బెంగాల్‌లో దీదీకి షాక్‌ | 2 TMC MLAs over 50 councillors join BJP | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో దీదీకి షాక్‌

Published Wed, May 29 2019 3:52 AM | Last Updated on Wed, May 29 2019 7:36 AM

2 TMC MLAs over 50 councillors join BJP - Sakshi

న్యూఢిల్లీ/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి తేరుకోకముందే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి గట్టి షాక్‌ తగిలింది. బెంగాల్‌లో కమలం వికసించడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జారుకుంటున్నారు. మంగళవారం తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వీరితోపాటు 50 మందికిపైగా కౌన్సిలర్లు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. వీరిలో ఎక్కువ మంది టీఎంసీ పార్టీ వాళ్లే. బీజేపీ నాయకుడు ముకుల్‌ రాయ్‌ కొడుకు టీఎంసీ ఎమ్మెల్యే సుభ్రాన్షు రాయ్‌తోపాటు ఎమ్మెల్యేలు తుషార్‌కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్‌ రాయ్‌ (సీపీఎం) బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై సుభ్రాన్షుని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు టీఎంసీ బహిష్కరించింది.  

ఎమ్మెల్యేలు ఇంకా వస్తారు..
‘రాబోయే రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు టీఎంసీ నుంచి బీజేపీలో చేరతారు. అలాగని బెంగాల్‌లో దీదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మేం అనుకోవడం లేదు. 2021 వరకు కొనసాగిస్తాం. అయితే ఆమె చేసిన తప్పుల కారణంగా ప్రభుత్వం పడిపోతే మేమేం చేయలేం’అని ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి, బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు కైలాశ్‌ విజయ్‌వార్గియా, ముకుల్‌ రాయ్‌ అన్నారు. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ హుగ్లీ బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం అయ్యాయి. 2014 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాలకు గాను 34 స్థానాలను గెలుచుకున్న టీఎంసీ.. 2019లో కేవలం 22 సీట్లకే పరిమితమైంది. గతంలో 2 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


కేబినెట్‌లో మార్పులు చేసిన మమత
సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తన కేబినెట్‌లో పలుమార్పులు చేశారు. రవాణా శాఖమంత్రి సువేందు అధికారికి నీటిపారుదల, జలవనరుల మంత్రిత్వ శాఖను అప్పగించారు. సైన్స్‌–టెక్నాలజీ, బయోటెక్నాలజీ మంత్రి బ్రాత్య బసుకు అటవీశాఖను అదనపు బాధ్యతలు ఇచ్చారు. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్‌బోస్‌ను అటవీశాఖ సహాయమంత్రిగా చేశారు. సోమెన్‌ మహాపాత్రకు పర్యావరణం, ప్రజారోగ్యం,ఇంజనీరింగ్‌ బాధ్యతలు ఇచ్చారు. మలే ఘాతక్‌కు కార్మిక, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా రజిబ్‌ బెనర్జీ, చంద్రిమా భట్టాచార్యకు పంచాయతీరాజ్‌ సహాయమంత్రిగా నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement