ఆజ్ఞాపన మీద అస్పష్ట ముద్ర
తెలుగు రాష్ర్ట కృత్రిమ విభజనకు దారి తీసిన కారణాలు, పలు రకాల ఉద్రేకాలు కూడా నగర ఓటింగ్ సరళిపైన ప్రభావం చూపినట్టు వెల్లడైంది. విభజనకు ముందు ఆ తరువాత సెటిలర్స్ పేరిట వెలువడిన అనూహ్యమైన ప్రకటనలు, నివాసానికి సంబంధించిన అర్హతలకు కొందరు నాయకులు పెట్టిన కొలతల ప్రభావమూ ఈ ఎన్నికల ఓటింగ్ సరళి మీద పడిందని, తగ్గిన శాతమే రుజువు చేస్తున్నది. ఈ అర్హతలు, కొలతల వల్లనే ఎన్నికలలో అధికార పార్టీ ప్రచారంలో వాణీ బాణీలు కూడా అకస్మాత్తుగా మారిపోయాయి.
‘గదిలో పన్నిన తెర వెనుక (బ్యాక్ రూం) వ్యూహంతో పకడ్బందీ రూపకల్పనతో, బడుగు బలహీన వర్గాలకు గుప్పించిన హామీల పరంపరతో హైదరాబాద్ మహానగర్ మున్సిపల్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ ఘన విజయం సాధించింది. నగరంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన హామీల పరంపరను నమ్మినందునే ఈ విజయం సాధ్యమైంది.’
- ది హిందూ (6-2-2016)నివేదిక
‘జంటనగరాలలోని అన్ని ప్రాంతాల ప్రజలు టీఆర్‌ఎస్‌కి చరిత్రాత్మకమైన ఆజ్ఞాపన పత్రం అందచేశారు. దీంతో నగరవాసులందరి సంక్షేమానికీ, వారి సంరక్షణకూ మాపై బాధ్యత పెరిగింది.’
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (6-2-2016)
‘ఇక్కడొక సత్యాన్ని మరచిపోరాదు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు నగరంలో తిరుగుతూ తమ అభ్యర్థులు ఈ ఎన్నికలలో గెలుపొందకపోతే అందుకు ప్రతీకారం తీర్చుకుంటాం సుమా అని హెచ్చరికలు జారీ చేశారు.’
- మల్లు భట్టివిక్రమార్క(టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, 5-2-2016)
గ్రేటర్ ఎన్నికల పూర్వాపరాల గురించిన ఈ వ్యాఖ్యలలో పత్రికా వాణి ఉంది. అధికార పార్టీ గొంతు వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం స్పందన ఉంది. కానీ జంటనగరాలలో 8-9 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి కనుమరుగయినాయి. లేదా గల్లంతైనాయి. వీరి గొంతు మాత్రం వినిపించలేదు. ఇంకా, పోలింగ్ శాతం తగ్గడానికి వెనుక కారణాలను తెలుసుకోవలసి ఉంది. అలాగే సాధారణ ఎన్నికల పోలింగ్‌లో, అభ్యర్థుల జాబితాలో ప్రవేశపెట్టిన ‘నోటా’ (ఎవరూ నచ్చలేదన్న ముద్రకు కొట్టే ఓటరు హక్కు, దానికి మీట)ను తప్పించడానికి గల కారణాలను కూడా అన్వేషించవలసి ఉంది.
తెలుగు జాతిని చీల్చడానికి వేరువేరు కారణాల మీద, రాజకీయ ప్రయోజనాలపైన ఉద్యమించిన చంద్రబాబు, కేసీఆర్‌లు రెండు తెలుగు రాష్ట్రాల జల, విద్యుత్, విద్య, ఉపాధి, అధికార గణాల పంపిణీ, ఆస్తుల పంపిణీ, ప్రత్యేక ప్రతిపత్తుల సమస్యలు, ఉద్యోగుల పంపిణీ వంటి సమస్యలు ఒక కొలిక్కి రాకుండానే మొత్తం తెలుగు ప్రజలను రొంపిలోకి దింపారు. ప్రజా సంబంధాలను తీర్చి దిద్దడానికి ఉభయ రాష్ట్రాల నాయకులు ఆధారపడుతున్న యంత్రాంగం, మంత్రాంగం ఎక్కడుంది? ఆచరణకు దూరమైన నేతలు లెక్కకు మిక్కిలిగా దొర్లిస్తున్న హామీల పరంపర దగ్గర ఉంది. పోలింగ్ శాతం తగ్గడం మన ప్రజాస్వామ్యం బలుపా, వాపా అన్న ప్రశ్న క్రమంగా జనంలోకి శరవేగంగా దూసుకు వస్తున్న సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.
గుర్తించాల్సిన అంశాలు
మన కుహనా ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ఓట్ల కోసం ఎరగా వేస్తున్న హామీలకు పెద్దగా విలువ లేదని ప్రజాబాహుళ్యం పూర్తిగా అవగాహన చేసుకుని చైతన్యం పొందితే తమ అధికార స్థానాలకు చేటు తప్పదని భావించి వారి దృష్టిని మళ్లించే వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే రాజ్యాంగ విరుద్ధంగా కూడా వెళుతున్నారు. పాలనకు సంబంధించిన బాధ్యతల అధ్యాయంలోని కీలకమైన లక్ష్యానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. మూఢ విశ్వాసాలను తుంచి వేసి ప్రజానీకంలో శాస్త్రీయ, హేతుబద్ధ దృక్పథాన్ని పెంచాలన్న రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధంగా తార్కిక పునాదులు లేని యజ్ఞ యాగాదులను కేంద్రంలోను, రాష్ట్రాలలోను పాలకులే ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికలకు కొలది రోజుల ముందు కేసీఆర్ ఓటర్ల మీద సంధించిన బ్రహ్మాస్త్రం అదే. అందుకే ఓ తెలుగు కవి, ఏనాడో, ‘ఓ మూఢ లోకమా! దినమెల్ల ముగియలేదు/ దీపమున్నది నీ హృదయంబు దిద్దుకొనుము’ అని మోసపోతున్న పేద, బడుగు వర్గాల, మధ్య తరగతి ప్రజలను హెచ్చరించి, మేల్కొల్పడానికి సిద్ధమయ్యాడు. అధికారానికి వచ్చే ముందు టీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను పరిశీలిస్తే ఈ సత్యం బోధపడుతుంది.
ఇక సత్తా ఉడిగిపోయిన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు మిగిలి ఉన్న ఆ కాస్త ఊపిరిని కూడా తోడేస్తే తప్ప తమ పార్టీ ఉనికికి శాశ్వత రక్షణ ఉండదని భావించిన కేసీఆర్ సూదంటు రాయి ప్రయోగంతో టీఆర్‌ఎస్ వైపునకు గుంజుకున్నారు. ఆయా పార్టీ శాసనసభ్యులను కూడా పదవులు, ప్రలోభాలతో ఆకర్షించారు. ఇదంతా ఒక సాంకేతిక విద్యగానే భావించారు. ఇది క్రమంగా నోటుకు ఓటు మహా ప్రయోగంగా టీడీపీ-టీఆర్‌ఎస్‌ల మధ్య గుట్టుగా సాగిన ప్రయోగంగా ప్రజలు చెప్పుకునే స్థాయిలో సాగింది. చివరికి దీనిని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రాజీ బేరాలతో ముగిసిన చిదంబర రహస్యంగా ప్రజలు సరిపెట్టుకున్నారు. ఇంతకూ ఆ కేసులో దొర ఎవరు, దొంగ ఎవరు అన్న అంశం ఇప్పటికీ తేలలేదు.
‘పెట్టుబడిదారీ వ్యవస్థలోని పాలకులకూ, సమాజాలకూ మాత్రం నిత్యం కట్టుకథలు వినిపించే అవసరం ఉంటుంది’ అంటాడు ప్రసిద్ధ ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ విశ్లేషకుడు నికోలె ఆస్కాఫ్. అలాంటి కథలలో హామీలు ఒక భాగం. మొదట్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు కొన్ని ప్రజల జ్ఞాపకాల నుంచి నిష్ర్కమించినా, ఇప్పుడు ఆయన ఇచ్చినవి- బడుగు వర్గాల ప్రజలందరికీ రెండు లేక మూడు బెడరూమ్‌ల ఇళ్లు కట్టించడం (చాపలే గతిగా ఒక్క కుక్కి మంచానికి కూడా చోటు లేని స్థితిలో ఒక్క బెడ్‌రూమ్‌కు కూడా చోటు లేని చోట); జలాశయాలకు (వాటర్ బాడీస్) రక్షణ; ప్రైవేట్ విద్యా సంస్థల స్థానే ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తానని చెప్పడం; ఇరవైనాలుగు గంటలు విద్యుత్, నీటి సరఫరాలకు హామీ. కాళ్లు గడప దాటకున్నా, మాటలు కోటలు దాటినట్టు గ్రేటర్ రాజధానిలో మౌలిక వసతులన్నీ కల్పిస్తానని చెప్పడం, వరసపెట్టి ఆకాశ హర్మ్యాలు , ఆకాశ మార్గాలు నిర్మిస్తానని చెప్పడం.
ప్రతిపక్షాలన్నీ చిత్తు
అయితే వ్యూహ రచనకు సంబంధించి అన్ని ప్రతిపక్షాలను పల్టీ కొట్టించడంలో, డీలా పడిపోయేటట్టు చేయడంలో కేసీఆర్ చతురత, ఘనత గురించి అంతా ఒప్పుకోవాలి. నిర్దిష్టమైన ఎజెండా ఏదీ లేకుండా, ప్రతి వ్యూహం లేకుండా, నైపుణ్యం లేకుండా ఉన్న విపక్షాలను మూలను కూర్చోబెట్టడంలో కేసీఆర్ ఘనత చెప్పుకోదగినది. ఇవన్నీ ఎలా ఉన్నా జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓటింగ్ శాతం కుదించుకుపోవడం మన కుహనా ప్రజాస్వామ్య పరిమితులను కూడా స్పష్టంగా వెల్లడైనాయి. నగరంలోని మేధావులు, మధ్య తరగతి, పేద వర్గాలు క్రమేణా ఓటింగ్ నుంచి గైర్హాజరు కావడానికి కారణాలు కూడా ప్రశ్నించుకోవలసిన స్థాయిలోనే ఉన్నాయి.
ఎలాగంటే- తెలుగు రాష్ర్ట కృత్రిమ విభజనకు దారి తీసిన కారణాలు, పలు రకాల ఉద్రేకాలు కూడా నగర ఓటింగ్ సరళిపైన ప్రభావం చూపినట్టు వెల్లడైంది. విభజనకు ముందు ఆ తరువాత సెటిలర్స్ పేరిట వెలువడిన అనూహ్యమైన ప్రకటనలు, నివాసానికి సంబంధించిన అర్హతలకు కొందరు నాయకులు పెట్టిన కొలతల ప్రభావమూ ఈ ఎన్నికల ఓటింగ్ సరళి మీద పడిందని, తగ్గిన శాతమే రుజువు చేస్తున్నది. ఈ అర్హతలు, కొలతల వల్లనే ఎన్నికలలో అధికార పార్టీ ప్రచారంలో వాణీ బాణీలు కూడా అకస్మాత్తుగా మారిపోయాయి. ‘మనమందరమూ సెటిలర్లమే’ అన్న కొత్త ఒరవడి చిగుళ్లు తొడిగింది.
మంచి పరిణామం
ఇది మంచి పరిణామమనే చెప్పాలి. బహుశా దాని ఫలితమే అయి ఉంటుంది, అంతవరకు సెటిలర్స్‌గా కొందరు భావిస్తున్న సొంత తెలుగు వారి నుంచే మచ్చుకు ముగ్గురు నలుగురిని అవసరం కొద్దీ టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా తీసుకువచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకునే కొత్త సంస్కృతికి టీఆర్‌ఎస్ తలుపులు తెరిచింది.
విభజన గందరగోళం మధ్య అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణలో నివాసార్హత, విద్య ఉద్యోగాలలో చేరేవారి అర్హతకు పెట్టిన షరతులలో భాగంగా ఆగమేఘాల మీద జరిపిన రెండు రకాల (ఒకటి ఇంటింటి సమగ్ర సర్వే) సర్వేలను హైకోర్టు ఎందుకు నిలిపివేయవలసి వచ్చిందో, ఏ నినాదాల ఉధృతిలో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవలసి వచ్చిందో అందరికి తెలిసినదే. ఈ పూర్వ రంగం ఎలా ఉన్నా మన తెలుగు వాళ్లమంతా ఎక్కడ ఉన్నా రాహుల్ సాంకృత్యాన్ చెప్పినట్టు (ఓల్గా సె గంగా) ‘మానవ వలసలన్నీ చారిత్రక విభాత సంధ్యలలో తెరలు తెరలుగా జరిగిన మానవ వికాస కథలలో అంతర్భాగమే’నని గుర్తిస్తే చాలు.
abkprasad2006@yahoo.co.in
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు