ఈసారి ఓటు ఎలా? | 17 political parties likely to approach EC on EVMs | Sakshi
Sakshi News home page

ఈసారి ఓటు ఎలా?

Published Sun, Aug 5 2018 2:26 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

17 political parties likely to approach EC on EVMs - Sakshi

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈవీఎం లను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉన్నందున 2019 ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లనే ఉపయోగించాలని కాంగ్రెస్, తృణమూల్‌ సహా 17 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈవీఎం లను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని, పైగా వీవీప్యాట్‌ (ఓటరు ఏ పార్టీకి ఓటు వేసిందీ తెలియపరుస్తూ రసీదు ఇచ్చే మిషన్‌)ల అనుసంధానంతో ఈవీఎంలు మరింత భద్రంగా, కచ్చితంగా పనిచేస్తాయని ఎన్నికల సంఘం పదే పదే స్పష్టం చేస్తున్నా విపక్షాలు నమ్మడం లేదు.

కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. గతే డాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఈవీఎంలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పడటాన్ని సాక్ష్యంగా చూపుతోంది. 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని ఆప్‌ ఆరోపించింది. ‘ఈవీఎంల స్థానం లో బ్యాలెట్‌ పేపర్లు పెట్టాలన్నది మా డిమాండ్‌. పార్టీలన్నీ ఒక్కటై దీన్ని సాధించాలి’అని తృణమూల్‌ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.

ప్లీనరీలో కాంగ్రెస్‌ తీర్మానం...
ఈవీఎంలను తొలగించాలంటూ ఈ ఏడాది మార్చి లో జరిగిన 84వ ప్లీనరీలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. ఈవీఎంలను వాడు తున్నప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వస్తున్నాయని, ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే ఇలా జరుగుతోందని ఆ పార్టీ వాదిస్తోంది. వచ్చే సోమవారం అన్ని పార్టీలు సమావేశమై దీనిపై చర్చిం చనున్నాయి.

పార్లమెంటులో ఈవీఎంలపై చర్చకు డిమాండ్‌ చేయాలని నిర్ణయించాయి. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలసి ఈవీఎంలపై వినతిపత్రం సమర్పించనున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు కాదంటే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ పేపర్లను ప్రవేశపట్టే విషయం ఆలోచిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈవీఎంలతో లాభాలివీ...
ఈవీఎంల వల్ల కాగితం ఆదా అవుతుంది.  
ఈవీఎంలను భద్రపరచడం, పంపిణీ చేయడంలోనూ సమస్యలను అధిగమించవచ్చు.
ఈవీఎంల వాడకంతో చెల్లని ఓటంటూ ఉండదు.
ఈవీఎంల ద్వారా గంటకు 240 ఓట్లు వేయొచ్చు. కానీ బ్యాలెట్‌ బాక్స్‌లలో ఇది సాధ్యం కాదు.
  కేవలం 6 వోల్ట్‌ల బ్యాటరీతోనే ఈవీఎంలు పనిచేస్తాయి కనుక మారుమూల గ్రామాల్లోనూ ఈవీఎంలను వాడటం తేలిక.  

బ్యాలెట్‌ పేపర్‌తో కష్టాలు...
బ్యాలెట్‌ విధానంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఎక్కువ. రాజకీయ ప్రాబల్యంగల వారు రిగ్గింగ్‌కి పాల్పడటం, ప్రత్యర్థులకు ఓట్లు పడ్డాయనుకున్న చోట్ల బ్యాలెట్‌ బాక్సుల్లో ఇంక్‌ పోయడం లాంటి వాటికి అవకాశం ఉంది.  
ఓటరు ఎంచుకున్న అభ్యర్థి గుర్తుపైన ముద్ర పడకున్నా, లేక పడిన ముద్ర పూర్తిగా కనిపించకపోయినా ఆ ఓటు చెల్లకపోవచ్చు.
బ్యాలెట్‌ బాక్స్‌లను సురక్షిత ప్రదేశానికి తరలించడం కషం. దీనికి పెట్టాల్సిన ఖర్చు అధికం.
    ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్‌కు ఈవీ ఎంలతో  2 నుంచి 3 గంటలు పడితే, బ్యాలెట్‌ పేపర్‌తో 30 నుంచి 40 గంటలు పడుతుంది.
2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 9,30,000 పోలిం గ్‌ స్టేషన్లలో 14 లక్షల ఈవీఎంలను ఉపయోగించారు. 81.7 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు 87.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వినియోగించాలంటే బ్యాలెట్‌కన్నా ఈవీఎంలే నయమనే వాదనా ఉంది.

మన బ్యాలెట్‌ కథా కమామిషు!
ఎన్నికల నిర్వహణకు ఒక రూపు రేఖ తీసుకువచ్చిన ఘనత తొలి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుకుమార్‌సేన్‌ దే. ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. తొలి ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికీ వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్‌ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తును పెయింట్‌ చేశారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారో, అన్ని బాక్స్‌లు ఉంచారు.

ఓటర్లు తమకు ఇచ్చిన బ్యాలెట్‌ పేపర్‌ను వారికి నచ్చిన అభ్యర్థి బ్యాలెట్‌ బాక్స్‌లో వేస్తే సరిపోతుంది. 1957లో కూడా ఇదే ప్రక్రియను అనుసరించారు. 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఎన్నికల గుర్తులన్నీ ఒకే బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రించి, తమకు నచ్చిన అభ్యర్థిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్‌ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలలపాటు జరిగింది. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం కూడా తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 62 కోట్ల బ్యాలెట్‌ పేపర్లను ముద్రించారు.

ఇక ప్రతి అభ్యర్థికి ఒక్కో బ్యాలెట్‌ బాక్స్‌ తయారీని ప్రఖ్యాత గోద్రేజ్‌ కంపెనీ చేపట్టింది. ముంబైలోని విఖ్రోలి సబర్బన్‌ ప్రాంతంలో వాటి తయారీ జరిగింది. రోజుకు 15 వేలకుపైగా బ్యాలెట్‌ బాక్స్‌ల చొప్పున 2.1 కోట్లకుపైగా స్టీల్‌ బ్యాలెట్‌ బాక్స్‌లను తయారు చేసి అనుకున్న సమయానికి అందించడంలో గోద్రేజ్‌ కంపెనీ సఫలమైంది. నేపాల్, ఇండోనేసియా, సూడాన్‌ వంటి దేశాలు భారత్‌ ఎన్నికల నిర్వహణను పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను ప్రశంసించింది. ఇలా అభ్యర్థికొక బ్యాలెట్‌ బాక్స్‌లతో మొదలైన ప్రయాణం ఈవీఎంల వరకు చేరుకొని, ఇప్పుడు మళ్లీ ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్న చర్చకు దారి తీస్తోంది.


ఈవీఎంలపై అనుమానాలివీ..
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ట్యాంపరింగ్‌ (ఏ బటన్‌ నొక్కినా ఒకే పార్టీకి ఓటు పడేలా) చేయొచ్చన్న ఆరోపణ ఉంది. 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ, ఆప్‌ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగినట్లు ఆరోపించాయి.
ఈవీఎంలతో అవకతవకలకు అవకాశం లేదని కచ్చితంగా చెప్పడానికి లేదు. పూర్తిగా జోక్యానికి వీల్లేని యంత్రమనేది ప్రపంచంలో లేనేలేదనీ, మనం గమనించలేనంత చిన్న పరికరం సాయంతో ఈవీఎంల పనితీరును ప్రభావితం చేయవచ్చని శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త గౌతమ్‌ రజా పేర్కొన్నారు.
ఈవీఎంల వాడకంలోనూ బూత్‌ల ఆక్రమణ జరిగే అవకాశం లేకపోలేదు. యంత్రాలతో చేసే తప్పుడు పనులకు కండబలం అవసరం లేదు. అది ఎవరి కంట్లో పడదు కాబట్టి మరింత ప్రమాదమనే అభిప్రాయం వినబడుతోంది.
అర్హత లేని సిబ్బంది యంత్రాల నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్‌ ఎన్నికలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది.
నెదర్లాండ్స్‌లో 2000 సంవత్సరంలో ఈవీఎంల వాడకంలో సమస్యలు ఎదురవడంతో తిరిగి బ్యాలెట్‌ ఓటింగ్‌నే అనుసరించారు.
ఈవీఎంలతో ట్యాంపరింగ్‌కు అవకాశమున్నందున ప్రపంచ దేశాలు పేపర్‌ బ్యాలెట్‌ వైపునకు మళ్లుతున్నాయని, భారత్‌ కూడా దీన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ సూచిస్తున్నారు.


బ్యాలెట్‌కు బ్లాక్‌చెయిన్‌..!
ఈవీఎంల వాడకం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజ కీయ పార్టీలు, నిపుణులు చెబుతుండటంతో ఇకపై ఓటింగ్‌ కోసం బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగించాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో ఓటరు వివరాలు, ఓటింగ్‌ వివ రాలు సంకేతభాషలో నిక్షిప్తమవుతాయి కాబట్టి ఇతరులెవరూ వాటిని చూడటం లేదా మార్పుచేర్పులు చేయడం సాధ్యం కాదు.

నెట్‌వర్క్‌లో ఉన్నవారిలో అంటే.. వ్యవహారం నడిపిన వారందరూ అంగీకరిస్తేనే మార్పులు సాధ్యమవుతాయి. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని సురక్షితమైన ఓటింగ్‌కు కొత్త మార్గంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. మీ వివరాలతో ఎన్నికల నిర్వహణ సంస్థ వద్ద పేరు నమోదు చేసుకోవాలి. తరువాతి దశలో ఈ వివరాలను గోప్యంగా ఉంచుతూనే మీకు ఓ డిజిటల్‌ గుర్తింపు సంఖ్య, పాస్‌వర్డ్‌ లభిస్తాయి.

స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లతో డిజిటల్‌ బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటు వేయవచ్చు. ఓట్లు లెక్కకట్టేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నా లజీ వాడితే ఎవరికి ఓటు పడిందో తెలుస్తుందిగానీ.. ఓటేసిన వారి వివరాలు ఏమాత్రం తెలియవు. సియర్రా లియోన్‌ అనే చిన్న దేశం ఈ ఏడాది మార్చిలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా త్వరలో ఈ టెక్నాలజీని వాడతామని ప్రకటించాయి.  

ఈవీఎంలను తీసేసే ప్రసక్తి లేదు: ఈసీ
ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని, వాటిని ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రావత్‌ స్పష్టం చేశారు. వీవీప్యాట్‌లతో ఈవీఎంల పనితీరు మరింత పారదర్శకంగా, కచ్చితంగా మారిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ బ్యాలెట్‌ పేపర్‌ వైపు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.

ఈవీఎంలలో లోపాలు లేవని, దానిని ఉపయోగిస్తున్న తీరుపైనే ఓటర్లకు అనుమానాలున్నాయని, ఎన్నికల సంఘం వాటిని నివృత్తి చేయాల్సి ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ వంటి సంస్థల ప్రతినిధులు, నిపుణులు అంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్‌ల పనితీరుపైనా కొందరు ఓటర్లు అనుమానాలు వ్యక్తం చేశారని, ఎన్నికల సంఘం వారి అనుమానాలు తీరేలా యంత్రాలను మెరుగుపరచాలని వారు సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement