చంద్రబాబును వదిలి రామోజీ దగుల్బాజీ రాతలు | Ramoji Rao again publish baseless story on emmar | Sakshi
Sakshi News home page

చంద్రబాబును వదిలి రామోజీ దగుల్బాజీ రాతలు

Published Thu, May 1 2014 12:04 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

చంద్రబాబును వదిలి రామోజీ దగుల్బాజీ రాతలు - Sakshi

చంద్రబాబును వదిలి రామోజీ దగుల్బాజీ రాతలు

ఎమ్మార్ వ్యవహారంపై మళ్లీ విషం కక్కిన ‘ఈనాడు’
ఆది నుంచీ చక్రం తిప్పిన బాబు పేరు కూడా రాయని తీరు
ఎమ్మార్ ప్రాజెక్టు బిడ్‌లను 2001లోనే ఆహ్వానించిన బాబు
ఐదు సంస్థలు రాగా వాటిలో రెండింటి తిరస్కరణ
మిగిలిందల్లా ఎమ్మార్, ఐఓఐ, ఎల్ అండ్ టీ సంస్థలే
చివరితేదీ నాటికి ఎమ్మార్ మినహా మిగతా రెండూ వెనక్కి
ఐఓఐ ఇండియా సంస్థ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది
దానికి హైటెక్‌సిటీ రెండోదశ, జెమ్స్ అండ్ జువెలరీ పార్క్ అప్పగింత
ఎల్ అండ్ టీకి హైటెక్‌సిటీ, కాకినాడ పోర్టు సహా విలువైన ప్రాజెక్టులు
ఎమ్మార్ తరఫున డీల్ చేసిన కోనేరు ప్రసాద్‌తో అప్పటికే  చంద్రబాబుకు సంబంధం
దీనికిచ్చిన 535 ఎకరాల సమీపంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి భూమి ఎకరా రూ.కోటికి అమ్మకం
ఎమ్మార్‌కు మాత్రం ఎకరా రూ.29 లక్షలకే అప్పగింత
ఇన్ని చేసిన బాబు పేరును ప్రస్తావించకుండా రామోజీ కథనాలు
నవ్విపోతున్న జనం.. పట్టించుకోకుండా దిగంబర రాతలు

 
మరీ ఇంత దగుల్బాజీతనమా? ‘‘వందల కోట్ల విల్లాసం.. యావజ్జీవ శిక్షకు అవకాశం’’ అంటూ కోనేరు రాజేంద్రప్రసాద్ గురించి పాంచజన్యంలో అంత గట్టిగా ఊదినప్పుడు... ఆ వ్యవహారంలో చంద్రబాబు నాయుడి పాత్ర గురించి చెప్పరేం? టెండర్ల నుంచి దుబాయ్ అలబ్బర్‌ను ఇక్కడికి రప్పించటం మొదలు... భూముల్ని కట్టబెట్టడం దాకా బాబు చేసిన బాగోతాన్ని ఒక్క ముక్క కూడా రాయరెందుకు? ‘‘ఈయనకు యావజ్జీవం పడుతుంది’’ అనే బెదిరింపు ఓటర్లను భయపెట్టడానికి కాదా? అసలు రామోజీపై కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నిట్లో గనక వ్యతిరేక తీర్పు వస్తే వాటిని అనుభవించడానికి రామోజీకి ఒకటి రెండు జీవితాలు సరిపోతాయా? ఎన్ని పదుల జీవితాలు కావాలి? చాలా కేసుల్లో సాంకేతిక చంద్రబాబు కనక సాంకేతిక కారణాలతో తప్పించుకోకపోతే ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉండేవారు కాదా? అసలు ఎన్నికల బరిలో నిలిచే అర్హత ఉండేదా? ఈ వ్యవహారంలో బాబు పాత్ర మీకు కనిపించలేదా?..

బాబు హయాంలో జరిగిందిదీ...
దేశంలో ఎక్కడా లేనట్లు ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలనుకున్నారు 2000వ సంవత్సరంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు. టౌన్‌షిప్ అంటే జనం ఉండేదేమీ కాదు. 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్... చుట్టూ శ్రీమంతుల విల్లాలు... ఫైవ్‌స్టార్, బిజినెస్ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో సమావేశ మందిరం. ఇదీ టౌన్‌షిప్ స్వరూపం.

2000 మార్చిలో ఏపీఐఐసీ ప్రకటన ఇచ్చింది. కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఐటీసీ, ఈఐహెచ్ లిమిటెడ్‌లను షార్ట్‌లిస్ట్ చేశారు. రెండిటికీ ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) పత్రాలు పంపగా ఐటీసీ ఒక్కటే స్పందించింది. మణికొండ, హుస్సేన్‌సాగర్ రెండుచోట్లా భూములు కేటాయిస్తే ప్రాజెక్టును రెండు చోట్లా చేపడతామని పేర్కొంది. కానీ మణికొండ వద్ద మాత్రమే భూమి కేటాయిస్తామని చెప్పిన బాబు  ప్రభుత్వం... ఆ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది.

2001 జూలై 6న ఏపీఐఐసీ ద్వారా మరో నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి స్పందించి... దుబాయ్‌కి చెందిన ఎమ్మార్, మలేసియాకు చెందిన ఐఓఐ ప్రాజెక్ట్స్, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ... ముందుకొచ్చాయి. ఎందుకనో సోమ్ ఏసియాను, షాపూర్జీ పల్లోంజీని బాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సెప్టెంబర్ 26న మిగిలిన మూడింటినీ ఆర్‌ఎఫ్‌పీకి అర్హమైనవిగా ప్రకటించింది. టెండర్లకు ఆఖరుతేదీ 2001 డిసెంబర్ 15 కాగా... చిత్రంగా ఐఓఐ, ఎల్ అండ్ టీ వెనక్కెళ్లిపోయాయి. ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. పోటీ లేకుండా సింగిల్ టెండరుంటే దాన్ని రద్దు చేసి మళ్లీ పిలుస్తారు. కానీ బాబు ప్రభుత్వం అలా చేయలేదు.

ఎమ్మార్‌కే ప్రాజెక్టు కట్టబెట్టేసింది. ప్రభుత్వానికి చెందిన 445 ఎకరాలతో పాటు మరో 80 ఎకరాల్ని రైతుల నుంచి సేకరించి మరీ... మొత్తం 535 ఎకరాలిచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అది కూడా కేవలం ఎకరా రూ.29 లక్షల చొప్పున. ఇక్కడ గమనించాల్సింది మరొకటుంది. ఎమ్మార్‌కు కేటాయించిన స్థలానికి సమీపంలోనే బాబు కుటుంబానికి మూడెకరాల స్థలం ఉంది. దాన్ని ఎమ్మార్‌తో ఒప్పందానికి మూడేళ్ల ముందే బాబు ఎకరా రూ.కోటి చొప్పున రెడ్డీ ల్యాబ్స్‌కు విక్రయించారు. మరి సొంత స్థలాన్ని మూడేళ్ల ముందే ఎకరా కోటి రూపాయలకు అమ్మిన బాబు... ఎకరా విలువ రూ.4 కోట్లు పలుకుతున్న సమయంలో ప్రభుత్వ స్థలాన్ని కేవలం రూ.29 లక్షల చొప్పున ఎందుకిచ్చేశారు? ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయి?

ఆ రెండూ బినామీ సంస్థలే...
ఇక్కడ మరొకటి కూడా గమనించాలి. చివరి నిమిషంలో టెండర్లు వేయకుండా వెనక్కెళ్లిపోయిన సంస్థలు రెండూ బాబుకు అత్యంత సన్నిహితమైనవి. ఎల్ అండ్ టీని చూస్తే  రాష్ట్రంలో హైటెక్ సిటీ నుంచి కాకినాడ పోర్టు వరకూ బాబు కట్టబెట్టిన ప్రాజెక్టులన్నీ దానికే. టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను అది ఉచితంగా నిర్మించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక ఐఓఐ ప్రాజెక్ట్స్ (ఇండియా) చూసుకున్నా అది బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది. ఆయనకు బంజారాహిల్స్‌లో అత్యంత విలువైన ఐదెకరాల్ని జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ పేరిట కారు చౌకగా బాబు కట్టబెట్టారు. పెపైచ్చు హైటెక్ సిటీ రెండోదశనూ సురేష్‌కు చెందిన ఫినిక్స్ ప్రాజెక్ట్స్‌కే అప్పగించారు. అదీ కథ.

250 నుంచి 535 ఎకరాలకు పెంపు
ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఆసక్తి అంతా ఇంతా కాదు. 2001లో ఏపీఐఐసీ ప్రకటనలు జారీ చేసినపుడు కూడా మణికొండలోని 250 ఎకరాలనే ప్రతిపాదించారు. ఆ భూములపై నాటికి హైకోర్టు స్టే కూడా ఉంది. కానీ బాబు చొరవతో 2001 జూలై 11న స్టే తొలగటం, ఆ మర్నాడే పత్రికల్లో ప్రకటనలివ్వటం జరిగిపోయాయి.

నిబంధనల ప్రకారం ఆగస్టు 2, 3 తేదీల్లో ఈ ప్రకటనల్ని జతపరుస్తూ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి ఏపీఐఐసీ నోట్‌ఫైళ్లు పంపింది. ఆ వెంటనే భూమి 250 ఎకరాలు కాకుండా 500 ఎకరాలకు పెంచాలని ఏపీఐఐసీకి ఆదేశాలందాయి. నిబంధనల ప్రకారం వెళుతున్న అధికారులకు అనుమానం వచ్చింది. చీఫ్ సెక్రటరీని అడిగారు. దీంతో ఆయన తనకు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పంపిన నోట్‌ను వాళ్లకు పంపారు. దాన్లో ఏముందంటే... ‘‘చీఫ్ సెక్రటరీ గారూ! ఈ విషయం పరిశీలించండి. ఈ ఉదయం దీనిపై సీఎం నాతో మాట్లాడారు. మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆ నోట్లో ఉంది.

చేసేదేమీ లేక ఏపీఐఐసీ మరో సవరణ ప్రకటన జారీ చేసింది. దాన్లో భూమిని 535 ఎకరాలకు పెంచింది. అసలు భూమిని పెంచమని ఎవరడిగారు? టెండర్లు వేసిన సంస్థలు ఎక్కువ భూమి కావాలన్నాయా? ఏపీఐఐసీ ఏమైనా ప్రతిపాదించిందా? అలాంటిదేమీ లేనపుడు చంద్రబాబు ఎందుకంత ఆసక్తి చూపించారు? 500 ఎకరాలైతే ముడుపులు డబుల్ అవుతాయనా? దీన్ని రామోజీ రాయరెందుకు?

ఏపీఐఐసీ వాటాకు ఆదిలోనే గండి!
రైతుల నుంచి సేకరించి మరీ ఎమ్మార్‌కు 535 ఎకరాల భూమిని అప్పగించిన చంద్రబాబు... వాటాల్లోనూ చేతివాటం చూపించారు. 535 ఎకరాల్లో... హోటల్, కన్వెన్షన్ సెంటర్లకు 15, గోల్ఫ్‌కోర్సుకు 200, విల్లాలకు 285 ఎకరాలు కేటాయించారు. అయితే 15 ఎకరాల హోటల్, కన్వెన్షన్ సెంటర్లో ఏపీఐఐసీ వాటాను 49 శాతంగా ఉంచి... 520 ఎకరాలిచ్చిన గోల్ఫ్‌కోర్స్, విల్లాల ప్రాజెక్టులో మాత్రం 26 శాతానికే పరిమితం చేశారు చంద్రబాబు. ఇది చాలు బాబు కుట్ర బయటపెట్టడానికి!! లాభాలొచ్చే రియల్ ఎస్టేట్‌కు అనుమతించిన 285 ఎకరాల్లో ఏపీఐఐసీ వాటాను 26 శాతమే ఎందుకు ఉంచారు? ఎన్ని కోట్లు ముడుపులు తీసుకున్నారు?

కొలాబరేషన్‌తో కొల్లగొట్టిందీ బాబే!
భూమిని ఎమ్మార్‌కు కట్టబెట్టేశాక... ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాక... 2003 ఆగస్టు 19న కొలాబరేషన్ అగ్రిమెంట్ తెరపైకి వచ్చింది. ఈ కొలాబరేషన్ ఒప్పందమే కుంభకోణానికి మూలమని విజిలెన్స్ నివేదిక స్పష్టంగా చెప్పింది కూడా. మరి ఇదంతా జరిగింది బాబు హయాంలో అయితే రామోజీ అస్సలు ఆ ప్రస్తావనే ఎందుకు చేయటం లేదు? దీన్నిబట్టే అర్థం కావటం లేదా ఈ ఎల్లో కుట్ర?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement