తుపాన్ బాధితుల్ని ఆదుకోండి: ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ
ఫై-లీన్ తుపాన్ బాధితుల్ని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. తుపాన్ ప్రభావానికి శ్రీకాకుళం జిల్లాలో జరిగిన నష్టాన్ని వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు. అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఫైలిన్ బాధిత ప్రాంతాల్లో ఇటీవల విజయమ్మ పర్యటించిన సంగతి తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లాలో భారీ నష్టం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఏరియల్ సర్వే కూడా చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయని, వెంటనే విద్యుత్ను పునరుద్ధరించాలని విజయమ్మ కోరారు. రైతులు, మత్స్యకారులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని వారు తనకు తెలిపారని లేఖలో పేర్కొన్నారు. నష్టపోయిన ప్రాంతాల్లో ఎకరాకు రూ.10వేల చొప్పున చెల్లించాలని, రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని ప్రధానిని విజయమ్మ కోరారు.