ఏకగ్రీవాల హోరు.. వైఎస్సార్‌సీపీ జోరు | 125 ZPTC Positions Are Unanimous To YSR Congress Party In Local Body Elections | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవాల హోరు.. వైఎస్సార్‌సీపీ జోరు

Published Sun, Mar 15 2020 3:26 AM | Last Updated on Sun, Mar 15 2020 4:07 PM

125 ZPTC Positions Are Unanimous To YSR Congress Party In Local Body Elections - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 2000 స్థానాలకు పైగా ఏకగ్రీవం అయ్యాయి. మండలానికి ఒక జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. ఈ లెక్కన 125 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం అరుదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల ఆగడాల పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 9 నెలల జనరంజక పాలన పట్ల గ్రామీణ ప్రజలు చూపిస్తున్న ఆదరణతోనే స్థానిక టీడీపీ నేతలు పలుచోట్ల పోటీకి దూరంగా ఉన్నారనేది స్పష్టమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. దీంతో ఆయా స్థానాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారన్న వివరాలతో జిల్లాలో ఎక్కడికక్కడ రిటర్నింగ్‌ అధికారులు జాబితాలు విడుదల చేశారు. ఒక్కో అభ్యర్థే పోటీలో ఉన్న చోట ఎన్నిక ఏకగ్రీవం ఎన్నికయినట్లు రిటర్నింగ్‌ అధికారులు స్థానికంగా ప్రకటించారు.
 
ప్రజా వ్యతిరేకతతో పోటీకే దూరం..

గత ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 నెలల కాలంలోనే ఎన్నికల ముందు చెప్పిన హామీలలో దాదాపు అన్నీ అమలు చేశారు. ఇందువల్ల ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసినా గెలవమేమోనన్న భయం స్థానిక టీడీపీ నాయకులను వెంటాడటం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ పోటీలో నిలబడకపోవడానికి వారి విశ్లేషణలో తేలిన కారణాలు ఇవీ..
 – గత 9 నెలలుగా జనరంజక పాలన సాగుతోంది. సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఫలితంగా పోటీ చేయడానికి టీడీపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది.
– టీడీపీ నాయకత్వం మీద ఆ పార్టీ శ్రేణులకు భరోసా సన్నగిల్లింది. టీడీపీ అధినేత మీద విశ్వాసం కొరవడటంతో పోటీకి టీడీపీ శ్రేణులు విముఖత ప్రదర్శించాయి. ఫలితంగా.. స్థానిక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టడానికి వెతుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చింది.
– టీడీపీకి పెద్దగా భవిష్యత్‌ లేదనే నిర్లిప్త ధోరణి టీడీపీ కార్యకర్తల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నాయకుల్లోనూ అదే ధోరణి నెలకొంది. అందువల్ల ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం కొరవడింది.
– గత 5 సంవత్సరాల టీడీపీ పాలన, చంద్రబాబు వ్యవహార శైలి పట్ల సామాన్య ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఈ 9 నెలల్లో టీడీపీ పట్ల, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పట్ల వ్యతిరేకత ప్రజల్లో తగ్గలేదని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భావించారు. ఇంత వ్యతిరేకతలో ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల శ్రమ దండగ తప్ప ఫలితాలు సానుకూలంగా రావని వారంతా భావించారు. ఈ పరిస్థితిలో పోటీ చేయడం అనవసరమనే భావన.. వారిని పోటీ నుంచి దూరంగా ఉంచింది. 

పది జిల్లాల్లో జెడ్పీటీసీలు ఏకగ్రీవం
– శ్రీకాకుళం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాలోనూ జెడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవ విజయాలు నమోదయ్యాయి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా వైఎస్సార్‌ కడపలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను 38 స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
–  ఏకగ్రీవమైన జెడ్పీటీసీ స్థానాల సంఖ్యతో అధికార వైఎస్సార్‌సీపీ వైఎస్సార్‌ జిల్లాలో జెడ్పీ చైర్మన్‌ పదవిని సునాయసంగా దక్కించుకోగలదు. 
– చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలకు గాను, 29 స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. 
– నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రెండంకెల జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2000కు పైగా ఎంపీటీసీ స్థానాలను అధికార వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది.

వైఎస్సార్‌ జిల్లాలో కొత్త చరిత్ర
సాక్షి ప్రతినిధి కడప: వైఎస్సార్‌ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఏకపక్షంగా మారాయి. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో శనివారం రాత్రికి 39 స్థానాలు, 38 ఎంపీపీలు ఏకగ్రీవమయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఏడు జెడ్పీటీసీలకుగాను ఏడూ వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం కావడం విశేషం. పులివెందుల నియోజకవర్గంలో 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 65 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అంతటా ఇదే ఊపు కనిపిస్తోంది. కమలాపురం నియోజకవర్గంలో 58 స్థానాలు ఉండగా 53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రొద్దుటూరులో 33 స్థానాలకుగాను 19 స్థానాలు ఏకగ్రీవం కాగా, మైదుకూరులో 61 స్థానాలకుగాను 53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బద్వేలు నియోజకవర్గంలో 58 స్థానాలు ఉండగా 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రైల్వేకోడూరులో 74 స్థానాలకుగాను 48 స్థానాలు, జమ్మలమడుగులో 66 స్థానాలకుగాను 15 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.   


మాచర్లలో వైఎస్సార్‌సీపీ హవా 
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రికార్డు సాధించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు (ఒక్కటి మినహా) ఓటింగ్‌ నిర్వహించే పనిలేకుండానే నియోజకవర్గంలోని 71 ఎంపీటీసీ గాను 70 స్థానాలు, వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి, రెంటచింతల, దుర్గి జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల మున్సిపాలిటీలో సైతం 31 డివిజన్లకు గాను 31 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం చేసుకుంది. మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు పట్టు కలిగి ఉన్న సీతానగరం మండలం జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి స్వగ్రామంలోనే ఎదురు దెబ్బ తగలింది. ఆయన స్వగ్రామమైన నార్తురాజుపాళెం–1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోశింరెడ్డి అనిల్‌కుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఏ మాత్రం గెలిచే అవకాశం లేకపోవడంతో పరువు కోసం టీడీపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement