సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్‌ఏల్లో 58 మంది తమపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వీరిలో బీజేపీ నుంచే ఎక్కువ మంది ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ పేర్కొంది. పదిమంది సిట్టింగ్ బీజేపీ’ఎంపీలు (లోక్‌సభ), ఏఐయూడీఎఫ్, టీఆర్‌ఎస్, పీఎంకే, ఏఐఎంఐఎం, శివసేనల నుంచి ఒక్కరేసి ఎంపీపై విద్వేషపూరిత ప్రసంగం చేశారనే అభియోగాలు నమోదైనట్టు ఏడీఆర్ వెల్లడించింది. ఇక పార్టీల వారీగా బీజేపీ నుంచి 27 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐఎంఐఎంకు చెందిన ఆరుగురు చట్టసభ సభ్యులు, టీఆర్‌ఆఎస్ (6) టీడీపీ (3), శివసేన (3), ఏఐటీసీ (2), ఐఎన్‌సీ (2), ఐఎన్‌డీ (2), జేడీ (యూ) (2), ఏఐయూడీఎఫ్ (1), బీఎస్‌పీ (1), డీఎంకే, పీఎంకే, ఎస్‌పీల నుంచి ఒక్కో సభ్యుడిపై ఈ తరహా కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
కేంద్ర మంత్రి ఉమాభారతితో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది మంత్రులు తమపై ఇలాంటి కేసులున్నాయని వెల్లడించారని తెలిపింది. ఇక విద్వేషపూరిత ప్రసంగాల కేసులు నమోదయ్యాయని పలు రాష్ట్రాలకు చెందిన 43 మంది సిట్టింగ్ ఎంఎల్‌ఏలు వెల్లడించారని పేర్కొంది. వీరిలో బీజేపీ నుంచి అత్యధికంగా 17 మంది ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్, ఏఐఎంఐఎంల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు, ఐఎన్‌సీ, ఏఐటీసీ, జేడీ(యూ), శివసేనల నుంచి ముగ్గురేసి ఎమ్మెల్యేలపై విద్వేష ప్రసంగాల కేసులు నమోదయ్యాయి. కాగా డీఎంకే, బీఎస్‌పీ, ఎస్‌పీ సహా ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీలు, ఎంఎల్‌ఏలు సమర్పించిన డిక్లరేషన్‌లను విశ్లేషిస్తూ ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది.
ఇక రాష్ట్రాలవారీగా చూస్తే యూపీలో అత్యధికంగా15 మంది ఎంపీలు, ఎంఎల్‌ఏలు నోరుజారారు. ఇక తెలంగాణా నుంచి 13 మంది సిట్టింగ్ ఎంఎల్‌ఏలు, కర్ణాటక నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి ఐదుగురు చట్టసభల సభ్యులు తమపై ఇలాంటి కేసులున్నాయని వెల్లడించారు. ఇక తెలంగాణాలో ఈ తరహా కేసులు 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్నాయని, బిహార్ నుంచి నలుగురు, యూపీ నుంచి 9 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విద్వేషపూరిత ప్రసంగం చేశారనే కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ, కర్ణాటక నుంచి ముగ్గురేసి ఎమ్మెల్యేలపై హేట్ స్పీచ్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరేసి, గుజరాత్, ఎంపీ, తమిళనాడు, రాజస్ధాన్, జార్ఖండ్‌ల నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేసిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment