భాగ్యనగరం కాషాయమైంది. గల్లీగల్లీ నేతలతో నిండిపోయింది. ఫ్లెక్సీలు, కటౌట్లతో సందడి నెలకొంది. ఎన్నికల సమయంలో ఉండే హడావుడి ఇప్పుడే కన్పిస్తోంది. అగ్రనేతల దూకుడుతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల కౌంటర్..ఎన్‌కౌంటర్లతో రాజకీయ వేడి రగులుకుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ...రానున్న ఎన్నికలకు రాష్ట్ర శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. మూడవ రోజు బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా భాగ్యనగరంలో జరుగుతున్న బీజేపీ సమావేశాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇతర దిగ్గజ నేతలు హాజరవుతోన్న ఈ సమావేశానికి మినీ ఇండియా లాంటి గ్రేటర్ సిటీ అతిథ్యమిస్తోంది. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు కాషాయ శోభ సంతరించుకున్నాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ పతకాలతో అన్ని దారులూ హైటెక్స్ వైపే అన్నట్లుగా తీర్చిదిద్దారు. భిన్న రాష్ట్రాల..సంస్కృతులు..ఆచార వ్యవహారాలు కలగలిసిన భాగ్యనగరంలో గంగా జమునా తహజీబ్ లాంటి మిశ్రమ సంస్కృతి ఏళ్లుగా కొనసాగుతుండడంతో ఇక్కడే సమావేశాల నిర్వహణకు బీజేపీ అధినాయకత్వం ఆసక్తి చూపింది.
ఇదే క్రమంలో మహానగరం పరిధిలో పాతనగరంలోని 8 నియోజకవర్గాలు మినహా మిగతా 16 శాసనసభ స్థానాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పాగా వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లోనివసిస్తున్న 15 రాష్ట్రాలకు చెందిన వివిధ సామాజిక వర్గాలు,నేతలు,ప్రముఖులతో ఆపార్టీ అగ్రనేతలు సదస్సులు, సమావేశాలు, సాంస్కృతిక వేడుకలు, సమాలోచనలు,విందు సమావేశాలను గురు,శుక్రవారాల్లో నిర్వహించడం విశేషం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల నివాసాల్లోనే అల్పాహారం,భోజనం స్వీకరిస్తూ అందరితో మమేకమవుతోన్న ఆపార్టీ అగ్రనేతలు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు.
ఆయా నియోజకవర్గాల పరిధిలో అన్ని వర్గాల్లో పార్టీ ఎజెండానూ ముందుకు తీసుకెళ్లడంతోపాటు గ్రూపు తగాదాలు లేకుండా బీజేపీ అనుబంధ సంఘాలను సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడం, బూత్‌స్థాయి కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా పార్టీ నేతల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఎన్నికలకు ముందుగానే వ్యూహాత్మకంగా కమలం పార్టీ పావులు కదుపుతుండడంతో ఆ పార్టీ క్యాడర్, నేతల్లో జోష్ నెలకొంది. ముఖ్యమైన నేతలు మాత్రమే హాజరయ్యే కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ క్యాడర్‌కు సరికొత్తగా దిశానిర్దేశం చేయనున్నారు. ఈనేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పార్టీ దూసుకుపోతోందని ఆ పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేడర్‌లో జోష్..
గ్రేటర్‌లో కమలం పార్టీ కేడర్‌లో నయా జోష్ నెలకొంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ అగ్రనేతలు నగరాన్ని సందర్శిస్తుండడం, వీరంతా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండడంతో వారిలో నూతన ఉత్సాహం నెలకొంది. నగరంలో పలు చోట్ల కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేరిట వెలిసిన ఫ్లెక్సీలు, స్థానిక నాయకులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, కన్వీనర్లు ఏర్పాటు చేసిన కటౌట్లు అగ్రనేతలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. నగరవ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నలిచాయి. హైటెక్స్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ స్వాగత ద్వారం హైలెట్‌గా నిలిచింది. పరేడ్‌గ్రౌండ్స్ మైదానంలో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభ సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
ప్రధానమంత్రి మోదీ,ముఖ్య నాయకులు సభ అనంతరం బయటకు వెళ్లేందుకు టివోలి రోడ్డులో మరో ద్వారం ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతోన్న పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇప్పటికే నగరంలోని పలు కీలక నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడం, కిందిస్థాయి నేతలు, కార్యకర్తలతో మమేకమయి సరికొత్తగా దిశానిర్దేశం చేయడంతోపాటు పలువురు నేతలు క్షేత్రస్థాయిలోనే కార్యకర్తల ఇళ్లలో బస చేయడంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నిండింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సినీనటి, బీజేపీ నేత ఖుష్భూ ప్రత్యేక పూజలు చేయడంతో పాతనగరంలోనూ కమలం పార్టీ కేడర్‌లో జోష్ నిండింది.
(చదవండి: రాష్ట్రంలో బీజేపీదే అధికారం)
Comments
Please login to add a commentAdd a comment