
జాతిపితకు ఘన నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 68వ వర్ధంతి సందర్భంగా శనివారం దేశప్రజలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాజ్‌ఘాట్‌లోని గాంధీ స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి మహాత్ముని స్మరించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు మనోహర్ పరీకర్, వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, త్రివిధ దళాల అధిపతులు తదితరులు కూడా రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించారు.
ఆధ్యాత్మికగురువులు సర్వమత ప్రార్థనలు నిర్వహించగా, విద్యార్థులు, కళాకారులు దేశభక్తి గేయాలు పాడారు. ‘గాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నా వందనాలు.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరులందరి ధైర్యసాహసాలను స్మరించుకుంటున్నాం’ అని మోదీ ట్వీట్లు చేశారు. రాజ్‌ఘాట్ వద్ద కస్తూర్బా స్మారక కేంద్రాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు.