
డబ్బు జబ్బు వైద్యానికి ‘చికిత్స’
కొత్త కోణం:
గవర్నరంతటి వాడికే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇంత చేదు అనుభవం ఎదురైతే, సాధారణ పౌరుల ధన, ప్రాణాలకు హామీ ఎక్కడ? వైద్య, ఆరోగ్యరంగాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక మంచి ప్రత్యామ్నాయ విధానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం నరసింహన్ చేస్తారని ఆశిద్దాం. క్యూబాలో అటువంటి వినూత్న ప్రజారోగ్య విధానం అమలులో ఉంది. మన కార్పొరేట్ వైద్య రంగాన్ని దారిలో పెట్టడానికి, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి వైద్య ఆరోగ్య రంగాల్లో క్యూబా సాధించిన విజయాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలి.
‘‘రోగి నుంచి వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోకుండానే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నేను ఒక చిన్న సమస్యతో ఆసుపత్రికి వెళితే ఎక్స్‌రే సహా నానారకాల పరీక్షలు చేశారు. ఏమీ లేదని తేల్చారు. అవసరం లేని పరీక్షలు చేస్తూ రోగులు బతికుండగానే చంపేస్తున్నారు. ఉదాహరణకు, మధుమేహం వ్యాధి లేని ఒక రోగికి శస్త్ర చికిత్స చేసే ముందు 28 పర్యాయాలు రక్తపరీక్ష చేయడం జరుగుతోంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఇక బతకడని తెలిసినా వైద్యం చేస్తున్నామంటూ రోజులు గడిపేస్తూ బిల్లులు పెంచే అధ్వాన స్థితికి కార్పొరేట్ ఆసుపత్రులు నేడు చేరాయి. పలు ఆసుపత్రులు రాజకీయ నేతలకు, వీఐపీలకు రాయితీలు ఇస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే రోగం కాదుగానీ, బిల్లులు రోగిని పూర్తిగా చంపేస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి.’’ ఇవి, ఏ విప్లవకారుడో లేక ఏ ఉద్యమకారుడో చేసిన వ్యాఖ్యలు కావు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్వయంగా అన్న మాటలు.
గవర్నరంతటి వాడికే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇటువంటి చేదు అనుభవం ఎదురైతే, సాధారణ పౌరుల ధన, ప్రాణాలకు హామీ ఎక్కడ? రెండు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న గవర్నర్ అత్యవసర సేవలైన వైద్య ఆరోగ్య పరిస్థితులను అర్థంచేసుకుని, బహిరంగంగా హెచ్చరించడం, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తానని ప్రకటించడం సంతోషకరం. ఈ విషయంలో గవర్నర్ వ్యాఖ్యలకులాగే ఆయన చేతలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
దేశంలో ఒకవైపు వైద్య ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటే, రెండోవైపు కనీసం మందు గోలి, సూది మందు ఎరుగని ప్రజలు కోట్లలో ఉన్నారు. మొత్తం దేశం ప్రజలంతా వైద్య, ఆరోగ్యాల కోసం చేస్తున్న ఖర్చులో కేవలం 30.5 శాతం మాత్రమే మన ప్రభుత్వం భరిస్తోంది. మిగతా 69.5 శాతం ప్రజలే భరించాల్సి వస్తోంది. లాటిన్ అమెరికా దేశమైన క్యూబాలో ఇది అక్షరాలా 94.2 శాతం. అక్కడి ప్రజలు సొంతగా ఖర్చుపెట్టేది 6.8 శాతం మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2015 నివేదిక వెల్లడించింది. మన ప్రైవేటు రంగం ఎంత విచ్చలవిడిగా వైద్య వ్యాపారాన్ని సాగిస్తోందో ఈ గణాంకాలే చెబుతాయి. నరసింహన్ ఆందోళనకు పరిష్కారం లభించాలంటే ప్రత్యామ్నాయం వెతక్క తప్పదు. ప్రజలందరికీ వైద్యం, ఆరోగ్యం ఉచితంగా లభించేలా లేదా అందుబాటులో ఉండేలా చేసే వ్యవస్థల వైపు మనం దృష్టి సారించాలి. అయితే అవేమీ ఆకాశంలోంచి ఊడిపడవు. ఇప్పటికే వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థల నుంచి, విధానాల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది.
ప్రక్షాళనే పరిష్కారం
మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరి ఆలోచనలు రాజధానికి సింగపూర్‌లాంటి రాజధాని వైపు, మరొకరి ఆలోచనలు అమెరికా కొలమానం సుందర నగరీకరణ వైపు పరుగులు తీస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రక్షాళన చేయడానికి ఇప్పటివరకు ఓ మంచి అనుభవం, ఓ వినూత్న నమూనా వీరికి కనిపించకపోవడం విషాదకరం. ఆరేళ్ళకుపైగా తెలుగు ప్రజలకు గవర్నర్‌గా ఉన్న నరసింహన్ అయినా రెండు రాష్ట్రాల వైద్య ఆరోగ్యరంగాన్ని ప్రక్షాళన చేయడానికి, ఒక మంచి ప్రత్యామ్నాయ విధానాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తే మంచిది. క్యూబాలో అటువంటి వినూత్న ప్రజారోగ్య విధానం అమలులో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తేల్చి చెప్పింది. కార్పొరేట్ వైద్య రంగాన్ని దారిలో పెట్టడానికి, మన వ్యవస్థను సంపూర్ణంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
క్యూబా ప్రజారోగ్యం ఆదర్శం
వైద్య ఆరోగ్య రంగంలో క్యూబా సాధించిన ఈ విజయానికి పునాది 1959 నాటి రాజ్యాంగంలోనే ఉంది. ‘‘ఆరోగ్యం ఒక మానవ హక్కు. అందువల్ల ఉత్పత్తితో ముడిపడి ఉన్న ఆర్థిక లాభం కన్నా క్యూబా ప్రజలందరికీ ఆరోగ్యసేవలు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత’’ అని అది పేర్కొంది. ఆ లక్ష్యంతో క్యూబా 1960లోనే అందుకు తగ్గ వ్యవస్థలను నెలకొల్పింది. మొదటిగా గ్రామీణ వైద్య సేవలు అనే సంస్థను స్థాపించి, ప్రజల్లో ఆరోగ్య సంబంధమైన అవగాహనను పెంపొందించడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేసింది. 1959కి ముందటి క్యూబా ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి, నియంతృత్వ పాలనను సాగించాయి.
ఫిడెల్ కాస్ట్రో విప్లవ ప్రభుత్వం ఆనాటి ఆరోగ్య విధానాన్ని తలకిందులు చేసి పట్టణ, గ్రామ ప్రాంతాల ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. ఐదారేళ్లలోనే ఒక్క ఆసుపత్రి కూడా లేని ఆ ప్రాంతాల్లో 53 వైద్యశాలలను స్థాపించి, 750 మంది డాక్టర్లను పర్వత ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల దగ్గరకు పంపింది. ఆరోగ్యం ప్రజలందరి హక్కుగానే గాక ప్రభుత్వం తన బాధ్యతగా గుర్తించడం కీలకమైనది. ఆరోగ్యాన్ని వ్యక్తిగత సమస్యగాగాక, నిర్దిష్ట పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలందరి సమష్టి అవసరంగా మార్చింది. దీని ఫలితంగానే ప్రతి నిర్దిష్ట నివాస ప్రాంతానికి ఫ్యామిలీ డాక్టర్ అనే విధానం రూపొందింది. ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించడంలో ప్రజలందరినీ అందులో భాగస్వాములను చేసి, వైద్య వ్యవస్థలను అనుసంధానం చేసే ప్రక్రియకు పురికొల్పింది. ఈ పథకాన్ని మొదట లావ్టా పట్టణంలో ప్రయోగాత్మకంగా అమలు జరిపి, తదుపరి క్యూబా అంతటికీ విస్తరింపజేశారు.
ప్రతి 150 కుటుంబాలకు ఒక ఫ్యామిలీ డాక్టర్, ఒక నర్స్ బాధ్యత వహించే ఈ విధానాన్ని ‘డాక్టర్-నర్స్ పథక’మని పిలుస్తారు. రోగాల బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టేలా వారు ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఈ 150 కుటుంబాల వారందరి ఆరోగ్య వివరాలు తెలిసిన ఈ బృందం, వారిలో ఎవరికి ఎలాంటి వైద్య అవసరం ఏర్పడ్డా వెంటనే ఆ ఇంటికి చేరుకుని, అవసరమైన చికిత్సను అందిస్తుంది. తదనంతర చికిత్స కోసం పాలీక్లినిక్‌కి స్వయంగా వారే తీసుకెళతారు. 1984 నాటికి 30 వేల మంది డాక్టర్లు, 32 వేల మంది నర్సులతో డాక్టర్-నర్స్ పథకం నూరు శాతం జనాభాకు అందుబాటులోకి రావడం విశేషం. 30 వేల నుంచి 60 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక పాలీక్లినిక్‌ను ఏర్పాటు చేస్తారు. దాదాపు 498 పాలీక్లినిక్‌లు విస్తృత వైద్య సేవలందిస్తున్నాయి. ఈ పాలీక్లినిక్‌లలో పిల్లలు, మహిళల వైద్య నిపుణులతో పాటూ ఒక జనరల్ ఫిజీషియన్ కూడా ఉంటారు. ఫ్యామిలీ డాక్టర్-నర్స్ పథకం, పాలీక్లినిక్‌ల సమర్థ నిర్వహణ కోసం ప్రజాసంఘాలతో కూడిన స్వచ్ఛంద బేసిక్ వర్క్ గ్రూప్ వారానికి ఒకసారి ఫ్యామిలీ డాక్టర్లు, పాలీక్లినిక్ డాక్టర్లు, రోగులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ గ్రూప్ వీరందరి మధ్య సమన్వయాన్ని పెంపొందించి, రోగులలో అవగాహనను కల్పిస్తుంది. వైద్య విద్యార్థులు మొదటి ఏడాది నుంచే పాలీక్లినిక్‌లలో వైద్యసేవలనందించడంలో శిక్షణ పొందుతారు. రోగుల సమస్యల గురించిన ఈ ఆచరణాత్మక జ్ఞానం వైద్య విద్యార్థులకు అమూల్య అనుభవం అవుతుంది.
ప్రజాభాగస్వామ్యంతో ప్రజారోగ్యం
క్యూబా ఆరోగ్య సంరక్షణ విధానంలో ప్రజా భాగస్వామ్యం ప్రధానాంశం. స్థానిక సంస్థల పాలనలో కూడా దీనిని ప్రధాన అంశంగా చేర్చారు. స్థానిక సంస్థల సమావేశాలకు ముందు పీపుల్స్ కౌన్సిల్స్ సమావేశమై అక్కడి ఆరోగ్య సమస్యలను చర్చించి తదుపరి చర్యల కోసం ప్రతిపాదనలను స్థానిక సంస్థలకు పంపిస్తాయి. మహిళలు, కార్మికులు తదితరుల ప్రజాసంఘాలన్నీ ఈ ఆరోగ్య విధానంలో భాగస్వాములవుతాయి. క్యూబా తన దేశంలోనే కాదు, ఇతర వెనుకబడిన దేశాల ప్రజలకు కూడా వైద్య ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తన శక్తిమేర కృషి చేస్తూ, పొరుగు దేశాలకు సహకరిస్తోంది. అంతేగాక, లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్స్ స్థాపించి కొన్ని వేల మంది విదేశీ విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అందించింది. 72 దేశాలకు చెందిన దాదాపు 20,500 మంది విద్యార్థులు క్యూబాలో శిక్షణ పొందారు.
క్యూబా స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా అమెరికా ఆంక్షలను విధించింది. అత్యవసరమైన మందులు, వైద్య పరికరాల ఎగుమతులను కూడా నిలిపివేసింది. ఇన్ని ఒత్తిడుల మధ్య సైతం క్యూబా, అమెరికా కన్నా మిన్నగా ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూబా, అమెరికాల శిశు మరణాల రేట్లే ప్రజారోగ్యంలో క్యూబా సాధించిన అసాధారణ విజయానికి అద్దం పడతాయి. అగ్రరాజ్యం అమెరికాలో శిశుమరణాల రేటు 5.74 శాతంకాగా, క్యూబాలో అది కేవలం 4.63 శాతం. ఇక మన దేశంలోనైతే పదింతలు అధికంగా 41.1 శాతం. అమెరికాతో సమానంగా 79 ఏళ్ల సగటు ఆయుర్దాయాన్ని క్యూబా సాధించగలిగింది. మన దేశానికొస్తే అది 66 ఏళ్లే. అందుబాటులో లేని ఆరోగ్య వ్యవస్థ, గగనమైపోతున్న వైద్యం భారతీయుల ఆయుర్దాయాన్ని సైతం నిర్దేశిస్తోంది. క్యూబా వైద్య ఆరోగ్య రంగాల్లో సాధించిన విజయాన్ని మార్గదర్శకంగా తీసుకోవడమే గవర్నర్ నరసింహన్ ఆందోళనకు పరిష్కారం.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య
మొబైల్: 97055 66213