
ఎంపీ సుప్రియా చెప్పిన రహస్యం
ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటేగానీ పొలిటీషియన్ కానేరడోయ్ అంటాడు గిరీశం. ప్రస్తుతం గొడవలొచ్చే ప్రకటనలిస్తే తప్ప రాజకీయవేత్తలు కారోయ్ అనొచ్చు. వివాదాస్పద ప్రకటనతో దృష్టి ఆకర్షించిన ప్రస్తుత ఎంపీ సుప్రియా సూలే- ఎన్‌సీపీ నేత, శరద్‌పవార్ కుమార్తె. నాసిక్‌లో ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఓ దేవరహస్యం చెప్పారామె. పార్లమెంటులో వక్త మీద కాక, మిగిలిన వారి మీద కూడా అప్పుడప్పుడు కెమేరా తిరుగుతుంది. గంభీరంగా కనిపించినంత మాత్రాన వారేదో తీవ్ర సమస్య గురించి మథనపడుతున్నారని అనుకోనక్కరలేదంటారు సూలే.
ఆ మధ్య తాను ఒక తమిళ మహిళా ఎంపీ పక్కన కూర్చుని ఉండగా కెమేరా తమ వైపు తిరిగిందని, తాము ఆ క్షణంలో ఏదో మాట్లాడుకుంటున్నా, అది చెన్నైని ముంచెత్తిన వరదల సంగతి మాత్రం కాదని సూలే చెప్పారు. మరేమిటి? ‘ఈ చీర బాగుంది ఎక్కడ తీసుకున్నారు?’ అని మాత్రమే అడిగాను అన్నారు సూలే. పార్లమెంటులో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తే వారు బ్యూటీ పార్లర్ల గురించీ, ఫేషియల్సూ, చీరల గురించే చర్చించుకుంటారంటూ కొందరు పురుష ఎంపీలు తరువాత తనను ఆట పట్టించారని కూడా సూలే చెప్పారు.