సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ కదిలొచ్చింది. ఎటు చూసినా జన సంద్రమే. ఏ రోడ్డు చూసినా ప్రజా వెల్లువే. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం జరిగిన సకల జనభేరి సభకు జనం పోటెత్తారు. నిజాం కాలేజీకి వచ్చే రహదారులన్నీ జన సమూహాలతో నిండిపోయాయి. కాలేజీకి చుట్టుపక్కలా ట్యాంక్‌బండ్, అసెంబ్లీ, ఆబిడ్స్, నాంపల్లి, హైదర్‌గూడ, రాంకోఠి దాకా రోడ్లపై జనం బారులు తీరారు. ఎటు చూసినా తెలంగాణ జేఏసీతో పాటు భాగస్వామ్యపార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమొక్రసీ, సీపీఐ జెండాలు పట్టుకుని పెద్దఎత్తున తరలివస్తూ కనిపించారు. నిజాం కాలేజీ మైదానం పూర్తిగా నిండిపోయింది. మైదానంలోనే కాకుండా రోడ్లపైనా ఊరేగింపులు, ర్యాలీలతో తండోపతండాలుగా తెలంగాణవాదులు తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, బోనాలు, బతుకమ్మలు, పోతురాజులు వంటి తెలంగాణ సంప్రదాయిక వేషాలతో వచ్చారు. ‘హైదరాబాద్ మాదిరా..’ అంటూ నినాదాలు చేస్తూ గుర్రాలు, ఒంటెలతోనూ కొందరు ర్యాలీని నిర్వహించారు.
తెలంగాణ న్యాయవాదులు కూడా ర్యాలీగా సభావేదిక దగ్గరకు చేరుకున్నారు. సభ విజయవంతం కావడంతో తెలంగాణ జేఏసీ అగ్రనేతలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణపై నిర్ణయం తర్వాత హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీవోలు సభను నిర్వహించారు. తర్వాత జరిగిన ఈ సభకు హాజరైన జనసందోహంపై జేఏసీ నేతలతోపాటు తెలంగాణవాదులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.
‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ అన్న అంద్శైపాటతో సభలో నేతల ప్రసంగాలు మొదలయ్యాయి. అంతకుముందు తెలంగాణ ధూంధాం కన్వీనర్ రసమయి బాలకిషన్ బృందం కళారూపాలతో తెలంగాణవాదులను ఉత్సాహపరిచారు. సభావేదిక నిర్మాణానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు ఏర్పాట్లు చేయగా, మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, దేవీ ప్రసాద్, సి.విఠల్, అద్దంకి దయాకర్ వేదికపై సమన్వయం చేశారు. ‘ఈనాడు’ గ్రూపు చైర్మన్ రామోజీరావు పచ్చళ్ల వ్యాపారం, పత్రిక అమ్ముకోవడానికి పరేషాన్ పడుతున్నాడని, మార్గదర్శి చిట్స్ వ్యాపారంపై, ఫిలింసిటీలో భూ ఆక్రమణలపై పాటల రూపంలో కళాకారులు విమర్శలను గుప్పించారు.
జనభేరి సక్సెస్‌తో జేఏసీలో హర్షం
Published Mon, Sep 30 2013 1:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement