శక్తినిచ్చి.. మచ్చ మిగిల్చిన ఇందిర | What TIME Said 40 Years Ago When Indira Gandhi Declared a State of Emergency in India | Sakshi
Sakshi News home page

శక్తినిచ్చి.. మచ్చ మిగిల్చిన ఇందిర

Published Fri, Jun 26 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

సంజయ్(ఎడమ), ఇందిరాగాంధీ, సిద్ధార్థ శంకర్ రే (కుడి)

సంజయ్(ఎడమ), ఇందిరాగాంధీ, సిద్ధార్థ శంకర్ రే (కుడి)

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ఎప్పటికీ సమర్థించను. కానీ వ్యక్తిగతంగా ఆమె ఈ దేశాన్ని శక్తివంతం చేశారని నమ్ముతా. బంగ్లాదేశ్ యుద్ధ విజయంతో ఆమె ప్రజల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారు. అణు పరీక్షలను నిర్వహించి దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపారు. పేదల పెన్నిధిగా ఆమె అనేక సంక్షేమ పథకాలు రూపొందించారు. ఎమర్జెన్సీ విధింపు, దాని అతిక్రమణల కారణంగా తిరస్కరించిన ప్రజలే మళ్లీ ఆమెను ఎన్నుకోవడంతో ఆమె చేసిన తప్పులను ప్రజలు క్షమించేశారేమో అనిపిస్తుంది.
 
 ‘1971 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన ఇందిరా గాంధీ.. అధికార దుర్వినియోగం చేశారని ఆ ఎన్నికలో ఆమె ప్రత్యర్థియైన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకో ర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 12 జూన్ 1975న ఆ హైకోర్టు న్యాయమూర్తి జగ్‌మోహన్ సిన్హా ఇందిరా గాంధీ దోషిగా నిర్ధారించారు. ఆమె లోక్‌సభ సభ్య త్వాన్ని రద్దు చేస్తూ, మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా తీర్పు నిచ్చారు. నెహ్రూ వద్ద పనిచేసే ఒక ఉద్యోగి ఇందిరా గాంధీ వద్ద కూడా పని చేసేవారు. రాయ్‌బరేలీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఆ ఉద్యోగిని, ప్రభుత్వ వాహనాన్ని వినియోగించుకున్న కారణంగా ఈ తీర్పు వచ్చింది.
 
  ఆ సమయంలో నిజానికి ఇందిరా గాంధీ రాజీనామా చేయాలనుకున్నా... ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ, అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రేల ప్రోద్బలంతో ఆమె ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో జయప్రకాశ్ నారాయణ్ తదితరులు ఇందిర పదవిలో కొనసా గరాదని, ఆమె ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోరాదని తిరుగుబాటు లేవనెత్తారు. సమ్మెలు, ఆందోళనలు చెలరేగాయి. ఇందిర హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కానీ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 24 జూన్ 1975న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పారు.
 
 చీకటి పాలనలో....
 ఈ పరిస్థితుల్లో సిద్ధార్థ శంకర్ రే దేశంలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు, అసంతృప్తి, సమ్మెలు సాగుతున్న దృష్ట్యా రాజ్యాంగంలోని 352వ అధికరణం కింద స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధింపునకు అవకాశం ఉన్న దని ఇందిరా గాంధీకి వివరించారు. దేశంలో అంతర్గత భద్రతకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీ విధింపునకు ఈ నిబంధన అవకాశం ఇస్తుందని చెప్పడంతో ఇందిరాగాంధీ అందుకు సరేనన్నారు. దాదాపు 21 నెలల పాటు పత్రికలు, ప్రజాసంఘాలు, విపక్షాలను అణగదొక్కారు. జైల్లో పెట్టారు. అదొక చీకటి అధ్యాయం.. పత్రికలపై సెన్సార్‌షిప్ ఉండేది. అప్పుడు నేను ముంబైలో పనిచేసిన ‘ఆన్‌లుకర్’ మ్యాగజీన్ కూడా అందుకు మినహా యింపు కాలేదు. పత్రికలను పూర్తిగా అణచివేశారు. కులదీప్ నయ్యర్ వంటి పలువురు ప్రధాన స్రవంతికి చెందిన పత్రికల ప్రతినిధులు కూడా అరెస్ట య్యారు.
 
 ఆ కాలమంతటా సెన్సార్‌కు వెళ్లని వ్యాసాలేవీ పత్రికల్లో ప్రచు రించడానికి అవకాశం ఉండేదే కాదు. దీనికి నిరసనగానూ, సంపాదకీయ పేజీ వ్యాసాలను సెన్సార్‌షిప్‌కు పంపడం ఇష్టం లేని కారణంగానూ పత్రికలు తమ ఎడిట్ పేజీలను ఖాళీగా వదిలేవి. ఎమర్జెన్సీ విధింపుకు ప్రధాన కారణమైన ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలోనే రాజకీయరంగ ప్రవేశం చేసి బలీయమైన అధికారేతర శక్తిగా ఎదిగి, ప్రభుత్వంపై ఆధిపత్యం చలాయించారు. ఆయన ఒకదశలో 30 ఏళ్లపాటు ఎన్నికలే ఉండవని చెప్పుకొచ్చారు. బలవంతంగా కుటుంబ నియం త్రణ ఆపరేషన్లు చేయించేవారు. అలాంటి బాధితుల సంఖ్య లక్షల్లో ఉందని అంచనా. దీనికి తోడు సంజయ్‌గాంధీ తల్లి ఇందిరా గాంధీపై పెత్తనం చలా యించే స్థితికి చేరడంతో, ఆయన అనుయాయులు దేశవ్యాప్తంగా పలు అతి క్రమణలకు పాల్పడ్డారు.
 
 అతిక్రమణలు...దిద్దుబాటు యత్నం
 అంతవరకు భారతదేశాన్ని అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చూసిన ప్రపంచ దేశాలు ఒక్కసారిగా విభ్రాంతికి గురయ్యాయి. అత్యంత సమర్థులరాలైన ప్రజాస్వామ్యనేతగా పేరు మోసిన ఇందిరా గాంధీ నియంతగా తీవ్ర విమ ర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొద్ది నెలలకే ఇందిరా గాంధీ జరి గిన తప్పును గ్రహించారు. ఎమర్జెన్సీ అనే ఒక తప్పు జరిగిపోయిందని తెలు సుకున్నారు. స్వతహాగా ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఇంది రాగాంధీ.. జరిగిన తప్పును సరిదిద్దేందుకు ప్రయత్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని పార్ల మెంటులో తప్ప సుప్రీంకోర్టులో 39వ రాజ్యాంగ సవరణ చేసిన ఇందిరా గాంధీయే 2 నవంబర్ 1976లో భారతదేశం సోషలిస్టు, సెక్యులర్, రిపబ్లిక్‌గా 42వ సవరణ చేశారు. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ప్రజాతీర్పు పొంద డానికి సన్నాహాలు చేశారు. 1977లో మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర ఓటమి పాలయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్ బలం 153కు పడిపోయింది. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం అంతర్గత కలహాలతో త్వరలోనే ప్రజలలో అప్రతిష్ట పాలైంది. దీంతో అత్యవసర పరిస్థితి విధింపు కారణంగా నియంతగా విమర్శలను ఎదుర్కొన్న ఇందిరా గాంధీకి మరోమారు ప్రజల తీర్పును కోరే అవకాశం త్వరలోనే లభించింది.
 
 ఓడించిన ప్రజలే పట్టంగట్టారు
 జనతాప్రభుత్వం అంతర్గత కలహాలతో కుప్పకూలి పోవడంతో 1980 నాటికే దేశం మళ్లీ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాల్సివచ్చింది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని, దేశం ఎదుర్కొన్న సవాళ్లను... కొద్ది రోజులకే దేశం మరిచిపోయిందనిపించేలా ప్రజాతీర్పు వెలువడింది. జనతా ప్రభుత్వ పాలనలోని అంతర్గత ఘర్షణల వల్ల దానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఎమర్జెన్సీకి ముందు ఇందిరా గాంధీ దేశాన్ని శక్తివంతంగా మలిచిన కారణంగా దేశ ప్రజలు మళ్లీ ఆమెకే పట్టం కట్టారు. ఒక రాజకీయ నేతగా ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ఎప్పటికీ సమర్థిం చను. కానీ వ్యక్తిగతంగా ఆమె ఈ దేశాన్ని శక్తివంతం చేశారని నమ్ముతా.
 
 1962లో చైనాతో జరిగిన యుద్ధం కారణంగా దేశం బలహీనపడిందన్న న్యూనతాభావం నుంచి పాక్‌తో జరిగిన యుద్ధంలో గెలిచి, బంగ్లాదేశ్ ఆవి ర్భావానికి సహకరించి... ఆమె ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెం పొందించారు. 1974లో అణు పరీక్షలను నిర్వహించి, అగ్రరాజ్యాల సరసన చేరి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అత్యంత సాహసోపేతంగా బ్యాంకులను జాతీయం చేశారు. పేదల పెన్నిధిగా ఆమె అనేక సంక్షేమ పథకాలు రూపొం దించారు. బడుగువర్గాల్లో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలలో ఆమె అమ్మగా పేరు మోశారు. ఏదిఏమైనా ఆమె దేశాన్ని ఒక ప్రబలశక్తిగా చేశారు. కానీ చంద్రుడిలో కనిపించే మచ్చలా.. ఇందిరా గాంధీ రాజకీయ జీవితంపై ఈ ఎమర్జెన్సీ మచ్చ ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. ఇందిరా గాంధీ.. ఎమ ర్జెన్సీని విధించకుండా ఉంటే, హత్యకు గురికాకుండా ఉంటే ఆమె బలమైన నేతృత్వంలో దేశం చాలా ముందుకు వెళ్లేదేమో.
 
 ప్రజలు క్షమించారేమో...
 1980 సాధారణ ఎన్నికల కంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఇందిరా గాంధీతో పాటు ఆమె వాహనంలో నేనూ వెళ్లాను. మేం ముంబై నుంచి పుణే వెళ్తుండగా ప్రతి ఊళ్లో జనం చంటి బిడ్డలను చంకన వేసుకుని ఆమెను చూసేందుకు ఎగబడేవారు. రాత్రయినా పగలైనా అదే జనసందోహం, అదే నిరీక్షణ. ఇందిరమ్మను చూశామన్న ఆనందం వారి కళ్లల్లో కనిపించేది.

అప్పుడే ఆమె మళ్లీ తన కిరీటం దక్కించుకుంటుందని నేను ‘ఆన్ లుకర్’ మ్యాగజీన్‌లో రాశా. ఆ తరువాత ‘ఇండియా టుడే’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు కూడా 1980 సాధారణ ఎన్నికలకు ముందు రిపోర్టింగ్ నిమిత్తం ఆమె వెంట విమానంలో వెళ్లినప్పుడు ప్రజలు ఆమె పట్ల చూపుతున్న ఆదరణను చూసి.. ఇందిరా గాంధీ మళ్లీ ప్రధాని కాబోతున్నారని అప్పుడే వార్తలు ఇచ్చా. తొలిసారిగా అప్పుడు ఇచ్చిన జనాభిప్రాయ సేకరణ కూడా నిజమైంది. ఎమర్జెన్సీ విధింపు, దాని అతిక్రమణల కారణంగా ఇందిరాగాంధీని తిరస్కరించిన అదే ప్రజలు మళ్లీ ఆమెను ఎన్నుకోవడంతో ఆమె చేసిన తప్పులను ప్రజలు క్షమించేశారేమో అనిపిస్తుంది.’
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) s.venkatanarayan@gmail.com
 - ఎస్. వెంకటనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement