు

భవిష్యత్తులో కేబినెట్‌ను విస్తరిస్తే మోడీ చుట్టూ భజనబృందం చేరుతుంది. ఇతర నాయకుల్లాగే ఆయన్నీ వారు కీర్తించడం మొదలెడతారు. దీంతో మోడీ పతనం ప్రారంభమవుతుంది. పాలన వ్యవహారాలలో తన ముద్ర కోసం తపించే ఆర్‌ఎస్‌ఎస్ తెరవెనుక ఉంటూ వివాదాలు సృష్టిస్తూనే ఉంటుంది. మోడీకి భవిష్యత్తులో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అనుసరించిన విధానాలు మిత్రులనే కాదు, ప్రత్యర్థుల్ని సైతం ఆశ్చర్యచకితుల్ని చేశాయి. అయితే ఒబామా అనుసరించదగిన ఆదర్శ నాయకుడేమీ కాదు. పనితీరు బాగా లేకపోతే గొప్ప ఉపన్యాసాలు సైతం చికాకు కలిగిస్తాయి. మాటలకు తగిన పటుతరమైన చేతలు తోడైతేనే విజయం వరిస్తుంది. దీంట్లో ఏది శ్రుతి మించినా వికటిస్తుంది. ప్రధానిగా మోడీ తన సత్తా నిరూపించుకునేందుకు ఎంతో కాలం ఉంది. కాని ఏ పనైనా బాగా మొదలుపెడితే సగం పూర్తయినట్టే కదా.

(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement