ఆధారాల ఆట ఆగేదెన్నడు?
బైలైన్
పశ్చిమ యూరప్ నుంచి ప్రత్యేకించి ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల నుంచి కార్యకర్తలను ఎక్కువగా ఆకర్షించడం ఐఎస్‌ఐఎస్ ప్రత్యేకత. ట్రోజన్ హార్స్‌ను రహస్యంగా లోపలకు తేవాల్సిన అవసరమేమీ లేదు. లక్ష్యంగా ఎంచుకున్న నగరంలోనే అది (ఉగ్రవాది) చడీచప్పుడు లేకుండా నివసిస్తుంటుంది. దీని పర్యవసానాలు యూరప్‌వ్యాప్తంగా ఉంటాయి. దీని ప్రభావం ముందు ముందు జరిగే ఎన్నికల్లో మరింత ప్రబలంగా కనిపించి, ఉదార వాదుల అవకాశాలు మరింతగా కుంచించుకుపోయేలా చేస్తుంది.
నగరాలపై ఉగ్రవాద దాడులు ప్రార ంభమైంది ముంబైతోనే. అదీ 2008లో కాదు, 1993లోనే మొదలైంది. 1993 ఫిబ్రవరిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ప్రభావం ఓ అరడజను భవనాల విధ్వంసంకంటే ప్రబలమైనది. అసాధారణ స్థాయి పెద్ద నగరాలు ఉగ్రవాద దాడులకు సంబంధించి అత్యంత బలహీనమైన ప్రాంతాలనే సిద్ధాంతం 1993 నుంచి చాలాసార్లే ప్రపంచవ్యాప్తంగా రుజువైంది. మహా నగరంలోకి చొరబడటానికి ఎన్నో కంతలుంటాయి. కాబట్టి ఎక్కడబడితే అక్కడ దొరికే అమాయకులను హతమార్చడం ద్వారా బీభత్సాన్ని సృష్టించడమే ఏకైక లక్ష్యంగా కలిగిన వారి దాడులకు మహానగరం అనువైనది.
పాఠశాల, ఆసుపత్రి, రైల్వేస్టేషన్, స్టేడియం, సంగీత సభ ఏదీ ఉగ్రవాదులకు పవిత్రమైనది కాదు. ఉగ్రవాదులు సామూహిక హంతకులు. పట్టణీకరణ వారి వేటకు అనువైన మైదానాన్ని సమకూరుస్తుంది. ఒకప్పుడు నగరాలను ధ్వంసం చేయడానికి పెద్ద సేనలు కావాల్సి వచ్చేవి. సాంకేతిక పరిజ్ఞానం దాడి, రక్షణల మధ్య సమీకరణాన్ని మార్చింది. భయబీభత్సాలను సృష్టించడానికి ఒకప్పుడు సైనిక దుస్తులు ధరించినవారు చాలా మంది అవసరమయ్యేవారు. ఇప్పుడు ఆ పని చేయడానికి గుప్పెడు మంది చాలు.
న్యూయార్క్ నగరం మీద జరిగిన ఉగ్రవాద దాడి 9/11గా సుప్రసిద్ధం. బహుశా అదే అత్యంత నాటకీయమైన దాడి కావచ్చు. అలా అనిపించడానికి కారణం నమ్మశక్యంకాని ఆ దృశ్యాలు ఇంకా సజీవంగా నిలిచి ఉండటం మాత్రమే కాదు. అంతే సుప్రసిద్ధమైన ఇతర పాశ్చాత్య నగరాలు కూడా దాడులకు గురయ్యాయి, గాయపడ్డాయి. ప్రతి దాడీ హాహాకారాలను, ఆగ్రహాన్ని, భయోత్పాతాన్ని, బాధను మిగిల్చింది. నేటి వరకు జరిగిన అన్ని దాడులూ... ఆ విషమ సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం ఇంకా గుడ్డిగా అన్వేషిస్తూనే ఉన్నాయి. దేశాలు తమ నగరాల ఎత్తుగడలపరమైన రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాయి. కానీ ఉగ్రవాద దాడుల అసలు సూత్రధారులను బోనెక్కించడానికి అవసరమైన సమైక్య ప్రతిదాడి వ్యూహం విషయంలో అంగీకారం సాధించలేకపోయాయి.
ఈ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన వినాశనానికి వనరు. ఉగ్రవాదులు తమ ప్రాబల్యాన్ని విస్తరింపజేసుకోగలిగారు, ఆయుధాలను మెరుగుపరచుకున్నారు, రిక్రూట్‌మెంట్‌ను పెంచుకున్నారు. అణుకాలుష్యం బారిన పడే ముప్పుకు అవకాశాన్ని ఇకనెంత మాత్రమూ తోసిపుచ్చలేం. అది వారికి అందుబాటులోకి వచ్చేంత సమీపంగానే ఉండి ఉండొచ్చు. సంప్రదాయక ఆయుధాలతో వారు సాగించే దాడులనే ఎదుర్కోలేని దుస్థితిలో ఉన్న మనం, వారు సంప్రదాయేతర ఆయుధాలను ప్రయోగిస్తే ఏం చేయగలం? ఆత్మాహుతి దాడికి సిద్ధమైనవారికి తాము ఎలా చస్తామనే విషయంలో ఎలాంటి పట్టింపూ ఉండదు. ఎంత మందిని తమతో పాటూ తీసుకుపోగలమనేది ఒక్కటే వారికి పడుతుంది.
తప్పించుకు తిరిగే మిలీషియాల కోసం వెతుకులాడుతూ దేశాలను విధ్వంసానికి గురిచేయలేమని బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు ఇప్పుడు గుర్తించాయి. ఇరాక్ భారీ మూల్యం చెల్లించాల్సిన మూఢత్వం అయింది. కొందరు ముస్లింలు చేసే తప్పులకు మొత్తంగా ఒక మతాన్నే- ఇస్లాంను తప్పు పట్టలేమని బాధ్యతగల నేతలు గుర్తిస్తారు. కాకతాళీయంగానే అయినా, పారిస్ గుండె కోత మన అంతరాత్మలను తాకడానికి కొన్ని గంటల ముందే ప్రధాని నరేంద్ర మోదీ తుపాకులకు, ఉగ్రవాదానికి విరుగుడు ఇస్లాంలోని సూఫీయిజమేనని పేర్కొన్నారు. ఈ విధమైన అవ గాహన పటిష్టం కావడం అవసరం.
అయితే ఇంతకూ తదుపరి చేయాల్సింది ఏమిటి? అత్యంత సరళమైన ఒక వాస్తవాన్ని మనం నిరాకరించలేం. ఉగ్రవాదం వల్ల బాగా దెబ్బతిన్న దేశాలు అసలు సూత్రధారులను వేటాడే విషయంలో అనిశ్చిత వైఖరిని అవలంభిస్తున్నాయి. వారిని బోనెక్కించే సమస్యను సూత్రబద్ధమైనదిగా గాక, తమకు అనువైనది అనుకున్నప్పుడే పట్టించుకుంటున్నాయి. విషాదం సంభవించిన రోజున మాత్రమే ఆ సూక్తులను వల్లె వేయడం వినిపిస్తుంది. ఒక్కసారి ఆ జ్ఞాపకం మరుగున పడిందంటే, రాజకీయాలు, భౌగోళిక వ్యూహా త్మక అవకాశాలే పైచేయి సాధిస్తాయి.
పారిస్ హంతకులు కేవలం ఆటబొమ్మ లు మాత్రమే. ఆ బొమ్మలను ఆడించేవాడు మరెక్కడో సురక్షిత స్థావరంలో కూచుని ఉంటాడు. ఏ శిక్షకూ గురికాకుండా ఉన్నంత కాలం, స్వార్థపరశక్తుల రక్షణ లభిస్తున్నంత కాలం వాడు నిశ్చింతగా ఉంటాడు. వాడికి రక్షణ కల్పించే స్వార్థపర శక్తులలో స్థానిక ప్రభుత్వాలు సైతం ఉంటాయి. దీంతో ఈ దుష్ట క్రీడ ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది తప్ప, క్షీ ణించదు.
పారిస్ బీభత్సకాండ వెనుక ఉన్నది ఐఎస్‌ఐఎస్ అని తొలి వార్తలను బట్టి తెలుస్తోంది. కాగితం మీదైనె తే ఇది దోషుల అన్వేషణను తేలిక చేస్తుంది. కానీ వాస్తవ జీవితంలో ఇది ఆ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుంది. పశ్చిమ యూరప్ నుంచి ప్రత్యేకించి ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల నుంచి కార్యకర్తలను ఎక్కువగా ఆకర్షించడం ఐఎస్‌ఐఎస్ ప్రత్యేకత. ట్రోజన్ హార్స్‌ను (ప్రాచీన ట్రాయ్ నగరాన్ని లోపలి నుంచి ముట్టడించడానికి తయారుచేసిన వంచనాత్మకమైన కొయ్యగుర్రం) రహస్యంగా నగర ద్వారాల గుండా లోపలకు లాక్కురావాల్సిన అవసరమేమీ లేదు. లక్ష్యంగా ఎంచుకున్న నగరంలోనే ఆ గుర్రం చడీచప్పుడు లేకుండా నివసిస్తుంటుంది. క్రమబద్ధమైన ఉద్యోగం లేకపోయినా, కనీసం సామాజిక భద్రతతోనైనా అది గడిపేస్తుంటుంది. దీని పర్యవసానాలు యూరప్‌వ్యాప్తంగా ఉంటాయి. తదుపరి దఫా ఎన్నికల్లో దీని ప్రభావం మరింత ప్రబలంగా కనిపించి, ఉదార వాదుల అవకాశాలు మరింతగా కుంచించుకుపోయేలా చేస్తుంది.
ఇప్పుడున్న ప్రభుత్వాలు అందుకు తమను తాము తప్పు పట్టుకోవాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితికి ఆమోదనీయమైన విధంగా ఉగ్రవాదాన్ని నిర్వచించే విషయంలో అవి ఇప్పటికైనా ఒక అంగీకారానికి రాలేకపోతే పెద్దగా ఆశంటూ ఏమీ మిగలదు. సమస్య భాషకు సంబంధించినది కాదు. ‘నీ తుపాకీ పట్టినవాడు ఉగ్రవాది, నా తుపాకీ పట్టినవాడు స్వాతంత్య్ర యోధుడు’ అనే విషపు కలుపును అగ్రశక్తుల ఆశ్రీతులు పలువురు ఇంకా ప్రచారంలో పెడుతూనే ఉన్నారు. వారి సంరక్షణలో పెరిగినవారు ఈ కుతర్కాన్ని విశ్వసిస్తూనే ఉన్నారు.
అయినాగానీ ముందుకు సాగ డానికి ఒక ప్రారంభం అంటూ ఉండాలి. బహుశా అది, ఇదంతా మొదలైన ముంబైకే తార్కికంగా తిరిగి చేరుస్తుంది. 1993 ముంబై ఉగ్రవాద దాడులను నిర్వహించినది దావూద్ ఇబ్రహీం అని మనం దశాబ్దాలుగా గుర్తిస్తున్నాం. 2008 ముంబై దాడులకు పాల్పడ్డ లష్కరే తోయిబా అధిపతి హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించే కష్టభరితమైన పనిలో అమెరికా మనకు గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష సహాయాన్ని అందించింది.
భారత్‌తో కలిసి చేసిన సంయుక్త ప్రకటనల్లో కూడా ఆ విష యాన్ని అది అంగీకరించింది. దావూద్ ఇబ్రహీం తానొక మాఫియా కార్య కలాపాల ముఠాకు అధిపతిననే విషయాన్ని ఖండించడమైనా చేయడం లేదు. అలాంటి వాడిని కరాచీలోని అతగాడి సురక్షిత నివాసంలోంచి పట్టుకొచ్చి విచారణకు నిలపలేదెందుకు? హఫీజ్ సయీద్ లాహోర్‌లోని తన సురక్షిత నివాసం నుంచి భారత్‌ను, పాశ్చాత్య దేశాలను ఇంకా ఎలా దుమ్మెత్తి పోయగ లుగుతున్నాడు? ముంబై తరహా దాడి మరోదానికి అతగాడు పథకం పన్ను తున్నాడనేది నిస్సంశయం. వారిద్దరినీ బోనెక్కించడానికి బదులు ఇస్లామా బాద్‌లోని వారి సంరక్షకులు వారి భద్రతను మరింత పటిష్టం చేశారు.
ఈ ఆధారాల ఆట ముగిసేదెన్నడు? ఆ ఆట సాగుతున్నంత కాలం పారిస్ పునరావృతమవుతూనే ఉంటుంది.
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి