మ్యూజియంలూ, కళాఖండాలపైనా నిర్లక్ష్యమే..! | More negligence to museum, art props | Sakshi
Sakshi News home page

మ్యూజియంలూ, కళాఖండాలపైనా నిర్లక్ష్యమే..!

Published Sun, Apr 3 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

మ్యూజియంలూ, కళాఖండాలపైనా నిర్లక్ష్యమే..!

మ్యూజియంలూ, కళాఖండాలపైనా నిర్లక్ష్యమే..!

హైదరాబాద్ రాష్ట్రం 1956లో రాష్ట్ర విభజనకు ముందు వస్తుప్రదర్శన శాలలు, పురాతన కళాఖండాలకు పెట్టింది పేరుగా ఉండేది. హెదరాబాద్ స్టేట్ మ్యూజియం, హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం దేశంలోనే పేరుగాంచాయి. అయితే 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత, తెలంగాణ ప్రాంతంలోని పురావస్తు ప్రదర్శనశాలల పరిరక్షణ, విస్తరణపై ఆంధ్రా పాలకులు ఎలాంటి శ్రద్ధా పెట్టలేదు.
 
 తెలంగాణ  2 వేల ఏళ్ల క్రితం శాతవాహనులు పాలించిన ప్రాంతంగా ఉండేది. వీరి తర్వాత అనేక రాజవంశాలు ఈ ప్రాం తాన్ని క్రీ.శ. 1948 వరకు పాలించాయి. శాతవాహనుల నుంచి 1948లో ముగిసిన అసఫ్ జాహి పాలన వరకు 2 వేల ఏళ్లకుమించి సంక్షుభిత చరిత్రను కలిగి ఉన్నప్పటికీ, తెలంగాణలో అనేక చారి త్రక స్థలాలు, పురాతన కళాఖండాలు ఉన్నాయి. వీటిలో కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, పెద్దబంకూరు, ధూళికట్ట... మెదక్ జిల్లా లోని కొండాపూర్ ప్రాచీన చరిత్రలో పేరెన్నిక గన్నవి. అయితే ఈ ప్రాంతాలన్నింటిలోనూ పురావస్తు తవ్వకాలపై ఆంధ్రా పాలకులు ఏమంత శ్రద్ధ చూపలేదు. దీనితో తెలంగాణ ప్రజల ఉనికి, వారసత్వం ఈ ప్రాంతాల్లోని, భూమి పొరల్లోనే ఉండిపోయాయి.
 
 బ్రిటిష్ పాలనా కాలంలో భారత్‌లోని పలు నగరాల్లో -కోల్‌కతా, పట్నా, బాంబే, మద్రాస్- పురావస్తు ప్రదర్శన శాలల స్థాపన ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం వాటికి ఎనలేని ప్రాధాన్య మిచ్చింది. క్రీ.శ. 1814లో స్థాపించిన కోల్‌కతా మ్యూజియం దేశంలో ప్రాచీనమైనది. ఈ కాలంలోనే బరోడా, మైసూర్, ట్రావెన్‌కోర్, హైదరాబాద్ వంటి పలు సంస్థానాలు కూడా తమ తమ సంస్థానాల్లో పురావస్తు ప్రదర్శన శాలలను స్థాపించాయి. హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం సుప్రసిద్ధమైనది. అన్ని రంగాలకు సంబంధించి ఒకే ఒక్క వ్యక్తి సేకరించి అపురూప వస్తువులతో, కళాఖండాలతో దీన్ని నెలకొల్పారు. ప్రపంచంలోనే ఇంతటి విశిష్ట, అరుదైన మ్యూజియం లేదు. అలాగే హైదరా బాద్‌లోని బిర్లా మ్యూజియం కూడా ప్రజాదరణ పొందింది.
 
 ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలు అనేక మ్యూజియం లను (మహారాష్ట్ర (22), తమిళనాడు (14), కేరళ (15), పశ్చిమ బెంగాల్ (12) స్థాపించాయి. కానీ  గత ప్రభుత్వాలు మ్యూజి యంల స్థాపనకు చొరవ తీసుకోకపోవడంతో వీటితో పోలిస్తే చాలా ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. 1980 తర్వాతే ఏపీ ప్రభుత్వం వివిధ జిల్లాల్లో పురావస్తుప్రదర్శన శాలల ఏర్పాటుకు నిర్ణయిం చుకుంది. ఈ పథకం కింద తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మ్యూజియంలు స్థాపించారు. అయితే ఇవన్నీ సరైన సామగ్రి, నిర్దిష్ట భవనాల లేమిని ఎదుర్కొన్నాయి. నిజామాబాద్ మ్యూజియం మూడేళ్లలోపే మూలబడింది. పైగా వీటికి శాశ్వత సిబ్బంది లేరు. మూడు జిల్లాలకు ఒక అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ చార్జిగా ఉన్నప్పటికీ ఈయన ప్రధాన కార్యాలయం హైదరా బాద్‌లో ఉంది. ఈ స్థితిలో ఈ మ్యూజియం అభివృద్ధి, విస్తరణకు అవకాశమే లేకుండా పోయింది.
 
 తెలంగాణలో పురావస్తు తవ్వకాలకు సంబంధించి గతంలో ఎలాంటి చర్యా చేపట్టలేదు. పైగా 1992 నుంచి పురావస్తు శాఖకు శాశ్వత డెరైక్టర్లు లేరు.ఇతర విభాగాల నుంచి వీరిని డిప్యుటేషన్ కింద తీసుకొచ్చారు. దీంతో అర్హత, అనుభవం లేని ఇతరులు పురావస్తుశాఖ డెరైక్టర్ పదవులను చేపట్టారు. ఇక ప్రధాన కార్యాల యంలో జాయింట్ డెరైక్టర్ లేరు. ఒకే ఒక డిప్యూటీ డెరైక్టర్ మాత్రమే అన్ని పనులూ చేస్తున్నారు. మరోమాటలో చెప్పాలంటే డిప్యూటీ, అసిస్టెంట్ డెరైక్టర్లకు సంబంధించిన పలు పదవులు, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. పురావస్తు శాఖ పూర్తిగా సాంకేతిక విభాగం. దీనికి ప్రత్యేక అర్హతలు, అనుభవం కలిగిన సంచాలకులు అవసరం.
 
 కాబట్టి పురావస్తు శాఖలో దిద్దుబాటు కోసం కింది చర్యలు చేపట్టాలని సూచించడమైనది. 1. పురావస్తుశాఖకు శాశ్వత డెరై క్టర్‌ను నియమించాలి 2. జాయింట్ డెరైక్టర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు చెందిన ఖాళీలను పూరించాలి. 3. క్రీ .పూ 250 నుంచి అసఫ్‌జాహీల కాలం వరకు వివిధ కాలాలకు చెందిన 4 లక్షల కంటే ఎక్కువ నాణేలు హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నందున టెక్నికల్ అసిస్టెంట్లకు బిర్లా నషిక్ కాయిన్స్ మ్యూజి యంలో తప్పక శిక్షణ ఇప్పించాలి. 5. అన్ని జిల్లా స్థాయి మ్యూజి యాల్లో పూర్తి కాలం పనిచేసే అధికారులు కావాలి. 6. తవ్వకాల సమయంలో భారీ పురావస్తు ప్రాంతాలు బయటపడిన కోటిలిం గాలలో, కరీంనగర్‌లోని ఇతర ప్రాంతాల్లో స్థల మ్యూజియాలు నెలకొల్పాలి.
 
 పై అంశాలన్నీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి గొప్ప దార్శనికత, కల్పనాశక్తి కలిగిన వారు ఈ శాఖకు మంత్రిగా ఉండటం అవసరం. అలాగే పురావస్తు శాఖకు తగిన కార్యాచరణ పథకం రూపకల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పర్చాలని సూచించడమైనది.ఈ చర్యలను అమలు చేయడం ద్వారానే శాతవాహనులు, కాకతీయ రాజవంశం తెలంగాణకు వదిలిపెట్టి వెళ్లిన  మనదైన వారసత్వాన్ని మనం కాపాడి, సంరక్షించుకోగలం.
 వ్యాసకర్త మాజీ ఎంపీ, నిజామాబాద్  7702941017
 - ఎం. నారాయణ్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement