పాత బంధం పనిచేస్తుందా! | Ramachandramurthy writes on modi's visit to america | Sakshi
Sakshi News home page

పాత బంధం పనిచేస్తుందా!

Published Sun, Jun 25 2017 1:37 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

పాత బంధం పనిచేస్తుందా! - Sakshi

పాత బంధం పనిచేస్తుందా!

త్రికాలమ్‌
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య రేపు జరగబోయే సంభాషణ రెండు దేశాల ప్రజల భవిష్యత్తునూ, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రజల జీవితాలనూ, వివిధ దేశాల మధ్య సంబంధాలనూ ప్రభావితం చేయబోతోంది. ట్రంప్‌ శ్వేత భవనంలో అడుగిడిన అనంతరం మోదీ వాషింగ్టన్‌ సందర్శించడం ఇదే ప్రథమం. మూడేళ్ళలో మూడు విడతలు అమెరికా సందర్శించిన ప్రధాని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ‘బరాక్, నేనూ మిత్రులం’అంటూ ఆత్మవిశ్వాసంతో మోదీ ప్రకటించే స్థాయికి వారి మధ్య అనుబంధం పెరిగింది . ట్రంప్‌ అనూహ్యంగా అధ్యక్ష పదవికి ఎన్నికైన వ్యక్తి. మోదీ ఫక్తు రాజకీయవాది. ట్రంప్‌ వ్యాపార ప్రపంచం నుంచి రెండేళ్ళ క్రితమే రాజకీయరంగంలో అడుగుపెట్టి వివాదాలలో వర్థిల్లుతున్న ఘనుడు.

ఆర్థిక, విదేశాంగ విధానాల కొనసాగింపే
ఆర్థిక విధానం వలెనే విదేశాంగ విధానం సైతం కొనసాగింపే. 1991లో పీవీ నరసింహారావు–మన్మోహన్‌సింగ్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను వాజపేయి కొనసాగించారు. మన్మోహన్‌ ప్రధానిగా ఆ విధానాలనే మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. అదే బాటలో మోదీ కొనసాగుతున్నారు. దివాళా చట్టం, జీఎస్‌టీ వంటివి యూపీఏ హయాంలో మొదలై ఎన్‌డీఏ–2 పాలనలో ఒక కొలిక్కి వచ్చినవే. విదేశాంగ విధానం సైతం యూపీఏ–2 నుంచి కొనసాగింపే. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పిన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదటి నుంచీ సోవియట్‌ యూనియన్‌ వైపే మొగ్గు చూపించారు.

1956లో హంగరీని సోవియట్‌ యూనియన్‌ ఆక్రమించిన సందర్భంగా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు గట్టిగా వ్యతిరేకిస్తే ఇండియా మౌనం వహిం చింది. అమెరికా పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేసింది. కశ్మీర్‌ వివాదంలో పాకిస్తాన్‌ను బలపరిచింది. కొరియా విషయంలో అమెరికాను భారత్‌ సమర్థించకుండా తటస్థంగా ఉండేది. చైనాను అమెరికా వ్యతిరేకిస్తే మన దేశం చైనాను వెనకేసుకొచ్చేది. భద్రతామండలిలో చైనాకు స్థానం కల్పించాలని పట్టుబట్టిన దేశాలలో భారత్‌ ముఖ్యమైనది.

నెహ్రూ అంతేవాసి కృష్ణమీనన్‌ అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో, ఇతర వేదికలపైనా అనర్గళంగా ప్రసంగించేవారు. నెహ్రూ, కెన్నడీల మధ్య పరస్పర విశ్వాసం కుదరలేదు. నెహ్రూ అలీనవిధానం అమెరికాకు మింగుడు పడలేదు. నిరుపేద దేశానికి సొంత అభిప్రాయాలూ, స్వతంత్ర విదేశాంగ విధానం ఉండటం అమెరికాకు కానీ ఇతర పాశ్చాత్య దేశాలకు కానీ నచ్చలేదు. చైనా దురాక్రమణ సందర్భంగా నెహ్రూ ఆశించిన సహాయం అమెరికా నుంచి అందలేదు.

ఇదే అమిత్ర వైఖరి ఇందిర హయాంలోనూ కొనసాగింది. వియత్నాంలో అమెరికా జోక్యాన్ని మన దేశం గట్టిగా వ్యతిరేకించింది. తూర్పు పాకిస్తాన్‌ సంక్షోభం వివరించేందుకు ఇందిర వాషింగ్టన్‌ వెళ్ళినప్పుడు నిక్సన్, కిసింజర్‌లు పొడిపొడిగానే మాట్లాడారు. కించిత్‌ అవమానకరంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన కిసింజర్‌ని ఇందిరాగాంధీ తన సౌత్‌బ్లాక్‌ ఆఫీసులో ఇంటర్వ్యూ ఇవ్వకుండా చాలాసేపు కూర్చోబెట్టి ఉడుక్కునేటట్టు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. సోవియట్‌ యూనియన్‌తో 20 ఏళ్ళ స్నేహ ఒడంబడికను కుదుర్చుకోవడంతో మన దేశం సోవియట్‌ పరిష్వంగంలోకి పూర్తిగా వెళ్ళినట్టయింది.

వియత్నాంలో యుద్ధం కారణంగా అమెరికా పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేసింది. 1971లో బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం సమయంలో అణ్వస్త్ర సహితమైన అణుశక్తిసహిత విమాన వాహక సప్తమ నౌకాదళాన్ని అమెరికా బంగాళాఖాతంలోకి పంపించి ఇండియాపైన మోహరించింది. ఇందిరాగాంధీ అద్భుతమైన యుద్ధవ్యూహం అమలు చేసి చారిత్రక విజయం సాధించారు.

నిక్సన్‌ను ఖంగు తిని పించారు. 1974లో పోఖ్రాన్‌లో అణు విస్ఫోటనం అమెరికాకు మరింత ఆగ్రహం కలిగించింది. మరుసటి సంవత్సరం ఆత్యయిక పరిస్థితిని ప్రకటించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరాయి. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హయాంలో సంబంధాలు కొద్దిగా మెరుగైనాయి. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికా విదేశాంగ శాఖ అధికారి రాబిన్‌ రాఫెల్‌ కశ్మీర్‌ వివాదంపైన భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడంతో సంబంధాలు మరోసారి దిగజారాయి. బిల్‌ క్లింటన్‌ భారత్‌కు సుముఖంగా ఉండేవారు కానీ వాజపేయి నాయకత్వంలో జరిగిన అణుపరీక్ష ఆయనను కలవరపరిచింది.

మారిన పరిస్థితుల ప్రభావం
దౌత్యపరంగా భారత్‌ అమెరికాకు దూరంగా ఉన్నప్పటికీ ఆర్థిక సంస్కరణల ఫలితంగా విపణి ఆధారిత ఆర్థిక వ్యవస్థ వేళ్ళూనుకోవడం, అమెరికా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడం, భారత విద్యార్థులు వేల సంఖ్యలో అమెరికా యూనివర్శిటీలలో చదువు కోవడం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) విస్తరించడంతో రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు విశేషంగా పెరి గాయి. క్లింటన్‌ ఇండియా సందర్శించారు. హైదరాబాద్‌కూ వచ్చారు. 2008లో మన్మోహన్‌సింగ్‌ అసాధారణమైన సంకల్ప బలంతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడంతో సంబంధాలు లోగడ ఎన్నడూ లేనంత స్థాయికి ఎదిగాయి.

మన్మోహన్, జార్జి బుష్‌లు మంచి స్నేహితులుగా మారారు. ద్వైపాక్షిక సంబంధాలు ఒక మేలిమలుపు తిరిగింది బుష్‌ అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే. బుష్‌ కూడా హైదరాబాద్‌ సందర్శించారు. ఒబామా 2010లో ఢిల్లీ వచ్చి పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. స్థూలంగా చెప్పుకోవాలంటే నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకూ అమెరికాతో భారత్‌ సంబంధాలు ఏ మాత్రం బాగాలేవు. రాజీవ్‌తో కాస్త మెరుగై, మన్మోహన్‌తో సంతృప్తికరమైన స్థాయికి చేరుకున్నాయి.

ఒబామాతో సత్సంబంధాలు నెలకొల్పుకున్న మోదీ ట్రంప్‌తో ఎట్లా నెగ్గుకొని వస్తారో చూడాలి. ఒబామా, ట్రంప్‌ల వ్యక్తిత్వాలలో అంతరం ఉంది. వారి నేపథ్యాలు వేరు. మాట్లాడే పద్ధతీ, ఆలోచించే తీరూ వేరు. మితవాద కెరటంపై మోదీ విజయలక్ష్యం చేరుకున్న విధంగానే ట్రంప్‌ కూడా అన్ని అంచనాలనూ తల్లకిందులు చేసి హిల్లరీని ఓడించి విజయఢంకా మోగించారు. స్వతహాగా రాజకీయవేత్త కారు కనుక ట్రంప్‌ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టం.

అ«ధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చైనాపైన దుమ్మెత్తి పోసిన ట్రంప్‌ శ్వేతభవనంలోకి మారిన తర్వాత చైనాతో స్నేహంకోసం అర్రులు చాచడం చూశాం. ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ వాషింగ్టన్‌ వెళ్ళినప్పుడు అత్యంత సాదరంగా స్వాగతం చెప్పడమే కాకుండా తనకూ, జీ జిన్‌పింగ్‌కూ మధ్య స్నేహరసాయనిక ప్రక్రియ సంభవించిందంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అణ్వస్త్రాలు ప్రయోగిస్తానంటూ అమెరికాను బెదిరిస్తున్న ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి చైనాను వినియోగించుకోవాలని ట్రంప్‌ ఎత్తుగడ. చైనా అందుకు పూర్తిగా సహకరించడం లేదని అసంతృప్తి.

ఎవరి ప్రయోజనాలు వారివి
ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికి ఉంటాయి. భారత్‌కు అనుకూలమైన నిర్ణయాలు అమెరికా తీసుకోవాలని మోదీ కోరుకుంటారు. అమెరికా బంటుగా ఇండియా ఉండాలని ట్రంప్‌ ఆశిస్తారు. ట్రంప్‌ను మోదీ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఇద్దరూ మూడుసార్లు ఫోన్‌లోనే మాట్లాడుకున్నారు. మోదీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తున్నది. ట్రంప్‌ వచ్చాక ఒక విదేశీ ప్రముఖుడికి శ్వేతభవనంలో విందు (డిన్నర్‌) ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇద్దరూ మొత్తం అయిదు గంటలు కలిసి ఉంటారు. ముందు ఇద్దరే మాట్లాడుకుంటారు.

తర్వాత రిసెప్షన్‌. ప్రతినిధి బృందాల చర్చ. అనంతరం ప్రకటనలు చేయడం. తర్వాత డిన్నర్‌. చర్చలు ఏయే అంశాలపైన జరుగుతాయి? చైనాకు పోటీగా ఇండియాను ముగ్గులో దించాలని అమెరికా ప్రయత్నిస్తుంది. అఫ్ఘానిస్తాన్‌లో భారత్‌ సైనిక ప్రమేయం పెట్టుకొని ఆ మేరకు తన భారం తగ్గించాలని అగ్రరాజ్యం కోరుకుంటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపైన పోరాటంలో సంపూర్ణ సహకారం అందించాలని అభిలషిస్తుంది. ఐఎస్‌ నడ్డి విరగకొట్టడం ట్రంప్‌ లక్ష్యం. అందుకు ఇండియా తోడ్పడాలని ఆయన ఆశిస్తారు. ఉగ్రవాదంపైన సహకరించడానికి ఇండియాకు అభ్యంతరం ఉండదు.

చైనాతో శత్రుత్వం ఇప్పటికే ఉంది. కొత్తగా కొనితెచ్చుకోవడం ఇష్టం ఉండదు. ఆఫ్ఘానిస్తాన్‌లో పార్లమెంటు భవనం కట్టించాం. విద్యారంగంలో సహకరిస్తున్నాం. 300 కోట్ల డాలర్ల మేరకు ఆ దేశానికి ఆర్థిక సాయం చేయడానికి ఒప్పుకున్నాం. అంతకు మించి ముందుకు సాగడం, సైనిక ప్రమేయం పెట్టుకోవడం భారత ప్రయోజనాలకు హానికరం. ఇవన్నీ ఆచితూచి నిర్ణయం తీసుకోవలసిన కీలకమైన అంశాలు. అన్నిటికీ మించి అమెరికా పాకిస్తాన్‌ విషయంలో మరింత స్పష్టమైన వైఖరి అవలంబించాలనీ, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్‌ను వ్యతిరేకించాలనీ, పాకిస్తాన్‌ను నిలువరించాలనీ ఇండియా కోరుతోంది.

ఇండియానూ, పాకిస్తాన్‌నూ ఒకేగాట కట్టబోమనీ, ఆ విధానానికి స్వస్తి చెబుతామనీ అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్‌ పాకిస్తాన్‌ పట్ల కరకుగా వ్యవహరించే సూచనలు ఉన్నాయి. పైలట్‌ లేకుండా నడిచే గార్డియన్‌ డ్రోన్‌ విమానాలను ఇండియాకు విక్రయించడానికి ఒబామా అనుమతి ఇవ్వలేదు. దక్షిణాసియాలో బలాబలాలు మారిపోతాయనీ, పాకిస్తాన్‌ కంటే ఇండియాది పైచేయి అవుతుందనీ ఒబామా సంకోచించారు. కానీ ట్రంప్‌ 22 గార్డియన్‌ డ్రోన్‌ల విక్రయానికి అంగీకరించారు. వీటి విలువ 200 కోట్ల డాలర్లు. నాటో కూటమిలో లేని దేశానికి ఈ డ్రోన్‌లు విక్రయించడం ఇదే మొదటిసారి. ఈ విమానం 35 గంటల పాటు ఏకధాటిగా ఆకాశంలో ఎగరగలదు. సముద్రాల గస్తీలో నావికాదళానికి ఈ విమానాలు ఉపయోగపడతాయి.

అత్యాశ పనికిరాదు
అమెరికాను సవాలు చేస్తున్న ఉత్తర కొరియాపైన ఆంక్షలు విధించాలన్న ఐక్యరాజ్య సమితి నిర్ణయాన్ని భారత్‌ సమర్థించింది. హంగరీ, వియత్నాంపైన అమెరికా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఇండియా దౌత్యనీతిలో కాలక్రమేణా గణనీయమైన మార్పు వచ్చింది. పీవీ హయాంలో ఇజ్రేల్‌ను ఇండియా గుర్తించింది. వచ్చే నెల మోదీ ఇజ్రేల్‌కు వెడుతున్నారు. ఇజ్రేల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ అవుతారు. అంతగా మారింది భారత విదేశాంగ విధానం. ఇండియాని శత్రుదేశంగా 1948 నుంచి 1984 వరకూ పరిగణించిన అమెరికా ఇప్పుడు ఆప్తమిత్రదేశంగా సంభావిస్తున్నది. అలీన విధానమంటూ, సోషలిస్టు వేదిక అంటూ అమెరికాను వ్యతిరేకించడమే విదేశాంగ విధానంగా వ్యవహరించిన ఇండియా ఇప్పుడు అమెరికాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నది.

మారిన పరిస్థితులు రెండు దేశాలనూ దగ్గరికి చేర్చాయి. రెండు చోట్లా ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడటం, మార్కెట్‌ ఏకానమీ తిరుగులేని విధానంగా చెలామణి కావడంతో భారత్, అమెరికాలు చేరువ కావడానికి మార్గం సుగమం అయింది. దూరదృష్టితో ఈ మార్గాన్ని శాశ్వత రహదారిగా మార్చడానికి అవసరమైన చొరవ, సృజన ఇద్దరు నేతలూ ప్రదర్శిస్తే హెచ్‌1–బి వీసాల వ్యవహారంలో ట్రంప్‌ వైఖరి క్రమంగా మారుతుందని భావించవచ్చు.

ఇప్పటికైతే ఈ అంశంపైన చర్చకు ఆస్కారం లేదని శ్వేతభవనం అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్‌ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించిన భారతీయుడు కుల్‌భూషణ్‌ యాదవ్‌ను విడిచి పెట్టవలసిందిగా పాకిస్తాన్‌పైన ఒత్తిడి తేవాలని నరేంద్రమోదీ ట్రంప్‌ను కోరవచ్చు. ఇచ్చిపుచ్చుకోవడమే దౌత్యం. మనం ఏమి ఇవ్వడానికి అంగీకరిస్తామో అమెరికా నుంచి అంతే ఆశించాలి. అంతకంటే మించి రాబట్టాలనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే మోదీ అమెరికా పర్యటన నుంచి అద్భుతాలు ఆశించకూడదు.

కె. రామచంద్రమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement