
సాక్షి, శ్రీనగర్ : కర్ణాటకలో పాలక కాంగ్రెస్ విజయాలపై 15 నిమిషాల పాటు పేపర్ చూడకుండా ప్రసంగించాలని ప్రధాని నరేంద్ర మోదీ విసిరిన సవాల్‌ను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్వీకరించాలని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా సూచించారు. ‘ప్రధాని సవాల్‌ను రాహుల్ అంగీకరిస్తారని ఆశిస్తున్నా...ఇక ప్రధాని నరేంద్ర మోదీ రెండు నిమిషాల పాటు మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగికదాడులపై మాట్లాడాలని తాము కోరుతున్నా’మని ఒమర్ ట్వీట్ చేశారు.కాగా, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాహుల్‌ను ఉద్దేశించి కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ సాధించిన విజయాలపై ఎలాంటి పేపర్ చూడకుండా 15 నిమిషాల పాటు ఏ భాషలోనైనా ప్రసంగించాలని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఏ పార్టీకి అధికారం అప్పగించాలో అప్పుడు కర్ణాటక ప్రజలే నిర్ణయిస్తారని మోదీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు.
మరోవైపు జమ్మూకాశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ సర్కార్ కథువాలో మైనర్ బాలికపై హత్యాచారం కేసును చేపడుతున్న తీరుపై ఒమర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపిస్టులకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నఇద్దరు బీజేపీ మంత్రులను తొలగించిన ప్రభుత్వం, అదే ర్యాలీకి హాజరైన ఎమ్మెల్యేకు మాత్రం మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. కథువా కేసుపై బీజేపీ, పీడీపీ సర్కార్ గందరగోళంగా వ్యవహరిస్తోందన్నారు.