ఆన్లైన్ స్నేహం.. డాక్టర్ను చేసింది
ఐదు సంవత్సరాల క్రితం...
ఒక భారతీయ పాఠశాల విద్యార్థి...
లండన్‌లోని ఒక రిటైర్డ్ టీచర్‌తో ఆన్‌లైన్ స్నేహాన్ని పెంచుకున్నాడు.
ఆమె సహాయంతోఇప్పుడు డాక్టర్ అయ్యాడు.
వారు ఇప్పటికీ ఒకరినొకరు చూసుకోలేదు
కాని ఒకరు లేనిది ఒకరు జీవించలేనంతగా వారి మధ్య స్నేహం పెనవేసుకుంది.
అతడి పేరు షారుఖ్ ఖాన్... ఆవిడ పేరు లిజ్ ఫ్యూయింగ్స్.
షారుఖ్ ఖాన్‌కి పదమూడు సంవత్సరాల వయసున్నప్పుడు హైదరాబాద్‌లోని ఒక పాఠశాలలో చదువుతుండేవాడు. అక్కడ లాబ్‌లో పిల్లలందరికీ కంప్యూటర్ ఇస్తారు. ఆ కంప్యూటరే అతడి జీవితాన్ని మార్చేసింది. ‘‘విద్యార్థులమంతా ఒక చిన్న గదిలో ఇంటర్నెట్ చూస్తూ కూర్చున్నాం. ఆ సమయంలోనే విదేశాలలో ఉన్న రిటైర్డ్ టీచర్‌తో చాట్ చేయడానికి అవకాశం దొరికింది’’ అన్నాడు షారుఖ్.
ఇక్కడి పిల్లలకు అక్కడివారితో బంధం ఏర్పరచి వారిని మెంటర్లుగా చేయడం ఆ స్కూల్‌లోని విద్యావిధానం. ‘‘విదేశీయులతో మాట్లాడటం, వారి నుంచి కొంత నేర్చుకోవడం చాలా సరదాగా ఉంటుంది. నేను కంప్యూటర్ ముందు కూర్చుని అన్నిటినీ చూస్తూ వాళ్లతో మాట్లాడుతుంటాను. అలా పరిచయమయ్యారు లండన్ వాస్తవ్యురాలు లిజ్ ఫ్యూయింగ్స్’’ అంటాడు షారుఖ్ ఖాన్.
ఫ్యూయింగ్ వయసు 60 సంవత్సరాలు. ఇటీవలే టీచర్‌గా రిటైర్ అయ్యారు. ఆవిడ తూర్పులండన్‌లోని హాక్నేలో నివాసం ఉంటున్నారు. 2009లో ఒక వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన చూసి ఆమె ఈ విభాగంలో చేరారు.
మొదట్లో, ఫ్యూయింగ్ భారతీయ విద్యార్థులతో చాలామందితో మాట్లాడేవారు. కాని కొంతకాలానికి కేవలం ఖాన్ మాత్రమే మిగిలాడు. ‘‘అలా మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది’’ అంటారు ఆమె.
ఇద్దరూ ఈ మెయిల్స్ రాసుకుంటుండేవారు. ఆవిడ సలహాలిస్తూ ఉండేది. ‘‘ఖాన్‌కి తొందరగా అర్థం చేసుకునే శక్తి అంతగా లేదు. అందుకే నేను ఏది చెప్పినా, అర్థమైందా? లేదా? అని అడుగుతుండేదాన్ని. మా ఇద్దరి మధ్యా చాటింగ్ సరదాలతో, విజ్ఞానాత్మకంగా సాగేది. అతడు కూడా నన్ను సరదాగా మాట్లాడుతుండే వాడు. నేనెప్పుడైనా పెద్ద అక్షరాలలో ఏదైనా రాశానంటే నాకు కోపం వచ్చిందని అతడికి అర్థం అవుతుంది.
ఖాన్ మా ఇద్దరి మధ్య స్నేహాన్ని తను చదువులో రాణించేందుకు ఉపయోగించుకున్నాడు. అతడి ఇంగ్లిష్ బాగా ఇంప్రూవ్ అయింది’’ అంటారు ఫ్యూయింగ్స్.
సంవత్సరాలు గ డుస్తున్నాయి. ఒకసారి ఖాన్ తనకు డాక్టర్ చదవాలనుందని, లండన్ యూనివర్సిటీకి అప్లయ్ చేస్తున్నాని చెప్పాడు.
ఖాన్ వయసు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. పెద్ద అన్నయ్య కుటుంబానికి ఆధారమయ్యారు. స్కూల్ ఫీజులు అన్నీ ఆయనే చూసేవారు. కానీ, విదేశాలలో చదవడానికి అప్లయ్ చేసుకోమని ఎన్నడూ సలహా ఇవ్వలేదు.
‘‘విదేశాల గురించి నాకేమీ తెలీదు. అక్కడి సంస్కృతి సంప్రదాయాలు తెలియవు’’ అంటాడు ఖాన్. ‘‘ఆవిడతో మాట్లాడిన తర్వాత లండన్‌లో జీవన విధానం గురించి అర్థమైంది. లండన్‌లో చదవడానికి ఎంత ఖర్చవుతుంది, ఎలా అప్లయ్ చేయాలి... వంటివి ఫ్యూయింగ్ మేడమ్ ఇంటర్నెట్‌లో చెక్ చేసి చెప్పారు. యూనివర్సిటీలలో ఎటువంటి మోసాలు జరుగుతాయో కూడా ఆవిడ వివరించారు.
‘‘ఖాన్ ఇంటర్నెట్‌లో చూసి కేంబ్రిడ్జిలో ఉండే కాలేజీల వివరాలు నాకు పంపేవాడు. ఒకరోజున ‘పోస్ట్ బాక్స్’ నంబరు మాత్రమే ఇచ్చిన ఒక గ్రామానికి సంబంధించిన వివరాలు తెలుసుకోమని అడిగాడు. నేను ఎలాగైనా ఆ పిల్లవాడికి సహాయపడాలనుకున్నాను. ప్రపంచం అంతా నిజాయితీతో నిండి లేదు. ఎక్కడైనా వివక్ష తప్పదని ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పాను’’ అన్నారు ఆమె.
ఫ్యూయింగ్ సహాయంతో, ఖాన్ ఒక విషయం తెలుసుకున్నారు... ఇంగ్లండ్‌లో చదవడం చాలా ఖర్చుతో కూడిన పని మాత్రమే కాదు, చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుందనీ, వాటిని తాను చాలా చాకచక్యంతో ఎదుర్కోవాలనీ.
వారిద్దరి మధ్య నడిచిన అనేక చర్చల తరువాత, అతడు ఫిలిప్పీన్స్‌లో మెడిక ల్ డిగ్రీ చదవడానికి నిశ్చయించుకున్నాడు.
అలా కంప్యూటర్ చాటింగ్ ద్వారా ఖాన్ మెడికల్ కాలేజీలో చేరి డాక్టరయ్యాడు.