నా కథా రచనలోని రహస్యాలు | telugu story writer Buccibabu centenary | Sakshi
Sakshi News home page

నా కథా రచనలోని రహస్యాలు

Published Mon, Jun 13 2016 12:29 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

నా కథా రచనలోని రహస్యాలు - Sakshi

నా కథా రచనలోని రహస్యాలు

- బుచ్చిబాబు శత జయంతి
 

 
కథలో వ్యక్తులు ఎంతేనా ఉద్రేకం చూపొచ్చు- వస్తు వ్యాప్తంలో ఎంతేనా రసం వుబకొచ్చు- కాని రచయిత నిబ్బరంగా వుండి, పైనుంచి వాటి మార్గం, చిక్కదనం, సంచలనం శాసించే అధికారం పోగొట్టుకోకూడదు.
 
కథలు ఎల్లా వ్రాయాలో చెప్పడం నేను కథలు ఎల్లా వ్రాస్తానో చెప్పడమే అవుతుంది. ప్రతి రచయితా తాను వ్రాసే పద్ధతిని సమర్థిస్తూ, అందులోంచి కొన్ని సూత్రాలను ప్రతిపాదించి వొక వీలునామా దిగవిడిచే ప్రమాదం వుంది. గనక, కథలు ఎల్లా వ్రాయాలో చెప్పడం కంటె, నేనెల్లా వ్రాస్తానో చెప్పడం సముచితం అనుకుంటా.
 జీవితంలో ఎదుర్కొన్న యథార్థాన్ని సాహిత్యంలో ఎదుర్కొంటే హర్షించడు పాఠకుడు. అతనికి కావాల్సింది కళానుగుణమైన సత్యం, నగ్నసత్యం కాదు. చిత్రకారుడు మాటిస్ గీచిన వొక నగ్నస్త్రీ చిత్రాన్ని చూసి వొకామె ‘‘ఆడదల్లా ఉంటుందా?’’ అని ఆక్షేపిస్తూ అడిగిందట చిత్రకారుణ్ణి. ‘‘ఇది ఆడది కాదు, బొమ్మ’’ అన్నాడుట మాటిస్. నిత్యజీవితంలో సంఘటనకీ, కథలో సంఘటనకీ ఇట్లాంటి తేడా ఉండితీరాలని శాసించే పాఠకుణ్ణి నేను గౌరవిస్తాను.


ఒక అమాయకుణ్ణి నేరస్తుడిగా తీర్పుచేసి శిక్ష విధించడం, అసలు నేరస్తుణ్ణి విడిచెయ్యడం; స్త్రీకి కూడా ఆస్తిలో భాగం ఏర్పడ్డాక, చెల్లెలు అన్నపట్ల కనబరిచే వైఖరీ- దాని ఫలితంగా జరిగిన హత్యాకాండ, ఆత్మహత్యాకాండ, ఇవి సమాజంలో మనం అప్పుడప్పుడు చూస్తూన్నవే. వీటిని అరికట్టాలని, ఆదర్శజీవియైన రచయిత ఉబలాటపడొచ్చు. కథ ద్వారా ఇందుకు పూనుకోవచ్చు. (దీనికోసం) ఈ ఉదంతాల పుట్టుపూర్వోత్తరాలు బాగా చదివి తెలుసుకోవాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్షుణ్ణంగా చదవాలి. ఆస్తి చట్టం వల్లె వెయ్యాలి. ప్లీడర్లతోను, పోలీసు అధికార్లతోను చర్చించి, పద్ధతులు తెలుసుకోవాలి. తరవాత వీటిచుట్టూ ఏవొక వ్యక్తినీ, సంస్థనీ ఉద్దేశించకుండా, కథ అల్లాలి. తను వొక ఆదర్శాన్నీ నైతిక విలువనీ పాఠకుడి నెత్తిన రుద్దుతున్నట్లు కనిపించకుండా రచన సాగాలి. వినోదం, కాలక్షేపం- కాస్త వికాసంతో కూడుకున్న సంతృప్తి- ఇవి సమకూర్చగల రచయిత ధన్యుడు. సంఘ సంస్కారం అతని పనికాదు. వ్రాసెయ్యడంతో కార్యరంగంలో రచయిత పని పూర్తయినట్లే.


 ‘‘నిరంతరత్రయం’’ అన్న కథలో ప్రధాన వ్యక్తి క్షయవ్యాధికి గురవుతుంది. బి.సి.జి. ఉద్యమం కొనసాగుతున్న రోజులవి. క్షయవ్యాధిని గురించి చదివాను; డాక్టర్లతో ముచ్చటించాను. ఈ రకం వైజ్ఞానిక విషయాల సమీకరణ, పాండిత్యం నవలకి అవసరంగాని కథానికకి అక్కర్లేదు- ఈయన హడావుడి చేస్తున్నాడు- అనుకోవచ్చు కొందరు. అక్కర్లేదు, నిజమే. నేను తెలుసుకున్నవాటిని ఒకటి రెండు తప్ప యీ కథలో వాడనేలేదు.

 ఏమీ తెలుసుకోకుండా వ్యాధితో బాధపడినవారిని చూస్తే సరిపోవచ్చు. కాని నా కట్లాగనిపించదు. ఆ వ్యాధి భోగట్టా అంతా తెలుసుకున్నాక మనస్సులో వస్తువుకి అనువైన మానసికస్థితి ఏర్పడుతుంది. ఒక వాతావరణం ప్రబలుతుంది. దానికి సరిహద్దు లేర్పడతాయి. అందులోంచి ఒక తీక్షణమైన పరిశీలనా శక్తి, ఆకళింపు చేసుకున్నదాన్ని సూటిగా, శక్తివంతంగా పాఠకుడితో పంచుకోవాలన్న ఒక కళాతృష్ణ ప్రత్యక్షమవుతాయి. చాలామంది రచయితలు బాహ్యజగత్తులో తమ దృష్టిలో పడిన అపూర్వ సంఘటనలను, వ్యక్తులను, విషయాలను నోటుబుక్కులో వ్రాసుకుంటారు. కొంతకాలమయ్యాక వాటిలో కొన్నింటిని కథలుగా రూపొందిస్తారు.


నేను మొదట్లో నోటుబుక్కులో వ్రాసుకున్న కొన్ని విషయాలను కథలుగా వ్రాశాను. అవి వొస్తువు వేట అవసరం లేకుండా చేసినా, వ్రాసేటప్పుడు వాటి నిజ స్వరూపం పోయి, కొత్త అవతారం దాల్చేవి. వ్రాతలో ఆవేశానికి, ఉద్రేకానికి లొంగిపోవటం నా కిష్టమే అయినా, పూర్తిగా అందులో మమేకం అయి, జిజ్ఞాస పోగొట్టుకుని తందన్నాలాడడం నాకిష్టం లేదు. కథలో వ్యక్తులు ఎంతేనా ఉద్రేకం చూపొచ్చు- వస్తు వ్యాప్తంలో ఎంతేనా రసం వుబకొచ్చు- కాని రచయిత నిబ్బరంగా వుండి, పైనుంచి వాటి మార్గం, చిక్కదనం, సంచలనం శాసించే అధికారం పోగొట్టుకోకూడదు.
 
ఇతివృత్తం ఊహలో కొంతకాలం తిప్పుకుంటేగాని, కథకి స్వరూపం ఏర్పడదు. ఆ స్వరూపమే స్థిరమైందని వ్రాసేసి వూరుకోకూడదు. వస్తువు స్వీకరించడం, ఊహలో వ్యక్తుల రూపకల్పన చెయ్యడం వొకెత్తూ; వ్రాసేటప్పుడు కళానుగుణమైన ఆవేశానికి లొంగిపోయి కళానుగుణమైన సత్యాన్ని ప్రదర్శించడం వొకెత్తూ. ఆ సత్యం కథకుణ్ణి చకితుణ్ణి చేస్తుంది. తన లోపలి చీకటి తెరలు తొలగినట్లవుతుంది. ఒక్క క్షణం వూపిరి బిగపెట్టి, ఒక వెలుగుని చూస్తాడు. ఆ క్షణం ఆధ్యాత్మికానుభూతి పొందుతాడు. అట్లా పొంది, అందులో కాస్తోకూస్తో పాఠకుడితో పంచుకోగలిగితే అతని కథ గొప్ప కథ అవుతుందనుకుంటాను.

 థామస్ హార్డీ మంచి కథకుడు. ఆయనకి ధనికుల జీవితం గురించి వ్రాయాలని సరదా. కాని దాన్ని గురించి ఆయనకేమీ తెలియదు. ఆ సరదా తీర్చుకోడం కోసం వ్రాసిన కథలేవీ బాగుండలేదు. వ్రాసే ప్రతి విషయం గురించి రచయితకి ప్రత్యక్షానుభవం వుండి తీరాలనటం లేదు నేను. హత్య చేసిన వాడి మనస్సు చిత్రించడానికి రచయిత హత్య చెయ్యనక్కర్లేదు. తన స్వానుభవానికి అందుబాటులో వున్న వొస్తువుని తీసుకోవాలంటున్నాను. సంస్కృతి, బాల్యజీవితం, స్నేహితులు, గృహజీవితం, సాంఘిక అభిరుచిని నిర్ణయిస్తాయి. ఈ అభిరుచిపైన స్వానుభవం ముద్రపడుతుంది. ఆ ముద్రని అనుసరించివున్న బాహ్యజగత్తు సంఘటనని అంతరంగంలోకి లాక్కుపోయి ఊహలో తిప్పుతూ వుండడం ముఖ్యం. కాలం గడిచాక, దానిలో ప్రయోజనం వున్నట్లయితే అదెల్లానూ కథగా బైటపడుతుంది.

 ‘‘చెప్పదల్చుకున్న విషయం వున్నవాడు శైలిని గురించి పట్టించుకోడు’’ అన్న వొక అభిప్రాయం ఉంది. నేను పూర్తిగా అంగీకరించను. కేవలం వొక యజ్ఞంగా శైలిని గురించి పట్టించుకోనక్కరలేదు నిజమే. కాని శైలంటూ ఒకటుంది- రచయిత వ్యక్తిత్వం అంటూ ఒకటుంది. విషయం చెప్పడంలో కూడా మెళకువలు, చమత్కృతి, వయ్యారం, నాజూకు శక్తి వున్నాయి. పాఠకుణ్ణి తనవైపుకు లాక్కుని లొంగదీసుకుని రచయిత అంతరంగ జగత్తులోకి ప్రవేశింపచెయ్యడం శైలి లక్ష్యం. ఆ నడక, ఆ పోకడ పాఠకుడికి నచ్చితే అసలు ఆ అంతరంగ జగత్తులోంచి పొమ్మన్నా పోడు.

 అంతమాత్రంచేత కొట్టొచ్చేటట్లుండ గూడదు శైలి. అది వొస్తువులో కలిసిపోయి, విడదీయడానికి వీల్లేకుండా అల్లిక జరగాలి. ‘‘ఆయన చాలా గడుసువాడుస్మండీ’’ అని నలుగురూ పైకి చెప్పుకుంటే ఆయన గడుసువాడే కాదు.  ఖండ కావ్యానికి అవసరమైన దీక్ష, నిశ్చల మనస్తత్వము కథానిక రచన కుండాలి. నిత్యవ్యవహారంలో ప్రయోగించే ఉత్తమాటలు పోగుచేసి వ్రాసెయ్యడం సులభమే: కాని అందులో సరియైన పదాలని వెదికి కూర్చడం, పొదగడం, చెప్పదలుచుకున్నదాన్ని తీక్షణంగా చెప్పడం, ఇదే శిల్పం.

 ‘‘ఏమయ్యా, నువ్వేదో కొండల్లోకి వెళ్ళి వొక్కడవూ తపస్సు చేస్తే ప్రపంచానికి ఏమిటి ప్రయోజనం?’’ అని రామకృష్ణ పరమహంసని అడిగారుట. ‘‘నాలో వొక భావ తరంగం లేచి ప్రపంచం అంతటా వ్యాపిస్తుంది’’ అన్నాడుట. కథకుడి వొంద కథలలో, వొక్క కథ అట్లాంటి అనుభూతి తరంగమై విశ్వమంతా వ్యాప్తి చెందుతుందని నా విశ్వాసం. ఎవరో అన్నట్లు సాహిత్యం ఆత్మని రక్షించలేదు- రక్షించతగిందిగా చేస్తుంది.
 
 (‘కాల్పనిక వాద ధోరణి నుండి అనుభూతాత్మక కథా కథన ధోరణికి ఒక కొత్త మలుపును కొనివచ్చిన తెలుగు నవకథా రచయిత’,  క్లాసిక్ నవల ‘చివరికి మిగిలేది’ రచయిత బుచ్చిబాబు శతజయంతి రేపు. ‘కథలు వ్రాయడం ఎలా’ సంకలనం కోసం బుచ్చిబాబు రాసిన వ్యాసానికి పై వ్యాసం సంక్షిప్త రూపం. సౌజన్యం: విశాలాంధ్ర.)
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement