దాటవేతలెందుకు దాదా? | When Pranab Mukherjee Got a 'Dressing Down' From Indira Gandhi | Sakshi
Sakshi News home page

దాటవేతలెందుకు దాదా?

Published Sun, Dec 14 2014 1:40 AM | Last Updated on Wed, Aug 15 2018 8:02 PM

దాటవేతలెందుకు దాదా? - Sakshi

దాటవేతలెందుకు దాదా?

గాంధీ మహాత్ముడు కాక మునుపు 1927లో రాసిన ఆత్మకథ (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్)లోనే అన్ని వాస్తవాలూ రాయలేదనీ, కొన్నిటిని దాచారనీ విమర్శలు వచ్చినప్పుడు పదవులలో ఉన్నవారూ, పదవులు కోరుకునేవారూ అక్షరసత్యాలు రాస్తారని విశ్వసించడం కష్టం. కొన్ని ఇబ్బందికరమైన వివరాలను ప్రస్తావించకపోవచ్చు కానీ శుద్ధ అబద్ధాలు రాసి తప్పించుకోవడం కూడా ఈ సమాచార యుగంలో సాధ్యం కాదు.  
 
ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన సమయంలో అందుకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఇందిరాగాంధీకి బొత్తిగా తెలియవా? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రచించిన ఆత్మకథ మొదటి భాగంలో ఇందిర పాలనను సమర్థించారా లేక ఎండగట్టారా? ముఖర్జీ ప్రచురించదలచిన మూడు పుస్తకాల కాలవిభజనలో 1989-1998 మధ్య కాలాన్ని పరిహరించడంలో ఉద్దేశం ఏమిటి? రాష్ట్రపతిగా మరో పదవీకాలం (ఐదేళ్ళు) కొనసాగాలనే ఆకాంక్షేనా?
 
 ప్రణబ్ కుమార్ ముఖర్జీ రచించిన ఆత్మకథ ‘ది డ్రెమాటిక్ డికేడ్: ది ఇందిరాగాంధీ ఇయర్స్’ విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. రాజకీయ ప్రముఖులూ, కీలక పదవులు నిర్వహించిన ఉన్నతాధి కారులూ, అధికార కేంద్రాన్ని దగ్గరగా పరిశీలించిన జర్నలిస్టు దిగ్గజాలూ రచించిన పుస్తకాలు విడుదలైన సందర్భంలో అనేక వివాదాలు చర్చనీయాంశాలైనాయి. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీగా పనిచేసిన మాధవ్ గాడ్బోలే, కేంద్ర మాజీ మంత్రులు నట్వర్‌సింగ్, జశ్వంత్‌సింగ్,  ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమాచార సలహాదారుగా పని చేసిన సంజయ బారు, బొగ్గు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, కాగ్ మాజీ అధినేత వినోద్ రాయ్, సీఎన్‌ఎన్-ఐబిఎన్ మాజీ ప్రధాన సంపాదకుడు రాజదీప్ సర్దేశాయ్, తదితరులు రచించిన గ్రంథాలలో కఠోర సత్యాలుగా కనిపించే కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.
 
 వీరంతా కేవలం సత్యాలే రాశారా లేక ఉన్న వాస్తవాలన్నీ రాశారా లేక తమ వాదనలకు అవసరమైన వాస్తవాలను మాత్రమే ఉటంకించి తక్కినవాటిని వదిలేశారా అన్నది పాఠకులు నిర్ణయించుకోవలసిందే. గాంధీ మహాత్ముడు కాక మునుపు 1927లో రాసిన ఆత్మకథ (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్)లోనే అన్ని వాస్తవాలూ రాయలేదనీ, కొన్నిటిని దాచారనీ విమర్శలు వచ్చినప్పుడు పదవులలో ఉన్నవారూ, పదవులు కోరుకునేవారూ అక్షర సత్యాలు రాస్తారని విశ్వసించడం కష్టం. కొన్ని ఇబ్బందికరమైన వివరాలను ప్రస్తా వించకపోవచ్చు కానీ శుద్ధ అబద్ధాలు రాసి తప్పించు కోవడం కూడా ఈ సమాచార యుగంలో సాధ్యం కాదు.  నట్వర్‌సింగ్, సంజయ బారు మాత్రం కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియాగాంధీపైన పరోక్షంగా, ప్రత్యక్షంగా కొన్ని విమర్శలు చేశారు. తక్కినవారు మన్మోహన్‌సింగ్‌పైన ప్రధానంగా తమ దాడిని కేంద్రీకరించారు. వీరందరికీ సమాధానం చెబుతూ మాజీ ప్రధాని ఆత్మకథ రాసితీరతారని ఆయన కుమార్తె ప్రకటించారు. ఆయన రాస్తారో లేదో తెలియదు. వీరందరిలోనూ అత్యధిక పదవులు నిర్వహించి, అనేక నాటకీయ రాజకీయ పరిణామాలకు సాక్షీభూతంగా నిలిచిన వ్యక్తి ప్రణబ్‌దా. నాలుగున్నర దశాబ్దాల భారత రాజకీయాలపైన ఆయన చేసే వ్యాఖ్యలకూ, చెప్పే తీర్పులకూ ఎనలేని విలువ ఉంటుంది.
 
 పైగా ఆయన గ్రంథాన్ని ప్రచురించిన రూపా పబ్లికేషన్స్ సమస్త విక్రయాధికా రాలనూ గుత్తగా అమెజాన్.ఇన్‌కు కట్టబెట్టడం పెద్ద వివాదమై కూర్చుంది. 595 రూపాయల వెల కలిగిన పుస్తకంపై 33 శాతం డిస్కౌంటు ఇచ్చి రూ. 399కే ఆన్ లైన్‌లో విక్రయిస్తున్న అమెజాన్‌తో పుస్తక విక్రేతలు తగవుపడుతున్నారు. పుస్తకాన్ని బహిష్కరించాలని నిర్ణయిస్తున్నారు. ఈ విధంగా ఒకే ఒక సంస్థకు గుత్తాధిపత్యం కట్టబెట్టడం అన్యాయమని వాదిస్తున్నారు. ముఖర్జీ జన్మదినమైన డిసెంబర్ 11వ తేదీన అమెజాన్ సంస్థ ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్టు ప్రకటించిన సమయానికే బెస్ట్ సెల్లర్స్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇది ఒక రకమైన చరిత్ర. సరికొత్త రికార్డు.  కంపెనీలకూ, ఈ-టైలర్లకూ (రిటైర్లలాగా) మధ్య వ్యాపార స్పర్థను రేకెత్తిం చిన సందర్భం.
 
 అపారమైన అనుభవం
 ఎనభై ఏళ్ళ కిందట పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని చిన్న గ్రామంలో పుట్టిపెరిగిన ‘పొట్లా’ క్రమంగా ప్రణబ్ కుమార్ ముఖర్జీగా ఎదిగి, రాజకీయశాస్త్రం, చరిత్ర, న్యాయశాస్త్రంలో పట్టాలు పుచ్చుకొని కొంతకాలం న్యాయశాస్త్రం బోధించి రాజకీయాలలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీనుంచి చీలిపోయిన అజయ్ ముఖర్జీ స్థాపించిన బంగ్లా కాంగ్రెస్‌లో ప్రవేశించి రాజకీయాలలో తొలిఅడుగులు వేశారు. 1969లో రాజ్యసభకు ఎన్నికైనారు. అప్పుడే ఆయన మొట్టమొదటిసారి ఢిల్లీ సందర్శించారు. బ్యాంకుల జాతీయీకరణపైన జరిగిన చర్చ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించిన ఇందిరాగాంధీ అప్పుడు విప్‌గా పనిచేస్తున్న ఓంమెహతాను అడిగి బెంగాలీబాబు వివరాలు తెలుసుకున్నారు.
 
 అనంతరం సీపీఐ అగ్రనాయకుడు భూపేశ్‌గుప్తా ప్రణబ్‌ను ఇందిరాగాంధీకి పరిచ యం చేశారు. 1972లో బంగ్లా కాంగ్రెస్ చీలిపోయిన తర్వాత ప్రణబ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇందిరకు దగ్గరై 1973లో పరిశ్రమలశాఖలో ఉపమంత్రిగా స్థానం సంపాదించారు. ఇందిర హత్యానంతరం రాజీవ్‌గాంధీతో విభేదాలు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్న సందర్భాన్ని మినహాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలన్నిటి లోనూ ప్రణబ్ మంత్రిగా పనిచేశారు. దేశీయాంగం, ప్రధానమంత్రి పదవి మినహా తక్కిన శాఖలలో ముఖ్యమైనవాటిని అన్నింటినీ నిర్వహించారు. ముఖ్యంగా మన్మోహన్ హయాంలో రాజకీయపరమైన, పరిపాలనపరమైన  సంక్షోభం ఏర్పడిన ప్రతిసారీ సోనియాగాంధీ ప్రణబ్ ముఖర్జీకే పరిష్కార బాధ్యతను అప్పగించారు.  రాజకీయ, పరిపాలన రంగాలలో అంతటి విస్తారమైన అనుభవం కలిగిన వ్యక్తి రాసిన పుస్తకంలో భావి తరాలు తెలుసుకోవలసిన అంశాలు అనేకం ఉంటాయనడంలో సందేహం లేదు.  
 
 ఇందిరకు నిబంధనలు తెలియవా?!
 తిరుగులేని వాస్తవాలతోపాటు కొన్ని వివాదాస్పదమైన అంశాలూ ఉన్నాయి. వాటి లో చెప్పుకోదగింది ఇందిరకు రాజ్యాంగంలో ఆత్యయిక పరిస్థితికి సంబంధిం చిన నిబంధనలు తెలియవన్నది. అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థశంకర్ రే సలహా పాటించి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని ప్రణబ్ రాయడం ఆశ్చర్యం. 1961-62లో ఇండియాపైన చైనా దాడిచేసినప్పుడు ఆత్యయిక పరిస్థితి ప్రకటించిం ది ప్రభుత్వం. అప్పటికే ఇందిర కాంగ్రెస్ అధ్యక్షపదవి నిర్వహించారు. 1971 బంగ్లా దేశ్ విమోచన కోసం పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు సైతం దేశంలో ఆత్యయిక పరిస్థితి విధించారు. అప్పుడు ఇందిర స్వయంగా ప్రధానమంత్రి. అటువంటి అగ్ర శ్రేణి నాయకురాలికి  రాజ్యాంగ నిబంధనలు తెలియవనుకోవడం అమాయకత్వం. బహుశా తనను రాజకీయంగా ప్రోత్సహిం చిన ఇందిరాగాంధీని నిర్దోషిగానో, తప్పుడు సలహా విని పొరబాటు నిర్ణయం తీసుకున్న నేతగానో చిత్రించే ప్రయత్నం ప్రణబ్ చేసి ఉండవచ్చునని అనుకోవాలి. ఆత్యయిక పరి స్థితి ప్రకటించినప్పుడు దేశీయాంగశాఖ తెలుగు ప్రముఖుడు కాసు బ్రహ్మానందరెడ్డి చేతిలో ఉంది.
 
 తనకు ఆ నిర్ణయం ఇష్టం లేదనీ, బలవంతంగా సంతకం చేయించారనీ కాసు తనతో చెప్పినట్టు ప్రణబ్ రాశారు. నిజమే. 1992లో  కాసు బ్రహ్మానందరెడ్డిని నేను సుదీర్ఘంగా ఇంటర్య్వూ చేశాను. అనేక ప్రశ్నలతో పాటు ఈ ప్రశ్నకూడా అడిగాను. ఇందిరాగాంధీ తన అభిప్రాయానికి విలువ ఇచ్చేవారు కాదనీ, తాను కూడా దూరంగా ఉండేవాడిననీ ఆయన చెప్పారు. కారు డ్రైవర్ రాలేదనే కారణంపై ఒకసారి కేబినెట్ సమా వేశానికి రాలేనని చెప్పానని అన్నారు.  దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఓంమెహతానే ‘హోం మెహతా’గా చెలామణి అయ్యేవారంటూ చమత్కరించారు. దేశీ యాంగ మంత్రిగా సంతకం చేసిన మాట నిజమేనని అన్నారు. ఇష్టం లేనప్పుడు సంత కం ఎందుకు చేశారని అడిగితే ‘మేడమ్‌కి ఎదురు చెప్పే పరిస్థితులు అప్పుడు లేవు. ఆ తర్వాత ఎదురు తిరిగాం’ అన్నారు. మొత్తం మీద ప్రణబ్ ముఖర్జీ ఆత్యయిక పరిస్థితి కారణంగా ప్రజాస్వామ్యానికి కొంత విఘాతం కలిగినా మూల్యం అంతా ఇందిరా గాంధీ స్వయంగా చె ల్లించారనీ, ఆత్యయిక పరిస్థితి వల్ల వివిధ రంగాలలో క్రమశిక్షణ నెలకొనడం వంటి మంచి పరిణామాలు కూడా సంభవించాయనీ సమర్థించారు.
 
సాహసం కంటే విచక్షణే మేలనుకున్నారా?
 పీవీ హయాం గురించీ, బాబరీ మసీదు కూల్చివేత  గురించీ రాయకుండా ఎందుకు దాటవేస్తున్నారు? ఈ ప్రశ్నకు సీనియర్ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు సాక్షిటీవీ చర్చలో సమాధానం చెప్పారు. పీవీకి ప్రణబ్ అత్యంత సన్నిహితుడనీ, పీవీ పాలన గురించి రాస్తే ఆర్థిక సంస్కరణల విషయంలో ఆయనను అభినందించవలసి వస్తుందనీ, ఇది సోనియాకు ఇష్టం ఉండదు  కనుక మౌనంగా ఉండటమే ఉత్తమం అనుకొని ఉంటారనీ అన్నారు. కావచ్చు. దీనితో పాటు మరి రెండు కారణాలు కూడా ఉండవచ్చు. ఒకటి, బాబరీ మసీదు కూల్చివేత గురించి రాయవలసి వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నవారిలో చాలామందిని దోషులుగా బోనులో నిలబెట్టవలసి వస్తుంది. ‘‘ఏక్ ధక్కా ఔర్ దో’ అంటూ కరసేవకులను ప్రోత్సహించిన ఉమాభారతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో  నీటివనరుల మంత్రి.
 
 అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని తప్పు పట్టడం ద్వారా రాష్ట్రపతిగా మరో ఐదేళ్ళు కొనసాగే అవకా శాన్ని కాలదన్నుకోవడం అవుతుందని ప్రణబ్ భావించి ఉండవచ్చు. రాష్ట్రపతి భవ న్‌లో నివసిస్తూ మొఘల్ గార్డెన్ సౌందర్యం ఆస్వాదించిన వ్యక్తికి అక్కడే మరికొంత కాలం నివ సించాలని అనిపించడం సహజం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రపంచమెరిగిన తత్త్వవేత్త. ఆయన సైతం రెండో టరమ్ రాష్ట్రపతిగా ఉండే అవకాశం ఇందిరాగాంధీ ఇవ్వలేదని నొచ్చుకున్నారు. వెంకట్రామన్ సంగతీ అంతే. ఉన్నత పదవిలో కొనసా గాలనీ, మరికొంతకాలం దేశానికి సేవ చేయా లనీ కోరుకోవడంలో తప్పు లేదు. రెండు- ప్రస్తుతం అధికారంలో ఉన్నవారికి వ్యతిరే కంగా వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పెట్టి రాజ్యాంగ సంక్షోభం దిశగా ప్రయాణించడం ఎందుకని కూడా ప్రణబ్‌దా భావించి ఉండ వచ్చు. బహుశా పదవీ విరమణ తర్వాత ఇప్పుడు మినహాయించిన కాలం గురించి రాయవచ్చు. సాహసం కంటే విచక్షణ పాటించడం మేలు (డిస్క్రిషన్ ఈజ్ బెటర్ పార్ట్ ఆఫ్ వ్యాలర్)అని తలబోసి ఉండవచ్చు. మూడో కారణమే ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించనిది.
 
 రాసిన అంశాల కంటే రాయబోయే అంశాలు గంభీరమైనవి. వాజపేయి నేతృ త్వంలో మొదటి ఎన్‌డీఏ సర్కార్, మన్మో హన్‌సింగ్ నాయకత్వంలో రెండు యూపీఏ ప్రభుత్వాల వెలుగునీడల గురించి ప్రణబ్ ఏమి చెబుతారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజ నలో తన పాత్ర గురించి ఏమి చెబుతారో చదవాలని అనేకమందికి ఉంటుంది. ఆత్య యిక పరిస్థితి ముగిసి 1977నాటి ఎన్నికల అనంతరం మొరార్జీదేశాయ్ ప్రధానిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.  జనతా పార్టీ ప్రభుత్వం పతనమైన తర్వాత 1980 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘనవిజయం సాధించినప్పటి నుంచి 1996లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే వరకూ పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలు కాంగ్రెస్ పార్టీలో మేథావులుగా, చదువుకున్న, రాయడం తెలిసిన (లిఖాపఢా నేతాలోగ్) నాయకులుగా చెలామణి అయ్యారు. వీరిద్దరి మధ్యా మంచి సంబంధాలు ఉండేవి.
 
 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత తనకు ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అప్పగిస్తుందని ప్రణబ్ ఆశించారు. రాజీవ్‌గాంధీ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆశాభంగం చెందిన దాదా సొంత కుంపటి పెట్టుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికలలో గెలుపొందే ప్రాబల్యంలేని నాయకుడు కనుక ఆ పార్టీ బతికి బట్టకట్టలేదు. ఆ తర్వాత పీవీ చొరవతోనే ప్రణబ్ కాంగ్రెస్‌లోకి తిరిగివచ్చి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి స్వీకరించారు. క్రమంగా ప్రధాన స్రవంతిలో ప్రవేశించారు. పీవీ ప్రభుత్వంలో ద్వితీయ స్థానం కోసం అర్జున్‌సింగ్, శరద్ పవార్ పోటీపడినా వాస్తవంగా అది దాదాదే. పీవీని అంత సన్నిహితంగా చూసిన వ్యక్తి, అంతగా అభిమానించిన వ్యక్తి పీవీ పాలన కాలాన్ని ఆత్మకథలో పరిహరించడం అన్యాయం. ఆత్యయిక పరిస్థితిని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యాయంగా అభివర్ణించి కూడా ఇందిరను నిర్దోషిగా చిత్రించగలిగిన ప్రణబ్‌కు బాబరీమసీదు విధ్వంసాన్ని గర్హిస్తూనే విధ్వంసకుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించకుండా ఉండటం కష్టం కాదు. రెండో భాగాన్ని 1989 నుంచి ప్రారంభిస్తేనే సమంజసంగా ఉంటుంది. ఎవ్వరినీ నిందించకుండా, గాయపరచకుండా చరిత్ర చెప్పే నేర్పు ప్రణబ్‌దా కు దండిగా ఉంది. ఇందుకు మొదటి భాగమే సాక్ష్యం.
 murthykondubhatla@gmail.com
- కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement