ఆ ప్రాంతీయత ఇక్కడ పనిచేయదా?
తెరాస పార్టీని రక్షిస్తేనే అది తెలంగాణ ప్రయోజనాల్ని పరిరక్షిస్తుందనే ప్రాంతీయ చైతన్యంతోనే వరంగల్ ఉపఎన్నికలో ఓటర్లు అసాధారణ తీర్పునిచ్చారు. అది హైదరాబాద్‌లో గెలుపుకు మార్గం సుగమం చేయదు.
వరంగల్ ఉప ఎన్నిక ఫలితమే గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా పునరావృతం అవు తుందనే ప్రకటనలు పరం పరగా వెలువడుతున్నాయి. అంటే వరంగల్‌లో సాధిం చినట్లే గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా తెరాస ఘన విజయం సాధిస్తుందని చెప్పటమే వాటి ఉద్దేశ్యం. వరంగల్ ఫలితాలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపవచ్చు గానీ, కేవలం ఆ ప్రభావంతో గెలుపు సాధ్యం కాదు. వరంగల్ క్షేత్రస్థాయి పరిస్థితి వేరు.. గ్రేటర్ హైదరాబాద్ క్షేత్రస్థాయి పరిస్థితి వేరు.
తెలంగాణ ప్రాంతీయ ఉద్యమానికి వరంగల్ ప్రధాన కేంద్రం. అందుకే ఓరుగల్లు తెలంగాణ పోరాట పోరుగల్లుగా పేరుగాంచింది. కానీ హైదరాబాద్ నగరం తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డాగా, హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా, ప్రత్యేక రాష్ట్రంగా మార్చాలని అడ్డం తిరిగిన ప్రతికూల శక్తుల కేంద్రంగా పేరుగాం చింది. అంతేకాదు.. ఎలాంటి పోరాటాలతో పని లేకుండా ఓట్లు, సీట్లు లాబీయింగ్ ద్వారా సులభ మార్గంలో తెలంగాణ సాధిస్తానని ప్రగల్భాలు పలికి తెలంగాణ ఉద్యమ శక్తులను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్, 2009 సాధారణ ఎన్నికల తర్వాత ఏ అధికార పార్టీ అండలేక, లాబీయింగ్‌కు అవకాశం లేక చివరికి 2009 నాటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయటానికే భయపడి పలాయనం చిత్తగించాల్సిన దుస్థితి కల్పించిన రాజధాని నగరం. చివరికి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించి, తెలంగాణ ప్రాంతీయతకే అస్తిత్వం లేకుండా చేసిన సంక్షోభ స్థితిలో, కేసీఆర్ సులభ మార్గానికి తెరపడి ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యం అనే ఉద్యమకారుల బాటపట్టక తప్పని స్థితి కల్పించిన హైదరాబాద్‌ని గెలవటం అంత తేలిక కాదని కేసీఆర్‌కి ఎప్పటి నుంచో తెలుసు.
అందుకే వరంగల్ ఉపఎన్నికల కంటే ముందే, నవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలకి చెందిన బలమైన స్థానిక నాయకులను ఏదో ఒక ఆశజూపి వశం చేసుకు న్నారు. ఇప్పుడు ఆ వశీకరణ ఆకర్ష్ పథకాన్ని ముమ్మరం చేశారు. అంతేకాదు తెలంగాణాయేతర సీమాంధ్రులను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులుగా పోటీ చేయిం చడం, 150 వార్డుల్లో 50 వార్డులు ఎంఐఎం వారికి మిన హాయించి మిగతా వంద స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా తెరాస సంస్థాగత బలహీనతను అధిగమించే ఎత్తుగడ వేశారు.
ఈ చర్యలేవీ తీసుకోకుండా వరంగల్ ఫలితం దానంతటదే హైదరాబాద్‌లో పునరావృతం కాదనేది స్పష్టం. సంక్షేమ పథకాలతో వరంగల్ ప్రజల్ని ప్రభావితం చేసినట్లే హైదరాబాద్ మీద సంక్షేమ అభివృద్ధి పథకాల వరాల వర్షం కురిపించినా వాటి ప్రభావం పరిమితమే. ‘పద్నాలుగేళ్ల పోరుతో స్వపరి పాలన! ఒకే ఏడాదిలో సుపరిపాలన!’ అనే నినా దంతో నవ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తెరాస ప్రభుత్వ పనితీరు, వరంగల్ ఎన్నికల్లో తెరాస సభ్యుల పనితీరు చూసి జనం ఓటేసి గెలిపించారనేది కూడా పూర్తి వాస్తవం కాదు. వరంగల్‌లో గెలుపును నిర్దేశిం చిన ప్రధానాంశం, ఇక్కడ హైదరాబాద్‌లో అప్రధా నాంశం అవుతుంది. అందుకే వరంగల్ ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రధానాంశం ఏమిటో నిర్దిష్టంగా పరిశీలించటం అవసరం.
వరంగల్ ఓటర్లు గుండుగుత్తగా తెరాస వైపు అంతగా మొగ్గు చూపటం ఎందుకు జరిగిందనేదే ఆ ఎన్నికల్లో కీలకాంశం. కేసీఆర్ వ్యవహారశైలిపై, తెరాస ప్రభుత్వంపై తొలిదశలో ప్రజల్లో వ్యక్తమైన ప్రాథమిక స్థాయి అసంతృప్తి (వ్యతిరేకత కాదు) మరుగున పడిపోయి, ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణకి తెలం గాణ ప్రాంతీయ పార్టీ అయిన తెరాసను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవటం అవసరమనే ప్రాంతీయ చైతన్యం ప్రధానాంశంగా మారటం వల్లనే ఇలా జరిగిం దనేది స్పష్టం.
వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాస బలహీనపడితే, తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి పెచ్చు పెరిగితే, కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆంధ్రా ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కో వటం కష్టమవుతుందేమోననే అభద్రతా భావం వరం గల్ ప్రజల్లో ఏర్పడింది. ఆ అభద్రతా భావమే ఏకైక తెలంగాణ ప్రాంతీయ పార్టీ అయిన తెరాస పలుకు బడిని భద్రంగా కాపాడుకోవాలనే ప్రజాభిప్రాయా నికి దారి తీసింది. తెరాస పార్టీని రక్షిస్తేనే అది తెలంగాణ ప్రయోజనాల్ని పరిరక్షిస్తుందనే ప్రాంతీయ చైతన్యంతోనే ఇలాంటి అసాధారణ తీర్పునిచ్చారు. కనుక ఓరుగల్లు తీర్పు ప్రాంతీయతకే పట్టం కట్టిన పోరుగల్లు తీర్పు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరాసది కావచ్చు, తెరాస కేసీఆర్‌ది కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదు. 2001లో తెరాస ఏర్పడక ముందే 1996 నుంచి ఐదేళ్లపాటు తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమంగా మార్చిన తెలంగాణ ప్రజా ఉద్యమ శక్తులు ప్రజల ఆకాంక్షలకి ప్రాతినిధ్యం వహించగలవు. తెరాస పార్టీయే తెలంగాణకి దిక్కన్నట్లు లెక్కలేకుండా వ్యవహరిస్తే తెలంగాణ ఉద్యమ శక్తుల నుండి ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదు.
కాబట్టి ప్రజల్లో గూడుగట్టుకొన్న అసం తృప్తికి కారణాలేమిటో పరిశీలించుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ప్రజలు, ప్రజా ఉద్యమ శక్తులు చూస్తూ వూరుకోవని గ్రహించడం మంచిది. ముందు భౌగోళిక తెలంగాణ రాష్ట్రం రానివ్వండి, సామాజిక తెలంగాణ విషయం తరువాత చూద్దాం అని తెలంగాణ రాకముందు వాగ్దానం చేసిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బడుగు వర్గాల వారిని కూడా భాగస్వాముల్ని చేసే సమ్మిళిత అభివృద్ధి నమూనాని అమలు జరపటం ఆయన బాధ్యత అని గుర్తు చేస్తున్నాం.
వ్యాసకర్త: సాంబశివరావు, చైర్మన్, బహుళ బహుజన సమితి
మొబైల్ :77029 41017