పుట్టు పోరాట యోధుడు ఎం.టి.ఖాన్ | MT khan, a born fighter | Sakshi
Sakshi News home page

పుట్టు పోరాట యోధుడు ఎం.టి.ఖాన్

Published Fri, Aug 22 2014 1:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పుట్టు పోరాట యోధుడు ఎం.టి.ఖాన్ - Sakshi

పుట్టు పోరాట యోధుడు ఎం.టి.ఖాన్

ఒక ఆదర్శ ముస్లిం, ఒక ఆదర్శ కమ్యూ నిస్టు, ఒక ఉపాధ్యాయుడుగా ఎలా ఉండాలని ఎవరైనా అడిగితే ఎం.టి.ఖాన్ జీవితంలా ఉండాలని అంటారు. కర్తవ్య నిర్వహణకు పురస్కారాలు ఉండవు. ఒక వేళ పురస్కారం వంటిదేదైనా ఉంటుం దంటే అలాంటి అత్యున్నత పురస్కారాలు ఖాన్ గారికి వంగి సలాం చేయాల్సిందే. తానొక పుట్టు పోరాట యోధుడు. పూర్తి పేరు మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్. నివాసం హైదరాబాద్ లోని అబూ హాషీం మదాని దర్గా ప్రాంతం. పురానాపూల్‌కు ఈ కొసన ఉం టుంది.
 
1977లో కలిసినప్పుడు ఒక పాడుబడిన కొంపలో నివసించేవాడు. ఎలాంటి అదనపు వసతులు, సౌకర్యాలు ఉండేవి కావు. వాటిని ఆశించేవాడు కాదు. దర్మవంత్ విద్యా సంస్థలో ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా పనిచేశాడు. పదవీ విరమణ తర్వాత హిందూస్తాన్ సమాచార్, న్యూస్టైల్ సియాసత్, న్యూస్ టైం వంటి పత్రికలకు అనివార్యమై పనిచేశాడు.
 
ఖాన్ గారి పుట్టుకే కల్లోల కాలంలో జరిగింది. సుమారు 90 ఏళ్ల క్రింద హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ పాలనా పద్ధతులన్నీ ప్రజా వ్యతిరేకంగా ఉండేవి. ఒక వైపు స్వాతం త్య్రోద్యమం, మరోైవైపు ఆంధ్ర మహాసభ వేడిగాలితో నిజాం సంస్థానం ఉక్కిరిబిక్కిరయేది. ఆంధ్రమహాసభ అతి వాద, మితవాద మహా సభలుగా చీలిపోయినప్పుడు మక్దూం, మొహినుద్దీన్, రజ్వీ, రాజ్‌బహదూర్ గౌడ్‌లతో పాటు ఖాన్ సాబ్ సైతం అతివాదులవైపు నడిచారు.
 
వీరితో సాహచర్యం మార్క్సిస్టు అధ్యయనానికి పనికొచ్చింది. రక్తంలో సూఫీ తత్వం ఎంత ఉన్నా మార్క్సిజాన్ని జీవి తంలో భాగం చేసుకు న్నారు. నిగర్వి, మృదు స్వభావి. అదే సమయం లో అన్యాయం పట్ల ఆగ్ర హోదగ్రుడయ్యే వారు. నిజాం కాలేజీలో ఒక సారి అస్ఘర్ అలీ ఇంజనీర్ ప్రసంగిస్తున్నప్పుడు అక స్మాత్తుగా అతనిపై బడి ఒక దుండగుడు రేజర్‌తో గొంతు కోయడానికి ప్ర యత్నించగా పొట్టివాడైన ఖాన్ సాబ్ కట్టలు తెగిన ఆగ్రహంతో అతడిపైకి దూకి ఒడిసి పట్టుకుని అప్పగించాడు.
 
ఖాన్ సాబ్ జీవితాంతం తెల్లబట్టలే ధరించారు. సదా చిరునవ్వులు. మాట్లాడుతుంటే అమ్మ కంఠస్వరం వినిపించేది. చర్చలు వేడెక్కిన సందర్భాల్లోనూ మాట తూలేవాడు కాదు. సంయమనం, సుబోధన, తాత్విక అంశాలపై రాజీలేనితనం, నిరంతర అధ్యయనం.. ఒక మార్క్సిస్టు ఎలా ఉండాలో అతడిని చూస్తేనే తెలిసేది.
 
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినపుడు అతివాదం వైపు మొగ్గు చూపిన ఖాన్ సాబ్ జీవితాంతం రెబెల్‌గానే ఉంటూ వచ్చారు. స్వాతంత్య్రోద్యమంలో, తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. మార్క్సిస్టు పార్టీలో చీలిక వచ్చి విప్లవపార్టీ ఏర్పడినప్పుడూ ఖాన్ తన మద్దతు తెలిపారు. విరసం వ్యవస్థాపక సభ్యుడిగా, పౌరహక్కుల నేతగా తన పాత్ర ప్రశంసలకు పాత్రమైంది. ఎమర్జెన్సీకాలంలో పాతబస్తీ నుండి అరెస్టయిన మొదటి వ్యక్తి ఖాన్ గారే.

హైదరాబాద్ కుట్రకేసులో అరెస్టై చాలాకాలం జైలులో ఉన్నాడు. పీపుల్స్‌వార్ నాయకులతో తన పరిచయం వారికి ఎంతగానో ఉపకరించింది. వారి అధికార పత్రిక పిలుపుకి ఖాన్ గారే సంపాదకులు. విప్లవోద్యమానికి చిరునవ్వుతో పునాదులు వేసినవారిలో తానొకరు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషల్లో అతని పాండిత్యం ఎనలేనిది. అన్ని భాషల్లో తర్జుమా చేసేవాడు. కవిగా, వచన రచయితగా తనకు తానే సాటి.
 
గత రెండు దశాబ్దాల నుండి ఆయన కార్యక్రమాలకు దూరం అయ్యాడు. మీలాంటి వారికి ఎందుకు గుర్తింపు లేదంటే గుర్తింపు కోసం ఏ పనీ చేయలేదని నవ్వేవాడు. ప్రగతిశీల రంగంలో తెల్ల బొద్దింకలు చేరాక అది జావకారిపోయిందనేవాడు. నిర్మాణాల్లో అతడిని కుచించే ప్రయత్నం చేస్తూ తాము మాత్రం నిర్మాణేతర శక్తులుగా ఎదగాలని చూసేవారితో పేచీ పడింది. అందుకే ఖాన్ నిశ్శబ్దమయ్యాడు.
 
కొన్నాళ్ల క్రితం నేను, ప్రముఖ కవి సూర్య వంశి ఆయన్ను చూడాలని వెళ్లి ఇంట్లోవారిని అడిగాం. నాలుగిళ్ల అవతల ఉన్న చిన్న బడ్డీకొట్టులో ఉన్నారని చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే ఖాన్ గాలిపటాలు అమ్ముకుంటున్నాడు. అదీ ఖాన్ బతుకు. డబ్బుల కోసం ఎన్నడూ చేయి చాచని అతని చేతిలో గాలిపటం. అతనితో పనిచేసిన వాళ్ల కొత్త బతుకులకీ, పురానా పూల్‌లో వికసించిన ఎర్రమోదుగ వెలుగులకీ ఎంత తేడా. అల్ట్రా ఉద్యమ కారులకీ, బతుకులోంచి ఉద్యమంలోకి వచ్చినవారికీ ఉన్న తేడా అది.
 (వ్యాసకర్త జానపద సాహిత్య పరిశోధకులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement