
బంగరు భవితకు పునాది వేద్దాం
విద్యాహక్కు చట్టం వచ్చాక... నిరంతర సమగ్ర మూల్యాంకనను అమల్లోకి తెచ్చారు. టీచర్లకు, విద్యాశాఖకు కూడా దాన్ని వర్తింపజేస్తే మంచిది. విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసి, పాఠశాలల నిర్వహణ, నిఘా, పర్యవేక్షణకు తగు చర్యలు చేపట్టాలి. సిలబస్‌కు, కాలానికి అనుగుణంగా టీచర్లు తమ విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునేలా ఐదేళ్లకోసారి వారికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలనే సూచన పరిశీలనార్హం. విద్యార్థుల భవితను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. వారు చిత్త శుద్ధి, అంకితభావం చూపినచోట మంచి ఫలితాలొస్తున్నాయి. ఈ ఒరవడి అంతటికీ విస్తరించాలి.
నేటి నుంచి మళ్లీ బడులు మొదలవుతున్నాయి. తమ ఆశలు, ఊసులతో పాటు తల్లిదండ్రుల బంగారు కలల్ని మోసుకుంటూ తూనీగల్లా పిల్లలు బడు లకు పరుగులు తీసే రుతువు వచ్చేసింది. పల్లెలు, శివారు జనావాసాల్నుంచి పట్టణాలు, నగరాల వరకు రంగు రంగుల దుస్తుల్లో కళకళలాడే పిల్లల కదలి కలు... అదో సందడి. పిల్లల ఆశలు, ఆశయాలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు, టీచర్ల ప్రతిపాదనలు, మేధావుల చర్చలు, ప్రభుత్వాల నిర్ణయాలు... వెరసి కొత్త వాతావరణం, కొత్త శోభ. ఈ ఏడాదైనా మెరుగైన ప్రమాణాలతో బడి చదువులు బాగుపడాలని యావత్ సమాజం కోరుకుంటోంది.
భావి వికాసా నికి పునాదులు పడేది బడిలోనే. బీజం గట్టిదైతేనే, బలమైన పునాదులు పడితేనే... భవిష్యత్ జాతి వికాస సౌధం సుదృఢంగా నిలుస్తుంది. అన్ని రంగాల్లోలాగే ఇక్కడా మంచీ, చెడూ రెండూ ఉన్నాయి. చెడును వీలైనంత తగ్గించి, మంచిని పెంపొందిస్తూ సాగితేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ప్రభుత్వాలతో పాటు ఈ ప్రక్రియతో సంబంధమున్న వారంతా తమ స్థాయి లో శ్రద్ధాసక్తులు చూపితేనే పాఠశాల విద్య ప్రమాణాలు మెరుగవుతాయి. సక ల అవరోధాల మధ్య కూడా... ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చూపిన ప్రతిభాపాటవాలు ఇందుకు ప్రేరణ కావాలి.
పర్యవేక్షణతోనే ఫలితాలు
సెలవుల తర్వాత బడులు మళ్లీ తెరుచుకునే వేళకి అన్ని సదుపాయాలు, వస తులు కల్పించాలని అంతా కాంక్షించారు. అదెలా ఉన్నా శుక్రవారం నుండి తెలంగాణలో బడులు మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు, టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రస్తుత చర్చనీయాంశం. టీచర్ల బదిలీల వ్యవహారం సరేసరి! విద్యాప్రమాణాల పెంపుదల మేధావివర్గంలో బాగా నలుగుతోంది. ఏకీకృత సర్వీసు నిబంధనల ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు నిలుపుదల ఉత్త ర్వుల దరిమిలా ఆ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఏపీలో ప్రత్యామ్నా య తాత్కాలిక నిబంధనల్ని రూపొందించుకొని పదోన్నతులు కల్పించారు. తెలంగాణలో అలాంటివేవీ లేనందున పదోన్నతులు లేవు. ఫలితంగా మం డల విద్యాధికారులు (ఎంఈఓ) లేక నిఘా, నియంత్రణ లోపిస్తోంది. 456 ఎంఈఓ పోస్టులకు గానూ పది తప్ప 446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
57 జిల్లా ఉప విద్యాధికారి పోస్టులకు 47 ఖాళీ! తాత్కాలిక నిబంధనలను పక్క నపెట్టి, పోస్టులవారీగా చూస్తే ఏపీలోనూ పరిస్థితి ఇదే. 666 ఎంఈఓ పోస్టు లకు గాను 536 ఖాళీలు. 63 డిప్యూటీ డీఈఓ పోస్టులకు గాను 51 ఖాళీ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బడుల్లో విద్యా బోధన ఎలా ఉంది? టీచర్లు క్రమం తప్పకుండా బడికి వస్తున్నారా? పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా? విద్యార్థుల ప్రమాణాలెలా ఉన్నాయి? తదితర విషయాలపై పర్యవేక్షణే లేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానోపా ధ్యాయులకు ఇన్‌చార్జి ఎంఈఓ బాధ్యతలు అప్పగించినా, అత్యధికులు అటు ఎంఈఓ బాధ్యతలకు, ఇటు ప్రధానోపాధ్యాయ బాధ్యతలకు కూడా పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. మండల విద్యాభివృద్ధి అధికారుల్ని (ఎంఈ డీఓ) నియమించుకోవాలన్న ప్రతిపాదనకూ మోక్షం లభించట్లేదు. తెలంగా ణలో కూడా తాత్కాలిక సర్వీసు నిబంధనలేర్పరచుకొని పదోన్నతులను కల్పిస్తే సమస్య ఎంతో కొంత పరిష్కారమౌతుంది.
బడులు ఉంచి, టీచర్లని సర్దాలి
టీచర్లు-పిల్లల నిష్పత్తికి తగినట్టుగా బడులు, పోస్టుల ‘హేతుబద్ధీకరణ’ పాఠ శాల విద్యారంగంలో ఇప్పుడు హాట్ టాపిక్. ఎక్కువ మంది పిల్లలున్న చోట ఒకటి, రెండు టీచర్ పోస్టులుండటం, ఐదు, ఆరు టీచర్ పోస్టులున్న చోట పట్టుమని పది, ఇరవై మంది విద్యార్థులు కూడా లేకపోవడంతో రెండు చోట్లా విద్యాప్రమాణాలు అధ్వానంగా ఉంటున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు అయిదో వంతు బడుల పరిస్థితి ఇదే. దీన్ని చక్కదిద్దే హేతుబద్ధీకరణకు రెండు ప్రభుత్వాలు సన్నద్ధమైనాయి. తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఆ ఉత్తర్వులను (జీవో:6) జారీ చేసింది. బడుల వారీగా గాక, టీచర్ పోస్టుల వారీగా హేతబద్ధీకరణకు సంబంధించిన తాజా ప్రతిపాదనల ఫైలుపై ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు సంతకం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ పోస్టుల్ని రద్దు చేయడమో, పెంచడమో చేస్తారు. పోస్టులకు తగిన సంఖ్యలో విద్యార్థులు లేని బడుల్ని రద్దు చేసి, వాటిని సమీప గ్రామాల్లోని బడులకు కలపాలనే ‘బడుల హేతుబద్ధీకరణ’ ఇక లేనట్టే! జరగాల్సింది ఇదే తప్ప, బడుల్ని రద్దు చేసే హేతుబద్ధీకరణ కాదు. అలా జరిపితే మారుమూల ప్రాంతాలు, చిన్న చిన్న గ్రామాలు, జనావాసాలకు తీరని నష్టం జరుగుతుం ది. 19 మందికి లోబడి విద్యార్థులున్న గ్రామాలు, జనావాసాల్లో ప్రాథమిక బడి ఉండదు.
75 మందికి తగ్గి విద్యార్థులున్న చోట ఉన్నతపాఠశాల రద్దవు తుంది. ఇది, విద్యా హక్కు చట్టం స్ఫూర్తికి పూర్తి విరుద్దం. 6-14 మధ్య వయ స్కులైన పిల్లలందరికీ నిర్బంధ విద్య ప్రభుత్వ బాధ్యత. టీచర్ పోస్టులు- పిల్లల నిష్పత్తి 1:30కి మించకుండా ఉండాలని చట్టం నిర్దేశిస్తోంది. తెలంగా ణలో 1.28 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుంటే, 30 వేల ప్రభుత్వ బడుల్లో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ఏపీలో ఇంకా మెరుగైన నిష్పత్తే ఉంది. 1.90 లక్షల మంది ప్రభుత్వ టీచర్లుండగా, 48 వేల ప్రభుత్వ బడుల్లో 46 లక్షల మంది విద్యార్థులున్నారు. బడుల్ని రద్దుచేయకుండా, టీచర్ పోస్టుల్ని సర్దుబాటు చేయడమే అన్నివిధాలా మంచిదని ఉపాధ్యాయులు, మేధావి వర్గం కూడా భావిస్తోంది.
అక్కడ మరోరకం అన్యాయం
ప్రైవేటు బడుల్లో చదువు గొప్పగా ఉంటుందని ప్రచారం ఉన్నా, అక్కడుండే లోపాలు అక్కడున్నాయి. మార్కుల కోసం బట్టీ బ్రాండు చదువులు చెబు తారని, సృజనను పెంపొందింపజేయరనే విమర్శ బలంగా ఉంది. ఇక ఫీజు లపై నియంత్రణే లేదు. ఆట స్థలాలుండవు తప్ప, ఇతర సదుపాయాలు కాస్త నయమే. తెలంగాణ కన్నా ఏపీలో ఉపాధ్యాయులు-విద్యార్థుల నిష్పత్తి ప్రైవేటు రంగంలో మెరుగ్గానే ఉంది. తెలంగాణ(హైదరాబాద్ సహా)లోని 13 వేల ప్రైవేటు బడుల్లో లక్ష మంది టీచర్లు, 31 లక్షల మంది విద్యార్థులుండగా, ఏపీలోని 12 వేల బడుల్లో 1.08 లక్షల ఉపాధ్యాయులు, 26 లక్షల మంది విద్యార్థులున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ వీటిపై సరైన ప్రభుత్వ నిఘా, పర్య వేక్షణ, అజమాయిషీ లేవు. ఫీజుల అదుపునకు 2008-09లో ఓ ప్రయత్నం జరిగినా అది సవ్యంగా అమలు కాలేదు. 2010 నుంచి విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) అమల్లోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టారు. పాఠ శాలలోని వనరులు, సదుపాయాల్ని బట్టి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఫీజుల్ని సిఫారసు చేయాలని, జిల్లా స్థాయిలో ఇందుకోసం పనిచేసే ఒక కమిటీ క్షేత్ర పరిశీలన చేసి, అంతిమంగా ఫీజుల్ని ఖరారు చేయాలని నిర్దేశిం చారు.
కానీ, అవేవీ అమలుకు నోచుకోవట్లేదు. విద్యాహక్కు చట్టం వచ్చాక, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం... వాటి పకడ్బందీ అమలుకు జీవో 42, 43లను, ఫీజులపై నియంత్రణకు జీవో 92, 93లను జారీ చేసింది. కానీ వాటిని హైకోర్టు కొట్టివేసింది. అలాగే ప్రైవేటు బడుల్లో వసతులు, టీచర్- విద్యార్థి నిష్పత్తి, ఫీజులపై ప్రభుత్వమిచ్చిన ప్రాథమిక ఉత్తర్వులను (జీవో:1) కూడా ఎవరూ ఖాతరు చేయట్లేదు. ఈ ఉల్లంఘనల్ని పరిశీలించి తగిన చర్య లు తీసుకునే వ్యవస్థ, యంత్రాంగం కూడా లేవు. ప్రైవేటు బడుల్లో ఫీజులు ఎక్కువ, టీచర్ల కిచ్చే జీతాలు తక్కువ. ఉపాధ్యాయుల విద్యార్హతల విష యంలోనూ రాజీపడి, అయోగ్యులనే గురువులను చేసి నెట్టుకొస్తుంటారు.
నిరంతర మూల్యాంకనం విద్యార్థులకేనా?
విద్యాహక్కు చట్టం వచ్చాక విద్యాబోధన, పరీక్షలు, ప్రతిభ మూల్యాంకనం లో మార్పులు తెచ్చారు. సంవత్సరాంతంలో పరీక్షల ద్వారా ఉత్తీర్ణతను నిర్ణ యించే పద్ధతి కాకుండా, నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. దీన్ని విద్యార్థులకే గాక ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి, ముఖ్యంగా విద్యా శాఖకు కూడా వర్తింపజేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రభుత్వాలు విద్యాశాఖ బడ్జెట్‌ను పెంచడంపైన, తగిన వస తులు, సదుపాయాల కల్పనపైన శ్రద్ధాసక్తులు చూపాలి. పాఠశాలల నిర్వ హణ, నిఘా, నియంత్రణ, పర్యవేక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకో వాలి. అత్యధిక బడుల్లో అధికారికంగా స్వీపర్లు, అటెండర్లు లేరు. బడి నిర్వ హణ నిధుల్లోంచి ఎక్కడికక్కడ నెలకు రూ.200 లేదా రూ.300 ఇచ్చి ఆ పనులు చేయించుకుంటున్నారు.
మారుమూల ప్రాంతాల్లో గదుల్ని శుభ్రం చేయడం, గంట కొట్టడం తదితర పనులన్నీ పిల్లలతోనే చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో అన్నీ లోపభూయిష్టమే. అపరిశుభ్రమైన ఆహారం తిని పిల్లలు వాంతులు, విరేచనాలు ఇతర జబ్బుల పాలవుతుం టారు. ప్రభుత్వం చొరవ చూపి వీటన్నిటికీ చరమగీతం పాడాలి.
మారుతున్న సిలబస్ ప్రకారం, కాలానుగుణంగా ఉపాధ్యాయులు తమ విషయ పరిజ్ఞానాన్ని, మేధను మెరుగుపరచుకోవట్లేదనే విమర్శ ఉంది. టీచర్లకు కనీసం ప్రతి అయిదేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, కనీసార్హత సాధించేలా చూడాలనే సూచన వస్తోంది. ఏదేమైనా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. వారు చిత్తశుద్ది, అంకిత భావం చూపినచోట చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. నిర్లక్ష్యం వహించిన చోట విద్యా ప్రమాణాలు నీరుగారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు లక్షలకు పైగా ఉన్న పాఠశాల ఉపాధ్యాయుల మనఃపూర్వక ఆశీస్సులే బాల్యా నికి దీవెన! భారత బంగారు భవితవ్యం మొగ్గతొడిగేది ఈ బడుల్లోనే!!
- దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్: dileepreddy@sakshi.com