వరుణ్ గాంధీ
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తన పరిధిని విస్తరించి రైల్వే మార్గాల విద్యుదీకరణ మీద, సిగ్నల్ వ్యవస్థ మీద దృష్టి సారించాలి. చేపట్టిన పథకాలను పూర్తి చేయడం ద్వారా వచ్చే ఐదేళ్లలో 14,000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని విద్యుదీకరించవచ్చు. ఇందుకు అవసరమయ్యే నిధులను కార్పొరేషన్ మార్కెట్‌లో నిధుల సేకరణ ద్వారా, తన కరెంట్ కేటాయింపుల ద్వారా సమకూర్చవచ్చు.
ప్రతి ఒక్క కిలోమీటరు కొత్త రైలు మార్గం వందలాది ఉద్యోగాలను కల్పించగలుగుతుంది. 200 కిలోమీటర్ల మేర నిర్మించే ఒక్క హైస్పీడ్ రైలు మార్గం భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని జమ చేయగలుగుతుంది. ఉత్పత్తిదారులకూ, వినియోగదారులకూ మధ్య భౌగోళిక అనుసంధానం కల్పించి, ఉత్పత్తిరంగంలో సమర్థనీయమైన విభజనను తెచ్చి ఆర్థిక వ్యవస్థ విస్తరణ మార్గాలను రైల్వేలు విస్తృతం చేస్తాయి. మేక్ ఇన్ ఇండియా ఆలోచనకు సమర్థ రైల్వే రవాణా అత్యవసరం. నగరాల మధ్య ప్రయాణాన్ని చౌకగా మార్చి, పర్యాటక, ఇతర సేవా రంగాల వృద్ధికి రైల్వే పునాదులు నిర్మిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి రైల్వే వ్యవస్థ ఏటా 15 నుంచి 20 శాతం పెరుగుదల సాధించాలి.
ఇప్పటికీ నత్తనడకే
రైల్వే శాఖకు కొత్త మంత్రిని నియమించడంతో ఆధునీకరణకు, ఇతోధికంగా సంస్కరణలు తేవడానికి అవకాశం ఏర్పడింది. ప్రైవేటు వ్యవస్థలో సరుకు రవాణాకు, హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబ డుల అనుమతికి, కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు, రైలు మార్గాల విద్యుదీకరణకు అవకాశం కలుగుతోంది. వీటితోనే రైల్వేల అభివృద్ధి సాధ్యమౌతుంది. రైల్వే జోనల్ అధిపతులకు సంబంధించి మంత్రికి ఉన్న సాధికారత నిర్వహణ, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడాలి. జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉపకరించాలి. టెండర్ల మీద నిర్ణయాలను వేగవంతం చేయాలి.
రైల్వే వ్యవస్థల అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పటికీ ఎంతో వెనుక బడి ఉన్నాం. 2014 సంవత్సరానికే చైనా 11,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైలుమార్గం నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ విధంగా ఆ వ్యవస్థను కలిగి ఉన్న చాలా దేశాల కంటే చైనా ఎంతో ముందంజ వేసింది. ఈ మార్గాన్ని కిలో మీటరు ఒక్కంటికి 17 నుంచి 21 మిలియన్ డాలర్ల వ్యయంతో చైనా నిర్మిం చుకోగలిగింది. కానీ యూరప్ దేశాలు కిలోమీటరు ఒక్కింటికి 25- 39 మిలి యన్ డాలర్లు ఖర్చు చేశాయి. బాధ్యతాయుతమైన వ్యవస్థ, సాంకేతిక సామ ర్థ్యం, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల వల్ల చైనాలో ఇది సాధ్యమైంది. కానీ మన దేశంలో జరుగుతున్నది వేరు.
దేశంలో 15,000 కిలోమీటర్ల హైవేలను నిర్మిం చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు ఏటా 2 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని భావించాం. డీజిల్, పెట్రోల్‌లపై లీటరు ఒక్కింటికి రెండు రూపాయల వంతున ఎక్సైజ్ పన్నును విధించడం ద్వారా అందుకు అవస రమైన నిధులలో కొంతమేర సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆదాయంలో సన్నగిల్లుతున్న పెరుగుదల; వేతనాలు, పింఛన్లు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోతూ ఉండడంతో రైల్వేల అభివృద్ధికి ఇదంతా పెద్ద ప్రతి బంధకంగా మారింది. భద్రతా ప్రమాణాలు, జవాబుదారీతనాన్ని పెంచు కోవడానికి తగిన రీతిలో పెట్టుబడులు పెట్టడానికి ఆటంకంగా మారుతోంది. రైల్వేల ఆధునీకరణ కోసం, అభివృద్ధి కోసం 340 ప్రాజెక్టులను చేపట్టడం జరి గింది. వీటి మీద రూ.1,72,934 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. కానీ వీటికి ఏటా కేటాయిస్తున్నది కేవలం రూ.10,000 కోట్లు.
త్రిముఖ వ్యూహం అవసరం
రైల్వేల అభివృద్ధికి త్రిముఖ వ్యూహం అవసరం. మొదటి వ్యూహంలో కొత్త మార్గాలను ప్రారంభించడం కోసం లెక్కకు మిక్కిలిగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలి. హైస్పీడ్ రైళ్లను, సరుకు కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. రెండో వ్యూహంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను సమీకరించాలి. మూడో వ్యూహం ప్రకారం రైల్వేలను సంపూర్ణంగా పునర్‌నిర్మించాలి. పెట్టుబడుల ప్రణాళిక, ప్రాజెక్టుల నిర్వహణలకు పూర్తిగా కొత్త రూపం ఇవ్వాలి. ఒక్కసారి భారత రైల్వే మార్గాలను చూపించే మ్యాప్‌ను చూడండి! వాటి ఉపయోగం చాలా అసమతౌల్యంతో కనిపిస్తుంది. వాటి మీద రాకపోకలు, సరుకు రవాణా తీరుతెన్నులు అసమంగా ఉంటాయి.
మన నాలుగు మెట్రో నగరాలను కలిపే రైల్వే లైన్లు మొత్తం లైన్లలో 16 శాతం మాత్రమే. కానీ అవన్నీ వంద శాతం మించిన రద్దీతో ఉన్నాయి. మనం డిమాండ్‌ను బట్టి సామర్థ్యాన్ని పెంచుకో వాలి. కాబట్టే రైల్వే వ్యవస్థలో నిర్మాణాల అవసరం చాలా ఎక్కువ. ఢిల్లీ-ఆగ్రా మధ్య ఇటీవల ప్రయోగాత్మకంగా నిర్వహించిన హైస్పీడ్ రైలు యాత్ర విజయవంతమైన నేపథ్యంలో ఆ రైల్వే వ్యవస్థకు ఊతం ఇవ్వాలి.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనే అయినా, కొత్త లైన్ల నిర్మాణానికి ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించాలి. స్టేషన్లను అభివృద్ధి చేయ డం, వినియోగంలో లేని రైల్వేల భూమిని వాణిజ్యావసరాల కోసం అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 50,000 కోట్లతో 50 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం చేపట్టే ప్రాజెక్టులలో ప్రైవేటు రంగం సహాయపడగలదు. నగరాల మధ్య ప్రైవేటు రైళ్లను నడపడానికి కూడా రైల్వే శాఖ అనుమతించాలి. రైలు మార్గాలను పరిశుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఉపయోగించుకోవాలి. సరుకు రవాణాకు కనీస భరో సాను రైల్వేలు ఇవ్వాలి. సరుకు రవాణా ఉద్దేశంతోనే మన రైల్వేలు 30 నుంచి 40,000 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించవలసి ఉంది.
రద్దీని తట్టుకోవడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కోల్ ఇండియా, ఆసియా అభివృద్ధి బ్యాంక్, భారతీయ రైల్వేలు కలసి చేస్తున్న ప్రయత్నాలకు ఊతం ఇవ్వడం కూడా అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కృష్ణపట్నం రైల్వే కంపెనీ, భారత రైల్వేలు ఉమ్మడిగా చేసిన ప్రయత్నం కూడా ప్రత్యేకమైనది. ఈ ఉమ్మడి కృషిలో తయారైన ప్రత్యేక వాహనాలను పరిగణనలోనికి తీసుకోవాలి. పరి మిత వ్యయంతో, నౌకాశ్రయాల అవసరాలకు చెందిన ఇలాంటి వాహ నాలను తయారు చేసుకోవాలి.
పునర్నిర్మాణం అవసరం
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తన పరిధిని విస్తరించి రైల్వే మార్గాల విద్యుదీకరణ మీద, సిగ్నల్ వ్యవస్థ మీద దృష్టి సారించాలి. చేపట్టిన పథకా లను పూర్తి చేయడం ద్వారా వచ్చే ఐదేళ్లలో 14,000 కిలోమీటర్ల రైలు మార్గా న్ని విద్యుదీకరించవచ్చు. ఇందుకు అవసరమయ్యే నిధులను కార్పొరేషన్ మార్కెట్‌లో నిధుల సేకరణ ద్వారా, తన కరెంట్ కేటాయింపుల ద్వారా సమ కూర్చవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలోనే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు, నౌకాశ్రయ సంబంధిత కంపెనీలు, ప్రైవేటురంగం రైల్వే లైన్ల నిర్మాణం పథకాలలో పాలు పంచుకోవచ్చు.
ఈ పథకాల నిర్మాణంలోనే కాకుండా, వాటి నిర్వహణలో కూడా ఈ వ్యవస్థలను భాగస్వాములను చేసే రీతిలో ఈ ప్రయత్నం జరగాలి. పెట్టుబడుల ప్రణాళిక, ప్రాజెక్టుల సమర్థ నిర్వహణలతో ఇది ప్రారంభం కావాలి. ఇంతవరకు సాంకేతిక సామర్థ్యమే ప్రధానంగా భావిస్తూ వచ్చిన రైల్వేలు ఇక వాణిజ్య కోణం నుంచి ఆలోచిస్తూ సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు, మౌలిక వసతుల నిర్వహణ వంటి వాటి మీద దృష్టి పెట్టాలి. లాభాలను తెచ్చి పెట్టే ఈ తరహా ఆలోచన వల్లనే రైల్వేల ఆదాయం అంతర్జాతీయ స్థాయి రైల్వేల స్థాయికి చేరుతుంది.
(వ్యాసకర్త బీజేపీ ఎంపీ / కేంద్రమంత్రి మేనకా గాంధీ కుమారుడు)