తెలుగే మన కంటి వెలుగు | telugu is our light, ABK prasad writes | Sakshi
Sakshi News home page

తెలుగే మన కంటి వెలుగు

Published Tue, Jan 19 2016 7:10 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

తెలుగే మన కంటి వెలుగు - Sakshi

తెలుగే మన కంటి వెలుగు

రెండో మాట

 

తెలుగు బోధనా భాషగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఘోరంగా పడిపోతున్నది. ఈ సంఖ్య ఇంకా పెరిగి, ప్రభుత్వ బడులు మూతపడే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిణామం మొత్తం పాఠశాలల్లో తెలుగును ‘ప్రోత్సహించడానికి’ పెద్ద ఆటంకమైంది. నిజానికి ఇప్పుడు తెలుగువాళ్లం ఇలా నెత్తిన పెట్టుకుంటున్న ఇంగ్లిష్, ఇంగ్లిష్‌వారు ఏం చేశారు? తమ భాష మీద మూడు వందల ఏళ్ల పాటు పెత్తనం చలాయించిన గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్ భాషల పెత్తనాన్ని దుర్భరంగా భావించారు.

 

‘సీమ దేశాన చదవి వచ్చెదనటుంచు/ చేతిలో చేయి వైచి వంచించిపోయి

 మరలి రాదాయె నా సంపద్విభూతి..../అన్య భాషా మారుతాఘాతమున చేసి

 వన్నె తగ్గినది నా వాజ్మయంబు/ పరువు తూలిన నీ అనాదరణ కతన

 మేటి నీ భాష పొలిమేర దాటలేదు’                

 - మహాకవి జాషువ

 

తెలుగు భాష తెలుగువారి అనాదరణ వల్లనే పొలిమేరలు దాట లేదని ఒకనాడు కొందరు బాధపడ్డారు. వన్నెచిన్నెలతో అనంతర దశలో తెలుగు భాష ఖండఖండాలలో ‘పాగా’ వేసిందని ఇంకొందరు అల్ప సంతోషంతో మురిసిపోయారు. కానీ నేడు తల్లి భాషకూ, దేశీయ చదువు లకూ ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎవరూ గమనించడం లేదు. వర్తక వాణిజ్యాల వ్యాప్తికోసం ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆంగ్ల మాధ్యమంతో మన ప్రజలని పరాయి భాషకు దాసానుదాసులుగా మార్చారు.

 

ఇప్పుడు ప్రపంచీకరణ పేరుతో ప్రపంచ బ్యాంక్ ‘సంస్క రణల’మాటున పాత, కొత్త నయా వలస సామ్రాజ్య పెట్టుబడి ప్రయో జనాల రక్షణ కోసం ఇంగ్లిష్ ద్వారా గ్రామసీమలకు సైతం తమ వస్తువు లను పాకించడం సాధ్యమని భావిస్తున్నారు. ఇంగ్లిష్‌ను ప్రాథమిక విద్య స్థాయి నుంచి మాధ్యమిక దశ వరకు నిర్బంధంగా బోధించాలని శాసించడం దీని ఫలితమే. స్వతంత్ర భారతంలో ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా (కొఠారీ, రాధాకృష్ణన్ కమిషన్‌లు మినహా)పాలకులు విద్యా వ్యవస్థను అనుక్షణం మార్పులకూ, ప్రయోగాలకూ గురి చేస్తూ, అల్ల కల్లోలం చేస్తున్నారు. అవేవీ సామాజిక జీవితంతో ముడిపడినవి కావు కూడా.

 

ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణల అమలులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆంగ్ల మాధ్యమం కేంద్ర బిందువుగా ఉన్న సంస్కరణలను శరవేగంగా ముందుకు నెడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే భాషా మాధ్యమాన్ని కాకుండా అంటే మాతృభాషకు ప్రాధాన్యం కల్పించకుండా, ఆంగ్లానికే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ అనే విభజన లేకుండా ఈ రెండు చోట్లా మాతృభాషకు బదులు, ఇంగ్లిష్‌నే ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని ప్రైవేట్ యాజమాన్యాలు ఒత్తిడి తెచ్చాయని ఈ నెల 15న ఒక వార్త వెలువడింది. ఇది పేరుకు ప్రైవేట్ ఒత్తిడే కానీ, బ్యాంక్ సంస్కరణల మేరకు ప్రభుత్వాలు రుద్దిన తాఖీదు. విభజన సమస్యలు ఎదుర్కొంటున్న రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు, అవి చాలవన్నట్టు ఒకటి నుంచి పదో తరగతి వరకు కూడా తెలుగు మాధ్యమానికి గండి కొడుతున్నారు.

 

కొత్త మెకాలేలు వచ్చారు

అరకొర ఆంగ్లంతో గుమాస్తా గిరీ విద్యావంతుల రూపకల్పనకు ఆద్యుడైన మెకాలే, ‘ఇంగ్లిష్ వాడి తిండికీ, వేషభాషలకూ అలవాటు పడిన భారతీ యులు మనకు శాశ్వతంగా బానిసలై ఉంటారు’ అని గట్టిగా విశ్వసిం చాడు. ఈ అంశంలో బ్రిటిష్ పాలకుల పాత్ర ముగిసినా, అమెరికన్ సామ్రాజ్యవాద పాలకులు అదే పాత్రను కొనసాగిస్తున్నారు. వందలాది మంది తెలుగు విద్యార్థులు సహా, ఇతర భారతీయ భాషలకు చెందిన విద్యార్థుల విషయంలో అమెరికా హెచ్-1బీ, ఎల్-ఐ వీసాల మంజూ రులో, ఫీజులను భారీగా పెంచడంలో అదే గుమాస్తా గిరీ విధానాన్ని అనుసరిస్తున్నది. భారత విద్యార్థులను అమెరికా ఆర్థికవ్యవస్థకు ఊడిగం చేసే వారిగా మలుచుకుంటున్నారు. ట్విన్‌టవర్స్‌ను ఉగ్రవాదులు కూల్చివేయడం ఏమిటి? అందుకు పరిహారంగా అమెరికా రూపొందించిన ఆరోగ్య నష్ట పరిహార చట్టం చాటున మన విద్యార్థుల హెచ్-1బీ, ఎల్-ఐ వీసాల ఫీజులను రెండేసి మూడేసి రెట్లు అమాంతం పెంచడం ఏమిటి? ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య మున్నెన్నడూ లేని విధంగా ఇప్పుడు 32 శాతం పెరగడం, అది కూడా ఒబామా-మోదీ పాలకులుగా ఉన్న సమయంలో ఈ పెరుగుదల నమోదు కావడం విశేషం.

 

ప్రపంచ దేశాల నుంచి అమెరికా చేరుకుంటున్న విద్యార్థులలో భారతీయ విద్యార్థులు 13.6 శాతం (సుమారు 10 లక్షలు). వీరి కారణంగా అమెరికా ఆర్థికవ్యవస్థకు సమకూరుతున్న మొత్తం ఆదాయం 3.6 బిలియన్ డాలర్లు. అలాగే 1999-2014 మధ్య అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం మరో అంశం. అయినప్పటికీ బడుగు, వర్ధమాన దేశాల విద్యార్థులను వెట్టికి తాకట్టు పడే సరుకుగా అమెరికా భావిస్తున్నది. కాబట్టే తనిఖీల పేరుతో తెలుగు పిల్లలు అవమానాలను ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గమనంలోకి తీసుకో వలసిన సమయం ఇది. ఇప్పుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడం మన పిల్లలు కంటున్న ఫలవంతమైన కల మాత్రం కాదు. అదో కాలిపోతున్న కల.

 

నానాటికీ తీసికట్టు

పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ తెలుగు బోధనా భాషగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఘోరంగా పడిపోతున్నది. ఈ సంఖ్య క్రమంగా పెరిగి, ప్రభుత్వ బడులు మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిణామం మొత్తం తెలుగును పాఠశాలల్లో ‘ప్రోత్సహించ డానికి’ పెద్ద ఆటంకమైంది. నిజానికి ఇప్పుడు తెలుగువాళ్లం ఇలా నెత్తిన పెట్టుకుంటున్న ఇంగ్లిష్, ఇంగ్లిష్‌వారు ఏం చేశారు? తమ భాష మీద మూడు వందల ఏళ్ల పాటు పెత్తనం చలాయించిన గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్ భాషల పెత్తనాన్ని దుర్భరంగా భావించారు.

 

ఎట్టకేలకు 16, 17 శతా బ్దాలలో అధికార భాషగా ఇంగ్లిష్‌ను ప్రకటించుకున్నారు. నిజానికి తెలుగు పరిరక్షణకు అదే శిరోధార్యం కావాలి. హైదరాబాద్‌కు చెందిన తెలుగు విద్యార్థుల ఇంగ్లిష్ వ్యామోహం ఇటీవల ఎంతవరకు పోయిందంటే, ఇంగ్లిష్ నామవాచకాలూ, క్రియల ఉచ్చారణలో ప్రత్యేక శిక్షణ పొందే వరకూ వెళ్లింది. తెలుగు భాషను అవహేళన చేయడం, ఇంగ్లిష్ యాస సర్వసాధారణమైపోయింది. ఐటీ కంపెనీలతో పాటు, కాల్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులు తెలుగు వారు, లేదా ఉర్దూ తెలిసిన వారు ఆయా సంస్థల యజమానులు ఫోన్ చేస్తే సుబ్బయ్య అనో, ఇమామ్ అనో చెప్పరాదట. ఆ కంపెనీ వారు తగిలించిన ఫ్రాన్సిస్ అనో, రాబర్ట్ అనో చెప్పాలని శాసించడం కూడా జరిగింది. అవతలి వాళ్ల వ్యాపారం కోసం మన వాళ్లు సొంత పేర్లు కూడా వదులుకోవాలన్న మాట. నిజానికి ఇదంతా ఒక పిచ్చి, ఉన్మాదాల స్థాయికి చేరింది. మాతృభాషను కలలో కూడా ఉపయోగించనంత దూరంగా జరిగేటంతగా, ఇంగ్లిష్‌ను కలలో కూడా మరువనంతగా తయారుచేస్తున్నారు.

 

అభిమానం, దురభిమానం

ఈ మొత్తం నీలినీడలు తెలుగుకు విశిష్ట భాష ప్రతిపత్తి అంశం మీద కూడా పడుతున్నాయి. కేంద్రం ఆ హోదాను సాధించుకునే దాకా ఉద్యమం సాగింది. అయితే ఈ గుర్తింపును సవాలు చేస్తూ ఒక తమిళుడు మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం వేశాడు. గత ఏడేళ్లుగా సాగుతున్న ఈ వివాదంలో కొద్దికాలం క్రితం చోటు చేసుకున్న మలుపు, విభజన నేపథ్యంలో ఒక తెలుగు వాడే ఆ తమిళుడితో చేతులు కలిపాడు. ఈ వివాదం ఇలా ఉండగానే తమిళనాడులో నివసిస్తున్న తెలుగు భాషకు చెందిన అల్పసంఖ్యాకులకు కనీస రక్షణ లేకుండా, పాఠశాలల్లో తమిళాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం చేసింది.

 

ఈ అంశం మీద తెలుగు భాషా అల్పసంఖ్యాకుల వేదిక అధ్యక్షుడు సీఎంకే రెడ్డి అదే న్యాయస్థానంలో  వ్యాజ్యం నడుపుతున్నారు. ఈ విషయంలో తన సూచనలను పెడ చెవిన పెడుతున్న తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి మందలించ వలసి వచ్చింది. ‘పరభాషను గౌరవించు- మాతృ భాషను సంరక్షించుకో’ అన్న నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆదర్శంగా తీసుకుందని గుర్తు చేసుకోవాలి. ఈ మాట చెప్పినప్పుడు మరొక ఉదంతం గుర్తుకు వస్తుంది. ఫ్రాన్స్ ఒకనాటి అధ్యక్షుడు జేక్విస్ షిరాక్ యూరోపియన్ శిఖరాగ్ర సదస్సులో (2006) పాల్గొన్నప్పటి ఘటన ఇది. ఒక ఫ్రెంచ్ వ్యాపారి మాతృభాషలో మాట్లాడకుండా ఇంగ్లిష్‌లో ఉపన్యసించినప్పుడు షిరాక్ తీవ్ర స్వరంతో, ‘ఒకే ఒక్క భాష - ఇంగ్లిష్ ద్వారా భవిష్యత్ ప్రపంచాన్ని నిర్మించలేరు. శాసించలేరు’ అని హెచ్చరించాడు.

 

ఎస్‌ఎంఎస్‌ల తంటా

ఇంటర్నెట్  ద్వారా మళ్లీ ఇంగ్లిష్‌ను వలస పెత్తందారీ రాజకీయాలకు ఆంగ్లో-అమెరికన్లు మాధ్యమంగా చేసుకున్నారు. అన్యభాషా సంపర్కం లేకుండా ఏ భాషకూ ఎదుగుదల ఉండదు. కానీ ప్రపంచంలోని 7,000 భాషలలో (ఆదివాసీ, అణగారిన జానపదుల ప్రాదేశిక భాషలు సహా)  సుమారు 3,000 భాషలు ఇప్పటికే అంతరించడం వలస భాషల దాష్టీకం ఫలితమే. ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ వాడకంలోకి వచ్చిన తరువాతి పరిణామం పట్ల క్వీన్స్ ఇంగ్లిష్ సొసైటీ, లండన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఆచార్య బెర్నార్డ్ లాంబ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 

‘బ్రిటిష్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు కూడా ఇంటర్నెట్ ప్రవేశంతో కుప్పకూలి పోతున్నాయి. ఫలితంగా మా పిల్లలు తప్పుల్లేకుండా ఇంగ్లిష్ రాయలేక పోతున్నారు. ఉచ్చారణ తప్పులతడక. వర్ణక్రమం ఘోరం. పదాలు రాయడం, విరామ చిహ్నాలు వినియోగం దారుణంగా ఉంది. మా అండర్ గ్రాడ్యుయేట్ల పరిస్థితి మరీ అధ్వానం అని నా సర్వేక్షణలో రుజువైంది. కానీ ఇంగ్లిష్ మాధ్యమంతో సంబంధం లేని విదేశీ విద్యార్థులు మన విద్యార్థుల కన్నా (బ్రిటిష్ విద్యార్థుల కన్నా) చాలా తక్కువ తప్పులు చేస్తున్నారు’ అని అన్నారాయన. మాతృభాషను విస్మరిస్తే అదెంత వికృతంగా ఉంటుందో తెలుగువాడి మరో డొల్లతనం ద్వారా తెలుస్తుంది. బ్యాంకు ఖాతా ద్వారా ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ తెచ్చుకోవాలి. అయితే ఆన్‌లైన్ ద్వారా ఈ వ్యవహారం చేసుకోలేకుంటే, అలాంటి వారి పరిస్థితి దుర్భరం కాదా! కాబట్టి తల్లి భాషను కాపాడుకుంటేనే కంటికి వెలుగు.

- ఏబీకే ప్రసాద్

సీనియర్ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement