నన్ను ‘విజేత’గా పంపించండి...! | will send me as victory, indian army | Sakshi
Sakshi News home page

నన్ను ‘విజేత’గా పంపించండి...!

Published Thu, Jul 14 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

నన్ను ‘విజేత’గా పంపించండి...!

నన్ను ‘విజేత’గా పంపించండి...!

సాయుధ దళాల ప్రత్యేక చట్టం వల్ల ఎంత మంది మరణిస్తున్నారో, రేప్‌కి గురి అవుతున్నారో తెల్సిందే. ఆ చట్టం ఎత్తివేతకోసం 15 ఏళ్ళుగా నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోటం లేదంటే.. అసలు ఇండియన్ ఆర్మీ నన్ను, మణిపురి ప్రజలనెవరినీ మనుషులుగా భావించటం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఈశాన్య భారతదేశంలో జరిగిన 1528 బూటకపు ఎన్‌కౌంటర్లలో 62 కేసులని పరిశీలిస్తూ.. ‘దీర్ఘకాలం పాటు సాయుధ దళాల ప్రత్యేక చట్టం అమలులో ఉండటం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించటమే’ అంటూ చేసిన వ్యాఖ్య, ఆ కేసులపై ఇచ్చిన తీర్పు.

ప్రజాస్వామ్యవాదులకు కొంత ఊరటనిచ్చింది. క్రూరమైన ఎ.ఎఫ్.ఎస్. పి.ఎ చట్టాన్ని ఎత్తివేసే రోజులు దగ్గర్లో ఉన్నాయేమో అనే ఆశ రేకెత్తిం చింది. ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఇండియన్ ఆర్మీ చేస్తున్న హత్యలు, రేప్‌లకు వ్యతిరేకంగా ‘ఇండియన్ ఆర్మీ రేప్ అజ్’ అంటూ మణిపురి మహిళలు నగ్నంగా చేసిన పోరాటం ఇంకా పచ్చి పుండుగానే ఉంది. ఈ జూలై 14కి మణిపురి మహిళలు చేసిన ఆ పోరా టానికి సరిగ్గా పన్నెండేళ్ళు. ఆ సందర్భంగా 15 ఏళ్ళుగా నిరాహార దీక్ష చేస్తున్న.. ఇరోమ్ షర్మిలతో ఇంటర్వ్యూ..  2016, మే 18 వ తేదీన ఇరోమ్ షర్మిలని కలిశాము. ఆమెని కలవ టానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేసి, ఎట్టకేలకు పర్మిషను తీసు కున్నాను.
 
 ఆమె జె.ఎన్.ఐ.ఎం.ఎస్ ఆస్పత్రిలో స్పెషల్ సెక్యూరిటీ జైల్లో ఆర్మీ పహారా మధ్య బందీగా ఉంది. అన్ని ప్రభుత్వాసుపత్రులు ఎలా ఉంటాయో... ఆ ఆస్పత్రి కూడా అలాగే.. కంపు కొడుతూ ఉంది. పర్మి షన్లు, చెకింగ్‌లు, ఆర్మీ వేసే ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పి, ఆమె ఉన్న స్పెషల్ వార్డు దాకా నడుచుకుని వెళ్ళేసరికి... గంట పట్టింది. ఆమెని కలుసుకోటానికి పదిహేను నిమిషాలు మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పెషల్ వార్డు అంటే ఏదో తళతళలాడే శుభ్రమైన ఏసీ గది అనుకున్నాను. అది చాలా చిన్న గది. తక్కువ వెలుతురుతో ఉన్న ఇరుకు గది అది.
 
 నెల్సన్ మండేలా పెద్ద ఫొటో, చాలా పుస్తకాలు, ఇరోమ్ షర్మిల పెంచుతున్న ఇండోర్ మొక్కలతో ఆ గది నిండి ఉంది. మేం వెళ్ళేసరికి ఆమె ఆ వార్డు కారిడార్‌లో వాకింగ్ చేస్తున్నారు. ఆమె ప్రతిరోజూ ఆ ఇరవై అడుగుల కారిడార్‌లోనే గంట పాటు వాకింగ్ చేస్తారట. ‘నీరసంగా మంచంలో పడుకుని ఉంటుందేమో’ అనుకున్న నాకు.. ఆమె నవ్వుతూ ఎదురొచ్చి, కుర్చీలు తనే వేసి.. కూర్చోమనటం చూసి.. మాట రాలేదు.

 నాతో పాటు వచ్చిన మీతియ్ మానవ హక్కుల కార్యకర్త ఒనిల్ మణిపురి భాషలో మాట్లాడి నన్ను పరిచయం చేశారు. ఆమెని చూసి ఏం మాట్లాడాలో, ఏం అడగాలో అర్ధం కాక.. మౌనంగా నిలబడ్డాను. ఏ ప్రశ్నలూ అడగను, మీరు చెప్పేది చెప్పండి అని మాత్రం అన్నాను. ఆమే మాట్లాడింది.
 
 నేను చాలా విసుగెత్తిపోయి ఉన్నాను. 15 ఏళ్లుగా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. కనీసం మంచి నీటిచుక్క కూడా నా నోట్లో పడలేదు. నాది చాలా న్యాయమైన డిమాండు. ‘మమ్మల్ని మనుషులుగా చూడండి, ఆ ఏఎఫ్‌ఎస్‌పీఏ ఎత్తివేయండి’ అని అడుగుతున్నాను. అంతే. ఆ చట్టం వల్ల ఎంతమంది మరణిస్తున్నారో, రేప్‌కి గురి అవుతున్నారో తెల్సిందే. 15 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోటం లేదు అంటే.. అసలు ఇండియన్ ఆర్మీ నన్ను మనిషిగా చూడటం లేదు. మణిపురి ప్రజలనెవ రినీ మనుషులుగా భావించటం లేదు. మా పోరాటాలకీ, మా అభిప్రా యాలకీ.. అసలు మా ప్రాణాలకీ, (స్త్రీల) శరీరాలకీ.. కాస్త కూడా విలువ, గౌరవం లేవు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అన్న నా విశ్వాసం సడలిపోకుండా ఉండటానికి 15 ఏళ్లుగా నేనెంతో మానసిక శ్రమ చేస్తున్నాను. కానీ.. ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కదలిక లేదు.
 
 నాకు అందరిలా, మామూలు స్త్రీగా బతకాలని ఉంది. సాదా సీదాగా బతకాలని ఉంది. నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఎన్నో ఏళ్ళుగా నా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఈ గదిలో కూర్చొని, అతను కానుకగా పంపిన మొక్కలని పెంచుతూ.. వాటి పచ్చదనంలోనే మా ప్రేమని బతికించుకుంటున్నాను. మొత్తం 39 మొక్కలు. మొన్న ఎవరో ఒక మొక్కను దొంగతనం చేశారు. ఇంత సెక్యూరిటీ ఉన్న చోట ఒక చిన్న మొక్క ఎలా దొంగతనానికి గురి అవుతుంది? ఎలా దొంగిలించారని కాదు.. ఎందుకు దొంగిలించారు? అని అడగాలేమో. ఎందుకంటే.. నాకు సంతోషాన్నిస్తున్న, నన్ను బతికిస్తున్న ఆ చిరు సంపద నా దగ్గర ఉండ కూడదు అనే ఆలోచనే నా మొక్కల్లో ఒక దాన్ని నాకు దూరం చేసింది. ఆ మొక్క ఇక్కడ నుంచి పట్టుకుపోయినా పర్లేదు. ఎక్కడో అక్కడ బతి కుంటే, రోజూ దానికి ఎవరో ఒకరు కాస్త నీళ్ళు పోస్తే చాలు.
 
 నేను విఫలమయ్యాను అనే బాధ అప్పుడప్పుడు నన్ను దహిం చేస్తుంటుంది. 15 ఏళ్లుగా అమ్మని కూడా చూడకుండా ఈ గదిలో ఇలా ఉన్నాను. మొన్న కోర్టులో హాజరైనప్పుడు.. నాకు మద్దతు తెలిపే ఒక్క వ్యక్తి కూడా ఆ కోర్టు ఆవరణలో లేరు. అప్పుడు నిరాశపడ్డాను. కానీ మానవత్వం చనిపోలేదని నాకు తెలుసు. ఈ భూమిమీద ఇంకా మానవత్వం ఉందని నమ్ముతున్నాను. ప్రజలు ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని ఎత్తివేయమని దేశమంతటా పెద్ద ఎత్తున దీక్షలు చేయకపోటానికి కార ణం.. వారు వేరే పోరాటాల్లో మునిగి ఉండటమేనేమో అని నాకు నేను సర్ది చెప్పుకుంటాను అని అనగానే.. నేను ఇరోమ్‌కి రోహిత్ గురించి ఏమన్నా విన్నారా? అని అడిగాను. ‘టీవీ, పేపరు అందుబాటులో లేని ఈ చిన్ని ప్రపంచంలోకి రోహిత్ వచ్చాడు’ అన్నది నవ్వుతూ.
 
 నాకు రోహిత్ గురించి కానీ, ఇరోమ్ షర్మిలకి మద్దతుగా దేశంలో పలుచోట్ల ఏఎఫ్‌ఎస్పీఏ ఎత్తేయాలంటున్న వివిధ సంఘాల వివరాలు కానీ చెప్పే సమయం లేదు. నాకిచ్చిన 15 నిమిషాల గడువులో 6సార్లు గార్డులు లోపలికి వచ్చారు. పైగా ఆమె బక్క పలచటి శరీరంలో ఉన్న ఆ కాస్త రక్తాన్ని కూడా పెద్ద పెద్ద దోమలు తాగేస్తున్నాయి. నేను, నాతో వచ్చిన ఒనిల్ ఆ దోమల్ని చంపటంలో పడ్డాం.
 ఆమె నవ్వుతూ.. ‘ఎన్నిటిని చంపుతారు వదిలేయండి, నాకు వాటితో ఏం ఇబ్బంది లేదు. నేను భారత ప్రభుత్వాన్ని, ప్రజా సంఘా లని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతీ వ్యక్తిని కోరుకునేది ఒకటే.. నన్ను ఈ ప్రపంచం నుంచి విజేతగా పంపండి. ఏఎఫ్‌ఎస్పీఏ అనే క్రూర చట్టం ఎత్తేయటాన్ని నా కళ్ళతో నేను చూడాలి. నా అంతఃశక్తి నశిస్తోంది. నేను ఒక ‘విఫల అస్త్రం’గా ఆ విశ్వంలోకి వెళ్ళాల్సి వస్తుందేమో అని బాధగా ఉంది.. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నన్ను విజేతగా పంపండి..’ అంటూ ఆమె ఏడ్చింది.
 
 నా కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయ్. వెంటనే ఆమె కళ్ళు తుడుచు కుని, నవ్వుతూ నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి.. ‘అప్పుడప్పుడూ ఇలా అని పిస్తుంది. నేనూ మనిషినే, అది ఇండియన్ ఆర్మీ గుర్తించాలి’ అంటుం డగానే సమయం అయిపోయిందని గార్డు వచ్చి లాఠీతో తలుపుమీద కొట్టి అరిచి చెప్పాడు. ఆమె ఆ స్పెషల్ వార్డు కారిడార్ చివరి దాకా వచ్చి, మాకు వీడ్కోలు చెప్పింది. నేను బైటకి రాగానే, ఆ గ్రిల్ వెనక నిలబడి, ‘నాకే కాదు, ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం ఎత్తేస్తారు.. నాకు మానవత్వం మీద విశ్వాసం ఉంది’ అని చెప్పి, లోపలికి వెళ్ళిపోయింది.
 
 ఆ తర్వాత మేం అక్కడున్న డ్యూటీ డాక్టరుని కలిశాం. ఇరోమ్ ఆరోగ్యం గురించి అడిగితే, ‘మెడికల్లీ మిరకిల్, హ్యూమన్లీ ఇంపాజిబిల్ (వైద్యపరంగా అద్భుతం, మానవపరంగా అసాధ్యం)’ అన్నాడాయన. నిజమే. మానవ చరిత్రలోనే ఇటువంటి పోరాటం జరగటం ఇదే మొదటి సారి. భారతదేశం తన స్వాతంత్ర పునాదులుగా చెప్పే.. ‘సత్యాగ్రహం, అహింస’ అనే రెండు మహోన్నత అస్త్రాలు ఇప్పుడు.. ఇరోమ్ షర్మిల చేతిలో ఉన్నాయి. దాన్ని గుర్తించి భారతదేశం ఏఎఫ్‌ఎస్‌పీఏని ఎత్తివేసి, ఇరోమ్ షర్మిలని స్వేచ్ఛా జీవిని చేస్తుందని మనందరం ఆశిద్దాం.
 (అత్యాచారాలకు వ్యతిరేకంగా మణిపురి మహిళలు చేసిన పోరాటానికి నేటికి సరిగ్గా పన్నెండేళ్లు)
 చైతన్య పింగళి, పాత్రికేయురాలు  chaithanyapingali@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement