నెంబర్ వన్ పోయె.. పరువూ పోయె..!
వన్డే క్రికెట్లో టీమిండియా ప్రపంచ చాంపియన్. న్యూజిలాండ్ పర్యటనకు ముందు ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ వన్. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ప్రపంచ కప్ కు ఆతిథ్యమివ్వనుండటంతో.. ధోనీసేన కివీస్ గడ్డపై సత్తాచాటాలనే లక్ష్యంతో వెళ్లింది. అయితే సీన్ రివర్సయింది. విదేశీ గడ్డపై తడబడే బలహీనత టీమిండియాను మరోసారి వెంటాడింది. బౌలర్లు ఘోరంగా విఫలమవ్వగా, బ్యాట్స్ మెన్ దీ దాదాపు అదే పరిస్థితి. ధోనీసేన అన్ని విభాగాల్లో విఫలమైంది. ఫలితంగా వన్డే సిరీస్ లో చిత్తుగా ఓడిపోయింది. సిరీస్ సంగతి అటుంచి వరుస పరాజయాలతో నెంబర్ వన్ ర్యాంక్ చేజార్చుకుంది. చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ధోనీసేన ఆరాటపడినా బోణీయే కొట్టకుండా సిరీస్ ముగించింది. సొంతగడ్డపై సత్తాచాటిన కివీస్ 4-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. మూడో వన్డేలో మాత్రం రాణించిన భారత్ అతికష్టమ్మీద టైగా ముగించింది.
భారత్ ఉపఖండంలోనే పులి అన్న విమర్శను ధోనీసేన మరోసారి చెత్తప్రదర్శనతో నిజం చేసింది. విదేశీ పరిస్థితులు, అక్కడి పిచ్ లపై తడబడటం భారత ఆటగాళ్ల బలహీనత. న్యూజిలాండ్ తో పోలీస్తే టీమిండియా అన్ని విధాల పటిష్టమైన జట్టు. అయితే కివీస్ స్వదేశంలో సానుకూల పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోగా.. భారత ఆటగాళ్లు తేలిపోయారు. ఓపెనర్లు విఫలమవడం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపించింది. బ్యాటింగ్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, ధోనీ మాత్రమే నిలకడగా రాణించారు. జడేజా రెండు మ్యాచ్ ల్లో మెరుపులు మెరిపించాడు. అయితే ఇతర ఆటగాళ్లు బ్యాట్లెత్తేయడంతో విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఓపెనర్లను మార్చినా, జట్టుకు భారంగా మారిన రైనాను తప్పించి అంబటి రాయుడుకు చాన్స్ ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఇక బౌలర్లయితే ఘోరంగా విఫలమయ్యారు. షమీ ఆకట్టుకున్నా కీలక ఓవర్లలో పరుగులు కట్టడి చేయలేకపోయాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి సత్తాచాటారు.
వన్డే సిరీస్ లో దారుణంగా ఓడిన ధోనీసేనకు కివీస్ గడ్డపై మరో సవాల్ ఎదురవుతోంది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్ లో ఓడి నిరుత్సాహంగా ఉన్న టీమిండియా పుంజుకుంటుందా? టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.