ఈ వృథా చర్చ ఇక చాలు
ఈవీఎంలపై రాద్ధాంతాన్ని ఆపేస్తే మంచిది. ఏ ఎన్నికల్లోనైనా ట్యాంపరింగ్ నిజంగా జరిగిందా లేదా అన్నదే మనం చేయాల్సిన చర్చ. అందుకు ఏ అవకాశమూ లేకుండా ఏం చెయ్యాలన్నది ఆలోచించాల్సిన మరో అంశం. ఏదో మేరకైనా ఈవీఎంల అవకతవకలకు పాల్పడేందుకు ఉన్న అవకాశాన్ని నివారించేందుకు కాగితపు రసీదును ఇచ్చే పద్ధతిని వాడటంపై అందరిదీ ఏకాభిప్రాయమే. ఇలాంటి కొత్త మెషీన్ల కొనుగోలు కోసం ఇప్పుడు కేంద్రం డబ్బు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. అదే ఈ చర్చ వల్ల జరిగిన ఏకైక లాభం.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) మద్దతుదారులూ, వ్యతిరేకులూ కలసి గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఒక నిరర్థక చర్చను కొన సాగిస్తున్నారు. ఈ క్షుద్ర క్రీడ ద్వారా తాము ప్రజాస్వామ్యానికి కీడు చేస్తు న్నామని గతంలో బీజేపీ అనుకోలేదు, ఇప్పుడు బీజేపీ వ్యతిరేకులూ అలా ఆలోచించడం లేదు. 2014కు ముందు ఇవే ఈవీఎంలతోనే తామెలా ఎన్నికల్లో గెలుపు సాధించామో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మనకు చెప్పవు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీదైతే మరీ వితండవాదన. వారు ఎన్నికల్లో గెలుపు సాధించినప్పుడల్లా ఎన్నికల కమిషన్, ఈవీఎంలు సరిగ్గా పని చేశాయని, ఓడిపోవడం మొదలైనప్పటి నుంచే ఈవీఎంల అవకతవకలు మొదలయ్యాయని అనుకోవాలి.
మరోవైపు, అవకతవకలన్నీ 2009కు ముందే ఉన్నట్టు, ఇప్పుడు ఈవీఎం లన్నీ బాగైపోయినట్టు బీజేపీ చెబుతుంది. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నించడమే నేరమన్నట్టు ఇప్పుడు బీజేపీ మాట్లాడుతుంది. కానీ ఎన్నికల సభల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జేమ్స్ మైకేల్ లింగ్డో పేరెత్తి మరీ ఆరో పణలు చేసిన తొలి రాజకీయ నేత నరేంద్ర మోదీ అనే విషయాన్ని టీవీ యాంకర్లు అలవాటుగానే మరచిపోయారు.
తప్పుడు సమస్యలపై సాగుతున్న చర్చ
ఈవీఎంలపై అన్ని పార్టీలూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న కారణంతో మాత్రమే వాటిపై జరుగుతున్న చర్చను అర్థంలేనిదని చెప్పడం లేదు. రెండు పక్షాల వాళ్లూ తప్పుడు విషయంపై చర్చ చేస్తున్నారు కాబట్టే ఇది వృథా చర్చ అని అంటున్నా. ఈవీఎంలను ఎప్పుడైనా ట్యాంపరింగ్ చేసే వీలుందా, లేదా అన్న అంశంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈవీఎంలు ఏ మాత్రం ట్యాంపరింగ్‌కు వీలు కాని యంత్రాలని వాటి సమర్థకులు వాది స్తున్నారు. దీనికి ప్రతిగా వాటి వ్యతిరేకులు ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో నిరూపించడంలో నిమగ్నమైపోయారు. ఈవీఎంలను ట్యాంప రింగ్ చేసి ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడం అసాధ్యమేమీ కాదన్నది వీరి వాదన.
ఈ ప్రశ్నకు సూటియైన, స్పష్టమైన జవాబు ఏమిటంటే, ఎలాంటి అవ కతవకలకు వీలులేని ఎలక్ట్రానిక్ పరికరం మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. నేనేమీ ఇంజనీర్‌ను కాను. అయినప్పటికీ చిప్ లేదా మదర్‌బోర్డును మార్చడం ద్వారా ఏ యంత్ర పరికరాన్నైనా ఎలా అనుకుంటే అలా మార్చె య్యవచ్చనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోగలను. సాఫ్ట్‌వేర్ ద్వారా అత్యంత సూక్ష్మ స్థాయిలో అవకతవకలకు పాల్పడవచ్చు. వాస్తవం ఏమి టంటే ఈవీఎంలలో ట్యాంపరింగ్ అసాధ్యమేమీ కానప్పటికీ, మన ఎన్నికల వ్యవస్థలో దీనికున్న అవకాశం అతి స్వల్పం. కాబట్టి సిద్ధాంత రీత్యా ఈవీఎం లలో లోటుపాట్లపై చర్చ చేయడంలో అర్థం లేదు. మొబైల్ ఫోన్లలో వందల రకాల నమూనాలున్నట్టుగానే ఈవీఎంలలో కూడా డజన్ల మోడళ్లున్నాయి. ఇతర దేశాలలో ఏ మోడల్ మెషీన్‌తో ఎలాంటి అనుభవం వచ్చిందనేది మనకు అప్రస్తుతం.
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా?
మన దగ్గర ఈవీఎంల ద్వారా అవకతవకలకు పాల్పడేందుకు ఉన్న అవకాశం ఎంత అనేది అసలు ప్రశ్న. మన దగ్గర ఉపయోగించే బేసిక్ మోడల్ ఈవీఎంలలో ఇంటర్నెట్ లేదా మొబైల్ సిగ్నళ్లు పని చేయవు. అంటే ఈవీ ఎంలోని సాఫ్ట్‌వేర్‌ను మార్చకుండా దీనిని దూరం నుంచి ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఒకవేళ ఫ్యాక్టరీలో తయారు చేసేటప్పుడే ఈవీఎంలో బిగించే చిప్‌ను ట్యాంపర్ చేశారనుకున్నా, దాంతో ఏదో ఒక పార్టీకి జరిగే లాభమేమీ ఉండదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ఎన్నికల గుర్తును లేదా పార్టీ పేరును గుర్తించలేదు. ఇది కేవలం అభ్యర్థి సంఖ్యను మాత్రమే గుర్తిస్తుంది. ఇక తమ పార్టీ అభ్యర్థుల పేర్లు ఏ నియోజకవర్గంలో ఏ సంఖ్యా క్రమంలో ఉంటాయో పోలింగ్‌కు రెండు వారాల ముందు దాకా ఎవరికీ తెలియదు.
ఒకవేళ మెషీన్‌లో ఏదో ఒక సంఖ్యకు లాభం జరిగేలా ట్యాంపరింగ్ చేసినా దాని వల్ల వేర్వేరు నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీలకు లాభం జరుగు తుంది తప్ప, ఏదో ఒక పార్టీకే లాభం జరిగే అవకాశం లేదు. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి ట్యాంపరింగ్ చాలా కష్టం. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి ఏ మెషీన్‌ను పంపాలనేది పోలింగ్‌కు కేవలం మూడు, నాలుగు రోజుల ముందే ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. పోలింగ్ మొదల వడానికి ముందు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎం బటన్లు నొక్కి వాటిని తనిఖీ చేసే అవకాశం అన్ని పార్టీల ఏజెంట్లకూ ఇస్తారు.
ఇవి కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ మరో ట్యాంపరింగ్ అవకాశం గురించి చెబుతోంది. ఓట్లు వేయడానికి ముందే ఈవీఎం మదర్‌బోర్డును మార్చివేసి, ఉదయం తనిఖీ పూర్తయిన తర్వాత ఓటింగ్ మొదలయ్యాక ఎవరైనా ఒక ఓటరు కుట్రపూరితంగా ఒక కోడ్‌ను నొక్కడం ద్వారా ట్యాంపరింగ్ ప్రక్రి యను ఆరంభించవచ్చు అని వారంటారు. నిజానికి ఇది అసాధ్యమేమీ కాదు. అయితే ఇలా ట్యాంపరింగ్ చేయాలంటే ఆచరణలో ఏమేం చేయాల్సి ఉంటుందో ఆలోచించండి. ఢిల్లీ నగర పాలక సంస్థ వంటి చిన్న స్థాయి ఎన్నికల్లో కూడా 15 వేల మెషీన్లను తెరిచి వాటి విడి భాగాలను మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత వేలాది పోలింగ్ కేంద్రాల్లో కోడ్‌ను మార్చే కుట్రను అమలు చేయడానికి కనీసం ఒక్కో వ్యక్తినైనా కేటాయించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి రహస్యాన్ని కాపాడగల నమ్మకస్తుడై ఉండాలి. మన లాంటి దేశంలో ఇంత విస్తృత స్థాయి కుట్రకు తెరతీశాక, దానికి పాల్పడ్డ వేలాది మందిలో ఒక్కరైనా దాన్ని బట్టబయలు చేయకుండా ఉండడమనేది అసలు సాధ్య మేనా? వేలాది మంది వ్యక్తులలో ఒక్కరైనా దీని గురించి మాట్లాడకుండా ఉంటారా? ఒక్క బూత్‌లోనైనా ఈ ట్యాంపరింగ్ గుట్టు రట్టు కాదా?
నిరాధారమైన ఆరోపణలు
కాబట్టి ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమా, కాదా అన్న సైద్ధాంతిక చర్చను ఇప్పటికైనా ఆపేస్తే మంచిది. అసలు ఎక్కడైనా ఎన్నికల్లో ఇలాంటి ట్యాంపరింగ్ వ్యవహారం నిజంగా జరిగిందా లేదా అన్నదే మనం చేయాల్సిన చర్చ. భవిష్యత్తులో ఇలాంటి చిన్న అవకాశం సైతం పూర్తిగా లేకుండా పోవాలంటే ఏం చెయ్యాలన్నది మనం ఆలోచించాల్సిన మరో అంశం. మొదటి విషయానికొస్తే.. ఏ ఎన్నికల్లోనైనా ట్యాంపరింగ్ జరిగిందని నిరూపించడానికి ఏ పార్టీ దగ్గరా ఆధారాలు లేవు. ముంబైలో ఒక అభ్యర్థికి తన పోలింగ్ బూత్‌లో ఒక్క ఓటూ పడలేదన్న విషయం, మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉపఎన్నిక సందర్భంగా ఈవీఎంలో జరిగాయని చెప్పిన లోటుపాట్లూ... ఇవి రెండూ మీడియా పరిశోధనలో అబద్ధమని తేలాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఫిర్యాదులన్నీ ఫలితాలు వెలువడ్డ తర్వాతే ముందుకొచ్చాయన్నది గమనార్హం. పోలింగ్ రోజున ఉదయం పార్టీల ఏజెంట్ల తనిఖీ సందర్భంగా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగిన మాట నిజమే అయితే కాగితపు స్లిప్‌తో కూడిన ఈవీఎంలను ఉపయోగించిన నియోజకవర్గాల్లోనైనా ఫలి తాలు భిన్నంగా రావాలి కదా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఢిల్లీ మునిసి పల్ ఎన్నికల్లోనూ అలాంటి ఆధారాలేమీ లేవు.
ఈవీఎంలను సాకుగా చూపడం మానండి
ఇక రెండో ప్రశ్నకు జవాబు ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు రెండూ ఇదివరకే చెప్పేశాయి. ఏదో మేరకైనా ఈవీఎంల అవకతవకలకు పాల్పడేందుకు ఉన్న అవకాశాన్ని నివారించేందుకు కొత్త తరహా వీవీపీటీ మెషీన్ (ఓటు వేసిన తర్వాత కాగితపు రసీదును వెలువరించే మిషన్)ను ఉపయోగించే విష యంలో అందరిదీ ఏకాభిప్రాయమే. ఇలాంటి కొత్త మెషీన్ల కొనుగోలు కోసం ఎన్నికల కమిషన్‌కు కావాల్సిన డబ్బును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వ లేదు. గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు సిద్ధపడలేదు. ఈ చర్చ వల్ల జరిగిన ఒకే ఒక లాభం ఏదైనా ఉందంటే ఇప్పుడు కేంద్రం ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడటమే. ఇక ముందు జరుగబోయే ఎన్నికలన్నిం టిలోనూ కొత్త నమూనా ఈవీఎంలనే ఉపయోగిస్తామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నిరర్థక అంశంపై చర్చను ఇకనైనా ఆపే య్యాలన్న గ్రహింపు రాజకీయ పార్టీలన్నింటికీ కలుగుతుందని ఆశిద్దాం.
తాజాకలం: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో మా పార్టీ స్వరాజ్ ఇండియా కూడా పోటీ చేసింది. మేం ఒక్క సీటునైనా గెల్చుకోలేకపోయాం. ఓట్లు కూడా మేం ఆశించిన దానికన్నా చాలా తక్కువే పడ్డాయి. మా అభ్యర్థులలో కూడా చాలా మందికి మెషీన్లే మమ్మల్ని మోసం చేశాయేమోనన్న అనుమానం కలి గింది. కానీ మేం ఈవీఎంలను సాకుగా చెప్పడానికి బదులు మన లోపాలే మిటో నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోవడం మేలని భావించాం. ఇతర పార్టీలు కూడా అలాగే చేస్తాయని ఆశిద్దాం.
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
మొబైల్: 98688 88986 ‘ Twitter: @_YogendraYadav
యోగేంద్ర యాదవ్