జవాబు పత్రాలకు విపరీతమైన ఫీజులు చెల్లవు | so much Fees to answer sheets revaluation | Sakshi
Sakshi News home page

జవాబు పత్రాలకు విపరీతమైన ఫీజులు చెల్లవు

Published Fri, Jan 22 2016 1:44 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

జవాబు పత్రాలకు విపరీతమైన ఫీజులు చెల్లవు - Sakshi

జవాబు పత్రాలకు విపరీతమైన ఫీజులు చెల్లవు

విశ్లేషణ
ప్రవేశ ఫీజు, చదువుల ఫీజు పోను, విశ్వవిద్యాలయాల పరీక్షా కేంద్రాలు బోలెడంత ఫీజు వసూలు చేసి, పరీక్షలు నిర్వహిస్తాయి. మార్కుల తదుపరి లెక్కింపునకు, పునర్ మూల్యాంకనానికి కూడా వందల రూపాయల ఫీజు కట్టమంటాయి. దాంతోపాటు విద్యార్థులు తాము రాసిన జవాబు పత్రాల ప్రతి అడిగితే దానికి 750 నుంచి రూ.2 వేల దాకా రుసుం డిమాండ్ చేస్తాయి. ఇవన్నీ వర్సిటీల నియమ నిబంధన లను అనుసరించి జరుగుతాయి. విద్యార్థులు తమ జవా బులకు మార్కులు సరిగ్గా రాలేదనుకుంటే జవాబు పత్రం చూడాలని కోరుకునే అవకాశం 2005కు ముందు లేదు. వారు కేవలం రీకౌంటింగ్ అడగవచ్చు. దానికి కొంత ఫీజు కట్టాలి. పరీక్షాధికారి జవాబులకు వచ్చిన మార్కులు కూడి, కూడికల్లో తప్పులేదని రాసి ఓ కాగితం ఇస్తాడు. విద్యార్థి ముందు లెక్కించాలని పట్టు బడితే ఆ పనిచేస్తాడు. లేకపోతే అదీ లేదు. విద్యార్థి తను ఏం రాశానో చూసుకుంటానంటే ఇచ్చేవారే కాదు.

అయితే 2005లో సమాచార హక్కు చట్టం వచ్చిన తరవాత విద్యార్థుల సమాధాన పత్రాలు సమాచార మేనని కనుక తమ జవాబు పుస్తకం కాపీ తమకు ఇవ్వాలని డిమాండ్ మొదలైంది. యూపీఎస్‌సీ, సీబీ ఎస్‌ఈ తదితర సంస్థలు పరీక్షా పత్రానికి విద్యార్థి ఇచ్చే జవాబులు, వాటికి మూల్యాంకన చేసిన పరిశీలకులు ఇచ్చిన మార్కులు కూడా ధర్మకర్తృత్వ బాధ్యత కింద ఇచ్చిన సమాచారం కనుక ఇవ్వడానికి వీల్లేదని గట్టిగా వాదించారు. ఆదిత్య బందోపాధ్యాయ దీన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లవలసి వచ్చింది. జవాబులు విద్యార్థి సొంత సమాచారమని, దానిపైన మూల్యాంకనంలో లభించిన మార్కులు కూడా ఇవ్వతగిన సమాచారమే నని సుప్రీంకోర్టు తేల్చివేసి, విద్యార్థులకు తమ జవా బులు తాము చదువుకునే సమాచార హక్కును, పంతుళ్ల మూల్యాంకన జవాబుదారీతనాన్ని నిర్ధారించింది. అయితే మరొకరి సమాధాన పత్రాన్ని అడిగితే మాత్రం అది  మూడోవ్యక్తి సమాచారం, వ్యక్తిగత సమాచారం కూడా అవుతుందని, కనుక ఇవ్వడానికి వీల్లేదన్నది.

అంతవరకు బాగానే ఉంది. కానీ జవాబు పత్రాన్ని పొందడానికి ఎంత ఫీజు చెల్లించాలనేది మరో సమస్య. దీన్ని కూడా తీవ్ర వివాదం చేసి కాలహరణం చేస్తు న్నారు. విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు కనుక జవాబు పుస్తకం ఖరీదును వారే నిర్ణయి స్తారని, అంత డబ్బు విద్యార్థులు కట్టాలని వారు వాదిం చారు. ఒక్కొక్క పేపర్‌కు రూ. 750 ఇవ్వాలని, మొత్తం అయిదు పేపర్లకు గాను రూ.3,750లు ఇవ్వాలని ఢిల్లీ యూనివ ర్సిటీ కోరింది. విశ్వవిద్యాలయం పాలకవర్గం సాధికారికంగా రూపొందించిన నియమాల ప్రకారం విద్యార్థులు ఇంత ఫీజు కడితేనే జవాబు పుస్తకం ఇస్తామని అంటున్నారని, ఇది ఆర్టీఐ చట్టం, నియమా లకు విరుద్ధమని విద్యార్థులు వాదించారు.

ఆర్టీఐ చట్టం సెక్షన్ 7 ప్రకారం నిర్ణీత ఫీజును చెల్లించి సమాచారం ప్రతిని పొందే హక్కు ఉంది. 7(2)(ఎ) కింద అడిగిన సమాచారాన్ని కాపీ చేయడానికి అయ్యే ఖర్చు లెక్కించి ఫలానా సొమ్ము ఫలానా విధంగా చెల్లించాలని పీఐఓ తెలియజేయవలసి ఉంటుంది. సమాచార హక్కు చట్టం (ఫీజు ఖర్చుల క్రమబద్ధీకరణ) నియమాలు 2005 నాలుగో నియమం ప్రకారం, పేజీకి రెండు రూపాయలు లేదా పెద్ద సైజు కాగితం అయితే ఆ కాగితం ఖరీదు ఎంతయితే అంత కోరాలని నిర్ధారించారు. ఈ లెక్కన జవాబు పత్రంలో విద్యార్థి వంద పేజీలు రాస్తే, రెండొందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఢిల్లీ విశ్వవిద్యాలయం రూ. 750  ఫీజు వసూలు చేస్తున్నది. అసమంజసమైన ఫీజు విధించడం అంటే అది సమాచార నిరాకరణే అవుతుం దని విద్యార్థి వాదించారు.

రాజస్థాన్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు ఇటు వంటి కేసే వచ్చింది. ఆర్టీఐ నియమాల ప్రకారం పేజీకి రెండు రూపాయలు ఇవ్వాలా లేక యూనివర్సిటీ నిర్ధారిం చిన మేరకు వేయి రూపాయలు చెల్లించాలా అనే సవాలును పరిశీలించింది. పేజీకి రెండు రూపా యల కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేయరాదని అల్కా మటోరియా వర్సెస్ మహారాజా గంగాసింగ్ యూనివ ర్సిటీ (ఏఐఆర్ 2013 రాజస్థాన్126) కేసులో రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది. దానిపై యూనివర్సిటీ అధికా రులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎస్‌ఎల్‌పీని కొట్టివేసింది. అంటే పేజీకి రెండు రూపాయల కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేయడానికి వీల్లేదన్న రాజస్థాన్ హైకోర్టు తీర్పు దేశ వ్యాప్తంగా శాసనంగా మిగిలిపోయింది. ఢిల్లీ హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మపీఠం కూడా పారస్ జైన్ వర్సెస్ భారత కంపెనీ సెక్రటరీల సంస్థ (ఎల్‌పీఏ 275 ఆఫ్ 2014) కేసులో జవాబు పత్రం చూడటానికి రూ. 450ల ఫీజు, జవాబు పత్రం కాపీ పొందడానికి రూ. 500ల ఫీజు వసూలు చేయడం చెల్లదని, ఆర్టీఐ నియమాలు 2005 రూల్ 4 ప్రకారం పేజీకి 2 రూపాయలు మాత్రమే తీసుకోవాలని నిర్ధారించింది.

అంతకన్నా ఎక్కువ ఫీజు వసూలు చేసే అధికారం ఇచ్చిన నియ మాన్ని కొట్టివేసింది. విద్యార్థులవద్ద డబ్బులేకపోతే విద్యాసంస్థలు జవాబుదారీతనం నుంచి తప్పించుకో వడం, రూ.750లు లేని విద్యార్థులకు జవాబులు చూసుకునే హక్కు లేదనడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించ డమే. సహచట్టాన్ని, నియమాల్ని, కోర్టు తీర్పుల్ని ఉల్లంఘించినందుకు సీఐసీ కారణ వివరణ గమనిక జారీ చేసింది. దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఎక్కువ ఫీజు వసూలు చేయకుండా ఉత్తర్వును అమలు చేయాలని యూజీసీని, మానవ వనరుల మంత్రిత్వ శాఖను సీఐసీ ఆదేశించింది.
 (అబ్నే ఇంగ్టీ వర్సెస్ ఢిల్లీ యూనివర్సిటీ కేసు ఇఐఇ/అ/ఇ/2015/901116 లో 15 జనవరి 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 

మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement