నరేంద్ర మోడీకి భజనపరుల బెడద
బీజేపీ ఢిల్లీ పంజరాల్లోని పెంపుడు చిలకల మాటను కాక పార్టీ క్యాడర్ల మాటనే పట్టించుకుంది. అందుకే మోడీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. ఆ ఉత్సాహం ఆయనలో తొణికిసలాడటం కనిపిస్తూనే ఉంది. మోడీ ఆందోళన చెందాల్సిన అంశం ఒకటి ఇంకా మిగిలి ఉంది. ఇంతవరకు మద్దతుదారులే ఆయన చుట్టూ ఉన్నారు. ఇక భజనపరులు వెంటపడతారు. నోటికి చేతికి మధ్య ఎన్నో అగడ్తలున్న రాజకీయ క్రీడలో అది పొంచి ఉన్న ముప్పు కాగలుగుతుంది.
యూరప్ లేదా అమెరికాల లోని గొప్ప పురాతన భవనాల పైకప్పు మీద వాతావరణ సూచి క ఉండేది. భవనానికి పైన అదేమీ శోభనిచ్చేది కాదు. అయితే దాని ప్రయోజనం సౌందర్య శాస్త్ర ప్రమాణాలతో కొలవగలిగింది కాదు. మానవ కార్యకలాపాలపై ప్రకృతి నేటి కంటే చాలా ఎక్కువ నియంత్రణను కలిగి ఉండిన రోజుల్లో అది గాలివాటపు దిశను సూచించేది.
బ్రిటిష్ వాళ్లు కలకత్తా, మద్రాసు, బొంబాయి, 20వ శతాబ్దపు కొత్త ఢిల్లీ వంటి వైభవోపేతమైన మహా నగరాలను నిర్మించారు. ఆ నగరాలలో వాతావరణ సూచికలు ఉండే వి కావు. అందుకు కారణం ఊహించగలిగేదే. భారతదేశంలో ప్రకృతి ముందస్తుగా అంచనా క ట్టడానికి వీలుగా ఉంటుంది. తుఫానులు వచ్చే ముందు ఆకాశంలో కారు మేఘాలు సుడులు తిరుగుతూ అగ్రగామి సైనిక శ్రేణుల్లాగా కదంతొక్కుకుంటూ వస్తాయి. ఇంటిలో ఉక్కబోస్తుండగా బయల్దేరి, వర్షంలో తడిచి గజగజలాడుతూ జలుబుతో ఇంటికి చేరడానికి ఢిల్లీ నగరం లండన్ కాదు.
వాతావరణ సూచికల్లాంటి బాహిరమైన ఇంద్రియాలను కోల్పోయినందుకు బదులుగా ఢిల్లీకి అంతకంటే మిన్నయైన అంతర్గత ఆంటెనాలు లభించాయి. ఢిల్లీలో ఆందోళన చెందవలసినది మానవ ప్రకృతి గురించేగానీ ప్రకృతి గురించి కాదు, రాజధానిలో పాలక వర్గానికి చెం దిన నానా గోత్రీకులు ఉండే ప్రత్యేక భాగంలోని ప్రతి చెవికీ శక్తివంతమైన ఆంటెనా ఉంటుంది. రాజకీయ గాలి నాటకీయంగా ఎటు వీస్తోందనే విషయాన్ని ఆ ఆంటెనా ఎప్పటికప్పుడు దిశను సరిచేసుకుంటూ నిరంతరం గ్రహిస్తుంటుంది. సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు సాగుతుండగా కూడా ఢిల్లీలోని అధికార దళారుల దొంతరలు బతికిబట్టగలిగాయి. సాధ్యమైనది వాస్తవం కాకపోవడమే కాదు, సంభావ్యం కూడా కాకుండా పోయే పరిస్థితులలో ఎవరు పైకి ఎగబాకుతున్నారో పసిగట్టి వారికి దండప్రమాణాలు ఆచరించనిదే అవి మనగలిగేవి కావు. ఘనమైన మన దేశ రాజధానిలో గత ఐదేళ్లలో రాజకీయ చర్చ ఎలా మారుతూ వచ్చిందనేదాన్ని నమోదు చేయడం చరిత్రకారులు మాత్రమే చేయగలిగిన పని.
కాంగ్రెస్, దానికి నేతృత్వం వహిస్తున్న నెహ్రూ కుటుంబం కనీసం వచ్చే ఇరవై ఏళ్లు దేశాన్ని ఎలా పరిపాలిస్తుంద నేది తప్ప మరే విషయమూ 2009 నాటి ఢిల్లీలో చర్చకు వచ్చేది కాదు. అందుకే ప్రధాని మన్మోహన్‌సింగ్ సైతం ఆ ఏడాది చివర్లో జరిగిన తన సుప్రసిద్ధమైన పత్రికా సమావేశంలో ఆ విషయాన్ని లాంఛనంగా ప్రతి ధ్వనించారు. రాహుల్‌గాంధీ ఎప్పుడు ప్రధాని కావాలని నిర్ణయించుకుంటే అప్పుడు ఆ పదవి చేపట్టవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినా గానీ రాహుల్ వేచి ఉండే గదినే ఎంచుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసాభావం వ్యక్తమయ్యేది. 2010 శీతాకాలానికల్లా అవినీతిపై కొంత ఆందోళన వ్యక్తమైనా, మొత్తంగా ఈ కథనం పెద్దగా మారింది లేదు. తదుపరి దర్బారులో అధికార చక్రం తిప్పేవారుగా రాహుల్ బృందానికి విందు వినోదాల్లో మన్నన లభించేది, ఆ బృందాన్ని ఆకట్టుకోడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నించేవారు.
ఇక అప్పుడు అన్నా హజారే, ఆయన్ను వెన్నంటి బాబా రాందేవ్ రంగప్రవేశం చేశారు. అయినా తలలు భయభక్తులతో ఊగుతూనే ఉన్నాయి. కొందరు తెలివిమంతులు జరగబోయేదంతా చూడగలిగారు. క్రమానుగతంగా సంభవించే ఆ కుదుపు బ్రహ్మాండంగా సాగుతున్న కాంగ్రెస్ ఊరేగింపునకు విఘాతం కలిగించడం అనివార్యమని గుర్తించగలిగారు. ఆ ‘ఈగ’ను తోలడానికి నియమితులైన మంత్రులంతా... అది ఎలా వచ్చిందో అలాగే అదృశ్యమైపోతుందన్నారు. ప్రజల జ్ఞాపకం ఎలాంటిదో వినలేదూ? స్వల్పమైనది, స్వల్పమైనది, స్వల్పమైనది. అందుకే వారి ముఖాల్లో నవ్వులు విప్పారుతూనే ఉన్నాయి. అంతలో 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో 80 సీట్లను గెలుచుకుంటే కాంగ్రెస్ దాన్ని తన గెలుపుగా ప్రకటిస్తుందనీ, రాహుల్ ప్రధాన మంత్రి కుర్చీని చేరడానికి ఆ గెలుపే ద్వార తోరణం కాగలదని ఆనాటి కథనం. యూపీ ఓటమితో ఆ కథనంపై అనుమానపు తొలి ఛాయలు పొడచూపాయి.
ఆ తదుపరి అదే ఏడాది గుజరాత్‌లో నరేంద్ర మోడీ తిరిగి గెలుపొందారు. అది పరిస్థితిని మార్చడం ప్రారంభించింది. విచిత్రంగా మోడీ ఇటు అనుమానాన్నీ, అటు ఆశనూ రేకెత్తింపజేశారు. రాజకీయ శక్తియుక్తులు, పరిపాలనాపరమైన రికార్డు ఆయనకు గట్టి సానుకూలాంశాలయ్యాయి. అయినా గానీ కాంగ్రెస్ గుజరాత్ అల్లర్లను మోడీ వ్యతిరేక సమీకరణగా మార్చగలుగుతుందా? బీజేపీ మోడీ బొమ్మను పెట్టుకుని ముందుకు సాగాలనే ఎంచుకుంటే చేజేతులా ఓటమిని కొనితెచ్చుకోవడమే అవుతుందంటూ వందలాదిగా వ్యాసాలు, వార్తా కథనాలు మీడియాను ముంచెత్తాయి.
అయితే బీజేపీ ఢిల్లీ పంజరాల్లోని పెంపుడు చిలకల మాటను పెడచెవిన పెట్టి, వీధుల్లోని తమ పార్టీ క్యాడర్ల మాటనే పట్టించుకుంది. అందుకే మోడీ ఇప్పుడు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. ఆ ఉత్సాహం ఆయనలో తొణికిసలాడటం కనిపిస్తూనే ఉంది. అయితే మోడీ ఆందోళన చెందాల్సిన అంశం ఒకటి ఇంకా మిగిలి ఉంది. ఇంతవరకు ఆయన మద్దతుదారులే ఆయన చుట్టూ ఉన్నారు. ఇక భజనపరులు ఆయన వెంటపడతారు. నోటికి చేతికి మధ్య ఎన్నో అగడ్తలున్న రాజకీయ క్రీడలో అది పొంచి ఉన్న ముప్పు కాగలుగుతుంది.
ఢిల్లీకి మోడీ గురించి ఉన్న ఆందోళనకు కారణం ఆయన తమ కోవకు చెందని బయటి వ్యక్తి కావడమే. అంతేగానీ ఆయన పార్టీ గురించి కాదు. ఢిల్లీ ఉన్నత వర్గాలు తమకు అందించాల్సిన సేవల గురించి నిర్భయంగా నిలదీయగల బాపతు. అందుకు వీలుగా వారికి ఇంగ్లిషు ప్రేరితమైన విద్యాబుద్ధులు, సంస్కృతులతో కూడిన నాజూకు సంస్కారం కావాలి. అది లేని మోడీ వారికి బయటివాడే. ఆయన తన సోదరుని టీ దుకాణంలో కస్టమర్లకు టీ అందించేవాడు. ఆయన కుటుంబానికి నేటికీ తమ మూలాలతో బలమైన అనుబంధం ఉంది. మోడీ ఇంగ్లిషు భాష ఇంగ్లండు రాణిని ఆకట్టుకోలేక పోవచ్చు. అయితే అన్నిట్లోకి ఎక్కువగా ఢిల్లీ ఆందోళన చెందేది మాత్రం పెళుసు స్వభావం గల వ్యక్తిగా మోడీకి ఉన్న పేరు గురించే. ఢిల్లీకి అంగీకారయోగ్యమైనది రాజీయే గానీ జవాబుదారీతనం కాదు. దశాబ్దాల తరబడి తాము కూడబెట్టుకున్న విలువైన పింగాణి వస్తువులను కుమ్ముకుంటూ పోయే పోట్ల గిత్తను వారు కోరుకోరు.
వివిధ స్థాయిలలో అధికారం నెరపిన బయటివారితో ఢిల్లీకి ఇంతకు ముందు కూడా అనుభవం ఉంది. అయితే వారిలో చాలా వరకు... ఢిల్లీ అంటే అసమర్థులకు అత్యం త ప్రియమైన నగరమని రుజువు చేసినవారే. ఒక్క లాల్‌బహదూర్ శాస్త్రి మాత్రమే ఆ నగరపు గతిని మార్చగలిగిన బయటి వ్యక్తి కాగలిగేవారు. అయితే ఆయన అందుకు తగినంత కాలం జీవించలేదు. పాకిస్థాన్‌తో తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకోవడానికి చేసిన కృషి ఆయనపై తీవ్ర ప్రభావం చూపి ఉండాలి. ఢిల్లీ తన ఒక ముఖంతో జనాం తికంగా మోడీని ప్రతిఘటిస్తుంది, మరో బహిరంగ ముఖంతో ఆనందాన్ని కనబరుస్తుంది. ఆ రెండు ముఖాల మధ్య ముఖాముఖి ఎన్నికలకు ముందు ఇంకా మిగిలి ఉన్న ఈ ఆరు నెలల కాలాన్ని ఆసక్తికరం చేయనుంది.
- ఎం.జె.అక్బర్
సీనియర్ సంపాదకులు