హృదయగత ప్రపంచం | Suchitra Sen`s condition critical, fluctuates through Saturday | Sakshi
Sakshi News home page

హృదయగత ప్రపంచం

Published Sun, Jan 12 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

హృదయగత ప్రపంచం

హృదయగత ప్రపంచం

సుచిత్ర సన్నటి, కొంటె నవ్వుకు మించి కాల్పనిక ప్రపంచాన్ని భగ్గున వెలిగించేయగలిగేది మరేదీ ఉండేదీ కాదు. సుచిత్ర విజయవంతమైన హిందీ సినిమాల్లో ఆమె సహ తార కాదు, ఏకైక తార. ఆమె అద్భుత నటనను కనబరిచిన మమత చూసి ఉండకపోతే వెంటనే  ఒక కాపీ అర్డర్ ఇవ్వండి. 1960లలో ఉద్యోగమనేది కనుచూపు మేరలో కనబడేది కాదు. ఆ దశాబ్దం తిరుగుబాటుకు, హింసకు సంకేతం కావడంలో ఆశ్చర్యం లేదు. కొందరిది మావోయిస్టు ఉద్యమం కాగా, మిగతావారివి జాతి లేదా మత పరమైన కారణాలు. ఆ పరిస్థితుల్లో సుచిత్రాసేన్ సహవాసం అత్యంత సౌఖ్యవంతమైనదిగా ఉండేది.
 
 గతాన్ని తలబోస్తూ గడిపేవారికి జ్ఞాపకాల కలబోత ఏమంత మంచి వార్త కాదు. వయసు విషాద గీతిక ఉపరితలానికి దిగువన ఉండే పొరలాగా కనబడకుండా దాక్కోవాలని ఎంత గట్టిగా ప్రయత్నించినా విఫలవుతుంటుంది. వర్తమానం భవిత దిశగా ఎప్పటిలాగే పరుగులు తీస్తూ పోతుంటే గతానికి ఉండే ఆకర్షణ విముక్తం కాని ఆత్మలను ఆచరణాత్మక ప్రయోజనమేమీ లేని ఆలోచనల్లో మునిగిపోయేలా చేస్తుం ది. అలా అని జ్ఞాపకాల కలబోతంటే అంతానికి సంబంధించిన విచారమేమీ కాదు. అది ఒక అన్వేషణ. బహుశా విషాదకరమైన అన్వేషణ. కాలం చెత్త కుప్పలో బంగారం ఇటుకలను వెతుక్కునే అన్వేషణ.
 
 కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో సుచిత్రాసేన్ తన జీవితం చివ రి రోజులను గడుపుతుండటం ఇక ఎంత మాత్రమూ వార్త కాదు. 1950లు, 1960లలో సమ్మోహన మూర్తి సుచిత్రాసేన్ గురించి తప్ప... ప్రత్యేకించి ఆమె తన ప్రియుడు, నట జీవిత భాగస్వామి ఉత్తమ్‌కుమార్‌తో కలిసి వెండితెరపై కనిపించడం గురించి తప్ప... బెంగాల్‌కు సంబంధించిన మరే వార్తా పట్టించుకోదగినది కాదనిపిస్తుండేది.
 
 సుచిత్ర ఎవరికీ తెలియని వారినెవరినో పెళ్లి చేసుకుంది. అతగాడినెవరూ పట్టించుకోలేదు. సుచిత్ర, ఉత్తమ్‌ల మధ్య రసాయనిక శాస్త్రానికి అందని రసాయనిక బంధం ఏదో ఉండేది. దాని ముందు వివాహం అర్థరహితమైనదని అనిపించేది. ఈనాటికి భిన్నంగా అప్పట్లో... నేడు బలహీనపడుతున్న శ క్తులైన తల్లిదండ్రులే అందరి పెళ్లిళ్లు చేసేవారు. అయినాగానీ ఎందరు కళ్లు మిరుమిట్లు గొలిపే అందగత్తెలు, అందగాళ్లు ప్రమాదకరమైన, పాపిష్టి ప్రేమలో పడలేదు? హృదయం ఇరుసు మీదే ప్రపంచం అల్లుకుంది.  మీసం మొలవక ముందు తొలిసారిగా నేను వారిద్దరినీ జ్యోతి సినిమా థియేటర్ వెండితెరపై చూశాను. నల్లులను మంచం పురుగులని తప్పుగా పిలుస్తున్నారనే నా అభిప్రాయం సరైనదేనని ఆ హాల్‌లో రుజువైంది. మంచానికి వెలుపల కూడా నల్లులకు చాలా జీవితం ఉంది.
 
 అప్పట్లో మేం ఒంపులు తిరుగుతూ పోయే హుగ్లీ నదికి అభిముఖంగా, నది ఒడ్డునే ఉన్న ఒక జనపనార మిల్లుకు శివారు గ్రామంలో ఉండేవాళ్లం. ఊహాగానం సదా సరిహద్దుల బంధనాలకు అతీతంగా ఒకదానితో ఒకటి కలగలిసిపోయిన కలల కలగూర గంపలోకి జారిపోతూ ఉంటుంది. సుచిత్ర సన్నటి, కొంటె నవ్వుకు మించి కాల్పనిక ప్రపంచాన్ని భగ్గున వెలిగించేయగలిగేది మరేదీ ఉండేదీ కాదు. ఉత్తమ్‌కుమార్ సంతోషంగా ఆ దేవత ముందు పెద్ద పిల్లాడైపోయేవాడు. ఆ సినిమా పేరేమిటో గుర్తుకు రావడం లేదు. బహుశా సప్తపది కావొచ్చు, కాకపోవచ్చు. ఆధునిక ఇంటర్నెట్ వినువీధుల్లో ఆ పేరును అతి సునాయసంగా తెలుసుకోవచ్చు. అది తెలుపు-నలుపు సినిమాల కాలం. ముకమల్ శకం. ముకమల్ మెరుపు దానికదే ఒక ప్రత్యేకమైన రంగులా కనిపించేది. జ్ఞాపకం వ్యక్తిగతమైనదిగా కంటే వ్యాప్తి చెందినప్పుడే ఎక్కువ ఉపయోగపడుతుంది.
 
 1960ల కాలం ముళ్ల గొంగళిని కప్పుకుని ఉండేది. ఉద్యోగం కనుచూపు మేరలో కనబడేది కాదు, అవకాశాలు ఉండేవి కావు. ఆకాంక్షలకులాగే ఆర్థికవ్యవస్థకు కూడా ఆదరణ కరువై ఉండేది. ఆ దశాబ్దం తిరుగుబాటుకు, హింసకు సంకేతం కావడంలో ఆశ్చర్యం లేదు. కొందరిది మావోయిస్టు ఉద్యమం కాగా, మిగతా వారివి జాతి లేదా మతపరమైన కారణాలు. ఆ పరిస్థితుల్లో సుచిత్రాసేన్ సహవాసం అత్యంత సౌఖ్యవంతమైనదిగా ఉండేది. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి... ఉత్తమ్‌కుమార్ సాంగత్యం కూడా అలాంటిదే. నిజమే, అలాంటి కులాసా కాలాక్షేపం అదొక్కటే కాదు. దేవానంద్ కూడా తోడు ఉండేవాడు. అతి చురుకైన సామాన్యునిగా దేవానంద్ చిల్లర మల్లర నేరాల దారుల్లో అడ్డదిడ్డంగా సంచరించడమే (బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లమ్మడం, జేబులు కత్తిరించడం, జూదగృహంలో ధైర్యాన్ని ప్రద ర్శించడం) అతని మనుగడకు ఏకైక ఆధారం.
 
 అది కూడా సుచిత్ర అంతగానూ ఆకట్టుకునేది. దేవానంద్, సుచిత్ర కలిసి నటించిన సినిమా బొంబయ్ కా బాబు ఒక్కటే. అందులో వారిద్దరూ ఒకరికొకరు అంత దూరంగా ఎందుకున్నారో నా కెప్పుడూ అర్థం కాలేదు. ఆ చిత్ర నిర్మాణమంతా లోపరహితంగానే జరిగింది. హీరో, హీరోయిన్‌లు ఇద్దరూ తారస్థాయిలోనే న టించారు. సంగీతం దివ్యం. ఇక కథ... అవలింతలు తెప్పించే అర్థరాహిత్యానికి భిన్నమైనది. సుచిత్ర, దేవానంద్‌ల మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యా లేదు. అయినా వారిద్దరూ ఉదాసీనంగా కనిపించారు. బెంగాలీ సినిమా గురించి తెలిసిన మాలాంటి వారికి అది ఉపశమనాన్ని కలిగించింది. ఉంటే సుచిత్ర, ఉత్తమ్ ఉండాలి లేదా సుచిత్ర ఒక్కరే ఉంటారు లేదా ఎవరూ ఉండరు. సుచిత్ర, ఉత్తమ్‌లు బెంగాలీ ఒథెల్లోలో నటించారు.
 
 సుచిత్ర హిందీ సినిమాకు అలవాటు పడలేకపోయారు. అలాగే ఉత్తమ్‌కుమార్ కూడానూ. ఉత్తమ్ స్థానంలో మరొకరు అవసరం కానప్పుడే సుచిత్ర హిందీ సినిమాల్లో విజయవంతమయ్యారు. అలాంటి సినిమాల్లో ఆమె సహ తార కాదు, ఏకైక తార. ఆమె అద్భుత నటనను కనబరిచిన మమత మీరు చూసి ఉండకపోతే వెంటనే  ఒక కాపీ అర్డర్ ఇవ్వండి. అది భగ్న ప్రేమ, వంచిత జీవితం సినిమా. అందులో లతా మంగేష్కర్ పాడిన రహతే థే కభీ జిన్‌కే దిల్ మే హమ్ జాన్ సే బీ ప్యారో కీ తరా / బైతే హై ఉన్హీ కే మెహ్‌ఫిల్ మై హమ్ ఆజ్ గునాగారోంకి తరా, హేమంత్‌కుమార్ అజరామార గీతం చుపాలో యే దిల్ మే ప్యార్ మెరా అనే రెండు పాటలూ క్లాసిక్స్. హిందీలో సుచిత్ర రెండో విజయవంతమైన సినిమా ఆంథీ. ఆ సినిమాలో సుచిత్ర ఇందిరాగాంధీ లాంటి రాజకీయవేత్త పాత్రను పోషించింది. సుచిత్ర బెంగాలుకు చె ందినది, బెంగాలీయే.  ఉత్తమ్‌కుమార్ హఠాత్తుగా మరణించి మూడు దశాబ్దాలకు పైగానే అయింది.
 
 అప్పుడు నేను సండే వార్తా వారపత్రికకు సంపాదకుణ్ణి. ఉత్తమ్ సంస్మరణ సంచిక... ఒక్క కలకత్తాలోనే కాదు ప్రతి చోటా దుకాణాలకు చేరిన మరుక్షణమే అమ్ముడై పోయింది. ఉత్తమ్ అమితంగా ప్రేమించిన కలకత్తా నగర వీధుల గుండా అతడు అంతిమ యాత్ర సాగిస్తుండగా... యువ అభిమానులు తమ ఆరాధ్య నటుడ్ని తాకాలని ఉన్మాదంతో కుమ్ములాడారు. అప్పుడు సుచిత్ర మనతోనే ఉన్నారు. అనివార్యమైనదాన్ని విధి అతి ఉదారంగా వీలయినంత ఎక్కువ అలస్యం చేస్తుందని ఆశిద్దాం.  ఆమె పట్ల ఆరాధనాభావం సజీవంగా ఉన్నంత కాలం ఆమె జ్ఞాపకానికి మరణం లేదు.     
 - ఎం.జె.అక్బర్
 సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement