సృజనాత్మకత...రాజనీతిజ్ఞత | PM Modi meets Nawaz Sharif in surprise Lahore visit | Sakshi
Sakshi News home page

సృజనాత్మకత...రాజనీతిజ్ఞత

Published Sun, Dec 27 2015 1:11 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

సృజనాత్మకత...రాజనీతిజ్ఞత - Sakshi

సృజనాత్మకత...రాజనీతిజ్ఞత

త్రికాలమ్:
 
 మోదీ అనుభవరాహిత్యం వల్లా, దుందుడుకుతనం వల్లా దేశానికి తీరని అపకారం జరుగుతోందని కాంగ్రెస్ ప్రతినిధులు విమర్శించారు. లోక్‌సభలో 280 స్థానాల దన్ను ఉన్న మోదీకి కాంగ్రెస్‌కు సమాధానం చెప్పడం పెద్ద సమస్య కాదు. తన మద్దతుదారులను ఎట్లా ఒప్పిస్తారో చూడాలి.
 
 ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం కాబూల్ నుంచి ఢిల్లీ వస్తూ లాహోర్‌లో రెండు గంటల సేపు ఆగడం, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి ఆయనతో సమాలోచన జరపడం, షరీఫ్ తల్లికి పాదనమస్కారం చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఉదారవాదులూ, శాంతికాముకులూ రెండు దేశాల మధ్య సయోధ్య సాధించేందుకు ఎటువంటి ప్రయత్నం ఎవరు చేసినా హర్షిస్తారు, స్వాగతిస్తారు. నరేంద్రమోదీ చూపించిన చొరవ అభినందించదగినది.

 నవాజ్ షరీఫ్ వాస్తవిక దృక్పథం కలిగిన పాకిస్తాన్ నాయకుడు. భారత్‌లో పర్యటించి కశ్మీర్ వేర్పాటువాదులను కలుసుకోకుండా, కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించకుండా తిరిగి వెళ్ళిన మొదటి పాకిస్తాన్ అధినేత షరీఫ్. వాజపేయి బస్సులో వాఘా సరిహద్దు దాటి లాహోర్ వెళ్ళివచ్చిన తర్వాత  పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌పై దాడి చేసింది. భారత సైన్యం దీటుగా సమాధానం చెప్పి పాక్ సైన్యాన్ని నిలువరించింది. షరీఫ్‌ను బర్తరఫ్ చేసి సేనాధిపతి జనరల్ ముషారఫ్ అధికారం హస్తగతం చేసుకున్నారు. శాంతి యత్నానికి భంగం కలిగించిన ముషారఫ్ సైతం ఇండియాతో శాంతి చర్చలు జరిపారు. ఆగ్రాలో వాజపేయితో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.

కానీ ఉగ్రవాదం పెచ్చరిల్లడం వల్ల అడుగు ముందుకు పడలేదు. యూపీఏ ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వప్నం అమృత్‌సర్‌లో అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) స్వీకరించి, లాహోర్‌లో మధ్యాహ్న భోజనం (లంచ్) చేసి కాబూల్‌లో రాత్రి భోజనం (డిన్నర్) చేయడం. అది ఆయన విషయంలో కలగానే మిగిలిపోయింది. పాక్ పాలకులు ఎన్నిసార్లు ఆహ్వానించినప్పటికీ పాక్ గడ్డ మీద అడుగు పెట్టకుండానే ప్రధానిగా మన్మోహన్‌సింగ్ పదేళ్ళ పదవీకాలం ముగిసింది. మోదీ కాబూల్‌లో అల్పా హారం ఆరగించి, లాహోర్‌లో మధ్యాహ్నం నవాజ్ షరీఫ్ జన్మదినం సందర్భంగా ఇచ్చిన విందు స్వీకరించి, రాత్రి భోజన సమయానికి ఢిల్లీ చేరుకున్నారు. మన్మోహన్‌సింగ్ చేయలేని పని మోదీ ఎట్లా చేశారు?

 ప్రతిపక్షం ప్రతిఘటన
 పాకిస్తాన్ విషయంలో ఎప్పుడు ముందడుగు వేసినా వెనక్కి లాగేందుకు భారతీయ జనతా పార్టీ, హిందూత్వ సంస్థలు సిద్ధంగా ఉండేవి. పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెప్పలేని దద్దమ్మంటూ మన్మోహన్‌సింగ్‌ని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోదీ అనేకసార్లు దుయ్యబట్టారు. పాకిస్తాన్‌కు ‘ముహ్‌తోడ్ జవాబ్ దేనా చాహియే (మొహం పగిలే విధంగా జవాబు చెప్పాలి)’ అన్నది బీజేపీ వాదన.

మొన్న షరీఫ్ పుట్టిన రోజు మాత్రమే కాదు. వాజపేయి, జిన్నా జన్మదినం కూడా. మోదీ, షరీఫ్‌లు వాజపేయి శాంతియత్నం గురించి మాట్లాడుకున్నారు.  క్రిస్మస్ పండుగ రోజు మోదీ చూపించిన అసాధారణమైన చొరవ  పట్ల బీజేపీ శ్రేణులూ, ఆర్‌ఎస్‌ఎస్, శివసేన వంటి సంస్థలూ ఎట్లా స్పందిస్తాయి? ఆర్‌ఎస్‌ఎస్ గీత దాటి మోదీ మనగలరా? వాజపేయి, అద్వానీల మాదిరే ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం ఆగ్రహానికి గురికాక తప్పదా? లేదా, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను మోదీ ప్రభావితం చేయగలరా? మోదీకి ఆర్‌ఎస్‌ఎస్ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసి అద్వానీ, మురళీమనోహర్‌జోషీ వంటి అగ్రనాయకులను అడ్డు తప్పించింది. అయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ విధానాలకు కట్టుబడి వ్యవహరిస్తే వైవిధ్య భరితమైన, సువిశాలమైన భారతదేశాన్ని పరిపాలించడం సాధ్యం కాదనీ, దక్షిణాసియాలో శాంతి అందని ద్రాక్ష గానే మిగిలిపోతుందనీ మోదీ గ్రహించినట్టు కనిపిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుడి స్థాయి నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఎన్‌డీఏ-2 ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమంలో ఆయన వ్యక్తిత్వం పరిణతి చెందిందని భావించడానికి ఇటీవలి కొన్ని దృష్టాంతాలు స్పష్టంగా కనిపించాయి.

 అసహనంపైన పార్లమెంటులో చర్చకు సమాధానం చెబుతూ, ‘మై ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్’... అంటూ ఇండియా ఎట్లా ఉండాలని తాను అనుకుంటున్నారో మోదీ పదే పదే వివరించిన తీరు ఆయన రాజనీతిజ్ఞుడి స్థాయికి పెరుగుతున్నారనడానికి నిదర్శనం. ఆ రోజు పార్లమెంటులో మోదీ ప్రసంగం ఆలకించినవారికి ఆయన ఒక వాజపేయిలాగా ఎదుగుతున్నట్టు అనిపించి ఉంటారు. నెహ్రూను తలపించి ఉండాలి. భిన్నత్వంలో  ఏకత్వం భారతదేశాన్ని నిలబెడుతున్న ఒకే ఒక సూత్రమని చెప్పారు. తన ముందు అధికారంలో ఉండిన ప్రధానులందరూ దేశాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని అన్నారు. ఎన్నికల సభలలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ నినాదం చేసిన మోదీ, జవహర్‌లాల్  నెహ్రూను చరిత్రలో కుదించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించిన మోదీ వేరు. అసహనంపైన పార్లమెంటులో అద్భుతమైన ప్రసంగం చేసిన మోదీ వేరు. లాహోర్  పర్యటనపైన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానిస్తూ ప్రధాని రాజనీతిజ్ఞుడి(స్టేట్స్‌మన్)లాగా వ్యవహరించారంటూ కితాబు ఇచ్చారు.

ఆమె కూడా వాజపేయి ఆలోచనా ధోరణిని పుణికి పుచ్చుకున్న రాజకీయ నాయకురాలే. ఇందుకు భిన్నమైన వాతావరణం నుంచి జాతీయ స్థాయికి చేరుకున్న నాయకుడు రాంమాధవ్. అరవై సంవత్సరాల కిందట చారిత్రక కారణాల వల్ల విడిపోయిన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎప్పటికైనా కలిసిపోయి అఖండ భారత్‌గా విలసిల్లవలసిందేనంటూ అల్‌జెజీరా అనే అంతర్జాతీయ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంమాధవ్  వ్యాఖ్యానించారు. యుద్ధం చేయడం ద్వారా కాదు అందరి సమ్మతితోనే ఇది జరగాలని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వప్నం ఇది. మన్మోహన్ స్వప్నం భిన్నమైనది. ఇండియా, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ దేశాల అస్తిత్వాలకు భంగం లేకుండానే, సరిహద్దులు చెరగకుండానే ప్రశాంతమైన దక్షిణాసియాలో తన కల నెరవేరాలని ఆకాంక్షించారు. ఇప్పుడు మోదీ చేస్తున్న ప్రయత్నం ఆర్‌ఎస్‌ఎస్ స్వప్నానికి భంగం కలిగిస్తుందా? విదేశీ వ్యవహారాలలో మోదీ ప్రదర్శిస్తున్న  నాటకీయతనూ, మార్మికతనూ ఆర్‌ఎస్‌ఎస్ సహిస్తుందా?

 పరోక్ష దౌత్యం
 శాంతి కోసం జరిగే ప్రయత్నాలు ఎప్పుడూ నాటకీయంగానే, ఆకస్మికంగానే ప్రారంభం అవుతాయి. పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి చరిత్రాత్మకమైన కృషి చేస్తున్న సమయంలో కార్గిల్ యుద్ధంతో ఖంగు తిన్న వాజపేయి కొంతకాలం పాకిస్తాన్ విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించారు. పార్లమెంటుపైన ఉగ్రవాదుల దాడి జరిగిన కొన్ని వారాలలోనే కఠ్మాండూలో సార్క్(దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంస్థ) సమావేశం జరిగింది. ఆ సమయంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్నది. వాజపేయి భారత ప్రతినిధి బృందం సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన గదిలోకి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఆకస్మికంగా ప్రవేశించి కరచాలనం చేశారు. విస్మయం చెందిన వాజపేయి తేరుకొని నిలబడి మర్యాద పూర్వకంగా చిరునవ్వుల మధ్య ముషారఫ్‌కు అభివాదం చేశారు. 2002 జనవరిలో కఠ్మాండూలో ముషారఫ్-వాజపేయి కరచాలనం భారత్, పాక్ చర్చలు తిరిగి ప్రారంభం కావడానికి, 2004లో వాజపేయి ఇస్లామాబాద్ సందర్శించడానికి దారి తీసింది.

 మోదీ దౌత్యం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ కార్యదక్షత ఉంది. ఉక్కు పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ మధ్యవర్తిత్వం ఉంది. సజ్జన్ కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు నవీన్ జిందాల్ సోదరుడు. సజ్జన్‌కు షరీఫ్‌తోనూ, ఆయన కుమారుడు హసన్‌తోనూ సాన్నిహిత్యం ఉంది. జిందాల్‌లాగానే హసన్ కూడా పాకిస్తాన్‌లో ఉక్కు ఫ్యాక్టరీలు నడుపుతున్నాడు. ఇండియా, పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొంటే అఫ్ఘానిస్తాన్ నుంచి ముడి ఉక్కును పాకిస్తాన్ మీదుగా ఇండియాకు చేరవేయ వచ్చునని భారత ఉక్కు పారిశ్రామికవేత్తల ఆశ. కఠ్మాండూలో సార్క్ సభలు జరిగినప్పుడు మోదీ, షరీఫ్‌లు ఒకరినొకరు పలకరించుకోలేదని మీడియా తెలిపింది. కానీ కఠ్మాండూ చేరుకోగానే మోదీ సజ్జన్‌కు ఫోన్ చేసి వెంటనే నేపాల్ రావాలని కోరారనీ, సజ్జన్ హోటల్ గదిలోనే మోదీ, షరీఫ్‌లు గంట సేపు ముఖాముఖి మాట్లాడుకున్నారనీ బర్ఖాదత్ ఈమధ్య వెలువరించిన గ్రంథంలో వెల్లడించారు. మొన్న లాహోర్‌లో కూడా సజ్జన్ జిందాల్ ఉన్నారు. షరీఫ్ మనవరాలి వివాహానికి హాజరు కావడానికి లాహోర్ వెళ్ళినట్టు జిందాల్ చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి భద్రతా సలహాదారుగా నియుక్తుడైన నశీర్ జాంజువా మాజీ సైనికాధికారి. ఇరుగుపొరుగు దేశాల మధ్య శాంతి నెలకొనాలనే ఆకాంక్ష ఉన్నవాడు. ఆయనకు నేరుగా సేనాధిపతి రహీల్ షరీఫ్‌తో సంబంధాలు ఉన్నాయి. శాంతి నెలకొనడానికి పరిస్థితులు అనుకూలించ వచ్చునని భావించడానికి ఈ అంశం  కూడా కారణం.

 మోదీ అనుభవరాహిత్యం వల్లా, దుందుడుకుతనం వల్లా దేశానికి తీరని అపకారం జరుగుతోందని కాంగ్రెస్ ప్రతినిధులు విమర్శించారు. లోక్‌సభలో 280 స్థానాల దన్ను ఉన్న మోదీకి కాంగ్రెస్‌కు సమాధానం చెప్పడం పెద్ద సమస్య కాదు. తన మద్దతుదారులను ఎట్లా ఒప్పిస్తారో చూడాలి. భారత్‌తో శాంతి సంబంధాలను వ్యతిరేకించే శక్తులు పాకిస్తాన్‌లోనూ దండిగానే ఉన్నాయి. సైన్యాధికారులు బయటపడకపోయినప్పటికీ లష్కరే తొయిబా అధిపతి హఫీజ్ సయీద్ షరీఫ్‌ని తూర్పారబట్టాడు. ప్రతిపక్ష నాయకులు ఇమ్రాన్‌ఖాన్, బేనజీర్ తనయుడూ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడూ బిలావల్ భుట్టో ఈ పరిణామాన్ని స్వాగతించడం విశేషం. రెండు దేశాల మధ్య వివాదాలు తొలగిపోవాలంటే అత్యున్నత స్థాయి నేతల మధ్య తరచూ సమాలోచనలు జరగాలని వారు అన్నారు. అటువంటి పరిణతి చెందిన స్పందన మన ప్రతిపక్షం నుంచి రాకపోవడం శోచనీయం.

 అయిదేళ్ళ పదవీ కాలం మధ్యలో పాకిస్తాన్ పట్ల సృజనాత్మకమైన, తెగింపుతో కూడిన విధానాన్ని తలకెత్తుకోవడం వల్ల ఏమైనా అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సమయం మోదీకి ఉంటుంది. పాకిస్తాన్‌తో శత్రుత్వం విధిగా పాటించాలని పట్టుదలగా  ఉన్న శక్తులను మోదీ శాంతింప జేయగలిగితే, హఫీజ్ వంటి ఉగ్రవాదులను షరీఫ్ పూర్వపక్షం చేసి సైన్యాన్ని శాంతికి ఒప్పించగలిగితే దక్షిణాసియాలో శాంతి వెల్లివిరియవచ్చు. అదే జరిగితే, యుద్ధాలు జరిగే ప్రమాదం తొలగిపోతుంది. పేదరికంపైనా, అనారోగ్యంపైనా, అసమానతలపైనా సమష్టి యుద్ధం  ప్రకటించవచ్చు. ఇది శాంతికాముకుల స్వప్నం. భారత్, పాక్‌ల మధ్య శాశ్వత శాంతి నెలకొల్పడంలో మోదీ, షరీఫ్ కృతకృత్యులైతే అంతకంటే కావలసినది ఏముంది? నోబెల్ శాంతి బహుమతి ఇచ్చి వారిని సత్కరించినా తక్కువే.
http://img.sakshi.net/images/cms/2015-03/61427572438_625x300.jpg
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement