ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరిచ్చిన తీర్పు విలక్షణమైనదీ.. సలక్షణమైనదీనూ.. భారతీయ ఓటరు సరైన సమయంలో స్పష్టమైన తీర్పునిచ్చి తానెంత విజ్ఞతత...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరిచ్చిన తీర్పు విలక్షణమైనదీ.. సలక్షణమైనదీనూ.. భారతీయ ఓటరు సరైన సమయంలో స్పష్టమైన తీర్పునిచ్చి తానెంత విజ్ఞతతో వ్యవహరించగలడో తెలియజేశాడు. ఈ ఎన్నికల ఫలితం ఢిల్లీ పరిధి దాటి దేశం పైనే ప్రభావం చూపగలదు. చిన్నవాడిని, తప్పటడుగులేశాను, లెంపలేసుకున్నాను. మళ్లీ తప్పు చేయను అని నిజాయితీగా ముందుకొచ్చిన కేజ్రీవాల్‌కి అఖండ మెజారిటీ ఇవ్వటం ఢిల్లీవాసులు తీసుకున్న సముచిత నిర్ణయం.
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మూడు స్థానాలకే పరిమితమవ్వడం పరిశీలకుల అంచనాకు కూడా అందలేదు. దశాబ్దాలుగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ డకౌట్ అవ్వడం ఆ పార్టీకి చరిత్రాత్మక అవమానం. అవినీతి, ఆశ్రీత పక్షపాతం కాంగ్రెస్‌ను మట్టి కరిపించాయి. అహంకారం, అంతఃకలహాలు బీజేపీకి చావు తప్పి కన్నుపోయే పరిస్థితిని తీసుకువచ్చాయి. పరిమితికి మించిన వేగం ప్రమాదకరమని, అభివృద్ధి పేరుతో అసంఖ్యాక ప్రజానీకాన్ని, వారి సంక్షేమాన్ని విస్మరించడం కుదరదని ఓటరు మహాశయులు మోదీని హెచ్చరించారు. చేసిన అవినీతి, అవకతవకల పాలనను ఇప్పుడిప్పుడే మర్చిపోలేమని కాంగ్రెస్‌కు ఓటర్లు బుద్ధి చెప్పిన తీరు నుంచి ఆ రెండు జాతీయ పార్టీల వారు పాఠాలు నేర్చుకోవాలి. అలాగే కేజ్రీవాల్ మీద అనేక ఆశలతో ఢిల్లీ ప్రజలు ఓట్లు వేసి ఘనవిజయం కట్టబెట్టారు. ఈ తిరుగులేని మెజారిటీని చూసుకుని ఆయన కర్తవ్యాన్ని మరచిపోరాదు. గతంలో జరిగిన తప్పులను ఎట్టి పరిస్థితిలోనూ పునరావృతం కానీయరాదు. సామాన్యుడు కేంద్రంగా నిజాయితీ రాజకీయాలకు ఇదే నాంది కావాలి.
-డా. డి.వి.జి. శంకరరావు మాజీ ఎం.పి., పార్వతీపురం, విజయనగరం