
19–04–2018,
గురువారం కొత్త ఈదర, కృష్ణా జిల్లా
చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడీ డ్రామాలేంటి బాబుగారూ?!
ఈ రోజు ఈదర గ్రామంలో అడుగడుగునా ఆప్యాయతల నడుమ నా పాదయాత్ర సాగింది. ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులకు నామకరణం చేయాలంటూ వారి తల్లిదండ్రులొచ్చారు. వారిలో ఒక పాపాయికి విజయమ్మ అని పేరు పెట్టాలంటూ అడగడం.. ఇదే రోజు అమ్మ పుట్టిన రోజు కూడా కావడం.. యాదృచ్ఛికం. ఆ చిన్నారులకు పేర్లు పెట్టి.. కలకాలం చల్లగా ఉండాలని, మంచిగా ఎదగాలని, గొప్పవారు కావాలని దీవిస్తుంటే మనసుకెంతో తృప్తిగా అనిపించింది.
‘కష్టకాలంలో కరువు పనులకు పోదామన్నా పార్టీ పేరిట వివక్ష చూపుతూ కూలి పనులు కూడా ఇవ్వడం లేదన్నా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఉష, సముద్రవేణి తదితర ఉపాధి కూలీలు. ‘నా భర్త గతేడాది మూడు నెలల పాటు కరువు పనులకు వెళితే ఇంత వరకూ కూలి డబ్బులు ఇవ్వలేదన్నా’ అంటూ సర్కారీ శ్రమ దోపిడీని ఎండగట్టింది ప్రశాంతి అనే చెల్లెమ్మ. ‘నా భర్త చనిపోయి ఏడాది దాటినా బీమా డబ్బులే రాలేదన్నా’ అంటూ చంద్రన్న పథకం డొల్లతనాన్ని తెలియజేసింది.. కోటమ్మ అనే అక్క. ‘పశు సంరక్షణ అంటూ మాతో గొడ్డుచాకిరీ చేయించుకుంటూ జీవన భృతి కింద కేవలం రూ.3,500 మాత్రమే ఇస్తున్నారు’ అంటూ గోపాలమిత్రలు గోడు వెళ్లబోసుకున్నారు.
నాన్నగారి హయాంకు, చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని రైతులు విశదీకరించారు. నాన్నగారి హయాంలో రైతన్నకు భరోసా ఉండేది. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటేనే భయంగా ఉంది. నాన్నగారి హయాంలో సాగర్ జలాలు పుష్కలంగా అందేవట. ఈ నాలుగేళ్ల పాలనలో కాలువలు తడవడం కూడా కష్టంగా మారిందట. రైతన్నకు అనుకోని ఆపద వస్తే.. నాన్నగారు పెద్ద మనస్సుతో వెంటనే స్పందించేవారు. ఓ సారి అకాల వర్షాలకు మామిడి తోటలు దెబ్బతింటే.. వెంటనే ఆ రోజుల్లో రూ.25 కోట్ల పరిహారం ఇచ్చి ఈ జిల్లా మామిడి రైతన్నను ఆదుకున్న పెద్ద మనసు నాన్నగారిది.
ఈ నాలుగేళ్ల పాలనలో గాలివానలకు మామిడి తోటలు దెబ్బతింటే.. కనీసం నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం కూడా జరగలేదట. నూజివీడు మామిడి అంటేనే దేశ విదేశాల్లో ప్రసిద్ధి. అట్లాంటిది ధర పతనమైనా పట్టించుకునే నాథుడేలేక రైతన్న డీలా పడిపోతుంటే మనసుకెంతో బాధనిపించింది.‘ఊరంతా ఒక దారైతే.. ఉలిపిరికట్టెదొకదారి’ అన్నట్టు.. రాష్ట్రం మొత్తం ఓ వైపు హోదా కోసం గొంతెత్తి నినదిస్తుంటే.. అప్పటి దాకా పట్టించుకోని బాబుగారు ఇప్పుడు ధర్మ దీక్ష అంటూ.. కొత్త నాటకానికి తెరతీయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం విపక్షాలు, ప్రజా సంఘాలు అన్నీ ఏకమై ఆందోళనలకు పిలుపునిస్తే.. జపాన్ తరహా దీక్షలు చేయండి.. ఎక్కువ సమయం పనిచేయండి.. రాష్ట్రంపై ఆర్థిక భారం పడరాదు.. ఏదైనా ఉంటే ఢిల్లీలో చేయండి.. అంటూ నీతులు వల్లించారు. 25కు 25 మంది ఎంపీలు ఒకేసారి తమ పదవులకు రాజీనామా చేసి.. 25 మందీ నిరాహార దీక్షకు కూర్చుని ఉంటే.. దేశం మొత్తం చూసేది కాదా? కేంద్రం దిగొచ్చేది కాదా? అలా చేయకుండా ఈ రోజు ఈ డ్రామాలేంటి బాబుగారూ?!
Comments
Please login to add a commentAdd a comment