రాష్ట్ర విభజన ఆపండి | Stop state bifurcation, Ys vijayamma urges president and prime minister | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన ఆపండి

Published Wed, Aug 28 2013 1:02 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

Stop state bifurcation, Ys vijayamma urges president and prime minister

రాష్ట్రపతికి, ప్రధానికి వైఎస్ విజయమ్మ వినతిపత్రం
యూపీఏ సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశంపై అత్యంత అవకాశవాద ధోరణి ప్రదర్శిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. కేవలం తెలంగాణలో కొన్ని ఎంపీ సీట్ల కోసం ఏకపక్షంగా, అత్యంత నిరంకుశంగా, నిర్హేతుకంగా రాష్ర్ట విభజనకు నిర్ణయం తీసుకుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. విభజనతో తలెత్తగల అన్ని సమస్యలకూ సంతృప్తికరమైన పరిష్కారాలు దొరికేదాకా, ఇరు ప్రాంతాల ప్రజలూ తమకు న్యాయం జరుగుతుందని విశ్వసించే దాకా రాష్ర్ట విభజన ప్రక్రియను చేపట్టరాదని ప్రధానిని కోరారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించాల్సిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. రాష్ర్టంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అన్ని వర్గాల ప్రజలూ నానాఅవస్థలు పడుతున్నారని, పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోందని విజయమ్మ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘నీటి పంపకం, ఆదాయ పంపకం, హైదరాబాద్ భవితవ్యం వంటి కీలక సమస్యలపై ఏమీ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజన నిర్ణయం తీసుకుంది. దీనిపై కోస్తాంధ్ర, రాయలసీమల్లో తీవ్రస్థాయిలో పెల్లుబుకిన వ్యతిరేకతతో అక్కడి జన జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలూ ఉద్యమ బాట పట్టడంతో పాలన కూడా పడకేసింది. సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణంగా, అస్థిరంగా ఉంది’’ అని వారికి వివరించారు. విజయమ్మ మంగళవారం ఢిల్లీలో రాష్ర్టపతిని, ప్రధానిని కలిశారు. రెండు ప్రాంతాలకూ న్యాయం చేయలేనప్పుడు యథాతథ స్థితిని కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ తొలినుంచీ డిమాండ్ చేస్తూ వస్తోందని వారికి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రత్యేకమైన సమస్యలు నెలకొని ఉన్నాయని ఆమె ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను, సందేహాలను సరైన రీతిలో పరిష్కరించి, వారు తమకు న్యాయం జరుగుతుందని సంతృప్తి చెందేదాకా విభజన ప్రతిపాదనను నిలిపేయాలంటూ ఆగస్టు 10న తమ పార్టీ బహిరంగ లేఖ రాశామని, దాని ప్రతిని ఆయనకు కూడా పంపామని గుర్తు చేశారు. విభజన నిర్ణయంతో ప్రభావితమయ్యే అన్ని ప్రాంతాల వారినీ విశ్వాసంలోకి తీసుకోకుండా, వారందరినీ సంతృప్తి పరచకుండా రాష్ట్ర విభజన ప్రక్రియపై ప్రభుత్వం ముందడుగు వేయరాదని కోరారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ అనుసరించిన ఏకపక్ష, స్వార్థపూరిత వైఖరి, విభజనతో తలెత్తగల సమస్యలు, సీమాంధ్రుల్లో నెలకొన్న ఆందోళనలు తదితరాలను కూలంకషంగా వివరిస్తూ ప్రణబ్, మన్మోహన్‌లకు విజయమ్మ వినతిపత్రాలు సమర్పించారు. ఆగస్టు 10న లోక్‌సభ సభ్యత్వానికి జగన్, శాసనసభ్యత్వానికి విజయమ్మ రాజీనామా చేసిన సందర్భంగా విడుదల చేసిన బహిరంగ లేఖను కూడా జత చేశారు. వినతిపత్రాల్లోని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
 
స్వీయ నిర్ణయాన్నే తుంగలో తొక్కారు...
 యాదృచ్ఛికమే అయినా, దేశంలో ఏర్పాటైన తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశే. 57 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న అలాంటి పెద్ద రాష్ట్రాన్ని సహేతుకమైన ఆధారమేదీ లేకుండా విభజించబూనడం దారుణం. యూపీఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశంపై ప్రదర్శిస్తున్న అత్యంత అవకాశవాద వ్యవహార శైలితో మేమెంతో ఆవేదనకు లోనవుతున్నాం. దేశంలో పలు ప్రాంతాల్లో తలెత్తుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ల పరిష్కారానికి రెండో ఎస్సార్సీ వేయాలని తీర్మానిస్తూ 2001లో తీసుకున్న స్వీయ నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ తుంగలో తొక్కింది. ఆంధ్రప్రదేశ్‌ను చీల్చుతూ గత జూలై 31న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్హేతుక నిర్ణయం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశంలో ఎన్నో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లున్నా, కేవలం తెలంగాణ ఏర్పాటుపై మాత్రమే ముందడుగు వేశారు. దీన్ని నిరసిస్తూ, తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. రాజకీయాలతో ప్రమేయం లేకుండా జరుగుతున్న స్వచ్ఛంద ఉద్యమం ఆ ప్రాంతంలో మొత్తం పాలన యంత్రాంగాన్నీ స్తంభింపజేసింది. ఎన్జీవోలు, టీచర్లు, లాయర్లు, రవాణా సంఘాలు తదితరులంతా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
 
మరో హైదరాబాద్‌ను ఇవ్వగలరా...?
ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయం, పైగా అందుకు ఎంచుకున్న సమయమే ఇంతటి అసంతృప్తికి ప్రధాన కారణాలు. హైదరాబాద్ నగర భవితవ్యం, నీటి పంపకం, ఆదాయ పంపకం, ఆంధ్రా ప్రాంతానికి కొత్త రాజధాని నిర్మించేందుకయ్యే వ్యయం, ఆ ప్రాంతంలో సామాజిక, పారిశ్రామిక మౌలిక వసతుల ఏర్పాటుకు పట్టే సమయం వంటి పలు కీలక సమస్యలకు పరిష్కారాలు చూపించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఏరియా (హెచ్‌ఎండీఏ)నే తీసుకుంటే, అది కేవలం రాజధానిగానే గాక ఆర్థిక సూపర్‌పవర్‌గా ఆవిర్భవించింది. రాష్ట్ర ఉత్పత్తి జీడీపీలో 70 శాతం, సాఫ్ట్‌వేర్ కార్యకలాపాల్లో 95 శాతం వాటా దానిదే. పైగా దాదాపుగా అత్యున్నత విద్యా సంస్థలన్నిం టితో పాటు ప్రతిష్టాత్మక పౌర, రక్షణ పరిశోధన సంస్థలు నగరంలోనే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఆదాయంలో దాదాపుగా 40 శాతం హైదరాబాద్‌దే. అత్యంత మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీతో కూడిన జిల్లాలెన్నో ఆంధ్రా ప్రాంతంలో ఉన్నా దురదృష్టవశాత్తూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండింట్లోనూ పారిశ్రామిక పెట్టుబడులను హెచ్‌ఎండీఏ పరిధిలోనే అన్ని ప్రభుత్వాలూ ప్రోత్సహిస్తూ వచ్చాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కూ రాజధాని కాబట్టే ఆంధ్రా ప్రాంతం నుంచి ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి పెట్టుబడులన్నీ పెట్టారన్న అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. రాష్ట్రాన్ని విభజిస్తే, ఆంధ్రా ప్రాంతం వారు హైదరాబాద్‌లో పెట్టిన పెట్టుబడుల పరిస్థితేమిటి? ఈ పరిశ్రమలన్నీ ఆంధ్రా ప్రాంతానికి వలస వెళ్లడం సాధ్యమేనా? అలాంటి వ్యవస్థలను ఆంధ్రా ప్రాంతంలో తిరిగి నిర్మించేందుకు ఎంత సమయం, ధనం కావాలి? హెచ్‌ఎండీఏలో వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తారు? హెచ్‌ఎండీఏ ప్రాంతంలోని ఆదాయాన్ని నష్టపోతున్నందుకు ఆంధ్రా ప్రాంతానికి కేంద్రం ఎలా పరిహారం చెల్లిస్తుంది? ఆంధ్ర ప్రాంతంలో కూడా అలాంటి ఉన్నత విద్యా కేంద్రాలు, పౌర, రక్షణ పరిశోధన కేంద్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం స్థాపించి ప్రోత్సహించగలదా?
 
సీమాంధ్ర అన్నివిధాలా నష్టపోవాల్సిందేనా?
రాష్ట్ర జనాభాలో 62 శాతం మంది జీవనోపాధితో ముడిపడిన ముఖ్యమైన సమస్యలన్నింటికీ పరిష్కారాలు చూపకపోతే రాష్ట్ర విభజన ఆంధ్రా ప్రాంతానికి భారీ సమస్యలు తెచ్చిపెడుతుందనడం వాస్తవం కాదా? ముఖ్యంగా తయారీ పరిశ్రమ, సాఫ్ట్‌వేర్ వ్యాపారమంతా హెచ్‌ఎండీఏలోనే ఉండనుండటం, దాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే భాగంగా ఉంచుతామని సీడబ్ల్యూసీ తీర్మానంలోనే పేర్కొన్న నేపథ్యంలో ఇది పెద్ద సమస్యగా మారదా? అంటే రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రా ప్రాంతమంతా సాగునీటి ప్రాజెక్టుల కోసం తనకు రావాల్సిన వాటా నీటిని కోల్పోతుంది. హెచ్‌ఎండీఏ నుంచి ఆదాయాన్నీ పోగొట్టుకుంటుంది. పరిశ్రమలు, సేవా రంగాలపరంగా కూడా పూర్తిగా నష్టపోతుంది. సరిగ్గా ఈ కారణాలతోనే తెలంగాణపై 2012 డిసెంబర్ 28న కేంద్ర హోం మంత్రి జరిపిన అఖిలపక్ష సమావేశంలో మా పార్టీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు హక్కు రాజ్యాంగ రీత్యా కేంద్రానికి, పార్లమెంటుకే ఉంది గనుక సున్నితమైన ఈ అంశంపై ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల ప్రజలందరికీ న్యాయం జరిగేలా కేంద్రమే సరైన నిర్ణయం తీసుకోవాలని కుండబద్దలు కొట్టింది.
 
ఈ ప్రశ్నలకు బదులేది?
రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించదలిస్తే తెలంగాణ ప్రాంతీయుల మనోభావాలను తృప్తి పరిచేందుకు ఎలాంటి రక్షణ చర్యలు కల్పిస్తారు? లేదూ, రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయిస్తే ఆదాయ, నీటి పంపకం, హైదరాబాద్ భవితవ్యం వంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? హెచ్‌ఎండీఏకు దీటైన కొత్త రాజధాని, ఇతర మౌలిక ఏర్పాటులో సమస్యలను ఎలా అధిగమిస్తారు? ఇలాంటి వాటికి కేంద్రం నుంచి నిర్దిష్టమైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రజలు సహజంగానే ఆశించారు. కానీ తెలంగాణపై ఇప్పటిదాకా జరిగిన ఏ అఖిలపక్షంలోనూ తన అభిప్రాయం కూడా వెల్లడించని కాంగ్రెస్ పార్టీ, ఉన్నట్టుండి రాష్ట్ర విభజనకు తాను సానుకూలమని ప్రకటించడం మమ్మల్ని తీవ్ర విస్మయానికి లోను చేసింది. నీరు, ఆదాయ పంపకం, గత 57 ఏళ్లుగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా నివసిస్తున్న హైదరాబాద్ భవితవ్యం వంటి కీలకాంశాలపై ఎలాంటి చర్చా, ప్రజా స్పందనా లేకుండానే ఈ పని చేసింది. రైతులు, ప్రభుత్వోద్యోగులు, పరిశ్రమ, వర్తక సంఘాలు, పౌర సమాజం సభ్యుల వంటి వారెవరి అభిప్రాయాలనూ కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండానే, విభజన అంశాన్ని కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లడం ద్వారా తుది నిర్ణయం దిశగా కాంగ్రెస్ కదులుతుండటం మరింత విస్మయకరం. ఇది అత్యంత దురదృష్టకరం.
 
పరిస్థితులు ఏనాడూ ఒకలా లేవు
రాష్ట్ర చరిత్రను ఒకసారి చూస్తే, ఏ ప్రాంతానికీ, ఏ జిల్లాకూ అనాదిగా ఒకే పరిస్థితులు లేవు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. మద్రాసు ప్రెసిడెన్సీ అన్న పదం నుంచి మద్రాసు దూరమైంది. కోస్తాంధ్రలోని గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం ప్రాంతాన్నంతా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు బదలాయించారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని మన ఉత్తరాంధ్రలో భాగమైన కోరాపుట్, రాయగఢ్ ప్రాంతాలను ఒడిశాకు బదలాయించారు. రాయలసీమలో భాగమైన బళ్లారి జిల్లాను కర్ణాటకకు; కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని గద్వాల, అలంపూర్ ప్రాంతాలను మహబూబ్‌నగర్ జిల్లాకు కలిపారు. హైదరాబాద్ స్టేట్‌లోని ఔరంగాబాద్, గుల్బర్గా, మెదక్, వరంగల్ డివిజన్లు మార్పుచేర్పులకు గురయ్యాయి. ఔరంగాబాద్ డివిజన్ మహారాష్ట్రలోకి, గుల్బర్గా డివిజనేమో మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్లారితో పాటుగా కర్ణాటకకు వెళ్లాయి. గుల్బర్గా జిల్లాలోని కొడంగల్, తాండూరు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉన్న నడిగూడెం, మునగాల ప్రాంతాలు బ్రిటిష్ ఇండియాలో భాగంగా కృష్ణా జిల్లాలో ఉండేవి. కృష్ణా జిల్లా కంచికచర్ల దగ్గరి పరిటాల గ్రామం నైజాం సంస్థానంలో ఉండేది. ఇలా అన్ని ప్రాంతాలు కూడికలు, తీసివేతల తరవాత మిగిలిన దానితో సంతృప్తిపడి... మనం ఈ రోజున మన ప్రాంతాలను వివిధ పేర్లతో పిలుచుకుంటున్నాం.
 
మేమప్పుడే స్పందించాం
కేవలం తెలంగాణ పా్రంతంలో 10 నుంచి 15 ఎంపీ స్థానాలను అదనంగా చేజిక్కించుకునేందుకే ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ విభజించనుందంటూ జూలై 12న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగినప్పటి నుంచే విసృ్తతంగా ప్రచారమైంది. దీనికి నిరసనగా మా పార్టీకి చెందిన 16 మంది శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించారు. అయినా కూడా అత్యంత నిరంకుశ రీతిలో, పైన పేర్కొన్న ఏ సమస్యకూ పరిష్కారాలు చూపకుండానే తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ ప్రకటన చేసింది. మా పార్టీ తక్షణం స్పందించింది. రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకోకముందే నీరు, ఆదాయాల పంపకం, కొత్త రాజధానికి నిధులు, మౌలిక సదుపాయాల కల్పన వంటివాటిని వాటితో సంబంధమున్న వారందరి ముందు చర్చకు పెట్టాలని డిమాండ్ చేసింది. సమస్యలన్నింటినీ నిష్పాక్షికంగా అధ్యయనం చేసేందుకు రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, సాగునీటి, న్యాయ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం వేస్తే బాగుండేది. కానీ ఆశ్చర్యకరంగా ఏకే ఆంటోనీ సారథ్యంలో కాంగ్రెస్ కమిటీ వేశారు. కేవలం ఎలాగోలా రాష్ట్రాన్ని విడదీసేందుకే దాన్ని వేశారన్నది సుస్పష్టం.

విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజా పక్షాన నిలిచి న్యాయం కోసం పోరాడే లక్ష్యంతో లోక్‌సభ సభ్యత్వానికి మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీకి చెందిన మరో ఎంపీ, శాసనసభ్యత్వానికి నేను రాజీనామా చేశాం. నాతో పాటు పలువురు మా పార్టీ ఎమ్మెల్యేలు నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు. వాటిని ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా భగ్నం చేస్తోంది. దాంతో మరో మార్గం లేక మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లోని తన సెల్‌లోనే ఆగస్టు 25 నుంచీ నిరవధిక నిరాహార దీక్ష సాగిస్తున్నారు.    

సాగునీటి సమస్యలను ఏం చేస్తారు?
సాగునీటి ప్రాజెక్టులు, నీటి పంపకాల మాటేమిటి? ఇప్పటికీ రాష్ట్రంలో 62 శాతం మంది కార్మికులు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. దానికి సాగునీరు ప్రాణావసరం. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు కేటాయింపులను స్పష్టంగా నిర్వచించారు. ఆ మేరకు వాటికి నీటి విడుదల పలు దశాబ్దాలుగా సాఫీగా సాగిపోతూ వస్తోంది. కానీ కరువు సమయాల్లో ఎగువ రాష్ట్రాలు సుప్రీంకోర్టు, కేంద్రం, జల ట్రిబ్యునళ్లు ఆదేశించినా కూడా మా వంటి దిగువ రాష్ట్రాలకు కేటాయింపుల మేరకు నీటిని విడుదల చేయని వైనం తరచూ చూస్తున్నదే.  కాబట్టి ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాజెక్టులకు మరిన్ని పెను సమస్యలు ఎదురయ్యే ఆస్కారముంది. హాస్పేట వద్ద తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి విడుదలకు చేసుకున్న అంతర్రాష్ట్ర ఒప్పందాలు రాయలసీమ ప్రయోజనాలను కాపాడటంలో ఎలా సంపూర్ణంగా విఫలమయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర విభజనతో నీటి సమస్యలు కనీవినీ ఎరగనంతగా పెరిగిపోతాయి. అప్పుడిక ఆంధ్ర ప్రాంతానికి కేవలం ఉప్పు నీరే గతవుతుంది. పైగా 1959లో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలం డివిజన్ భవితవ్యం గురించి సీడబ్ల్యూసీ తీర్మానం ఏమీ చెప్పకపోవడం ఆశ్చర్యకరం. ఈ సమస్యను పరిష్కరించనిదే పోలవరం ప్రాజెక్టుకు చాలినన్ని నీళ్లు వస్తాయని సీడబ్ల్యూసీ ఎలా భావిస్తోంది? రాష్ట్రాన్ని పై భాగం ఒకరికి, కింది భాగం ఒకరికని అడ్డగోలుగా విభజిస్తే కింది భాగంలోని వారికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీరు తప్ప మంచినీళ్లెక్కడ ఉన్నాయి? పైగా రాయల తెలంగాణ అని మరింత ఆశ్చర్యకరమైన వదంతి కూడా వినిపిస్తోంది.

అసలు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు విడగొడుతున్నారన్న ప్రశ్నకు చెప్పే సమాధానం సెంటిమెంటు అని. మరి అదే కారణమైతే రాయలసీమను సగంగా విడగొడితే అక్కడి ప్రజలకు సెంటిమెంటుండదా? అదీగాక శ్రీశైలం డ్యాం ఒకవైపు, నాగార్జునసాగర్ మరోవైపు ఉంటే సాగర్ డ్యాముకు నీళ్లెలా ఇస్తారు? కృష్ణా ఆయకట్టును విడగొడితే రోజూ గొడవలు తప్పని పరిస్థితి రాదా? రాష్ట్రాన్ని విభజిస్తే శ్రీశైలం, సాగర్‌తో పాటు డ్యాములన్నీ జల నియంత్రణ బోర్డుల ఆధ్వర్యంలోకి వెళతాయి. అప్పుడు నికర కేటాయింపులు ఉన్నవాటికే నీరిస్తారు. ఒకసారి అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటయ్యాక మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు సీమలో గానీ, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు గానీ, ప్రకాశం జిల్లాకు గానీ చుక్క నీరు కూడా వాడుకునే అవకాశముండదు. దాంతో కృష్ణా ఆయకట్టు రైతాంగం భవిష్యత్తు అంధకారమవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి కృష్ణా ఆయకట్టు ప్రాంతాన్నంతా ఒకవైపున అయినా ఉంచాలి, లేదా యథాతథ స్థితినైనా కొనసాగించాలి. కనీసం ప్రాణాలు నిలబెట్టే నీరు కూడా లేకుండా ఆ రాష్ట్రంలో ప్రజలు ఎలా బతికేది? ఎలా అభివృద్ధి చెందేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement