
దేవుడెవరు?
దేవుడెవరు? ఇది అనాదిగా వస్తున్న ప్రశ్నే. ఎవరెన్ని విధాలుగా నిర్వచించినా సంతృప్తికరమైన సమాధానం దొరకదు. ‘కలడు కలండనెడివాడు కలడో?! లేదో?!
దేవుడెవరు? ఇది అనాదిగా వస్తున్న ప్రశ్నే. ఎవరెన్ని విధాలుగా నిర్వచించినా సంతృప్తికరమైన సమాధానం దొరకదు. ‘కలడు కలండనెడివాడు కలడో?! లేదో?!’ ఇదొక కొరకురాని కొయ్య. అయితే ఆయన లేడనుకోవడం కన్నా ఉన్నాడనుకోవటం వల్ల వ్యక్తికీ, వ్యవస్థకీ మేలు జరుగుతుంది. ఇది మాత్రం నిజం. సత్కార్యాలు ఆచరించటం వల్ల మనిషికి దైవత్వం సిద్ధిస్తుంది. ‘భగము’కలవాడు భగవంతుడు. భగమంటే? మాహాత్మ్యం, ధైర్యం, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం- అనే ఆరు గుణాలని కలిపి ‘భగ’మంటారు. ఎవరికి ఈ ఆరు గుణాలున్నా అతడు భగవంతుడే.‘దేవుడు తలక్రిందయితే - మనిషి అవుతాడు/ మానవుడు తలక్రిందయితే దానవుడవుతాడు!’ అన్నారు కవి తిలక్.
రాముడు మానవుడే. ఆయన తన వర్తన వల్ల షోడశ గుణాలతో విరాజిల్లి, మాన్యత నొంది, దైవావతారంగా పరిగణింపబడ్డాడు. జీసస్, మహమ్మదు, బుద్ధుడు మొదలైన వారంతా మహత్కార్యాలు ఆచరించి, మహనీయులై భగవత్స్వరూపులయ్యారు. మనిషి వికృతియైతే మాత్రం దైవం దయ్యమౌతుంది. ఉన్నా, లేకున్నా దేవుడనేది ఆత్మ విశ్వాసం కలిగించే మహాతత్త్వం. సర్కసులో ఎంతో ఎత్తున ఊయలలూగుతున్న వ్యక్తి హఠాత్తుగా చేతులు వదిలేసి, దూకి, మరొక వ్యక్తి చేతులు పట్టుకొని గాలిలో ఊగుతూంటాడు. కింద అతడి రక్షణ కోసం పెద్ద వల కట్టి ఉంటుంది. ఆ ‘వల’ వంటి వాడు భగవంతుడు. ఫీట్స్ చేసేదీ, చేయాల్సిందీ మనిషే! ఒక్కొక్కసారి దైవం తలచినా మనిషి మూర్ఖంగా తన కందిన అవకాశాన్ని కాలదన్నుకుం టాడు. దైవ ప్రేరణకి స్పందిం చడు.
మేడ మీద కూర్చున్న ధనవంతుడు కింద రోడ్డు మీద పోతున్న ముష్టివాడిని పిలుస్తోంటే ఆ పిలుపందక వాడు వెళ్లిపోతున్నాడు. ధనికుడు కొన్ని నాణాలు వాడి గిన్నెలో పడేటట్టు విసిరాడు. అది తీసుకుంటున్నాడే తప్ప, ముష్టివాడు తలెత్తి పైకి చూడటం లేదు. ఈసారి ధనవంతుడొక రాయి విసిరాడు. ముష్టివాడు వెంటనే తలెత్తి పైకి చూశాడు. ధనికుణ్ణి గుర్తించాడు. మనిషికి కష్టాల వల్లనే భగవత్స్పృహ కలుగుతోంది. అతడి ‘అస్తిత్వాన్ని’ మనిషి గుర్తిస్తున్నాడు. సుఖాల్లో గుర్తుకి రాడు. ఇంక మంచివానికి కష్టాలూ చెడ్డవానికి సుఖాలూ కర్మ సిద్ధాంతాన్ని నమ్మక తప్పని పరిస్థితిని కలిగిస్తాయి. మూఢ విశ్వాసాన్ని కల్పిస్తాయి. అలాకాక, ‘ఎవని కర్మకు వాడే కర్త!’ అన్న వివేకం ఉన్న వారికి భగవంతుడంటే ఆత్మ విశ్వాసం! వారి విజయాలకి అదే కేంద్రస్థానం. ఈ గీతాశ్లోకం ప్రతి వ్యక్తికీ అవశ్య పఠనీయం...
‘మత్తః పరతరం నాన్యత్కించి దస్తి ధనంజయ!
మయి సర్వఖదం ప్రోతం సూత్రే మణిగణాఇవ’
(భగవంతుని కంటె భిన్నమైనదేదీ లేదు. దారానికి మణులు గుచ్చినట్టు సర్వమూ నాచేతనే కూర్పబడినది.)
-పొన్నపల్లి శ్రీరామారావు