ప్రజాభిప్రాయం పట్టని చట్టసభలు
విశ్లేషణ
బ్రిటిష్ విద్యావేత్త, రాజకీయ నేత అయిన లార్డ్ మేఘ్‌నాథ్ దేశాయ్ ఇటీవల ఇలా రాశారు. ‘బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా నా 24 ఏళ్ల అను భవంలో, సభలో సభ్యు లు బ్యానర్లను ప్రదర్శించడం కాదు కదా.. గావుకేకలు పెట్టడం, తమ స్థానాలు వదలిరావడం, స్పీకర్ స్థానం వద్దకు దూసుకు పోవడం వంటి దృశ్యాలను నేనెన్న డూ చూడలేదు’. అలాగే ‘ప్రతినిధుల సభలో ఎవరైనా కొంతమంది హద్దు మీరి కేకలు వేస్తే, స్పీకర్ మందలించగానే అంతా సర్దుకోవడం’ సాధారణ సముచిత నడవడికగా ఉండేదని ఆయన అభివర్ణించారు.
భారత పార్లమెంటులో ప్రస్తుతం నిత్య కృత్యంగా మారిపోయిన అంతరాయాల గురించి స్పీకర్ ఆవేదనపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన వ్యాసానికి ‘యాన్ అన్ పార్లమెంటరీ డెమోక్రసీ’ అని మంచి శీర్షికను పెట్టారు. భారత పార్లమెంటులో సెషన్ తర్వాత సెషన్‌లో అడ్డంకులు, అంతరాయా లను చూసి విసిగిపోయిన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ.. ఇలా సభా కార్యక్రమాలకు అడ్డుపడేవారిని బయటకు పంపించేందుకు ‘లోక్‌సభకు ఉన్న తరహా అధికారాలను’ రూపొందించవలసిందిగా నియమ నిబంధనల కమిటీని ఆదేశించారు.
లోక్‌సభ స్పీకర్ ఈ అధికారాలను ఉపయోగించ లేదని కాదు. తన అధికారాలను ఉపయోగించి నట్లయితే, సభ్యులు ప్రదర్శించే ఎలాంటి దుష్ర్ప వర్తననైనా స్పీకర్ అడ్డుకుంటారు. స్పీకర్ అధికార వినియోగాన్ని ఆమోదించడం అంటే సభ తనకు తానుగా తగిన ఔచిత్యంతో వ్యవహరిస్తున్నదని అర్థం కాదు. లోక్‌సభ స్పీకర్ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆరోజు జరగవలసిన కార్య క్రమాలు సజావుగా జరగడం కోసం సభను క్రమం లో పెట్టడానికి సంబంధించి వారు తరచుగా నిస్పృహకు గురవుతున్నట్లు సభా కార్యకలాపాలు చూపిస్తున్నాయి.
అయితే ఒక సభ్యుడిని లేదా కొంతమంది సభ్యులను శిక్షించడానికి ప్రయత్నించడం అనేది.. అడ్డంకులను సృష్టించే సంస్కృతిని వదిలించు కోవడానికి అనుకూలమైనదిగా మారటం నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది. చర్చ తర్వాత మెజారిటీ నిర్ణయానికి కలిగే పవిత్రత స్థానంలో అడ్డంకుల సంస్కృతి వచ్చి చేరటం శోచనీయం. సంబంధిత పార్టీల విప్‌లు, తరచుగా పార్టీల నాయకులు, చివరకు సోనియాగాంధీ వంటి అధినేతలు కూడా తమ తమ పార్టీలకు చెందిన సభ్యుల దుష్ర్పవర్తనపై మౌన ప్రేక్షకులుగా ఉంటున్నారు. అలాంటి వైఖరిని ప్రదర్శించడం ద్వారా వీరు సభ్యుల ప్రవర్తనను ఆమోదించడమే కాకుండా చెడు ధోరణులను ప్రోత్సహిస్తున్నవారవుతున్నారు.
ప్రిసైడింగ్ అధికారుల అభ్యర్థనలను మన్నిం చని విచ్ఛిన్నకరమైన ప్రవృత్తి ప్రస్తుతం నిత్య వ్యవహారంలా మారిపోయింది. సభను విచ్ఛిన్న పర్చడం అనేది ఒక ఎత్తుగడ అని, దాన్ని వదిలించు కోవడం చాలా కష్టమని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు అంశాలను ఇక్కడ చూడాల్సిన అవసరముంది. ఒకటి, ఒక ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించిన సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఫాలీ నారిమన్ సూచించినట్లు పార్లమెంటు నడవకపోతే, సభ్యులకు చెల్లింపులను ఆపివేయడం. ఇక రెండోది, ఎంపీలు సభా చర్చల్లో ఓటు వేసి నప్పుడే వారికి రావలసిన సౌకర్యాలు, వేతన పెంపు దల వంటివి తీసుకోవడానికి అనుమతించడం.
నారిమన్ ఎంపీగా ఉన్నప్పుడు 2006లో ఆయన చేసిన ప్రతిపాదనపై పార్లమెంటు నేటికీ నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఇటీవల ఒక టీవీ వార్తా చానల్‌లో మాట్లాడుతూ.. జువెనైల్ బిల్ కేసులో వలే చట్ట సంస్థలు ప్రజాభిప్రాయ తీవ్రతను పసిగట్టిన సందర్భంలో మాత్రమే ఇలాంటివి చట్ట రూపం దాలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఎంపీల జీతభత్యాలు వంటివాటిని ఒక ప్రత్యేక, స్వతంత్ర కమిషన్ నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని సోమనాథ్ చటర్జీ గతంలో ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన కూడా ఉంది.
పార్లమెంటులో సబ్సిడీ ధరలతో క్యాంటీన్‌లు నడపటంపై ప్రజలు తరచుగా తీవ్రమైన వ్యాఖ్యా నాలు చేస్తున్నప్పటికీ ఎంపీలు ప్రజాభిప్రాయంపై ఏ రకంగానూ స్పందించడం లేదు. ఎంపీలు మాత్రమే కాదు, అధికారులు, సిబ్బంది కూడా ఈ సౌకర్యాన్ని వినియోగిస్తుండటంపై పునఃపరిశీలన జరగడం లేదు. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం గౌరవించటం లేదు. మరోవైపు ప్రజలు వీరిని భోజన పదార్థాలను కొల్లగొట్టేవారిలాగా లెక్కిస్తున్నారు. త మ వేతనాల పెంపుదలపై తామే నిర్ణయించుకోవడం అనేది కూడా దీనికి భిన్నమైనదేమీ కాదు.
సభ్యులకు అధిక ప్రయోజనాలను కలిగించే ఇలాంటి బిల్లులు పార్లమెంటులో లేదా రాష్ట్ర అసెంబ్లీలలో చివరిరోజు లేదా ఆ ముందటి రోజు మాత్రమే ఆమోదం పొందుతుంటాయి. చట్టసభల సభ్యులు తమ వేతనాలను తామే పెంచుకోవడంపై ప్రజల్లో చెలరేగుతున్న ఆగ్రహావేశాలు, సామాన్యుల వేతనాల పెంపుదలపై ప్రభావం చూపేంత స్థాయిలో కనిపించడంలేదు. పైగా సగటు మనిషి వేతనం పొందుతున్న పరిస్థితిలో కూడా అదే వ్యవస్థ నుంచి అదే స్థాయి సేవలను అందుకోవడం లేదు.
రాజకీయ నేతలు సంపన్నులని, ఒక్కోసారి వారు అతి సంపన్నులుగా ఉంటున్నారని, తమ ఇచ్చ ప్రకారమే వారు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇలాంటి ప్రయోజనాలకు వారు అర్హులు కారని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. నేతలు రాజకీయాలను ఒక వృత్తిగా మార్చుకుని, దానిలోనే కొనసాగే వారసత్వ క్రమాన్ని తీసుకురావడం ద్వారా తమకు తాముగా రాజకీయాల్లో పాతుకుని పోయారని భావిస్తుండటం వల్లే ప్రజలు ఆగ్రహావేశులవు తున్నారు. రాజకీయ నేతలు పన్నులేని సంపదను పోగుచేసుకుంటున్నారని, అదే సమయంలో సగటు మనిషికి అలాంటి అవకాశాలను కల్పించడం లేదని ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ రాజకీయ నేతలు మాత్రం ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా తమకు సమాజంలో ఇంకా గౌరవం ఉందంటూ తమను తాము మోసపుచ్చుకుంటున్నారు.
(వ్యాసకర్త: మహేష్ విజా పుర్కార్ సీనియర్ పాత్రికేయులు)