సంస్కరణ అనివార్యం | Reform that you may preserve | Sakshi
Sakshi News home page

సంస్కరణ అనివార్యం

Published Sun, Oct 18 2015 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

సంస్కరణ అనివార్యం

సంస్కరణ అనివార్యం

త్రికాలమ్
చట్టసభలలో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయో అందరికీ తెలుసు. అవినీతి, బంధుప్రీతి, అసమర్థత, అరాచకం వంటి అవలక్షణాలు పెచ్చరిల్లడం చూస్తున్నాం. న్యాయవ్యవస్థలోనూ చీకటి కోణాలు లేకపోలేదు.
 
‘సంస్కరించుకుంటేనే మనుగడ’ (Reform that you may preserve). సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ధర్మాసనంలోని తోటి న్యాయ మూర్తులకు ఇచ్చిన సలహా ఇది. న్యాయమూర్తుల నియామకాల జాతీయ సంస్థ (నేషనల్ జ్యుడీషియల్ అప్పాయెంట్‌మెంట్స్ కమిషన్-ఎన్‌జేఏసీ) ఏర్పా టునూ, దానికి వీలు కల్పించిన 99వ రాజ్యాంగ సవరణనూ కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారంనాడు ఇచ్చిన చారిత్రక తీర్పుతో విభేదించిన జస్టిస్ చలమేశ్వర్ లార్డ్ మెకాలేనూ ఉటంకిస్తూ ఈ హితవాక్యం చెప్పారు. 1831లో బ్రిటిష్ కామన్స్ సభలో రాజకీయ సంస్కరణల కోసం, పేదవారికి ఓటు హక్కు కోసం వాదిస్తూ పార్లమెంటు మనుగడ కొనసాగాలంటే తాను ప్రతిపాదిస్తున్న సంస్కరణలను అమలు చేయాలని లార్డ్ మెకాలే ఉద్ఘాటించాడు.
 
జస్టిస్ జేఎస్ ఖేహార్ నాయకత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో తక్కిన నలుగురు న్యాయమూర్తులతో ఏకీభవించలేనంటూ జస్టిస్ చలమేశ్వర్ చేసిన వాదనను అందరూ ఆమోదించకపోవచ్చును. కానీ ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తులను నియమించే ప్రక్రియను సంస్కరించుకోవలసిన అగత్యం ఉన్నదనే విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. ధర్మాసనం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నవారు ఎంతమంది ఉన్నారో తప్పుపడుతున్నవారూ అంతేమంది ఉన్నారు. 1993 నుంచీ అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నదని అంగీకరించేవారు సైతం ఎన్‌జేఏసీని పూర్తిగా ఆమోదించడం లేదు.
 
నరేంద్రమోదీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణ అమలు కాకుండా అడ్డుకోవడంలో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దత్తు పాత్రా లేకపోలేదు. తన ముందున్న వ్యాజ్యాలు పరిష్కార మయ్యే వరకూ ఎన్‌జేఏసీలో పనిచేసే సావకాశం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఆరు మాసాలుగా న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోయినాయి. ఉన్నత న్యాయస్థానాలలో 392 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి. పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత న్యాయవ్యవస్థదేననీ, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని అనుమతిస్తే 1976 నాటి ఆత్యయిక పరిస్థితి వంటి దుస్థితి మళ్ళీ దాపురించే ప్రమాదం ఉన్నదనీ న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది.
 
కీలకమైన అధికారం
న్యాయమూర్తుల నియామకం అన్నది అత్యంత కీలకమైన అంశం. న్యాయ వ్యవస్థ ప్రమాణాలు ఈ నియామకాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇందులో రాజకీయ ప్రమేయాన్ని అనుమతిస్తే న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని న్యాయమూర్తుల వాదన. రెండు దశాబ్దాలకు పైగా కొలీజియం ద్వారా జరుగుతున్న నియామకాలన్నీ సవ్యంగానే ఉన్నాయా? కొలీజియం రాకముందు (1993 కంటే ముందు) జరిగిన నియామకాలన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయా? అవునని కానీ కాదని కానీ ఈ రెండు ప్రశ్నలకూ సమాధానం చెప్పడం సాధ్యం కాదు. కొలీజియం రాకముందు జస్టిస్ భగవతి, కృష్ణయ్యర్, చంద్రచూడ్ వంటి ప్రతిభావంతులైన న్యాయ మూర్తుల నియామకాలు జరిగాయి. కొలీజియం వచ్చిన తర్వాత లాలూచీ పడే న్యాయమూర్తుల నియామకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.
 
కొలీజియంలో లోపాలున్నాయని జస్టిస్ చలమేశ్వర్ ఒక్కరే కాదు ధర్మాసనం తీర్పుతో ఏకీభవించిన జస్టిస్ కురియన్ జోసెఫ్ సైతం అంగీకరించారు. కొలీజియం వ్యవస్థను సంస్కరించడానికి సలహాలు ఇవ్వవలసిందిగా ధర్మాసనం విజ్ఞప్తి చేసింది. కొలీజియం వ్యవస్థలో ఆశ్రీత పక్షపాతం, బంధు ప్రీతి ప్రబలినాయనే ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించడం, ఒకసారి తిరస్కరించిన పేరును తరువాత ఆమోదించడం వంటి చేదు అనుభవాలు ఉన్నాయి. పైగా కొలీజియం శైలిలో పాదర్శకత లేదు. ప్రభుత్వ ప్రమేయం అంతగా లేదు.

న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే ఆనవాయితీ ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. మన రాజ్యాంగ నిర్మాతలు ఆదర్శంగా భావించి అనుకరించిన బ్రిటన్, అమెరికాల రాజ్యాంగాలలోనూ ఈ వెసులుబాటు లేదు. బ్రిటన్‌లో 15 మంది సభ్యుల వ్యవస్థ న్యాయమూర్తులను నియమిస్తుంది. వీరిలో అయిదుగురు మాత్రమే న్యాయవ్యవస్థ ప్రతినిధులు. తక్కినవారు ప్రభుత్వ, పౌరసమాజ ప్రతినిధులు. అమెరికాలో న్యాయ మూర్తులను అధ్యక్షుడు నియమిస్తాడు. వారి పూర్వాపరాలను సెనెట్ కమిటీలు తవ్వితీసి చిత్రిక పట్టిన తర్వాతనే నియామకాలకు ఆమోదం లభిస్తుంది.
 
1976 నుంచి మన దేశంలో న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ జోక్యం పెరిగిన మాట వాస్తవం. రాజ్యాంగ సవరణలను కొట్టివేసే అధికారం న్యాయ వ్యవస్థకు లేదంటూ 1981లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగింది. దిగువ కోర్టులో శిక్ష పడినా ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకుంటే చట్టసభల సభ్యులుగా కొనసాగడానికి అభ్యంతరం లేదని శాసనం తెచ్చే వరకూ రాజకీయ నాయకత్వం వెళ్ళింది. 1967లో గోలక్‌నాథ్-పంజాబ్ ప్రభుత్వం కేసులోనూ, 1973లో కేశవానందభారతి కేసులోనూ పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని నిర్ధారించింది.
 
తన ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఇందిరాగాంధీ న్యాయవ్యవస్థను అదుపులో పెట్టుకునేందుకు కమిటెడ్ జ్యుడీషియరీ (నిబద్ధత కలిగిన) విధానం అనుసరించారు. ఎవరి పట్ల నిబద్ధతో చెప్పనక్కరలేదు. తనకు ఇష్టం లేని సీనియర్ న్యాయమూర్తులను పక్కన పెట్టి నాలుగో స్థానంలో ఉన్న న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని కట్టబెట్టడంతో న్యాయవ్యవస్థ బీటలు వారింది. ‘మిమ్మల్ని వొంగమంటే మీరు సాగిల పడి నేలమీద పాకారు’ అంటూ ఎమర్జెన్సీలో పాత్రికేయులు వ్యవహరించిన తీరును బీజేపీ నేత లాల్‌కృష్ణ అడ్వానీ ఆక్షేపించారు. నిజానికి న్యాయమూర్తులూ, ప్రభుత్వ ఉన్నతాధికారులూ అదే పని చేశారు. ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడింది ప్రధానంగా రాజకీయ వ్యవస్థే.
 
కొనసాగుతున్న ఘర్షణ
ఇందిర హయాంలో ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య ప్రారంభమైన సంఘర్షణ ఇప్పటికీ ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగ సవరణలు సుప్రీంకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నీరు కార్చేందుకు పార్లమెంటు శాసనం చేసిన సందర్భం కూడా ఉన్నది. 1985లో విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిష్ఫలం చేసే విధంగా రాజీవ్‌గాంధీ హయాంలో పార్లమెంటు చట్టం చేసింది (ఇటీవల వొడా ఫోన్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయానికి విరుద్ధంగా పార్లమెంటు చట్టం తెచ్చింది).  న్యాయవ్యవస్థలో ప్రభుత్వ జోక్యాన్ని అరికట్టేందుకు జస్టిస్ వర్మ 1993లో కొలీజియం వ్యవస్థను రూపొందించారు. ఈ ప్రక్రియలోనూ లోపాలు ఉన్నాయని భావించిన యూపీఏ ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ, అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండాలనీ ప్రతిపాదించింది. దాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం కొనసాగించింది. 99వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించాయి.
 
ఇరవై రాష్ట్రాల శాసనసభలూ సరేనన్నాయి. అంటే దేశ ప్రజలలో అత్యధికులు ఏకగ్రీవంగా కొత్త వ్యవస్థకు ఆమోదం చెప్పారని భావించాలి. అయినా సరే 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక లక్షణాలకు విరుద్ధంగా ఉన్నదంటూ ధర్మాసనం తీర్పు చెప్పి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. కొత్త విధానంలో ధర్మాసనం ఎత్తి చూపిన లోపాలు ఏమిటి? 99వ రాజ్యాంగ సవరణ ఫలితంగా 124 (ఎ) వ అధికరణలో చోటు చేసుకున్న మార్పులను అనుసరించి ఏర్పాటు చేయవలసిన ఎన్‌జేఏసీలో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయశాఖ మంత్రితో పాటు ఇద్దరు పౌరసమాజం ప్రతినిధులు ఉంటారు. ఈ సంస్థ న్యాయమూర్తులను నియమిస్తుంది. ఈ వ్యవస్థలో కొట్టవచ్చినట్టు కనిపించే లోపాలు రెండు.
 
దేశంలో అతి పెద్ద కక్షిదారు (లిటిగెంటు) ప్రభుత్వమే. న్యాయ స్థానాలు విచారించే కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైనవే ఎక్కువ. అటువంటి కేసులను విచారించే న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి న్యాయశాఖ మంత్రి ఉండటం సబబేనా? పౌరసమాజానికి ప్రాతినిధ్యం వహించే ఇద్దరు ప్రముఖులకు వీటో హక్కు ఇవ్వడం సముచితమేనా? ఈ రెండు ప్రశ్నలకూ కాదనే సమాధానం. కొలీజియం పద్ధతిలో ఎవరిని న్యాయమూర్తులుగా నియమించవచ్చునో సిఫార్సు చేసిన తర్వాత అంతిమ నిర్ణయం రాష్ట్రపతిది. ఎన్‌జేఏసీలో రాష్ట్రపతిని పక్కన పెట్టినట్టే కనిపిస్తుంది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలసి ఇద్దరు పౌరసమాజం ప్రతినిధులను ఎన్నుకోవాలి. ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉన్నదో వారికి ఇష్టమైన వ్యక్తులే పౌరసమాజం ప్రతినిధులుగా ఎంపిక అవుతారు.
 
నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్‌ను కానీ హక్కుల నేత అరుణారాయ్‌ని కానీ లేక అరుంధతీరాయ్‌ని కానీ పౌరప్రతినిధులుగా ఎన్‌డీఏ ప్రభుత్వం ఆమోదిస్తుందా? సానుకూలమైన వ్యక్తులకే అవకాశం ఉంటుంది. ఆరుగురు సభ్యులలో అధికార పార్టీ లేదా కూటమికి చెందినవారు ముగ్గురు ఉంటారు. న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి కంటే ప్రధానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇది కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే. 217 అధికరణ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన మీదట న్యాయమూర్తులను నియమించాలి. ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలనడం, ఆ పదవికి అంతటి ప్రాధాన్యం ఇవ్వడం అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు సహజంగానే ఇష్టం ఉండదు.
 
న్యాయవ్యవస్థకు సంపూర్ణ స్వాతంత్య్రం ఉండాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. చట్టసభలూ, పాలనావ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల, బాధ్యతల పంపిణీలో సమతౌల్యం చెక్కుచెదరకుండా ఉండాలనీ, ఒక వ్యవస్థపైన మరో వ్యవస్థ పెత్తనం చెలాయించే పరిస్థితి ఉండరాదనీ ఉద్దేశం. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించే బాధ్యత తమ భుజస్కంధాలపైనే ఉన్నదని న్యాయమూర్తులు భావిస్తున్నారు. తమ బాధ్యతేనని చట్టసభల సభ్యులు భావిస్తున్నారు. పేచీకి ఇదే మూలం.
 
దొందూ దొందే
చట్టసభలలో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయో అందరికీ తెలుసు. అవినీతి, బంధుప్రీతి, అసమర్థత, అరాచకం వంటి అవలక్షణాలు పెచ్చరిల్లడం చూస్తున్నాం. న్యాయవ్యవస్థలోనూ చీకటి కోణాలు లేకపోలేదు. కొన్నేళ్ళ కిందట కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో ఒక అసాధారణమైన అఫిడవిట్ దాఖలు చేశారు. అంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పని చేసిన పదహారు మందిలో ఎనిమిది మంది అవినీతిపరులని ఆరోపిస్తూ, అటువంటి వ్యాఖ్య చేసినందుకు న్యాయస్థానం ఏ రకమైన శిక్షాత్మక చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ప్రకటించారు. అనంతరం ఆరుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పేర్లు చెప్పి వారందరిపైనా అవినీతి ఆరోపణలు నిరూపించే ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ శాంతిభూషణ్ కుమారుడు ప్రశాంతిభూషణ్ మరో అఫిడవిట్ దాఖలు చేశారు.
 
సర్వోన్నత న్యాయం స్థానం మౌనాన్ని ఆశ్రయించిందే కానీ తండ్రీకొడుకులపైన కోర్టు ధిక్కారనేరం కింద చర్యలు తీసుకునే సాహసం చేయలేదు. అందుకే కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించడాన్ని న్యాయ వాదులు సైతం వ్యతిరేకిస్తున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సి) వంటి సంస్థకు న్యాయమూర్తుల నియామకం బాధ్యతను అప్పగించడమే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం. నియామకాలపైన మాత్రమే కాదు న్యాయమూర్తుల నడవడిక మీదా, వారు ఇచ్చే తీర్పుల మంచిచెడ్డల మీదా ఉన్నత స్థాయి సంఘం ఒకటి నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి. ప్రలోభాలకు లోనై అడ్డగోలు తీర్పు చెప్పిన న్యాయమూర్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉండాలి. చట్టాలకు ఎవ్వరూ అతీతులు కారనీ, చట్టం ఎదుట అందరూ సమానమేననే విశ్వాసం జనసామాన్యంలో బలపడినప్పుడే చట్టపాలన పట్ల గౌరవం పెరుగుతుంది.

కె.రామచంద్రమూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement