సమతకు సరైన బాట ‘కోటా’ | SC, ST quota for Samatha | Sakshi
Sakshi News home page

సమతకు సరైన బాట ‘కోటా’

Published Thu, Sep 10 2015 1:00 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

సమతకు సరైన బాట ‘కోటా’ - Sakshi

సమతకు సరైన బాట ‘కోటా’

రైల్వేలో ఎస్సీ, ఎస్టీలు కీలక స్థానాల్లో ఉన్న విభాగాలు, జోన్ల పనితీరులో మెరుగుదల ఉన్నట్టు 2005 నాటి అధ్యయనం నిర్ధారించింది. ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చిన వారు తమ శక్తి సామర్థ్యాలను చాటడానికి కృషి చేయడం వల్లే మంచి ప్రగతిని, ఫలితాలను సాధించారని తేలింది. ప్రవేశ పరీక్షల్లో క్వాలిఫై కాలేక కోట్లు గుమ్మరించి సీట్లు కొనుక్కున్న  వాళ్లకు ప్రతిభ ఉన్నట్టా? లేనట్టా? కోటాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు విద్యాలయాల్లో ప్రవేశిస్తూ ప్రతిభను దెబ్బ తీస్తున్నారని వాదించే వాళ్ళకు కోట్లు పోసి సీట్లు కొనుక్కునే వారి ‘ప్రతిభ’ కనిపించదేం?
 
 నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా జోరున కురుస్తున్న వాన... అయి నా గ్యాంగ్‌మన్ చంద్రయ్య ఆగలేకపోయాడు. క్షణం తటపటాయిస్తే పది హేను వందల ప్రాణాలకు ముప్పు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి, పట్టాలు గాలిలో వేళ్ళాడుతున్నాయి. రాబోయే గోదా వరి ఎక్స్‌ప్రెస్‌ని నిలిపేయకపోతే... ఏమవుతుందో ఊహించలేకపోయాడు. ఆ వానలో, వరదలో తానే పోతే తన కుటుంబం ఏమౌతుందని క్షణమైనా ఆలోచించలేదు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను ఆపి, వందల ప్రాణాలు కాపాడాడు. కానీ... ఆ పట్టాలపైనే చంద్రయ్య ప్రాణాలు వదిలాడు. 2005లో పదిహేను వందల మందికి ప్రాణభిక్ష పెట్టిన గ్యాంగ్‌మన్ చంద్రయ్య దళితుడు. అంకిత భావంతో రైల్వేలో పనిచేస్తున్న లక్షలాది మంది అణగారిన వర్గాల ప్రతినిధి.
 
 ఆరేళ్ల క్రితం ఢిల్లీ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ అశ్వని దేశ్‌పాండే, అమెరికాకు చెందిన మిచిగాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్ వెస్సికాఫ్‌లు ‘రైల్వే పనితీరుపై రిజర్వేషన్ల ప్రభావం’ అనే అంశంపై అధ్యయనం చేశారు. రైల్వేలోని అన్ని డివిజన్లలోని వివిధ విభాగాలలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పనితీరుపై, రైల్వేల పురోగతిపై... రిజర్వేషన్ల వ్యతిరే కుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ వారీ అధ్యయ నాన్ని సాగించారు. ఆ అధ్యయనం 1952- 2002 మధ్య కాలానికి చెందినది. రిజర్వేషన్లు దేశాభివృద్ధిని, ప్రతిభను దిగజారుస్తున్నాయనే విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జరిగినది.
 
 ఎస్సీ, ఎస్టీలు కీలక స్థానాల్లో ఉంటే...
 రైల్వే ఉద్యోగులను వారు ఏ, బీ, సీ, డీ అనే నాలుగు కేటగిరీలుగా విభజిం చారు. ఉన్నతస్థాయి అధికారులది ఏ కేటగిరీ. అందులో ఎస్సీలు 12.12%, ఎస్టీలు 7.40%, ఇతరులు 80.42% ఉన్నారు. బీ కేటగిరీలో ఎస్సీలు 12.4%, ఎస్టీలు 7.21%, ఇతరులు 75.65% ఉండగా, సీ కేటగిరీలో ఎస్సీలు 13.77%, ఎస్టీలు 6.21%, ఇతరులు 80.02% ఉన్నారు. అట్టడుగు డీ కేటగిరీలో ఎస్సీలు 42.39%, ఎస్టీలు 13.44%, ఇతరులు 44.17% ఉన్నట్టు 2012 నాటి సమాచా రం. దాదాపు 10,40,000 రైల్వే ఉద్యోగులలో ఎస్సీలు 21.35%, ఎస్టీలు 8.58%, ఇతరులు 70.30%. నియామకాల్లోనే తప్ప ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేవు.
 
 కాబట్టి ఈ అధ్యయనం ఏ, బీ కేటగిరీలలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పని తీరుపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఈ స్థాయికి ఎలా చేరుకోగలిగారు? ఆ తర్వాత వారు విధి నిర్వహణలో ఎటువంటి ప్రతిభను కనబరిచారు? అనే అంశంపై వారు దృష్టిని సారించారు. ‘‘వరల్డ్ డెవలప్‌మెంట్ జర్నల్’’ ఈ అధ్యయన నివేది కను ప్రచురించింది. ఏఏ జోన్లలో, ఏఏ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీలు నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నారో ఆ జోన్ల పనితీరును ప్రత్యేకించి అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీలు కీలక స్థానాల్లో ఉన్న విభాగాలు, జోన్ల పనితీరుపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం కనబడకపోగా, మెరుగుదల ఉన్నట్టు  వాళ్ళు తేల్చారు.
 
 కింది వర్గాలైన ఎస్సీ, ఎస్టీల నుంచి ఎదిగివచ్చిన వారు తమ శక్తిసామ ర్థ్యాలను చాటడానికి కృషి చేయడం వల్లే వారు, మంచి ప్రగతిని, ఫలితాలను సాధించారని ఆ అధ్యయనం తేల్చింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను, అధికారు లను ఆధిపత్య కులాల ఉన్నతాధికారులు కొందరు వేధింపులకు గురిచే స్తున్నా, వాటిని తట్టుకొని మరీ వారు మంచి ప్రతిభను కనబరచడం వారి కఠోరశ్రమకు, పనిపట్ల శ్రద్ధకు, విధినిర్వహణలోని నిబద్ధతకు నిదర్శనమని అఖిల భారత రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు బి.ఎల్.భైరవ అన్న మాటలను ఈ అధ్యయనంలో పొందుపరచడం విశేషం. రిజర్వేషన్లు రెల్వేల ప్రగతికి తోడ్పడ్డాయే తప్ప, ఎలాంటి నష్టం కలిగించలే దని రుజువైంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సమాజానికి ఎంతో మేలు చేశాయనడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
 
 పేదలకు వైద్యం చేస్తున్నది ఎవరు?
 అలాగే ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిశీలిద్దాం. పాలకుల ఘోర నిర్లక్ష్యానికి తోడు నిర్వహణలో ఎన్ని లోపాలు, పరిమితులు ఉన్నా... నేటికీ నిరుపేదల ప్రాణాలను నిలుపుతున్నవి ప్రభుత్వాసుపత్రులేనంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ వైద్యశాలలే లేకుంటే పేదల ప్రాణాలు ఏమౌతాయనే ఆలోచనే భయం కలిగిస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే ఇల్లు ఎలా గుల్ల వుతుందో అందరికీ తెలుసు. ఇటీవల ఒక చిన్నపిల్లాడి కిడ్నీ మార్పిడి కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రి రూ.30 లక్షల అంచనా ఇవ్వగా, ప్రభుత్వ అధీనంలోని మరో ఆసుపత్రి వైద్యుడు రూ.10 లక్షలు మాత్రమే ఖర్చవుతుందన్నారు.
 
  ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పేరిట ఎంత విచ్చలవిడిగా దోపిడీ సాగుతోం దో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణనే ఉదాహరణగా తీసుకుంటే... ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల్లో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీలేనన్నది వెలుగు లోకి రాని సత్యం. ముఖ్యంగా గ్రామీణ, చిన్న, మధ్యతరహా పట్టణాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీలే పనిచేస్తున్నారు. ఆధిపత్య కులాల వాళ్ళు తప్పనిసరై గ్రామాలకో, చిన్న పట్టణాలకో వెళ్ళాల్సివస్తే.. ఏడాదో, ఆరునెలలో పనిచేసి, ఏదో వంకతో నగరాలకు చేరుకుంటున్నారు.
 
 కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరడమో, తామే ప్రైవేట్ నర్సింగ్‌హోంలు స్థాపించుకోవడమో చేస్తున్నారు. మెడికల్ ఎంట్రన్స్‌లో పీజీ సీట్లు రాకపోయినా కోట్లు గుమ్మరించి కొనుక్కొని, అటునుంచి అటే కార్పొరేట్ ఆసుపత్రులకో, విదేశాలకు ఎగిరిపో తారు. గత పదేళ్లలో ఇలా విదేశాలకు పోయిన వాళ్ళు దాదాపు 2,500 మంది అని అంచనా. ఇందులో అత్యధిక శాతం ఓపెన్ కేటగిరీ వారే. ప్రవేశ పరీక్షలో క్వాలిఫై కాలేక కోట్లు గుమ్మరించి సీట్లు కొనుక్కున్న వాళ్లకు ప్రతిభ ఉన్నట్టా? లేనట్టా? తక్కువ మార్కులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యాలయాల్లో ప్రవేశిస్తూ ప్రతిభను దెబ్బతీస్తున్నారని వాదించే వాళ్ళకు కోట్లు పోసి మేనేజ్ మెంట్ కోటాల్లో, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు కొనుక్కునే వారి ‘ప్రతిభ’ కనిపిం చడం లేదా? లేక వారా విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారా? తెలంగాణలో ప్రస్తుతం 6,400 మంది వైద్యులున్నారు. ఇందులో బోధనారంగంలో 2,100 మంది, వైద్య ఆరోగ్యసేవలు అంటే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్స రీలు, చిన్నస్థాయి ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళు 2,600 మంది, ఏరియా, జిల్లా ఇతర ప్రధాన వైద్యశాలల్లో పనిచేస్తున్న వైద్యులు 1,700 మంది ఉన్నట్టు తెలుస్తోంది. బోధనలో ఎక్కువగా ఓపెన్ కేటగిరీ వైద్యులు, గ్రామ, పట్టణ, జ్లిలా  స్థాయి ప్రభుత్వ వైద్య శాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నారు.
 
 వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మంది డాక్టర్లుండగా అందులో నలుగురు ఎస్టీలు, ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ, ముగ్గురు ఓపెన్ కేట గిరీ వైద్యులున్నట్టు తెలుస్తున్నది. ఓపెన్ కేటగిరీలోని ముగ్గురిలో ఇద్దరు కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేస్తున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వాసుప త్రిలో మొత్తం 17 మంది వైద్యులుంటే ఐదుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు, నలుగురు బీసీలు, ఐదుగురు ఓపెన్ కేటగిరీ వారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో 12 మంది డాక్టర్లుండగా ఆరుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఇద్దరు ఓపెన్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారు.
 
 దీన్ని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వైద్యులే అత్యధికంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తూ, ప్రజారోగ్య వ్యవస్థను కాపాడుతున్నారనేది స్పష్టమే. ఎస్సీ, ఎస్టీ, బీసీలందరి రిజర్వేషన్లు 50% మించిలేవు. మిగతా 50% సీట్లు ఓపెన్ కేటగిరీ లోనే ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ఆధిపత్య కులాలకే దక్కుతున్నాయి. కానీ వారిలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య వ్యవస్థల్లో పనిచేస్తున్న వారు స్వల్పం. ప్రభుత్వ సహాయంతో వైద్య విద్యనభ్యసించే వారు ఎవరైనాగానీ ప్రభుత్వా సుపత్రుల్లో పనిచేయకపోతే... పేదలకు ప్రాణ ప్రదమైన ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా పతనమవుతుంది. అదే జరిగితే పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే కట్టుబడ్డామనే ప్రభుత్వాల ప్రాథమిక లక్ష్యం దెబ్బతినిపోదా?
 
 కోటాల రద్దు వాదన అర్థరహితం
 వేలయేళ్ళుగా అక్షరానికి దూరం చేసి, తీవ్ర వివక్షకు గురిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మిగతా వర్గాలతో పోటీపడటం సహజంగానే సాధ్యం కాదు. అందుకే వీరికి ప్రత్యేక సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలని రాజ్యాంగ కర్తలు భావించారు. అంతేకాదు, కులం, జాతి, తెగ, మతం భేదాలు తీవ్రం గా ఉన్న మన దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే అన్ని వర్గాలకు, కులాలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలి. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యవ్యవస్థలో పాలనలో, విద్య, ఉద్యోగ అవకాశాలలో నిజమైన భాగస్వామ్యమే ప్రాథమి కమైన అంశం. కానీ ఈనాటికీ విద్య, ఉద్యోగ, రాజకీయరంగాల్లో ఆధిపత్యం అగ్రకులాలదే. ప్రధాన కులాల జనాభా నిష్పత్తిని, వారి ఉద్యోగ ప్రాతినిధ్యా న్ని పోల్చిచూస్తే అది తెలుస్తుంది.
 
జాతీయస్థాయిలో క్లాస్ వన్ కేటగిరీ ఉద్యో గాల్లో నేటికీ ఆధిపత్య కులాలదే అగ్రస్థానమనేది నిస్సందేహం. బ్రాహ్మ ణులు, రాజ్‌పుత్‌లు, కాయస్తులు, బనియాలు జనాభాలో 11.3% కాగా, క్లాస్ వన్ ఉద్యోగాలలో 70% కైవసం చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 68.05% ఉన్నా 20%కే ఆ ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇక ముస్లింల జనా భా 11% కాగా 3.2% మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే వాదనకు అర్థంలేదని స్పష్టమౌతూనే ఉంది. రిజర్వేషన్ల పట్ల గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న వాళ్ళు ఈ అంశాలను గమనిస్తే రాజ్యాంగ నిర్మా తలు ఆకాంక్షించినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం అవుతుంది.
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement